మరో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం రావచ్చు -ఆర్.బి.ఐ గవర్నర్


Raghuram Rajan

భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్ బాంబు పేల్చారు. మరోసారి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించవచ్చని హెచ్చరించారు. ఆయన చెబుతున్నది 2008 నాటి సంక్షోభం తరహాది కూడా కాదు. ఏకంగా 1930ల నాటి మహా మాంద్యం తరహాలోనే సంక్షోభం రావచ్చని హెచ్చరించారు.

2008 నాటి సంక్షోభాన్ని ‘ద గ్రేట్ రిసెషన్’ అని పిలవగా, 1930ల నాటి సంక్షోభాన్ని ‘ద గ్రేట్ డిప్రెషన్’ గా పిలిచారు. రిసెషన్ కంటే డిప్రెషన్ మరింత లోతైన, విస్తారమైన సంక్షోభం. ఆనాటి డిప్రెషన్ నుండి బైటపడేందుకు పశ్చిమ దేశాలు రెండోసారి ప్రపంచ యుద్ధానికి తెగబడ్డాయి. మార్కెట్ల పునర్విభజనను డిమాండ్ చేసిన జర్మనీ, జపాన్, ఇటలీలు, సోవియట్ రష్యా వీరోచిత ప్రతిఘటన, చైనా నూతన ప్రజాస్వామిక విప్లవాల వల్ల ఓటమికి గురయ్యాయి.

ఐరోపాను పాదాక్రాంతం చేసుకున్న జర్మనీ సోవియట్ రష్యా మీదికి వచ్చి చావుదెబ్బ తినగా, చైనాను లొంగదీసుకునే ప్రయత్నంలో జపాన్ ఓటమిపాలై తోక ముడిచింది. రవి అస్తమించని సామ్రాజ్యంగా వినుతి కెక్కిన బ్రిటన్ యుద్ధంలో తీవ్రంగా నష్టపోగా, చివరి దశలో మాత్రమే యుద్ధంలో ప్రవేశించిన అమెరికా, నూతన ప్రభావ ప్రాంతాలను ఏర్పరచుకున్న సోవియట్ రష్యాలు అగ్రరాజ్యాలుగా అవతరించాయి.

1930ల నాటి అత్యంత గడ్డు పరిస్ధితులు మళ్ళీ ఏర్పడుతున్నాయని ఆర్.బి.ఐ గవర్నర్ హెచ్చరిస్తున్నారు. ప్రపంచ స్ధాయి సంక్షోభం నుండి బైటపడే ప్రయత్నంలో నేడు అభివృద్ధి చెందిన దేశాలు పరస్పరం విరుద్ధ దిశల్లో పని చేస్తున్నాయని, ఈ పరిస్ధితి తీవ్ర సంక్షోభానికి దారి తీయవచ్చని ఆయన తెలిపారు. ‘సెంట్రల్ బ్యాంకింగ్ జర్నల్’ అనే పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ రఘురాం రాజన్ ఈ అంశాలు తెలిపారు.

1930ల నాటి మల్లేనే నేడు కూడా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పరస్పర సమన్వయంతో వ్యవహరించడం లేదని, సహకారం కొరవడిందని రఘురాం ఎత్తి చూపారు. ఫలితంగా ఆర్ధిక విధానాలు కట్టుతప్పి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను సంక్షోభంవైపుకు కొనిపోతున్నాయని తెలిపారు.

పూర్వాశ్రమంలో ఐ.ఎం.ఎఫ్ లో చీఫ్ ఎకనమిస్ట్ గా పని చేసిన రఘురాం రాజన్ 2008 నాటి సంక్షోభం గురించి ముందే హెచ్చరించారన్న ప్రతిష్టను కలిగి ఉన్నారు. దానితో రఘురాం రాజన్ మాటలకు ప్రాముఖ్యత వచ్చి చేరింది.

“ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు తగిన సామర్ధ్యం కొరవడిన పరిస్ధితుల్లో మరొక సారి కుప్పకూలే స్ధితిని ఎదుర్కొంటోంది. ఆర్ధిక సంక్షోభం నుండి కోలుకునేందుకు దేశాలు గతంలో తమ కరెన్సీ విలువలను పోటీపడి తగ్గించాయి. ప్రస్తుతం అందరూ ద్రవ్య సరళీకరణను (monetary easing) ఇష్టపడుతున్నారు. ప్రపంచ ద్రవ్య మార్కెట్ లో అసమతూకం నెలకొందనడానికి ఒక సూచన ఏమిటంటే యూరో విలువ అత్యధిక స్ధాయిలో ఉండగా యూరో జోన్ ఆర్ధిక పరిస్ధితి క్లిష్టంగా ఉండడం” అని రాజన్ అన్నారు.

యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు బాగా సర్దుబాటు ధోరణిని కనబరుస్తుండగా ఇతర సెంట్రల్ బ్యాంకులు బాగా సరళతరమైన ద్రవ్య విధానాలను (ultra-loose monetary policy) అనుసరిస్తున్నాయని రాజన్ ఎత్తి చూపారు. ఫెడరల్ రిజర్వ్ (అమెరికా సెంట్రల్ బ్యాంకు), బ్యాంక్ ఆఫ్ జపాన్ (జపాన్ సెంట్రల్ బ్యాంక్), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (ఇంగ్లండ్ సెంట్రల్ బ్యాంక్) లతో సహా అనేక సెంట్రల్ బ్యాంకులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయని ఆయన తెలిపారు.

పొదుపు విధానాల పేరుతో యూరోపియన్ దేశాలు కఠినమైన విధానాలను అవలంబిస్తున్నాయి. బడ్జెట్ ఖర్చులను తగ్గించడం, ఉద్యోగాలు కోత పెట్టడం, వేతనాల్లో కోత, సంక్షేమ చర్యల రద్దు లేదా కోత మొ.న చర్యలను అవి అమలు చేస్తున్నాయి. దాంతో ఐరోపా దేశాల జి.డి.పి అత్యల్ప స్ధాయిలో నమోదు అవుతోంది. ఐరోపా ఆర్ధిక నాయకుడుగా భావించే జర్మనీ సైతం కనా కష్టంగా వృద్ధిని నమోదు చేస్తోంది. ఐరోపాతో పోల్చితే అమెరికా మరింత అప్పు తెచ్చి ఉద్దీపనలు ఇస్తోంది. ఈ విషయంలో అమెరికా, ఐరోపాల మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. ద్రవ్య విధానాన్ని సరళీకరించాలని ఉద్దీపనలు ఇవ్వాలని అమెరికా కోరినప్పటికీ యూరో జోన్ దేశాలు పట్టించుకోలేదు. రఘురాం రాజన్ ఈ తేడాలనే ఎత్తి చూపుతున్నారు.

అయితే యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు కొద్ది రోజుల క్రితం మళ్ళీ వడ్డీ రేటును (1.5 శాతం నుండి) బాగా తగ్గించి 0.15 శాతం వద్ద కొనసాగిస్తోంది. అమెరికా వడ్డీ రేటు 0.25 శాతం వద్ద కొనసాగిస్తోంది. ఈ ఒక్క విషయంలో మాత్రం అమెరికా కంటే ఇ.సి.బి సరళతర విధానం అవలంబిస్తోంది.

అమెరికా వరుస యుద్ధాలను ప్రేరేపిస్తూ (సిరియా, ఉక్రెయిన్, ఇరాక్, గాజా) చలి కాచుకునే ప్రయత్నం చేయడం కూడా రాజన్ చెప్పిన సంక్షోభ పరిస్ధితుల వల్లనే. చైనా, రష్యాలపై దూకుతూ ఆ క్రమంలో ప్రాక్సీ యుద్ధాలను అమెరికా నడుపుతోంది. ఆయా దేశాలలోని పరోక్ష యుద్ధాల ద్వారా స్ధానిక ప్రజలను అష్టకష్టాలపాలు చేస్తోంది. తమ ప్రజలను కూడా నిరుద్యోగం, దరిద్రం లాంటి సమస్యలతో బాధిస్తోంది. సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అనేక జిమ్మిక్కులకు పాల్పడుతోంది.

పైకి మామూలుగా కనిపిస్తున్న ప్రపంచం లోలోపల ఉడుకుతోంది అనడానికి రాజన్ మాటలు స్పష్టమైన సంకేతం. మునిగిపోతున్న పడవ లాంటి అమెరికా ఆధిపత్య వ్యవస్ధలో భాగమై తానూ మునిగిపోవడమా లేక వర్ధమాన ఆర్ధిక గ్రూపు బ్రిక్స్ లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూ ఒడ్డుకు ప్రయాణించాలా అని తేల్చుకోవడం ఇప్పుడు భారత పాలకుల ముందున్న సవాలు.

6 thoughts on “మరో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం రావచ్చు -ఆర్.బి.ఐ గవర్నర్

 1. U.S. inching closer to energy independence as oil imports shrink
  The U.S. trade deficit shrank unexpectedly in June as American oil production helped to wean the economy off foreign imports.

  Increasing domestic petroleum production points to growing U.S. energy independence — an especially important factor as geopolitical tensions escalate in eastern Europe and the Middle East.

  http://fortune.com/2014/08/06/u-s-inching-closer-to-energy-independence-as-oil-imports-shrink/

 2. సర్,నాకుకొన్ని సందేహాలు ఉన్నాయి దయచేసి వాటిని నివృతి చేసుకోవడానికి సహాయపడగలరు?

  ఆనాటి డిప్రెషన్ నుండి బైటపడేందుకు పశ్చిమ దేశాలు రెండోసారి ప్రపంచ యుద్ధానికి తెగబడ్డాయి.
  ది గ్రేట్ దిప్రెసన్ నుండి బయటపడే క్రమంలో రెండో ప్రపంచయుద్ధంద్వారా, మర్కెట్ల పున్ర్విభజన ప్రయత్నంలో చాలా ఆసియా,ఆఫ్రికా దేశాలకు ప్రయోజనం కలిగింది కదా!(కొన్ని దేశాలు స్వతంత్ర్యం ప్రకటించుకోవడం మూలాన)
  మార్కెట్ల పునర్విభజనన డిమాండ్ కు జర్మనీ, జపాన్, ఇటలీలు ప్రయత్నిచకపోయినట్లయితే అభివృద్ధి చెందినదేశాలు ఆసియా,ఆఫ్రికాలలో దోపిడీని మరికొంతకాలం కొనసాగించేవిగా….!!
  జర్మనీ,జపాన్లు రష్యా,చైనలవలన ఓటమికి గురయ్యాయని తెలిపారు-దీనికి సంభందిచిన సమగ్రవివరాలు గానీ,విశ్లేషణలుగానీ,గణంకాలుగానీ ఏమైనా అందుబాటులో ఉన్నయా? ఉంటే శ్రమానుకోకుండా అందించగలరు?

  పొదుపు విధానాల పేరుతో యూరోపియన్ దేశాలు కఠినమైన విధానాలను అవలంబిస్తున్నాయి. బడ్జెట్ ఖర్చులను తగ్గించడం, ఉద్యోగాలు కోత పెట్టడం, వేతనాల్లో కోత, సంక్షేమ చర్యల రద్దు లేదా కోత మొ.న చర్యలను అవి అమలు చేస్తున్నాయి. దాంతో ఐరోపా దేశాల జి.డి.పి అత్యల్ప స్ధాయిలో నమోదు అవుతోంది.
  పైవిధానలవలన జి.డి.పి తక్కువ స్థాయిలో అమలౌతున్నా వాటినే అనుసరించాల్సిన అవసరం ఏమిటి? ప్రత్యమ్నాయాలను ఎందుకు అనుసరించలేకపోతున్నాయి?

  ప్రాక్సీ యుద్ధాలంటే ఏమిటి?వాటిఫలితంగా ఏర్పడే అనుకూల ప్రభావాలేమిటి?(స్థానిక ప్రజలకు/ప్రభుత్వాలకు)

  ఆమెరిక తదితర పశ్చిమదేశాలు పరోక్ష యుద్ధాల ద్వారా స్ధానిక ప్రజలను అష్టకష్టాలపాలు చేస్తోంది. తమ ప్రజలను కూడా నిరుద్యోగం, దరిద్రం లాంటి సమస్యలతో బాధిస్తోంది. సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అనేక జిమ్మిక్కులకు పాల్పడుతోంది.
  చైతన్యవంతులైన అక్కడి ప్రజలను మభ్యపెట్టదం,జోకొట్టడం అంతసులభమా??

 3. వలస దేశాలు విముక్తి కావడానికి ప్రధానంగా కావలసింది అక్కడి ప్రజల ఉద్యమాలు. అనగా అంతర్గత కారణాలే ఒక అంశంలో మార్పుకు ప్రధానంగా దోహదం చేస్తాయి. జర్మనీ, ఇటలీ, జపాన్ ల దండయాత్రలు బాహ్య కారణం అవుతాయి. బాహ్య కారణాలు ఒక అంశాన్ని ప్రభావితం చేస్తాయే గానీ, మార్పుకు ఏకైక కారణంగా ఉండలేవు. ఒక వేళ రెండో ప్రపంచ యుద్ధం జరగకున్నా, భారత ప్రజలు నిర్ణయాత్మకంగా పోరాడితే విముక్తి తప్పక లభిస్తుంది. ప్రపంచ యుద్ధం వల్ల బ్రిటన్ బలహీన పడడం మన దేశంలో అధికార మార్పిడిని వేగవంతం చేసింది తప్ప అదే ప్రధాన లేదా ఏకైక కారణం కాదు.

  రష్యా, చైనాలు కారణం అనడానికి మీకు ఏ గణాంకాలు కావాలి? సమగ్ర వివరణ, విశ్లేషణ ఒక చోట దొరికేవి కావు. ఒకటి రెండు ఆర్టికల్స్ లో వివరించేది కూడా కాదు.

  ఫ్రాన్స్ తో పాటు ఇతర శక్తివంతమైన ఐరోపా రాజ్యాలను జర్మనీ ఆక్రమించుకున్నప్పుడు అమెరికా స్పందించలేదు. జర్మనీ జైత్రయాత్రకు ఐరోపాలో అడ్డు లేకుండా పోయింది. హిట్లర్, రష్యాతో ఒప్పందాన్ని పక్కన బెట్టి ఆ దేశం మీదికి దండెత్తిన తర్వాతే జర్మనీ పతనం మొదలయింది.

  చైనా (నూతన) ప్రజాస్వామిక విప్లవ చరిత్రను చదివితే జపాన్ అక్కడ ఎలా మట్టి కరిచింది తెలుస్తుంది. జాతీయ ప్రభుత్వం జపాన్ తో కుమ్మక్కై కమ్యూనిస్టులను ఊచకోత కోయించినా ప్రజలు వీరోచితంగా తిరగబడి ఇటు దేశంలోని ద్రోహులను అటు జపాన్ నూ మట్టి కరిపించారు. చైనాను వలసగా చేసుకోవాలన్న జపాన్ ప్రయత్నాన్ని ఆ విధంగా తిప్పి కొట్టారు. దానితో జపాన్ బలహీనపడింది.

  పొదుపు విధానాలు అంతిమంగా కార్మిక వర్గ వేతనాల భాగాన్ని తగ్గించి ఆ మేరకు పెట్టుబడిదారులకు లాభాలుగా తరలిస్తాయి. కంపెనీల కోసమే ఆ విధానాలు అవలంబిస్తున్నారు. ఆ క్రమంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడినా, ఆర్ధిక వ్యవస్ధ ఎంత క్రుంగిపోయినా వారికి అనవసరం. వారి కోసమే పొదుపు విధానాలు అమలు చేస్తుంటే ప్రత్యామ్నాయమ్ కోసం ఎందుకు చూస్తాయి?

  ఉక్రెయిన్, సిరియా, ఇరాక్ లలో ప్రస్తుతం జరుగుతున్నవి ప్రాక్సీ యుద్ధాలే. పాత్ర ధారులు స్ధానికులే గానీ ఆ యుద్ధాల అంతిమ ఫలితాన్ని అమెరికా, రష్యా, పశ్చిమ ఐరోపా దేశాలకు దక్కుతుంది. ఇవి మేలు చేస్తాయా, కీడు చేస్తాయా అని జనరలైజ్ చేసి చెప్పలేము. ఉక్రెయిన్ లో కీలు బొమ్మ ప్రభుత్వం నిలిపితే రష్యాను అదుపు చేయడం పశ్చిమ దేశాలకు ముఖ్యంగా అమెరికాకు తేలిక. దానిని నివారించడానికి రష్యా ప్రయత్నిస్తోంది. తూర్పు ఉక్రెయిన్ కు చేయగల సాయం చేస్తోంది. వీటివల్ల స్ధానిక ప్రజలకు ఎంత లాభం అనేది అక్కడి పరిస్ధితులపై ఆధారపడి ఉంటుంది.

  ఉదాహరణకి ఉక్రెయిన్ లో అమెరికా జోక్యం వల్ల ఐ.ఏం.ఎఫ్ ఆర్ధిక విధానాలు అమలు అవుతాయి. వీటికి వ్యతిరేకంగా ఎక్కడి ప్రజలకైనా నష్టమే. పశ్చిమ ఉక్రెయిన్ ప్రజల్లో కొందరు చైతన్యం లేక ఇ.యు లో చేరితే జర్మనీ లాగా అభివృద్ధి కావచ్చని భ్రమలకు లోనై ఉన్నారు. తూర్పు ఉక్రెయిన్ ప్రజలకు ఆ భ్రమలు లేవు. వాళ్ళు సంస్కృతి పరంగా రష్యాతో చారిత్రక సంబంధం కలిగి ఉన్నారు. (అవి ఒకప్పుడు రష్యాలో భాగమే. లెనిన్, కృశ్చెవ్ ల కాలంలో విడతల వారీగా ఉక్రెయిన్ లో కలిపారు. అప్పటి అవసరం అలాంటిది.) అక్కడి పరిశ్రమలు రష్యా పుణ్యమే. కాబట్టి అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని తిరస్కరించి, రష్యాతో స్నేహం చేయడం వారికి మేలు చేస్తుంది. కానీ అది రష్యా పెత్తనానికి దిగకుండా ఉన్నంతవరకు మాత్రమే. ఇప్పటికప్పుడు అమెరికా అనుకూల ఉక్రెయిన్ ప్రభుత్వ దాడులను తిప్పి కొట్టాలంటే అక్కడి ప్రజలకు రష్యా సాయం తప్పనిసరి.

  ఏ ప్రాంతం. లేదా దేశాన్ని తీసుకున్నా స్వతంత్రంగా, తమ పాలన తాము చేసుకుంటేనే ఉపయోగం. ఒకరి పెత్తనం కింద ఉండడం ఎవరికీ క్షేమకరం కాజాలదు. స్నేహ, సహకార సంబంధాలే దేశాల మధ్య ఉండాలి గానీ పెత్తందారీ సంబంధాలు కాదు. ఈ సూత్రానికి పశ్చిమ దేశాలు విరుద్ధం. పెత్తనం చిక్కాక రష్యా, చైనా లైనా అదే చేస్తాయి. ఆయా దేశాల్లోని సామాజిక వ్యవస్ధలను బట్టి వారితో స్నేహం మేలు చేస్తుందా లేక కీడు చేస్తుందా అన్నది నిర్ణయం అవుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్ధలతో స్నేహం ఎప్పటికీ కీడే చేస్తుంది. సోషలిస్టు వ్యవస్ధలతో స్నేహం మేలు చేస్తుంది. కానీ నికరమైన సోషలిస్టు వ్యవస్ధ ప్రస్తుతం ఏ దేశంలోనూ లేదు. కాబట్టి ఉన్న దానిలోనే కాస్త మెరుగైన స్నేహాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

 4. సర్, మీ సమాధానానికి ప్రత్యేకకృతజ్ఞతలు..

  జర్మనీ,జపాన్లు రష్యా,చైనలవలన ఓటమికి గురయ్యాయని తెలిపారు-దీనికి సంభందిచిన సమగ్రవివరాలు గానీ,విశ్లేషణలుగానీ,గణంకాలుగానీ ఏమైనా అందుబాటులో ఉన్నయా? ఉంటే శ్రమానుకోకుండా అందించగలరు?
  జర్మనీని నిలువరించడంలో రష్యాపాత్రగురించి కాస్తాచదివానుగానీ,జపాన్ నునిలువరించడంలో చైనా (నూతన) ప్రజాస్వామిక విప్లవం గురించి ఎక్కడా చదవలేదు! అందుకోసమే ఏమైనావివరాలు ఉంటేఅందిచగలరనీడిగాను.
  ఇంకా,పెర్ల్ హార్బర్ దాడులు-హిరోషిమా,నాగసాకీలపై అణుదాడులు తత్ఫలితంగా జపాన్ లొంగుబాతుగురించిచదివాను.
  సర్, చైనా (నూతన) ప్రజాస్వామిక విప్లవం అంటే మావోనేతృత్వంలో సాగిన సోషలిస్టులక్షనాలవిప్లవమేనా?లేదా ఇంకేదైనా ఉన్నదా?

  ఇంకనూ,ఆమెరిక తదితర పశ్చిమదేశాలు పరోక్ష యుద్ధాల ద్వారా స్ధానిక ప్రజలను అష్టకష్టాలపాలు చేస్తోంది. తమ ప్రజలను కూడా నిరుద్యోగం, దరిద్రం లాంటి సమస్యలతో బాధిస్తోంది. సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అనేక జిమ్మిక్కులకు పాల్పడుతోంది.
  చైతన్యవంతులైన అక్కడి ప్రజలను మభ్యపెట్టదం,జోకొట్టడం అంతసులభమా??
  పైదానిగురించి దయచేసి వివరించగలరు!

  సర్,మరోసారి మీసమాధానానికి కృతజ్ఞతలు!!!

 5. //జర్మనీ,జపాన్లు రష్యా,చైనలవలన ఓటమికి గురయ్యాయని తెలిపారు-దీనికి సంభందిచిన సమగ్రవివరాలు గానీ,విశ్లేషణలుగానీ,గణంకాలుగానీ ఏమైనా అందుబాటులో ఉన్నయా? ఉంటే శ్రమానుకోకుండా అందించగలరు?//
  మూల గారు,
  ఈ విషయం గురించి సమగ్రంగా తెలుసు కోవాలంటే ” ఆధునిక చరిత్ర ” రష్యన్‌ మూలం నుండి ఇంగ్లీషు అనువాధం ద్వారా రాచమల్లు రామచంద్ర రెడ్డి గారి తెలుగు అనువాదం రంగ నాయకమ్మ గారి వ్యాఖ్యాణం తొ దొరుకుతుంది. నవోదయ బుక్‌ హౌస్‌ లో ప్రయత్నిస్తే దొరక వచ్చు.

 6. మూల గారు, అమెరికా ప్రజలు చైతన్యవంతులైతే వారిని వారి పాలకులు అంత సులభంగా ఎలా మోసం చేయగలరు? అమెరికాలో సర్వ రోగాలూ ఉన్నాయి. మహిళలకు గర్భ నిరోధ ఆపరేషన్ చేయరాదని, అది దైవ వ్యతిరేకమనీ గట్టిగా నమ్మే మూఢులకు కొడవలేదు. రిపబ్లికన్ పార్టీకి వారు ఒక పెద్ద ఓటు బ్యాంకు కూడా. ఇప్పటికీ నీగ్రోలపై జాతి విద్వేషాన్ని ప్రబోధించే సంస్ధలూ ఉన్నాయి. ప్రజల చైతన్యం గాలిలోనుండి ఊడిపడేది కాదు. ఇక్కడికి మల్లేనే అక్కడ కూడా అది వివిధ సామాజిక వాస్తవాలకు బందీ.

  పైన తిరుపాలు గారు చెప్పిన రిఫరెన్స్ కోసం ప్రయత్నించండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s