ప్రశ్న: ప్రపంచ బ్యాంకు షరతులు, సబ్సిడీలు…


World Bank headquarters -Washington D.C.

World Bank headquarters -Washington D.C.

చందన:

శేఖర్ గారూ, ద్రవ్య పెట్టుబడి వచ్చి వెళ్ళిపోవడం వల్ల వచ్చిన నస్టం ఏమిటి? దాని డబ్బు అది తీసుకునిపొతుంది. దానిస్తానంలొ కొన్నవాళ్ళ పెట్టుబడి వస్తుంది కదా? మరి ఏమిటి నస్టం.

మరొ ప్రశ్న. ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పు తీసుకున్న దేశాలు దివాళా తీశాయని, సంక్షొభంలొ కూరుకపొయాయని చాలాసార్లు పేపర్లొ ,పుస్తకాలలొ చదివాను. అయితె ఎక్కడాకూడా వివరణ లేదు. అప్పుతీసుకున్న దేశం తీసుకున్న డబ్బుకు వడ్డీ, అసలు చెల్లిస్తుంటుంది. మరి ప్రపంచ బ్యాంకుకు అప్పు తీసుకున్న దేశంపైన రకరకాల ఆంక్షలు విధించడం దేనికి? దానికి కావలసింది తను యిచ్చిన డబ్బుపైన వడ్డీ + అసలు. అంతవరకే దానికి కావల్సినది. ఆ ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలలొ కలగచేసుకుని కార్మికవర్గానికి నస్టం కలిగించే విధంగా జోక్యం చేసుకొవలసిన అవసరం ఏమిటి?.

మరొక్క ప్రశ్న. అంతర్జాతీయ సమావేశాలలొ కొన్నిదేశాలు పాల్గొని కొన్నిదేశాలను సబ్సీడీలను తగ్గించాలని సామ్రాజ్యవాద దేశాలు పట్టుబట్టి సాదించాయని చదివాను. ఇక్కడి రైతాంగానికి ఇక్కడి ప్రభుత్వం ఇక్కడి డబ్బు సబ్సీడీ ఇస్తె వాళ్ళకేంటి నస్టం. అసలు వ్యవసాయ ఒప్పందాలు అక్కడ ఎందుకు చర్చించాలి?  ఆయా దేశాల్లొ వాళ్ళ వాళ్ళ యిస్టం వచ్చినట్టు చేసుకొవచ్చు కదా.పై ప్రశ్నలను టీచర్స్ ని అడిగాను. ప్రశ్నలను దాటవేశారు గానీ సమాదానం చెప్పలేదు. వాళ్ళె సమాధానం చెప్పలేనప్పుడు వీటిగురించి అవగాహని లేని నాలాంటి వాళ్ళు చాలామంది వుంటారు. మీ బ్లాగుని ఒక నెలనుంచీ చూస్తున్నాను. చాలాబాగుంది. మీరు శ్రమ అనుకొకుండా సిద్దాంతపరంగా చర్చించి వీలైతే ఒక టపాగా రాయండి. చాలామందికి ఉపయొగకరంగా వుంటుంది.

సమాధానం:

చందుతులసి గారు ఇప్పటికే పై ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అది చాలావరకు సరిపోతుంది. ఆయన సమాధానాన్ని ఇస్తూ చివర్లో ‘సిద్ధాంతపరంగా చర్చించమన్న’ భాగానికి నేను సమాధానం ఇస్తాను.

చందుతులసి:

చందన గారు. మీ ప్రశ్నలకు నాకు తెలిసిన పరిధిలో సమాధానం చెబుతాను.
ముందుగా మీరు వేసిన ప్రశ్నలను కిందివిధంగా విభజించాను.

1. ద్రవ్య పెట్టుబడి వచ్చి వెళ్ళిపొవడం వచ్చిన నస్టం ఏమిటి?. దాని డబ్బు అది తీసుకునిపొతుంది దానిస్తానంలొ కొన్నవాళ్ళ పెట్టుబడి వస్తుంది కదా? మరి ఏమిటి నష్టం..?

మీ ప్రశ్న ప్రకారం… ఎవరైనా ఇష్టం వచ్చినపుడు పెట్టుబడి పెడతారు. తమకు నచ్చినపుడు తీసుకుపోతారు. దీంట్లో నష్టం ఏముంటుంది. అనే కదా…. మాములుగా ఆలోచిస్తే ఎటువంటి నష్టం కనపడదు. కాని దాన్ని పరిస్థితులకు అన్వయించి చూసినప్పుడు లాభమా, నష్టమా అనేది మొదట తెలుస్తుంది.

మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. పెట్టుబడి రావడం… అంటే విదేశీ వ్యాపార సంస్థ, లేదా పెట్టుడిదారు ఎవరైనా ఎందుకు పెట్టుబడి పెడతారు. లాభం కోసమే కదా….అంటే తన పెట్టుబడి ద్వారా మనదేశంలో ఏదైనా ఒకరంగంలో పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించాలనే ఉద్దేశంతో వస్తారు. వెళ్లిపోవడమంటే. ఇక తనకు ఇక్కడ లాభం వచ్చే పరిస్థితి లేదని గ్రహించడం వల్లనో, లేదా మరోచోట ఇంకా లాభం వస్తుందని గ్రహించడం వల్లనో వెళ్లిపోతారు.

ఈ వెళ్లిపోవడం ఒక్కడుగా కాక….ఒకే సారి అందరూ వెళ్లిపోవడం వల్ల… ఆ సంస్థ నష్టాల పాలు కాదా…

ఉదాహరణకు ఒక బ్యాంకులో ప్రజలు డబ్బులు దాచుకుంటారు. బ్యాంకు ఏం చేస్తుంది…ఆ డబ్బుతో వేరే వ్యక్తులకు వడ్డీకి ఇచ్చి వ్యాపారం చేస్తుంది. ఐతే ఒకే సారి పెట్టుబడి పెట్టిన వ్యక్తులందరూ వచ్చి మా డబ్బు మాకు ఇవ్వండని అడిగితే… బ్యాంకు ఇవ్వగలదా. ఇవ్వలేదు. ఫలితంగా బ్యాంకుకు మార్కెట్ లో పరపతి పడిపోతుంది. బ్యాంకుపై ఒత్తిడి పెరిగి చివరకు దివాలా తీస్తుంది. అలాగే ఏదైనా దేశంలోకి పెట్టుబడులు ఒకే సారి గంపగుత్తగా వెనక్కు వెళితే మార్కెట్లు పడిపోతాయి. దేశ కరెన్సీ విలువ పడిపోతుంది. ఫలితంగా దిగుమతుల భారం పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ సంక్షోభం లోకి వెళుతుంది. ఇవన్నీ విడిగా జరిగే సంఘటనలు కాదు. ఒక దానికొకటి సహసంబంధం కలిగి ఉంటాయి. ఐతే పెట్టుబడి రావడం పోవడం అనేది ఊరికే జరగదు-రావడానికి కారణాలున్నట్లే పోవడానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మనదేశానికి సంబంధించినవి కావచ్చు. లేదా మన దేశానికి ఆవల జరిగే కారణాలు కావచ్చు. గ్లోబలైజేషన్ కారణంగా ఒక దేశంలోని ఆర్థిక పరిణామాలు మిగతా ప్రపంచంపైన కూడా ప్రభావం చూపుతాయి.

ఇక తర్వాత ప్రశ్న.

2. ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పు తీసుకున్న దేశాలు దివాళా తీశాయని, సంక్షోభంలొ కూరుకుపోయాయని చాలాసార్లు పేపర్లలో,  పుస్తకాలలో చదివాను. అయితె ఎక్కడాకూడా వివరణ లేదు. అప్పుతీసుకున్న దేశం తీసుకున్న డబ్బుకు వడ్డీ అసలు చెల్లిస్తుంటుంది. మరి ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకున్న దేశంపైన రకరకాల ఆంక్షలు విధించడం దేనికి? దానికి కావలసింది తను యిచ్చిన డబ్బుపైన వడ్డీ + అసలు. అంతవరకే దానికి కావల్సినది .ఆ ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలలొ కలగచేసుకుని కార్మికవర్గానికి నస్టం కలిగించే విధంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి?

ఇది చాలా పెద్ద ప్రశ్న (మాత్రమే) కాదు. సమాధానం ఇదీ అని ఒక ముక్కలో చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు అంటే… ఏదో వడ్డీ వ్యాపారం చేసుకునే సేఠ్ లాంటిది కాదు. అదో పెద్ద వ్యవస్థ. ప్రపంచంలోని పెట్టుబడి దారీ దేశాలు పేద,అభివృద్ధి చెందిన దేశాల్లోని సహజవనరులు దోచుకునేందుకు ఏర్పాటు చేసిందే ప్రపంచబ్యాంకు. నేరుగా దోపిడీ చేయడం కుదరదు కాబట్టి… ఆర్థిక సహాయం పేరుతో పేద దేశాల బలహీనతలు అవకాశంగా మార్చుకుంటారు. తాము అప్పు ఇవ్వాలంటే దేశంలో ప్రైవేటు వ్యాపారాన్ని ప్రోత్సహించాలని… వ్యాపారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని… దేశంలోని సహజవనరుల్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని … స్థానికంగా కార్మిక సంఘాలు, చట్టాలు గట్టిగా ఉంటే వాటిని బలహీన పరచాలని షరతులు విధిస్తాయి.

అలా దేశంలోని విలువైన ప్రకృతి వనరుల్ని, దేశంలోని మార్కెట్ ను తమ చేతుల్లోకి తీసుకునేందుకు అగ్ర రాజ్యాలకు చెందిన కంపెనీలు ప్రపంచ బ్యాంకును ఏర్పాటు చేశాయి. అగ్రరాజ్యాల్ని నడిపిస్తోంది కొన్ని బహుళ జాతి బడా కార్పోరేట్ శక్తులు. అవి తమ స్వార్థం కోసం తమదేశంలోని ప్రభుత్వాల్నే కాదు, ప్రపంచంలోని ఏ దేశంలోని ప్రభుత్వాన్నైనా కూల్చగలవు. అందుకోసం మీడియాను కూడా విస్తృతంగా వాడుకుంటాయి. IMF, WTO ఇలా పేరు ఏదైనా కానీ అంతిమంగా వాటి ఉద్దేశం పేద బలహీన దేశాల్లోని ప్రజల్ని దోచుకోవడమే. ఆఖరుకు మనం గొప్పగా చెప్పుకునే ఐక్యరాజ్య సమితి కూడా అమెరికా లాంటి అగ్రరాజ్యాల చేతిలో కీలుబొమ్మ అని అనేక సార్లు రుజువైంది. అందుకు ఇటీవలి ఇజ్రాయిల్ అరాచకమే పెద్ద ఉదాహరణ.

ఒక్క ముక్కలో చెప్పాలంటే అగ్రరాజ్యాల కార్పోరేట్ శక్తులకు కావాల్సింది వ్యాపారం. అందుకోసం ఏమైనా చేస్తాయి.

3.మరొక్క ప్రశ్న. అంతర్జాతీయ సమావేశాలలొ కొన్నిదేశాలు పాల్గొని కొన్నిదేశాలను సబ్సీడీలను తగ్గించాలని సామ్రాజ్య దేశాలు పట్టుబట్టి సాధించాయని చదివాను. ఇక్కడి రైతాంగానికి ఇక్కడి ప్రభుత్వం ఇక్కడి డబ్బు సబ్సీడీ ఇస్తే వాళ్ళకేంటి నస్టం. అసలు వ్యవసాయ ఒప్పందాలు అక్కడ ఎందుకు చర్చించాలి? ఆయా దేశాల్లొ వాళ్ళ వాళ్ళ యిస్టం వచ్చినట్టు చేసుకొవచ్చు కదా.

ఈ ప్రశ్నకు కూడా పై సమాధానమే వర్తిస్తుంది. అక్కడి వ్యాపార శక్తులకు మార్కెట్ కావాలి. మరి పేద, వెనుకబడిన దేశాలు స్థానికి ప్రజలకు సబ్సిడీలు ఇచ్చి, ఆహార భద్రత లాంటి చట్టాలు తెస్తే వాటి ఉత్పత్తులు ఎవరు కొంటారు. ఉదాహరణకు అమెరికాలో చెరకు బాగా పండుతుంది. అది అమ్ముకోవడానికి మార్కెట్ కావాలి. అందుకోసం అది మన దేశంపై ఒత్తిడి తెచ్చి చక్కెర దిగుమతి చేసుకునేలా చేసింది. ఫలితంగా మన దేశంలో చెరకు పండుతున్నా….మనం చక్కెర దిగుమతి చేసుకుంటున్నాం. ఫలితంగా మన దేశంలో చెరకు పంటకు ధర లేకుండా పోయి రైతులు నష్టపోతున్నారు. ఇలా అనేక కారణాలు.

WTO చట్టాల్లో భాగంగా, వ్యవసాయ ఒప్పందాల్లో భాగంగా… సబ్సిడీలపై నియంత్రణ విధించారు. సబ్సిడీలను-గ్రీన్ బాక్స్, అంబర్ బాక్స్ లుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణ ప్రకారం పేద దేశాలు తమకిష్టం వచ్చినట్లు సబ్సిడీలు ఇస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉండాలన్నా…., కోట్లాది ఉద్యోగాలు రావాలన్నా WTO నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని అగ్రరాజ్యాలు తీర్మానించాయి.

మీరు మరో ప్రశ్న వేశారు. వ్యవసాయ ఒప్పందాలు అక్కడ ఎందుకు చర్చించాలని. మనం WTO సంస్థలో సభ్య దేశంగా చేరాం. కాబట్టి ఎగుమతి దిగుమతి విధానాలైనా, పన్నుల విధానాలైనా, వ్యవసాయ విధానాలైనా…ఆ సంస్థ చేసే రకరకాల ఒప్పందాల ప్రకారమే మన ఆర్థిక వ్యవస్థను అనుగుణంగా మార్చుకోవాలి. అది ఒప్పందంలో భాగం. ఒకసారి WTO లో చేరి సంతకం పెట్టాక ఆ నియమావళి ప్రకారం నడుచుకోవాలి. అలా నడుచుకోకపోతే కోర్టుకు ఈడుస్తారు. విచారణ జరిపి భారీగా జరిమానా విధిస్తారు. రకరకాల ఆంక్షలు విధిస్తారు.

***               ***               ***

నా సమాధానం:

ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లు విధించే షరతుల ప్రధాన లక్ష్యం వివిధ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను బహుళజాతి కంపెనీల దోపిడీకి అనుకూలంగా మార్చుకోవడం. రెండో ప్రపంచ యుద్ధానంతరం మూడో ప్రపంచ దేశాలు వలస పాలన నుండి విముక్తి అయ్యాయి. అనంతరం తమ దేశంలోని ధనిక వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వ రంగ కంపెనీలను అభివృద్ధి చేసుకున్నాయి. దేశంలోని ఉత్పత్తులు, సేవలు, పంపిణీ… ఇత్యాది వాణిజ్య కార్యకలాపాలను ప్రభుత్వరంగ కంపెనీల ద్వారా, ప్రభుత్వ సంస్ధల ద్వారా నియంత్రించుకున్నాయి. సరుకుల ఉత్పత్తి, పంపిణీలను కేవలం వ్యాపారంగా మాత్రమే కాక ప్రజా సంక్షేమ సాధనాలుగా పరిగణిస్తూ తదనుగుణంగా వివిధ వ్యవస్ధలను నిర్మించుకున్నాయి. ఆనాటి సోవియట్ రష్యా, సోషలిస్టు చైనాలు ఈ వ్యవస్ధల నిర్మాణానికి స్ఫూర్తిగా నిలిచాయి.

మూడో ప్రపంచ దేశాలు మాత్రమే కాదు. సోషలిస్టు రష్యా, చైనా, తూర్పు యూరప్ దేశాల పురోగమనం వల్ల అమెరికా, ఐరోపాలు కూడా తమ దేశాలను సంక్షేమ రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి. ఆ పేరుతో ప్రజలకు మద్దతుగా ఉచిత, సబ్సిడీ సేవలను అందించాయి. లేకపోతే తమ ప్రజలు కూడా సోషలిజం కోసం విప్లవాల బాట పడతారని అవి భయపడ్డాయి. ఒకపక్క కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం సాగిస్తూనే బడ్జెట్ లో గణనీయ మొత్తాన్ని ప్రజా సేవలకు ఖర్చు పెట్టాయి.

1990 నాటికి సోవియట్ రష్యా కుప్పకూలింది. సోషలిస్టు చైనా పెట్టుబడిదారీ పంధా చేపట్టింది. అందుకు కావలసిన క్రమం సోవియట్ రష్యాలో 1954లోనే మొదలైతే చైనాలో 1978 నుండి మొదలయింది. 1990ల నాటికి సోషలిస్టు పంధా అనేది ఉనికిలో లేకుండా పోయింది. దానితో పశ్చిమ మార్కెట్ ఎకానమీ దేశాలకు తాము సంక్షేమ రాజ్యాలుగా ఉండవలసిన అవసరం తప్పిపోయింది. కోల్డ్ వార్ వలన యుద్ధ ఆర్ధిక వ్యవస్ధలు నిర్వహిస్తూ క్రమంగా సంక్షోభంలో కూడా అవి కూరుకుపోయాయి. మార్కెట్ ఎకానమీలలో సంక్షోభం అంటే వారి బహుళజాతి పెట్టుబడిదారీ కంపెనీలకు మార్కెట్లు తగ్గిపోయి, లాభాలు పడిపోవడం. కొత్త మార్కెట్లకు మార్గాలు మూసుకుని ఉండడం. దీనినే సామ్రాజ్యవాద సంక్షోభం అని పేర్కొనవచ్చు.

కాబట్టి  సామ్రాజ్యవాద సంక్షోభం నుండి బైటపడేందుకు, బహుళజాతి కంపెనీలకు విస్తారమైన మార్కెట్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్ధల్లో పెను మార్పులు తేవలసిన అవసరం వచ్చింది. ప్రభుత్వ రంగం పరిశ్రమలు, వ్యవస్ధలు పునాదిగా ఉన్న మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధలను రద్దు చేసి వాటి స్ధానే బహుళజాతి కంపెనీల మార్కెట్ అవసరాలకు అనుకూలమైన వ్యవస్ధలను ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమాన్ని నేరుగా నిర్వర్తిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అందుకోసం ఆయా దేశాల్లో కృత్రిమ ఆర్ధిక సంక్షోభాలను సృష్టించారు. (ఉదాహరణకి మన దేశంలో 1990లో చెల్లింపుల సమతూకపు సంక్షోభం ఏర్పడిందని చెప్పారు) ఈ సంక్షోభాల పరిష్కారానికి ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ అప్పులు తప్ప మార్గం లేదని నమ్మ బలికారు. ఆ విధంగా వచ్చినవే నూతన ఆర్ధిక విధానాలు.

ప్రపంచ బ్యాంకు ద్వారా మౌలిక నిర్మాణాలకు అప్పులిచ్చి ఆర్ధిక అభివృద్ధి కార్యకలాపాలను అదుపులోకి తెచ్చుకోగా, ఐ.ఎం.ఎఫ్ అప్పుల ద్వారా ‘వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమాలను’ రుద్ది ద్రవ్య విధానాలను నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. ప్రపంచ బ్యాంకుకు మరో పేరు IBRD. అనగా అంతర్జాతీయ పునర్నిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంకు (International Bank for Reconstruction and Development). రోడ్లు, నీటి ప్రాజెక్టుల దగ్గర నుండి మురుగు కాలవల తవ్వకం వరకు అప్పులిస్తూ షరతులు విధించి ఆర్ధిక కార్యకలాపాలను బహుళజాతి కంపెనీల దోపిడీకి అనువుగా మారుస్తున్నారు. ఐ.ఎం.ఎఫ్ ద్వారా వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమం అమలు చేయిస్తున్నారు. అనగా మూడో ప్రపంచ దేశాలలోని మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధలను క్రమంగా బలహీనపరిచి, అంతిమంగా రద్దు చేసి పశ్చిమ మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలకు సేవ చేసే వ్యవస్ధలుగా మార్చడం.

మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధలను రద్దు చేస్తే దాని స్ధానంలో మార్కెట్ ఎకానమీ (సమస్త ఆర్ధిక విధానాలను మార్కెట్ నిర్ణయిస్తుందని చెబుతారు. వాస్తవంలో అదీ జరగదు) ప్రవేశిస్తుందని పొరబాటు పడకూడదు. WB, IMF విధానాల వలన మూడో ప్రపంచ దేశాల్లో మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ పోయి మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ రాదు. అలా జరిగితే పశ్చిమ దేశాలకు సమస్య. వారికి కావలసింది తమ తమ మార్కెట్ ఎకానమీలకు మరిన్ని పోటీ మార్కెట్ ఎకానమీలు రావడం కాదు. తమ మార్కెట్ ఎకానమీలకు సేవలు చేసే ఆర్ధిక వ్యవస్ధలు మాత్రమే వారికి కావాలి. అనగా  వారి కంపెనీలకు అత్యంత చౌక రేట్లకు, వీలయితే ఉచితంగా, ముడి పదార్ధాలు సరఫరా చెయ్యాలి. మన ముడి పదార్ధాలతో తయారు చేసిన సరుకుల్ని మనమే కొని పెట్టాలి. వారి సరుకులపైన వీలయినన్ని తక్కువ పన్నులు వేయాలి. అసలు పన్నులే వేయకపోతే ఇంకా మేలు. తమకు పోటీ వచ్చే మన దేశ కంపెనీలకు రాయితీలు ఇవ్వకూడదు. అసలు సరుకులన్నీ మేమే సరఫరా చేస్తాం కదా, ఇక మీ కంపెనీలు ఎందుకు అని కూడా అడుగుతారు (నిజంగానే.) వరి, గోధుమ లాంటి పంటలు మేము పండించి సరఫరా చేస్తాం కదా, ఇక మీ వ్యవసాయం ఎందుకు అంటారు. (ఇదీ నిజమే.) చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగ అని ఏమి తోచక ప్రచారం చేయలేదు.

మన కంపెనీలకు, రైతులకు మన ప్రభుత్వం పన్ను రాయితీలు, ఇన్ పుట్ సబ్సిడీలు ఇవ్వడం అంటే తద్వారా ఉత్పత్తి అయ్యే సరుకుల ధరలు తక్కువగా ఉంచడం. అలా చేస్తే విదేశీ సరుకులకు బదులు స్వదేశీ సరుకుల్ని జనం కొంటారు. అందుకని సబ్సిడీలు తగ్గించాలని, రద్దు చేయాలని షరతులు పెడతారు. ఇక్కడ విదేశీ కంపెనీలు పెట్టడానికి అనేక నియంత్రణ చట్టాలు ఆటంకంగా ఉన్నాయి. రెడ్ టేపిజం పేరుతో ఆ చట్టాలను అప్రతిష్టపాలు చేశారు. మన వేలుతో మన కంటినే పొడవడం అన్నమాట. ఆ చట్టాలను బలహీనపరచడానికి సరళీకరణ విధానాలు రుద్దారు. పెట్టుబడి, వనరుల కోసం ప్రైవేటీకరణ చేయాలన్నారు. ఇలా అన్ని విధాలుగా మన ఉనికిని రద్దు చేసుకుని ధనిక దేశాల బహుళజాతి కంపెనీలకు సాగిలపడేలా WB, IMFలు చేస్తాయి. IMF తన వెబ్ సైట్ లో నేరుగానే చెబుతుంది, ‘ఐ.ఎం.ఎఫ్ సభ్య దేశాలు తమ సార్వభౌకాధికారంలో కొంత వదులుకోవాలి’ అని.

సామ్రాజ్యవాద కంపెనీలు విస్మరించే విషయం ఏమిటంటే వారి సరుకులు కోనాలంటే మొదట మన దగ్గర (ఆధీన దేశాల ప్రజల దగ్గర) కొనుగోలు శక్తి ఉండాలి కదా. అనగా అక్కడి ప్రజలకు ఆదాయం ఉండాలి. ఆదాయం ఉండాలంటే ఏదో ఒక పని ఉండాలి. మన వ్యవసాయం, మన కంపెనీలు, మన ప్రభుత్వం… ఇవన్నీ ఉంటేనే ఎవరి సరుకులైనా మనం కొనగలిగేది. మన వ్యవసాయాన్ని దండగ చేసేసి, మన కంపెనీలను అమ్మేసుకుని, మన పనులన్నీ రద్దు చేసుకుంటే మనకిక ఆదాయం ఉండదు. ఆ విధంగా వారు ఏ మార్కెట్ కోసమైతే WB, IMF లను ఉసిగొల్పి పరాధీన విధానాలను అమలు చేయిస్తున్నారో ఆ మార్కెట్ కూడా బలహీనపడిపోతుంది. ఆ విధంగా సామ్రాజ్యవాద సంక్షోభం ఇంకా తీవ్రం అవుతుంది. మరోవైపు అన్నీ అవకాశాలు కోల్పోయిన జనం ఊరికినే కూర్చుంటారా? ఆందోళనల బాట పడతారు. ఆందోళనలకు సరైన వాళ్ళు నాయకత్వం వహిస్తే విప్లవాలు సంభవిస్తాయి. ఆ విధంగా సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్ధ తన మరణశాసనాన్ని తానే లిఖించుకుంటుంది.

2 thoughts on “ప్రశ్న: ప్రపంచ బ్యాంకు షరతులు, సబ్సిడీలు…

  1. అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసి అమ్మితే పెత్రోల్‌లాగే గోధుమల ధర కూడా కొనలేనంతగా పెరుగుతుంది కనుక మన పాలకులు ఆ పని చేస్తారనుకోను. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదు. కొంత మంది పల్లెటూర్లలో వ్యవసాయ భూములు అమ్ముకుని మరీ హైదరాబాద్‌లో ఆస్తులు కొన్నారు. సామ్రాజ్యవాదులు (MNC) అంతర్జాతీయ విమానాశ్రయం లాంటివి ఉన్న హైదరాబాద్ లాంటి నగరాలలోనే కార్యాలయాలు పెడతారు కానీ గ్రామీణ ప్రాంతాలలో కాదు. గ్రామీణాభివృద్ధి చెయ్యడం ఇష్టం లేక చంద్రబాబు వ్యవసాయం దండగ అని అన్నాడు. కానీ అందరూ పల్లెటూర్లు వదిలేసి హైదరాబాద్‌లో స్థిరపడడం సాధ్యం కాదు కదా.

  2. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి IT ఉద్యోగుల సంఖ్య కేవలం మూడున్నర లక్షలు. ఇంత పరిమిత సంఖ్యలో ఉన్న ఉద్యోగాల కోసం వ్యవసాయం ఎవరు మానేస్తారు?

    సామాజిక శాస్త్రాలు అవసరం లేదని కూడా చంద్ర బాబు అన్నాడు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చెయ్యడానికి సామాజిక జ్ఞ్ఞానమే ఎక్కువ అవసరం కదా. ఆంధ్రాలో వందలాది ఇంజినీరింగ్ కాలేజ్‌లు ఉన్నాయి. వాటిలో 200 కాలేజ్‌లు విజయవాడ, గుంటూరుల చుట్టుపక్కలే ఉన్నాయి. ఇప్పుడు ఇంజినీరింగ్ విద్యార్థుల్లో 80% మందికి ఉద్యోగాలు దొరకడం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాతే రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజ్‌ల సంఖ్య పుట్టగొడుగుల్లా పెరిగింది కానీ చంద్రబాబు చెప్పినంత అభివృద్ధి మాత్రం జరగలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s