తూర్పు ఉక్రెయిన్: ఉక్రెయిన్ బలగాల లొంగుబాటు


తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటు దళాల చుట్టివేత నుండి బైటపడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఉక్రెయిన్ పశ్చిమ అనుకూల ప్రభుత్వ బలగాలు ‘బ్రతుకు జీవుడా’ అంటూ లొంగిపోతున్నాయి. ‘ప్రత్యేక టెర్రరిస్టు అణచివేత కార్యక్రమం’ పేరుతో డోనేట్స్క్, లుగాన్స్క్ ప్రాంతాలపైకి దండెత్తిన ఉక్రెయిన్ సైన్యం గత రెండు నెలలుగా అమానుష కృత్యాలకు తెగబడింది. విచక్షణా రహితంగా బాంబుదాడులు చేయడంతో 100 మందికి పైగా ప్రజలు చనిపోయారు.

ఈ క్రమంలో రెండు బ్రిగేడ్ల సైన్యాన్ని డాన్ బాస్ మిలీషియా చుట్టుముట్టడంతో వారిని ముట్టడి నుండి బైటికి తెచ్చేందుకు మలేషియా విమానాన్ని కూల్చారని మిలట్రీ విశ్లేషకులు వివరించారు. విమానాన్ని రష్యా సరిహద్దుల్లో ముట్టడి ఏరియాకు సమీపంలో కూల్చివేసి ఆ నెపాన్ని రష్యా మీదికి తోసేందుకు పధకం వేశారని కానీ విమానం అనూహ్యంగా వెనక్కి ప్రయాణించి సరిహద్దుకు దూరంగా కూలిపోవడంతో వారి లక్ష్యం నెరవేరలేదని వారు వివరించారు. కూలిన విమానం వద్దకు అంతర్జాతీయ పరిశీలకులను అనుమతించాలని డిమాండ్ చేసి ఆ వంకతో ముట్టడిలో ఉన్న ఉక్రెయిన్ బలగాలను విడిపించాలని భావించగా అది పారలేదని తెలిపారు.

ఈ పరిస్ధితుల్లో ముట్టడిలో ఉన్న ఉక్రెయిన్ బలగాల వద్ద సరఫరాలు నిండుకున్నాయి. మందుగుండు లేదు. భోజనం అసలే లేదు. కనీసం తాగడానికి మంచి నీరు కూడా కరువయింది. ఆకలికి తాళలేక పాములు, ఇతర జీవాలను పట్టుకుని కాల్చుకుని తినవలసిన పరిస్ధితి దాపురించింది. ఇక మరో దారిలేక లొంగుబాటుకు అంగీకరించాలని కోరడంతో కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.

ఉక్రెయిన్ బలగాలు వచ్చింది డాన్ బాస్ ఏరియా (తూర్పు ఉక్రెయిన్ ప్రాంత రాష్ట్రాలను ఉమ్మడిగా ఈ పేరుతో పిలుస్తారు) లో రష్యా భాషీయ ప్రజలను చంపేందుకు. అక్కడి ప్రజలను టెర్రరిస్టులుగా ముద్రవేసి మూకుమ్మడి హత్యాకాండకు గురి చేయడానికి. తద్వారా పశ్చిమ ప్రయోజనాలను నిరాకరించే జనం అక్కడ ఉంటే చావనైనా చావాలి, లేదా రష్యాకన్నా పారిపోవాలి.

ఉక్రెయిన్ లో రాజధాని కీవ్ తర్వాత అత్యంత జనసమ్మర్డమైన ప్రాంతం డాన్ బాస్ ఏరియా. రష్యా సహాయంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. అనేక పరిశ్రమలు, కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. యూరోపియన్ దేశాల పెట్టుబడులు సైతం ఇక్కడ కేంద్రీకృతం అయినాయి. కనుక ఈ ప్రాంతం సొంత నిర్ణయాలతో వ్యవహరిస్తే తమ రుణాలు, పెట్టుబడులు గల్లంతవుతాయని పశ్చిమ దేశాలు భయపడుతున్నాయి.

ఉక్రెయిన్ లో యనుకోవిచ్ ప్రభుత్వం ఉన్నపుడే డాన్ బాస్ ప్రాంతంలోని రాష్ట్రాలు అసంతృప్తితో రగిలిపోతున్నాయి. వరుస ప్రభుత్వాల అవినీతి, దోపిడి విధానాల వలన యనుకోవిచ్ ప్రభుత్వం హయాంలోనే తాము ఆక్రమితులుగా ఉన్నామని తూర్పు ఉక్రెయిన్ ప్రజలు భావించారు. (ఈ సంగతి ఇ.యు, అమెరికాలకు తెలుసని ఎస్టోనియా విదేశీ మంత్రి, ఇ.యు విదేశీ విధాన అధిపతి కేధరీన్ ల మధ్య ఫోన్ సంభాషణ ద్వారా వెల్లడి అయింది.) అలాంటిది యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కూల్చివేసి, రష్యన్ భాషను రద్దు చేస్తూ చట్టం చేయడంతో తాము మరింత ప్రతికూల పరిస్ధితుల్లోకి జారిపోయామని డాన్ బాస్ ప్రజలు గ్రహించారు.

ఒడెస్సా హత్యాకాండ

దీనికితోడు యనుకోవిచ్ పదవిని వదిలి రష్యాకు పారిపోయిన తదనంతర రోజుల్లో ఒడెస్సా ప్రాంతంలో ఒక హత్యాకాండ ఘటన చోటు చేసుకుంది. ఒడెస్సా ప్రజలు కూడా పశ్చిమ దేశాలు ప్రతిష్టించిన ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. తాము స్వతంత్రంగా విడిపోతామని ఆందోళన చేశారు. డాన్ బాస్ ఏరియాలో ఆందోళనలను అణచివేయకపోతే తాము హామీ ఇచ్చిన 17 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేది లేదని ఐ.ఏం.ఎఫ్ అధినేత క్రిస్టిన్ లాగార్డే నూతన పాలకులను తెగేసి చెప్పింది.

ఆమె హెచ్చరించిన రెండు రోజులకు ఒడెస్సాలో ట్రేడ్ యూనియన్ భవనం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రజలను ఒక పద్ధతి ప్రకారం భవనం లోపలికి వెళ్ళేలా చేసి భవనానికి నిప్పు అంటించారు. లోపల ఉన్నవారు బైటికి రాకుండా తలుపులు బిగించడంతో అనేకమంది సజీవంగా కాలి బూడిదయ్యారు. అధికారికంగా 40 మంది చనిపోయారని ప్రకటించారు. కానీ వాస్తవంగా 100 మందికి పైగా మరణించారని అక్కడి ప్రజలు చెప్పే మాట!

చనిపోయినవారిలో కొంతమంది సజీవ దహనం కాగా ఇంకా అనేకమందిని గొంతు బిగించి చంపారని, కొందరిని కొట్టి చంపి మంటల్లో వేశారని స్ధానిక పత్రికలు వెల్లడి చేశాయి. కాలిపోయినవారిలో గర్భిణీ స్త్రీలు ఉన్నారని అవి తెలిపాయి. ఈ ఘోరం పైన విచారణ చేయాలని ఏ పశ్చిమ దేశమూ కోరలేదు. అమెరికా అధ్యక్షుడు ఒబామా కనీసం సానుభూతి ప్రకటించలేదు. పైగా తిరుగుబాటుదారులే దహనం చేశారని ప్రత్యారోపణ చేశారు.  మితవాద గ్రూపు రైట్ సెక్టార్, నయా నాజీ సంస్ధ స్వోబోడా… ఈ రెండు సంస్ధలు ఈ హత్యాకాండకు పాల్పడ్డాయనీ, ఐ.ఏం.ఎఫ్ అధిపతి చేసిన హెచ్చరిక నేరుగా ఈ హత్యాకాండకు దారి తీసిందని తెలిసినా పశ్చిమ పత్రికలు నోరు మెదపలేదు.

(ఒడేస్సా హత్యాకాండ ఫలితాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఇది హత్యాకాండకు పాల్పడినవారు విజయోత్సాహంతో పోస్ట్ చేసిన వీడియో. ఇందులో చాలా ఘోరమైన దృశ్యాలు ఉన్నందున మందస్తు హెచ్చరిక చేయడమైనది.)

ఒడేస్సా హత్యాకాండ జరిగిన మరుసటి దినమే ఉక్రెయిన్ నూతన పాలకులకు ప్రకటించిన 17 బిలియన్ డాలర్ల రుణంలో మొదటి విడత 3.2 బిలియన్లను ఐ.ఎం.ఎఫ్ విడుదల చేసింది. మరో విడత రుణం విడుదల చేయడానికి వీలుగా మరిన్ని హత్యాకాండల కోసం డొనేట్స్క్, లుగాన్స్క్ రాష్ట్రాల మీదికి వెళ్ళిన ఉక్రెయిన్ సైన్యాలు అక్కడ ముట్టడికి గురై ఎటూ పాలుపోక లొంగుబాటుకి సిద్ధం అయ్యారు.

రష్యా టుడే, స్లావ్యన్ గ్రాడ్ తదితర వార్తా సంస్ధల ప్రకారం రెండు బ్రిగేడ్లు ఇప్పటికే లొంగిపోయాయి. మొత్తం 485 మంది ఉక్రెయిన్ సైనికులు ఆగస్టు 4 తేదీన ఆయుధాలు అప్పగించి లొంగిపోగా వారిని తమ భూభాగం లోకి రష్యా అనుమతించింది. 72nd, 24th మేకనైజ్డ్ బ్రిగేడ్ లకు చెందిన బలగాలు రష్యాలో శరణు కావాలని విన్నవించారని, వారి విన్నపం మేరకు రష్యా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని రష్యా టుడే తెలిపింది. మరింత మంది సైనికులు ఈ విధంగా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

అయితే ఉక్రెయిన్ తరపున వచ్చిన పోలండ్ కిరాయి సైనికులు మాత్రం ఇంకా తిరుగుబాటుదారులతో తలపడుతున్నారు. ఉక్రెయిన్ బలగాలు పోరాట ప్రాంతాలకు వెళ్ళి తిరుగుబాటుదారులతో చేరిపోవడం ఉక్రెయిన్ కు సమస్యగా మారింది. దానితో పోలండ్ నుండి కిరాయి సైనికులను మాట్లాడుకుని ఐ.ఎం.ఎఫ్ ఆదేశాల మేరకు తమ దేశ ప్రజలపై హత్యాకాండకు ఉక్రెయిన్ పాలకులు తెగబడుతున్నారు. దానితో తిరుగుబాటుదారులు మరింత పట్టుదలతో తమ ప్రాంత రక్షణ కోసం తెగిస్తున్నారు.

లొంగుబాటుకు ముందు తమ వద్ద ఉన్న ఆయుధాలను, సాయుధ వాహనాలను ధ్వంసం చేస్తామని ఉక్రెయిన్ బలగాలు కోరాయి. అందుకు తిరుగుబాటుదారులు ఒప్పుకోలేదు. వాహనాలు, ఆయుధాలను తమకు అప్పగించాలని వారు షరతు విధించారు. లొంగిపోయినవారు ఆ షరతును అమలు చేసిందీ లేనిదీ ఇంకా తెలియలేదు. మరిన్ని బలగాలు లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నాయని మాత్రం తెలుస్తోంది.

One thought on “తూర్పు ఉక్రెయిన్: ఉక్రెయిన్ బలగాల లొంగుబాటు

  1. మీరు మైక్రో & మాక్రో ఎకనామిక్ ఎనాలిసెస్‌కి విరుద్ధంగా ఈ వ్యాసం వ్రాసారు. మన దేశంలో జనాభా ఎక్కువ, భూమి విస్తీర్ణం తక్కువ. రైతుల్లో ఎక్కువ మంది నాలుగైదు ఎకరాలు భూమి ఉన్నవాళ్ళే. నాలుగైదు ఎకరాలు విస్తీర్ణం గల వ్యవసాయ భూమి భారీ యంత్రాల వాడకానికి సహకరించదు. రైతుకి వ్యవసాయ ఋణం ఇచ్చినా అతను ఆ డబ్బుతో అధునాతన యంత్రాలు కొనుక్కోవడం జరగదు, agricultural output పెరగదు. పెరగలేని output కోసం ఋణం ఇవ్వడమే అనవసరం, ఇక ఋణమాఫీ మాత్రం ఎలా అవసరమవుతుంది?

    మన రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర భూములు తీసుకున్న పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టకుండా, ఆ భూముల్ని తనఖా పెట్టి బ్యాంక్ లోన్లు తీసుకున్నారు. అది చట్ట ప్రకారం నేరం అని తెలిసే అలా చేసారు. పరిశ్రమ పెట్టడానికి భూమి ఒక్కటే సరిపోదు కదా, మరి భూమి ఫ్రీగా ఇచ్చినంతమాత్రాన పరిశ్రమలు ఎలా పెడతారు? ఆ భూమి విలువని ఎక్కువగా చూపే దొంగ పత్రాలు సృష్టించి, దాంతో బ్యాంక్ లోన్‌లు తీసుకుని ఆ డబ్బుతోనే బతికేస్తారు ఈ పారిశ్రామికవేత్తలు. అందుకే మన దేశంలోని బ్యాంక్‌లకి NPAలు ఎక్కువగా ఉన్నాయి.

    దొంగ పత్రాలకి లోన్‌లు ఇచ్చే బ్యాంక్ అధికారులని అరెస్త్ చెయ్యాలని కోరకుండా “మీరు పారిశ్రామికవేత్తలకి లోన్‌లు ఇచ్చారు కనుక రైతులకి కూడా లోన్‌లు ఇవ్వండి” అని అంటే బ్యాంక్‌లు రైతులకి ఋణాలు ఎలా ఇస్తాయి?

    పైగా ఋణాల మాఫీ కూడానూ! మనది ప్రపంచ బ్యాంక్ అప్పులతో బతికే దేశం. ఉచిత విద్యుత్‌కి ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వదు అని గతంలో ప్రచారం చేసిన చంద్రబాబు ఋణమాఫీకి మాత్రం ప్రపంచ బ్యాంక్ అప్పు ఇస్తుందని ఎలా అనుకున్నాడు? 1950లోనే జవహార్ లాల్ నెహ్రూ విదేశీ అప్పులు తీసుకునే విధానాన్ని మొదలుపెట్టకుండా ఉండి ఉంటే మన దేశం ఈ స్థితికి దిగేది కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s