MH17: ఫైటర్ జెట్ గుళ్ళు పేల్చి కుల్చారు -జర్మన్ పైలట్


మలేషియా ప్రయాణీకుల విమానం MH17 ని బక్ మిసైల్ తో కూల్చారని ఉక్రెయిన్, అమెరికా, ఐరోపా రాజ్యాలు కట్టగట్టుకుని ఆరోపించాయి. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, విదేశీ మంత్రి జాన్ కెర్రీ ఈ ఆరోపణల్లో అగ్రభాగాన నిలిచారు. ఆనక అబ్బే పొరబాటున కూల్చి ఉంటారని నాలుక మడతేశారు. కానీ బక్ మిసైల్ తోనే కూల్చారని, కూల్చడానికి తగిన పరిస్ధితులను రష్యాయే ఏర్పరిచిందని ప్రస్తుతం వాదిస్తున్నారు.

కానీ జర్మనీకి చెందిన ఏవియేషన్ నిపుణుడు పీటర్ హైసెంకో జులై 30 తేదీన ఎండర్ వెల్ట్ ఆన్ లైన్ వెబ్ సైట్ లో వివిధ ఆధారాల సాయంతో MH17 ఎలా కూలింది విశ్లేషణ ఇచ్చారు. విమానాన్ని బక్ మిసైల్ తాకినట్లు ఎలాంటి ఆధారమూ లేదని ఆయన స్పష్టం చేశారు. కూలిన విమానం విడిభాగాల ఫోటోలను విశ్లేషిస్తూ ఆయన సవివరంగా విమానం కూలిన కారణాలను విశ్లేషించారు.

విమానం ముందు భాగమే (కాక్ పిట్) ప్రధానంగా దెబ్బ తిన్నదని, మిగిలిన భాగం అంతా చెక్కు చెదర లేదని ఆయన తెలిపారు. ఎత్తునుండి పడడం వల్ల ముక్కలుగా విడిపోయి చెల్లా చెదురు కావడం తప్ప ఇతర విడి భాగాలన్నీ పేలుడు వల్ల దెబ్బ తినలేదని, ఒక్క కాక్ పిట్ మాత్రమే నిండా రంధ్రాలతో తీవ్రంగా దెబ్బతిన్నట్లు గమనించవచ్చని ఆయన తెలిపారు. తన తన విశ్లేషణను ప్రచురించిన అనంతరం గూగుల్ ఇమేజెస్ లో ఆయన ప్రస్తావించిన ఫోటోలు అదృశ్యం అయ్యాయని ఆయన చెప్పడం విశేషం. అయితే సదరు ఫోటోలను తాను అప్పటికే భద్రపరిచినందున గూగుల్ ప్రయత్నం విఫలం అయిందని ఆయన సూచించారు.

రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విమానం కూలినప్పటికి సమయంలో MH17 తో పాటు ఏయే విమానాలు ఎగురుతున్నదీ గుర్తించే తమ రాడార్ చిత్రాలను పూర్తిగా వెల్లడి చేసింది. అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలు రష్యాను తప్పు పట్టడంతో అంతర్జాతీయ మీడియాను పిలిపించి తమ వద్ద ఉన్న సాక్ష్యాలు అన్నింటినీ వారి ముందు ఉంచింది. అయితే రష్యన్ సాక్ష్యాలను పశ్చిమ మీడియా కవర్ చేయలేదు.

కానీ OSCE ఆధ్వర్యం లోని అంతర్జాతీయ పరిశోధన బృందం సభ్యుడు ఒకరు పీటర్ హైసెంకో ఇచ్చిన విశ్లేషణను ధృవీకరించడంతో రష్యా సాక్ష్యాలు తిరుగు లేనివని రుజువయింది. వాస్తవం స్పష్టంగా రుజువైనప్పటికీ పశ్చిమ పత్రికలు, అమెరికా, ఐరోపా రాజ్యాలు రష్యాపై దుష్ప్రచారాన్ని మానలేదు. మరిన్ని ఆంక్షలతో రష్యాను ఒంటరి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో పీటర్ హైసెంకో రాసిన ఆర్టికల్ లోని కొన్ని భాగాలను యధాతధంగా అనువదించి ప్రచురిస్తున్నాను.

***               ***               ***

MH017 విమాన ట్రాజెడీ వివరాలు ఇంకా గోప్యంగానే ఉంచుతున్నారు. ఫ్లైట్ రికార్డులు (బ్లాక్ బాక్స్) ఇంగ్లాండ్ లో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ఆ రికార్డుల ద్వారా ఏం తెలుస్తుంది? బహుశా మీరు ఊహించేదానికంటే ఎక్కువే తెలియొచ్చు. కాక్ పిట్ ముక్కకు సంబంధించిన ఫోటోను చూసినట్లయితే, వాయిస్ రికార్డర్ లో ఏమి ఉందో తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది. ఏవియేషన్ నిపుణుడిగా నేను ఇంటర్నెట్ లో వ్యాప్తిలో ఉన్న విమాన శకలాల ఫోటోలను ఆసక్తిగా పరిశీలించాను.

మొదటిది, విమాన శిధిలాల ఫోటోలు చాలా తక్కువగా అందుబాటులో ఉండడం నాకు ఆశ్చర్యంగా ఉంది. గూగుల్ తో వెతికినా అదే పరిస్ధితి. అందుబాటులో ఉన్నవన్నీ తక్కువ రిసొల్యూషన్ తో ఉన్నాయి, ఒక్కటి తప్ప. ఆ ఒక్కటి పైలట్ పక్కన  కిటికీ కింది భాగంలో ఉండే కాక్ పిట్ కు చెందినది…

ప్రొజెక్టైల్స్ విమానం లోపలికి, బైటికీ వెళ్ళినట్లు తెలిపే రంధ్రాలు

ఈ కింద ఉన్న బొమ్మను క్లిక్ చేసి పెద్దదిగా చేసి చూడాలని నా సలహా. పి.డి.ఎఫ్ కాపీలో ఉన్న ఈ ఫోటోను డౌన్ లోడ్ చేసి పెద్ద సైజు చేసి చూస్తే ముఖ్యమైన అంశాలు తెలుస్తాయి. ఇది అవసరం. ఎందుకంటే అలా చూస్తేనే నేనిక్కడ చెప్పే అంశాలు అర్ధం అవుతాయి. నిజాలు స్పష్టంగా, పెద్ద గొంతుతోనే మాట్లాడుతున్నాయి. ఈ నిజాలు ఊహాలకు ఏ మాత్రం తావు ఇచ్చేవిగా లేవు. కాక్ పిట్ పైకి కాల్పులు జరిపిన (shelling) ఆనవాళ్లను ఈ ఫోటోలో గుర్తించవచ్చు.

 

MH17 cockpit fragment (Click to see big image in PDF)

MH17 cockpit fragment (Click to see big image in PDF)

గుళ్ళు లోపలికి వెళ్ళిన గుర్తులు, బైటికి వచ్చిన గుర్తులు కనిపిస్తున్నాయి. కొన్ని రంధ్రాల అంచులు లోపలికి వంగిపోయి కనిపిస్తే, మరికొన్ని రంధ్రాల అంచులు బైటికి వంగిపోయి కనిపిస్తున్నాయి. కనీసం 30 మిల్లీ మీటర్ల ప్రొజెక్టైళ్ళు వేగంగా, అత్యంత బలంగా కాక్ పిట్ లోపలికి, బైటికి వెళ్ళిన గుర్తులవి. లోపలికి వంగిన రంధ్రాలు కాస్త చిన్నవిగా ఉంటే బైటికి వంగిన రంధ్రాల అంచులు కాస్త పెద్దవిగా ఉన్నట్లు గమనించవచ్చు. ఒకే కాలిబర్ ఉన్న ప్రొజెక్టైల్ కాక్ పిట్ లోలి దూసుకెళ్ళినపుడు పదును చెదరకుండా ఉంటే లోపలికి వెళ్ళాక ఆ తాకిడికి కాస్త చెదిరిపోతాయి. అవి ఎంత ఎక్కువ శక్తి, వేగాలతో విమానం కాక్ పిట్ దూసుకెళ్లాయంటే, ఆ శక్తి వల్ల అవతలివైపు నుండి బైటికి వచ్చాయి. చెదిరిన షెల్ అవతలివైపు నుండి బైటికి వస్తూ కాస్త పెద్ద రంధ్రం చేస్తూ బైటికి వచ్చాయి.

ఇంటర్నెట్ లోని శిధిలాల ఫోటోలను తిరగేస్తుంటే ఒక సంగతి స్పష్టంగా అర్ధం అవుతుంది. కాక్ పిట్ వెనక ఉండే విమాన భాగాలన్నీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. కాకపోతే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి ఉన్నాయి. కేవలం కాక్ పిట్ మాత్రమే ఈ విధంగా విధ్వంసం జరిగిన గుర్తులు కలిగి ఉంది. ఈ విమానాన్ని మిసైల్ మధ్య భాగంలో తాకలేదు. విధ్వంసం కాక్ పిట్ వరకే పరిమితం అయింది. ఇదే ముఖ్యమైన క్లూ ఇస్తోంది. నిజానికి కాక్ పిట్ భాగం ప్రత్యేకంగా తయారు చేసిన శక్తివంతమైన లోహంతో తయారు చేస్తారు. విమానాలు అత్యధిక వేగంతో ప్రయాణిస్తాయి కనుక దాని ముందు ముక్కు భాగం ఆ బలాన్ని తట్టుకోవడానికి గట్టి లోహంతో తయారు చేస్తారు. విమానం శిధిలాల్లో కూడా ఈ అంశాన్ని గమనించవచ్చు. లాకర్ బీ వద్ద కూలిపోయిన పాన్ ఆం విమానం విషయంలో కూడా కాక్ పిట్ భాగమే చెక్కు చెదరకుండా ఒకే ముక్కగా దొరికింది. దానికి కారణం అది శక్తివంతమైన లోహంతో తయారు చేయడమే. MH017 విమాన శిధిలాలను బట్టి లోపల కూడా శక్తివంతమైన పేలుడు జరిగిందని అర్ధం చేసుకోవచ్చు.

ట్యాంకులను నాశనం చేయగల మందుగుండు

కాబట్టి ఏం జరిగి ఉంటుంది? రష్యా తన రాడార్ రికార్డ్ లను ఇటీవల ప్రచురించింది. ఆ రికార్డుల ప్రకారం కనీసం ఒక SU-25 ఫైటర్ జెట్ విమానం (ఉక్రెయిన్ కి చెందినది) MH017 కి సమీపంలో ఎగురుతోంది. స్పానిష్ ఎయిర్ కంట్రోలర్ కార్లోస్ (ఇప్పుడా వ్యక్తి అదృశ్యం అయ్యాడు) వెల్లడించిన అంశాలతో ఇది సరితూగుతోంది కూడాను. MH017 విమానానికి సమీపంలో రెండు ఫైటర్ జెట్ విమానాలు ఉండడం తాను చూశానని ఆయన చెప్పాడు.

ఇప్పుడు SU-25 ఫైటర్ జెట్ లో ఉండే మందుగుండును పరిశీలిస్తే రంధ్రాలకు కారణం తెలుస్తుంది. డబుల్ బారెల్ 30 mm తుపాకి దానికి అమర్చి ఉంటుంది. అది GSh-302/AO-17A రకానికి చెందినది. 250 రౌండ్ల ట్యాంకు వ్యతిరేక గుళ్ళు (shells), splinter-explosive గుళ్ళు (ఇవి లక్ష్యిత ట్యాంకులోకి దూసుకెళ్లి లోపల పెద్ద శక్తితో పేలిపోతాయి), వరుసగా ఒకదాని తర్వాత మరొకటి (alternate గా) అమర్చి ఉన్న మ్యాగజైన్ దీనికి ఉంటుంది. (రెండు రకాల రంధ్రాలను బట్టి) MH017 కాక్ పిట్ రెండు వైపుల నుండి కాల్చారని స్పష్టం అవుతోంది. కాక్ పిట్ కు సంబంధించిన ఒకే ముక్కలో గుండ్లు లోపలికి వెళ్ళిన గుర్తులు, బైటికి వచ్చిన గుర్తులు రెండూ ఉండడం అందుకే.

………….ఇంకా ఉంది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s