ఉక్రెయిన్ ఫైటర్ జెట్ SU-25తో కూల్చారు -2


Peter Haisenko

Peter Haisenko

ట్యాంకు విధ్వంసక ఇన్సెండియరీ బాంబులు, splinter-explosive బాంబులు ఆల్టర్నేట్ గా కాక్ పిట్ ను తాకితే ఏమవుతుందో ఒకసారి ఊహించండి! ఇవి ఆధునిక ట్యాంకును ధ్వంసం చేయడానికి ఉద్దేశించినవి. ఇన్సెండియరీ బాంబులు పాక్షికంగా కాక్ పిట్ గుండా ప్రయాణించి అవతలి వైపు నుండి కాస్త మారిన రూపంతో బైటికి వచ్చాయి. (ఏవియేషన్ ఫోరెన్సిక్ నిపుణులు శ్రద్ధ పెడితే వాటిని విమానం కూలిన ఏరియాలో కనుగొనవచ్చు.) మందపాటి ట్యాంకు గోడలను ఛేదించుకుని పోయే విధంగా ఈ బాంబు గుళ్లను డిజైన్ చేశారు. splinter-explosive గుళ్ళు అనేకమార్లు పేలే స్వభావం కలిగి ఉంటాయి. అవి తమ డిజైన్ కు తగ్గట్టుగానే కాక్ పిట్ లోకి వెళ్ళాక పెద్ద ఎత్తున పేలుళ్లు సృష్టిస్తాయి. GSh-302 ఫిరంగి అత్యంత వేగంగా గుళ్లను పేలుస్తుంది.  కాబట్టి కాక్ పిట్ లోపల అతి తక్కువ సమయంలోనే వేగంగా వరుస పేలుళ్లు సంభవించి ఉంటాయి. ఇవి ట్యాంకును ధ్వంసం చేయడానికి ఉద్దేశించినవాని మరువకండి.

వాస్తవానికి ఏ తప్పు, ఎవరు చేశారు?

వాణిజ్య విమానం ఏ మాత్రం సందు లేకుండా అత్యంత ఒత్తిడితో సీల్ చేయబడి ఉంటుంది. అందువలన కాక్ పిట్ లో జరిగే పేలుడు రెప్ప పాటు కాలంలో అక్కడి ఒత్తిడిని తీవ్ర స్ధాయికి, లేదా కేబిన్ పేలిపోయే స్ధాయికి పెంచుతుంది.  విమానాన్ని ఈ స్ధాయి పేలుళ్లను తట్టుకునే విధంగా తయారు చేయరు. అది బెలూన్ మాదిరిగా పేలిపోతుంది. మనం చూస్తున్న శిధిలాలు కూడా దీనినే ధ్రువపరుస్తున్నాయి. విమానం వెనుక భాగం ముక్కలు అయినప్పటికీ ధ్వంసం కాకుండా ఉండిపోయింది. లోపల అత్యధిక స్ధాయిలో పెరిగిపోయిన ఒత్తిడి వలన విమానం బలహీనంగా ఉండే జాయింట్ల దగ్గర గాలిలో బద్దలయింది. శిధిలాలు విస్తారమైన ఏరియాలో చెల్లాచెదురుగా పడిపోవడం, కాక్ పిట్ అతి భయానకంగా ధ్వంసం

Graze on the wing

Graze on the wing

కావడం ఇందువల్లనే జరిగింది. ఒక ఫోటోలో విమానం రెక్కకు గుండు రాసుకుంటూ పోయిన గుర్తును గమనించవచ్చు. ఈ రాసుకుపోయిన దిశను జాగ్రత్తగా గమనిస్తే అది నేరుగా కాక్ పిట్ కు దారితీస్తుందని గ్రహించవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… హై రిజొల్యూషన్ తో ఉన్న రంధ్రాలతో కూడిన కాక్ పిట్ భాగానికి సంబంధించిన ఫోటో, విమానం రెక్కను గుళ్ళు రాసుకుంటూ పోయినట్లు చూపుతున్న ఫోటో రెండూ గూగుల్ ఇమేజెస్ నుండి మాయమైపోయాయి. ఇప్పుడవి ఇంటర్నెట్ లో లేవు. నిజానికి MH17 శిధిలాల ఫోటోలు చాలా వరకు ఇంటర్నెట్ నుండి మాయమయ్యాయి.

వాషింగ్టన్ నుండి వినవస్తున్న గొంతులు ఇప్పుడు ‘విశాధాకరమైన తప్పిదం/ప్రమాదం’ గురించి మాట్లాడుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే ఏ రకమైన తప్పిదం ఈ దుర్ఘటనకు కారణం అయిందన్నదే. ఊహాగానాలకు బదులు ఈ అంశాలను పరిగణించాలని ఇతరులను కోరుతున్నాను: రష్యా అధ్యక్షుడి విమానం ఈ MH017 తరహాలోనే మూడు రంగుల్లో ఉంటుంది. అదే సమయంలో అధ్యక్షుడు పుతిన్ ప్రయాణిస్తున్న విమానం MH017కు సమీపంలోనే ఎగురుతోంది. ఏవియేషన్ రంగంలో ‘సమీపం’ అంటే 150 నుండి 200 మైళ్ళ వరకు అని అర్ధం. మిస్ టిమొషెంకో (ఉక్రెయిన్ మాజీ అధ్యక్షురాలు) రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కలష్నికోవ్ (AK47) తో కాల్చి చంపేస్తానని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవచ్చు.

అయితే, ఇది కేవలం ఊహాగానం మాత్రమే.  కానీ మలేషియా విమానం MH017 కాక్ పిట్ ను ఫైటర్ జెట్ గుళ్లతో పేల్చివేశారన్నది మాత్రం ఖచ్చితంగా ఊహాగానం కాదు.

***               ***               ***

ఈ ఆర్టికల్ ను ముగించే ముందు మరికొన్ని సంగతులు చెప్పుకోవాలి. ఉక్రెయిన్ ప్రభుత్వం ఇంత దురాగతానికి ఎందుకు పాల్పడుతుంది?

ఇది అర్ధం కావాలంటే ఉక్రెయిన్ ప్రభుత్వం పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా అమెరికా ప్రయోజనాల కోసం పని చేస్తోందన్న సంగతి గుర్తుంచుకోవాలి. అమెరికా సెనేటర్లు, ఉప విదేశీ మంత్రులు స్వయంగా కీవ్ ఆందోళనల చెంతకు వచ్చి, ఆహార పోట్లాలు పంచి పెట్టి ప్రజాస్వామ్య ఎన్నికల్లో అధికారం చేపట్టిన యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రోత్సహించి వెళ్లారు. అదే ఆందోళనకారులను ఉక్రెయిన్ ప్రభుత్వం నియమించిన స్నైపర్లు పదుల సంఖ్యలో కాల్చి చంపి ఆ నెపాన్ని యనుకోవిచ్ ప్రభుత్వం పైకి నేట్టారు. కానీ ఆ రహస్యం ఎస్తోనియా విదేశీ మంత్రి, ఇ.యు విదేశీ విధాన అధిపతిల ఫోన్ సంభాషణలో వెల్లడి అయింది.

సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సో కాల్డ్ తిరుగుబాటుదారులకు (ఆల్-ఖైదా గ్రూపు టెర్రరిస్టులు) రసాయన ఆయుధాల ప్రయోగంలో శిక్షణ ఇచ్చి వారి చేత రసాయన ఆయుధాలు ప్రయోగింపజేసి ఆ నెపాన్ని బషర్ పైకి నెట్టారు.

ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రభుత్వానికి, తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటుదారులకు మధ్య జరుగుతున్న ఘర్షణ వాస్తవానికి రష్యాపై అమెరికా జరుపుతున్న ప్రాక్సీ యుద్ధం. అంతర్జాతీయ రాజకీయ, మిలట్రీ ఘర్షణల్లో రష్యా స్వరం అంతకంతకూ పెరుగుతుండడం అమెరికాకు పెద్ద సమస్యగా మారింది. దానితో రష్యా పైన అమెరికా కత్తి గట్టింది. సోవియట్ రష్యా పతనానంతరం అధికారం చేపట్టిన యెల్టిసిన్ అమెరికా అడుగులకు మడుగులొత్తాడు. దానికి భిన్నంగా పుతిన్ స్వతంత్ర పంధాను ఎంచుకున్నాడు. తమ దేశంలోని భారీ సహజవనరులను వినియోగించుకుంటూ రష్యాను శక్తివంతం చేస్తున్నాడు.

మరోవైపు అమెరికా ఆర్ధికంగా పతన దిశలో ప్రయాణిస్తోంది. సమీప భవిష్యత్తులో కోలుకునే అవకాశం లేదు. సామ్రాజ్యవాద దేశాలు తమ సొంత సంక్షోభాన్ని ప్రపంచ మీద రుద్దుతాయి. అమెరికా ఇప్పుడు అదేపని చేస్తోంది. సంక్షోభం నుండి బైటపడేందుకు అమెరికా అనుసరిస్తున్న దూకుడు ఆర్ధిక విధానాలకు రష్యా ఆటంకంగా పరిణమించడంతో ఆ దేశాన్ని బలహీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా రష్యా పొరుగున ఉన్న ఉక్రెయిన్ ను అస్ధిరం కావించారు.

ఉక్రెయిన్ ను తమ తమ ప్రభావ విస్తరణ నుండి దూరంగా ఉంచుతూ తటస్ధంగా ఉంచాలని గతంలో పశ్చిమ దేశాలకు (నాటో), రష్యాకు అనధికారిక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందానికి భిన్నంగా ఉక్రెయిన్ ను అస్ధీరపరచడంతో పుతిన్ అప్రమత్తమై ముంచుకొస్తున్న ప్రమాదానికి స్పందిస్తున్నాడు. క్రిమియాలో రిఫరెండం నిర్వహించి రష్యాలో కలుపుకోవాలన్న తీర్పును మన్నించాడు. కానీ తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు ఎంతగా కోరినప్పటికీ సైన్యాలు పంపలేదు. రష్యాను ముగ్గులోకి లాగితే ఉక్రెయిన్ యుద్ధంలో కూరుకుపోతుందని అమెరికా ఎత్తు వేయగా పుతిన్ సంయమనం వలన ఆ ఎత్తు పారలేదు.

ఈ క్రమంలో మలేషియా విమానం పోటేళ్ళ మధ్య మేకలా బలైపోయింది. విమానం కూలిన ముందు రోజుల్లో తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటు దారుల చేతుల్లో ఉక్రెయిన్ సైన్యం చావు దెబ్బలు తింటోంది. ఆ ఏరియాలో ఉక్రెయిన్ సైన్యాన్ని తిరుగుబాటుదారులు చుట్టుముట్టి సరఫరాలు అందకుండా చేశారు. మరికొన్ని రోజులు గడిస్తే అవమానకరమైన ఓటమిని ఎదుర్కొనే పరిస్ధితిని ఎదుర్కొంటోంది. చుట్టివేత నుండి బైటపడడానికి మార్గం దొరకబుచ్చుకోవడానికి మార్గం వెతుకుతూ MH017 విమానాన్ని బలి తీసుకున్నారని కొందరు మిలట్రీ విశ్లేషకులు వివరించారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే విమానం రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో కూలిపోవాలి. ఆ నెపాన్ని రష్యా పైకి నెట్టేసి అంతర్జాతీయ పరిశీలకులు అక్కడికి వెళ్లడానికి మార్గం ఇవ్వాలని ఐరాసలో డిమాండ్ చేయాలి. ఆ మార్గం ద్వారా ఉక్రెయిన్ సైన్యం బైటపడాలి.

SU-25 నుండి వెలువడిన క్షిపణి మొదట ఒక రెక్కను తాకింది. దానితో ఒక ఇంజను ధ్వంసం అయింది కానీ విమానం ఇంకా గాలిలోనే ఉండిపోయింది. పైగా తన దిశను మార్చుకుని U ఆకారంలో వెనక్కి ప్రయాణం మొదలు పెట్టింది. అనగా  రష్యా సరిహద్దు నుండి దూరంగా జరుగుతోంది. దానితో కంగారు పడిన ఉక్రెయిన్ మిలట్రీ వ్యూహకర్తలు అర్జెంటుగా బక్ మిసైల్ ను ప్రయోగించి ఉండవచ్చని విశ్లేషకులు వివరిస్తున్నారు. బక్ అవసరం లేకుండానే రెండు SU-25 జెట్లతో పని కానిచ్చి ఉండవచ్చని అర్జెంటుగా కూల్చివేయడానికి ఇరు వైపులా జెట్ ఫైటర్లు ప్రయోగించారని వారు వివరిస్తున్నారు.

మెషీన్ గన్ తో కాల్చినట్లుగా కాక్ పిట్ తూట్లు పడిందన్న సంగతిని పశ్చిమ పత్రికలు ఇప్పుడు అయిష్టంగా అంగీకరిస్తున్నాయి. కానీ దానికి సంబంధం లేని కారణాలు ఏవో చెబుతున్నాయి. భూమి నుండి ప్రయోగించే బక్ మిసైల్ వల్ల ఇటువంటి రంధ్రాలు పడవన్న సంగతిని విస్మరిస్తున్నాయి. ఏదో విధంగా తిరిగి నెపాన్ని తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటుదారుల మీదికి తద్వారా రష్యా మీదికి నేట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒక పక్క పొరబాటున కూల్చారని అమెరికా చెబుతూనే అదే నోటితో రష్యాయే కారణం అని సంబంధం లేకుండా ఆరోపిస్తోంది. రష్యా తన రాడార్ రికార్డ్ లను పూర్తిగా బహిరంగం చేస్తుందని అమెరికా ఊహించలేదు. అందువల్ల ప్రారంభంలో దూకుడుగా రష్యాయే కారణం అని ఒబామా దగ్గరి నుండి కెర్రీ, ఇతర అధికారుల వరకూ ఆరోపణలు గుప్పించారు. రష్యా తన సాక్ష్యాలను వెల్లడి చేయడంతో తోక ముడిచి ‘అబ్బే, పొరబాటున కూల్చి ఉంటారు’ అని నాలిక వెనక్కి తిప్పారు. దానికి కూడా రష్యా సృష్టించిన పరిస్ధితులే కారణం అని చెప్పడం మానలేదు.

నిజానికి ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభం అయిందే అమెరికా, ఐరోపా దేశాల వలన. యూరోపియన్ యూనియన్ లో చేరే నిర్ణయాన్ని ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు యనుకోవిచ్ వాయిదా వేయడంతోనే సంక్షోభం మొదలయింది. పచ్చి మితవాదులు, నయా నాజీ గ్రూపులను దించి హింసాత్మక ఆందోళనలు చేయించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి తమ కీలు బొమ్మ ప్రభుత్వాన్ని నిలిపారు. ఉక్రెయిన్ సంక్షోభం అంతా అక్కడి నుండే మొదలయింది. కాగా ఇప్పుడు విమానం కూల్చివేతకు తగిన పరిస్ధితులను రష్యాయే కల్పించిందని చెప్పడం “దొంగే దొంగ, దొంగ” అని గావు కేకలు వేయడం.

Mh17 విమానం కూల్చివేత ఒక విఫల ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్. ఇప్పుడు తూర్పు ఉక్రెయిన్ పై పోరాడాలని పంపిన ఉక్రెయిన్ సైన్యంలో అనేకమంది తమ తప్పు తెలుసుకుని తిరుగుబాటుదారుల వైపుకి వెళ్లిపోతున్నారు. కమాండర్లు సైతం తిరుగుబాటు పక్షంలో చేరిపోతున్నారు. ఈ వాస్తవాలను చెప్పకుండా సరికొత్త ప్రాంతాలు ఉక్రెయిన్ సైన్యాలు స్వాధీనం చేసుకుంటున్నాయని కార్పొరేట్ పత్రికలు వార్తలు రాస్తున్నాయి.

అమెరికా, పశ్చిమ రాజ్యాల సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ప్రయాణీకుల విమానాన్ని కూల్చివేయడం అత్యంత ఘోరమైన, అమానుషమైన, రోత పుట్టించే చర్య. ఇలాంటి నీతిమాలిన చర్యలు పశ్చిమ దేశాల ఖాతాల్లో చాలానే ఉన్నాయి. భారత దేశంలో జలియన్ వాలా బాగ్ దుర్ఘటన అలాంటిదే. ఆఫ్రికా దేశాల ప్రజలను జంతువుల లెక్కన ఒడల్లో బందీలుగా తెచ్చుకుని బానిసలుగా మార్చుకున్న చరిత్ర అమెరికా ఖాతాలో భద్రంగా లిఖించబడి ఉంది. బానిస వ్యవస్ధను నిర్మూలించే చట్టానికి వ్యతిరేకంగా ఏర్పడిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా ఈ రోజు బారక్ ఒబామా తమ పూర్వీకులపై సాగిన అమానుష కృత్యాలను ఉక్రెయిన్, లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సోమాలియా, యెమెన్ మొదలైన దేశాల ప్రజలపై సాగిస్తున్నాడు. జార్జి బుష్ హయాంలో పరిమిత సంఖ్యలోనే డ్రోన్ హత్యలు జరిగితే ఒబామా హయాంలో డ్రోన్ హత్యలు ఒక విధానంగా మారాయి. గాజాపై ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న ఆయుధాలు అమెరికా అందించినవే అనీ, దాడులు జరుగుతుండగానే అమెరికా మందుగుండు సరఫరా చేసిందని ఎడ్వర్డ్ స్నోడెన్ పత్రాల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలో ఎక్కడ అమానుషం జరుగుతుంటే అక్కడ అమెరికా, పశ్చిమ దేశాల హస్తం తప్పనిసరిగా కనిపిస్తుంది. ఈ ఘోరకలిని ఆపడం ఎలా అన్న సంగతిని ప్రపంచ ప్రజలు సీరియస్ గా ఆలోచించాలి.

3 thoughts on “ఉక్రెయిన్ ఫైటర్ జెట్ SU-25తో కూల్చారు -2

  1. పీటర్ హైసెంకో చాలా లోతుగా…ససాక్ష్యాధారాలతో అసలు కారణాన్ని వెలికి తీశారు. పశ్చిమ దేశాల మీడియా చేస్తున్న దుష్ప్రచారం మరో సారి తేటతెల్లమైంది. ఐనా అలా విమానం కూలిందో లేదో…ఏదో తమ దగ్గర ఆధారాలున్నట్లు పశ్చిమ పత్రికలు రష్యానే కూలగొట్టిందని ప్రచారం మొదలు పెట్టాయి. కానీ ఒక్క ఆధారం చూపించలేదు. ఇప్పుడు ఇన్ని ఆధారాలతో మాట్లాడుతుంటే ఈ వార్తలను మాత్రం ప్రచురించవు. ఇంత విలువైన వ్యాసం అందించిన మీకు కృతజ్ఞతలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s