ప్రశ్న: రిట్రాస్పెక్టివ్ టాక్స్ అంటే?


GAAR

శ్రావణ్ కుమార్:

రిట్రాస్పెక్టివ్ టాక్స్ అంటే ఏమిటి? మీకు సమయం ఉంటే పూర్తి వివరాలు ఇవ్వగలరు.

సమాధానం:

రిట్రాస్పెక్టివ్ అంటే ఈ సందర్భంలో అర్ధం, గత కాలానికి కూడా వర్తించేది అని. ప్రభుత్వాలు చట్టాలు చేసేటప్పుడు ఆ చట్టం యొక్క స్వభావాన్ని బట్టి ఎప్పటి నుండి వర్తించేది కూడా చట్టంలో పొందుపరుస్తారు. వెంటనే అమలులోకి వచ్చేటట్లయితే ‘with immediate effect’ అంటారు. గతంలో నిర్దిష్ట తేదీ నుండి వర్తింపజేయాలని భావిస్తే ఆ తేదీని చట్టంలో పొందుపరుస్తారు. ఇలా గతించిన కాలానికి కూడా వర్తించే విధంగా చేయడాన్ని ‘రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్’ అంటారు.

వోడా ఫోన్ పన్ను ఎగవేత సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ GAAR అనే చట్టాన్ని తయారు చేసారు. పార్లమెంటు ఈ చట్టాన్ని ఆమోదించింది కూడా. General Anti-Avoidance Rules పేరుతో చేసిన చట్టం ఆదాయ పన్ను చట్టానికి అనుబంధంగా అమలు చేయాలని తలపెట్టారు. చట్టం అయితే చేశారు గానీ దానిని అమలు చేసే దమ్ము గత, ఇప్పటి ప్రభుత్వాలకు లేకపోయింది. ప్రణబ్ ను రాష్ట్రపతిగా పంపించిన తర్వాత ఆర్ధిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టిన చిదంబరం చట్టం అమలును 5 సం.లు వాయిదా వేశారు.

ఈ చట్టానికి వ్యతిరేకంగా బి.జె.పి ఎన్నికల్లో ప్రచారం చేసింది కూడా. కానీ చట్టాన్ని నేరుగా ప్రస్తావించకుండా ‘విదేశీ పెట్టుబడులను బెదరగొట్టే విధానాలను అనుసరించం’ అనీ, ‘పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టిస్తాం’ అనీ, ‘అంచనా వేయదగిన పన్నుల విధానాన్ని (predictable tax policy) తెస్తాము’ అనీ బి.జె.పి ప్రచారం చేసింది. అధికారం చేపట్టిన తర్వాత GAAR ను రద్దు చేస్తారా అని అడిగితే ఆర్ధిక మంత్రి, బి.జె.పి నేతలు నేరుగా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు. ఈ చట్టాన్ని అమలు చేసే ఉద్దేశ్యం తమకు లేదని బడ్జెట్ లో పరోక్షంగా సూచించడం తప్ప నేరుగా చెప్పలేదు. నేరుగా చెబితే విమర్శలు వస్తాయని భయం. అలాగని ధైర్యం చేసి రద్దు చేస్తే ప్రజల్లో పలచన అవుతామని మరో భయం.

GAAR చట్టం, దాని చుట్టూ అల్లుకున్న వివిధ రాజకీయాలను గతంలో కొన్ని ఆర్టికల్స్ లో వివరించాను. ఆ ఆర్టికల్స్ కు లంకెలను కింద ఇస్తున్నాను. ఈ పన్ను వివాదం గురించిన చరిత్రను ఈ ఆర్టికల్స్ లో వివరంగా చూడవచ్చు.

ఆదాయ పన్ను చట్టం అమలులోకి వచ్చిన నాటి నుండి, అనగా గత 50 యేళ్ళ నాటి నుండి GAAR అమలులోకి వచ్చేలా తయారు చేశారు. ఈ చట్టం అమలు చేస్తే లక్షల కోట్ల ఆదాయం భారత ఖజానాకు సమకూరుతుంది. కనీసం గత 5 సం.ల నుండి అమలు చేసినా అధమం లక్ష కోట్లు వసూలు అవుతుందని ఒక అంచనా.

స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలు పన్నులు ఎగవేయడానికి వందల కొద్దీ పేపర్ కంపెనీలను స్ధాపిస్తాయి. ఈ పేపర్ కంపెనీలు పన్నులు తక్కువగా ఉండే చిన్న చిన్న దేశాల్లో స్ధాపిస్తారు. వాస్తవంగా వ్యాపారం ఏమో ఇండియా లాంటి

Source: Business Today

Source: Business Today

దేశాల్లో చేస్తారు. అలా వచ్చే లాభాలను తీసుకెళ్ళి పేపర్ కంపెనీల్లో జమ చేస్తారు. తద్వారా వ్యాపారం చేసే దేశాల్లో అమ్మకపు పన్ను, కేపిటల్ గెయిన్స్ పన్ను ఎగవేస్తారు. ఈ విధంగా పన్నులు ఎగవేయడంలో యాపిల్ కంపెనీ అగ్రభాగాన ఉండగా దాదాపు బహుళజాతి కంపెనీలన్నీ ఈ పద్ధతిలో లాభాలు మూట గడుతున్నాయి.

హచిసన్స్ కంపెనీ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేసిన వోడా ఫోన్ కంపెనీ లక్ష కోట్ల కేపిటల్ గెయిన్స్ లాభం పొందింది. కానీ కొనుగోలు చేసిన కంపెనీ మాల్దీవులలో ఉన్నట్లుగా చూపింది. దానితో ఇండియాకు రావలసిన 10,000 కోట్ల రూపాయల పన్ను రాకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆదాయ పన్ను శాఖ టాక్స్ డిమాండ్ ను వోడా ఫోన్ కంపెనీ ముందు ఉంచింది. కంపెనీ కోర్టుకు వెళ్లింది. వివిధ దశలు దాటి సుప్రీం కోర్టు వరకు కేసు వెళ్లింది. సుప్రీం కోర్టు కంపెనీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. తదనుగుణమైన చట్టం లేనందున పన్ను చెల్లించనవసరం లేదని కోర్టు నిర్ధారించింది. దానితో ప్రణబ్ ముఖర్జీ GAAR పేరుతో సవరణలకు పూనుకున్నారు.

ఇతర వివరాలను కింది ఆర్టికల్స్ లో చూడగలరు.

ప్రణబ్ సవరణలను వెనక్కి తిప్పడానికి మన్మోహన్ ప్రయత్నాలు?

వోడాఫోన్ పన్ను వివాదం: ప్రణబ్ నిర్ణయాన్ని అపహాస్యం చేస్తున్న చిదంబరం?

వోడాఫోన్ పన్ను కేసు: రాజీ చర్చలు విఫలం

బడ్జెట్ 2014-15: సామాన్యుడు కాదు సంస్కరణలే లక్ష్యం

GAAR లాంటి చట్టాలు తేవడం ఇండియా వరకే పరిమితం కాదు. వివిధ రూపాల్లో అమెరికా, ఐరోపా దేశాలు కూడా ఇటువంటి సౌకర్యాలను తమ చట్టాల్లో చేసుకున్నాయి. కెనడా, తైవార్ లాంటి దేశాలు GAAR లాంటి చట్టాలనే చేసుకున్నాయి.

మరీ ముఖ్యంగా 2007-08 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం అనంతరం పన్నుల ఎగవేతకు స్వర్గధామాలుగా మారిన దేశాలపై ఒత్తిడి తెచ్చి కంపెనీల వివరాలను సంపాదించాలని జి20 గ్రూపు సమావేశాల్లోనే నిర్ణయం జరిగింది. ఆ మేరకు స్విట్జర్లాండ్ లాంటి దేశాలపైన అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చి తగిన మార్పులు చేయించుకుంది. అదే పని ఇండియా లాంటి దేశాలు చేయబోతే వ్యాపార వ్యతిరేకం అంటూ గగ్గోలు పెట్టడం అమెరికా, ఐరోపాలకు పరిపాటి అయింది. పశ్చిమ దేశాల ఆర్ధిక, వాణిజ్య ఆధిపత్యం ఈ విధంగా మన పన్నుల చట్టాలను సైతం తమకు అనుకూలంగా మార్చుకునేలా చేయగలుగుతోంది.

3 thoughts on “ప్రశ్న: రిట్రాస్పెక్టివ్ టాక్స్ అంటే?

 1. శేఖర్ గారూ ద్రవ్య పెట్టుబడి వచ్చి వెళ్ళిపొవడం వచ్చిన నస్టం ఏమిటి?. దాని డబ్బు అది తీసుకునిపొతుంది దానిస్తానంలొ కొన్నవాళ్ళ పెట్టుబడి వస్తుంది కదా? మరి ఏమిటి నస్టం. మరొ ప్రశ్నె ప్రపంచ బ్యంకుద్వరా అప్పు తీసుకున్న దేశాలు దివాళా తీశాయని, సంక్షొభంలొ కూరుకపొయాని చాలాసార్లు పేపర్లొ ,పుస్తకాలలొ చదివాను అయితె యక్కడాకుడా వివరణ లేదు. అప్పుతీసుకున్న దేశం తీసుకున్న డబ్బుకు వడ్డీ అసలు చెల్లిస్తుంటుంది. మరి ప్రపంచ బ్యంకు కు అప్పు తీసుకున్న దేశంపైన అకరకాల ఆంక్షలు విధించడం దేనికి? దానికి కావలసింది తను యిచ్చిన డబ్బుపైన వడ్డీ + అసలు అంతవరకే దానికి కావల్సినది .ఆ ప్రభుత్వ అతర్గత వ్యవహారాలలొ కలగచేసుకుని కార్మికవర్గానికి నస్టం కలిగించే విధంగా జొక్యం చేసుకొవలసిన అవసరం ఏమిటి?. మరొక్క ప్రశ్నె . అంతర్జాతీయ సమావేశాలలొ కొన్నిదేశాలు పాల్గొని కొన్నిదేశాలను సబ్సీడీలను తగ్గించాలని సామ్రాజ్య దేశాలు పట్టుబట్టి సాదించాయని చదివాను. ఇక్కడి రైతాంగానికి ఇక్కడి ప్రభుత్వం ఇక్కడిడబ్బు సబ్సీడీ ఇస్తె వాళ్ళకేంటి నస్టం.అసలు య్వసాయ వప్పందాలు అక్కడ ఎందుకు చర్చించాలి? ఆయా దేశాల్లొ వాళ్ళ వాళ్ళ యిస్టం వచ్చినట్టు చేసుకొవచ్చు కదా.పై ప్రశ్నెలను టీచర్స్ అడిగాను ప్రశ్నెలను దాటవేశారు గానీ సమాదానం చెప్పలేదు. వాళ్ళె సమాదాం చెప్పలేనప్పుడు వీటిగురించి అవగాహని లేని నాలాంటి వాళ్ళు చాలామంది వుంటారు. మీ బ్లాగుని ఒక నెలనుంచీ చుస్తున్నాను. చాలాబాగుంది. మీరు శ్రమ అనుకొకుండా సిద్దాంతపరంగా చర్చింతితే వీలైతే ఒక టపాగా రాయండి చాలామందికి ఉపయొగకరంగా వుంటుంది.

 2. ప్రణబ్ ను రాష్ట్రపతిగా పంపించిన తర్వాత ఆర్ధిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టిన చిదంబరం చట్టం అమలును 5 సం.లు వాయిదా వేశారు.
  సర్,ఈ వాయిదాకు చెందిన లింకుంటే ఇవ్వగలరు!
  షొమే కమిటి 3 సం,,వాయిదా వేయమనితెలిపినట్టు గుర్తు!!!

 3. చందన గారు. మీ ప్రశ్నలకు నాకు తెలిసిన పరిధిలో సమాధానం చెబుతాను.
  ముందుగా మీరు వేసిన ప్రశ్నలను కిందివిధంగా విభజించాను.

  1.ద్రవ్య పెట్టుబడి వచ్చి వెళ్ళిపొవడం వచ్చిన నస్టం ఏమిటి?. దాని డబ్బు అది తీసుకునిపొతుంది దానిస్తానంలొ కొన్నవాళ్ళ పెట్టుబడి వస్తుంది కదా? మరి ఏమిటి నష్టం..?
  -మీ ప్రశ్న ప్రకారం..ఎవరైనా ఇష్టం వచ్చినపుడు పెట్టుబడి పెడతారు. తమకు నచ్చినపుడు తీసుకుపోతారు. దీంట్లో నష్టం ఏముంటుంది. అనే కదా…. మాములుగా ఆలోచిస్తే ఎటువంటి నష్టం కనపడదు. కాని దాన్ని పరిస్థితులకు అన్వయించి చూసినప్పుడు లాభమా, నష్టమా అనేది మొదట తెలుస్తుంది.
  మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. పెట్టుబడి రావడం…అంటే విదేశీ వ్యాపార సంస్థ, లేదా పెట్టుడిదారు ఎవరైనా ఎందుకు పెట్టుబడి పెడతారు. లాభం కోసమే కదా….అంటే తన పెట్టుబడి ద్వారా మనదేశంలో ఏదైనా ఒకరంగంలో పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించాలనే ఉద్దేశంతో వస్తారు. వెళ్లిపోవడ మంటే. ఇక తనకు ఇక్కడ లాభం వచ్చే పరిస్థితి లేదని గ్రహించడం వల్లనో, లేదా మరోచోట ఇంకా లాభం వస్తుందని గ్రహించడం వల్లనో వెళ్లిపోతారు.

  ఈ వెళ్లిపోవడం ఒక్కడుగా కాక….ఒకే సారి అందరూ వెళ్లిపోవడం వల్ల…ఆ సంస్థ నష్టాల పాలు కాదా…
  ఉదాహరణకు ఒక బ్యాంకులో ప్రజలు డబ్బులు దాచుకుంటారు. బ్యాంకు ఏం చేస్తుంది…ఆ డబ్బుతో వేరే వ్యక్తులకు వడ్డీకి ఇచ్చి వ్యాపారం చేస్తుంది. ఐతే ఒకే సారి పెట్టుబడి పెట్టిన వ్యక్తులందరూ వచ్చి మా డబ్బు మాకు ఇవ్వండని అడిగితే….బ్యాంకు ఇవ్వగలదా. ఇవ్వలేదు. ఫలితంగా బ్యాంకుకు మార్కెట్ లో పరపతి పడిపోతుంది. బ్యాంకుపై ఒత్తిడి పెరిగి చివరకు దివాలా తీస్తుంది. అలాగే ఏదైనా దేశంలోకి పెట్టుబడులు ఒకే సారి గంపగుత్తగా వెనక్కు వెళితే మార్కెట్లు పడిపోతాయి. దేశ కరెన్సీ విలువ పడిపోతుంది. ఫలితంగా దిగుమతుల భారం పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ సంక్షోభం లోకి వెళుతుంది. ఇవన్నీ విడిగా జరిగే సంఘటనలు కాదు. ఒక దానికొకటి సహసంబంధం కలిగి ఉంటాయి. ఐతే పెట్టుబడి రావడం పోవడం అనేది ఊరికే జరగదు-రావడానికి కారణాలున్నట్లే పోవడానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలు మనదేశానికి సంబంధించినవి కావచ్చు. లేదా మన దేశానికి ఆవల జరిగే కారణాలు కావచ్చు. గ్లోబలైజేషన్ కారణంగా ఒక దేశంలోని ఆర్థిక పరిణామాలు మిగతా ప్రపంచంపైన కూడా ప్రభావం చూపుతాయి.

  ఇక తర్వాత ప్రశ్న.

  2. ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పు తీసుకున్న దేశాలు దివాళా తీశాయని, సంక్షోభంలొ కూరుకుపోయాయని చాలాసార్లు పేపర్లలో , పుస్తకాలలో చదివాను. అయితె యక్కడాకూడా వివరణ లేదు.- అప్పుతీసుకున్న దేశం తీసుకున్న డబ్బుకు వడ్డీ అసలు చెల్లిస్తుంటుంది. మరి ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకున్న దేశంపైన రకరకాల ఆంక్షలు విధించడం దేనికి? దానికి కావలసింది తను యిచ్చిన డబ్బుపైన వడ్డీ + అసలు అంతవరకే దానికి కావల్సినది .ఆ ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలలొ కలగచేసుకుని కార్మికవర్గానికి నస్టం కలిగించే విధంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి?

  – ఇది చాలా పెద్ద ప్రశ్నే కాదు. సమాధానం ఇదీ అని ఒక ముక్కలో చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు అంటే…ఏదో వడ్డీ వ్యాపారం చేసుకునే సేఠ్ లాంటిది కాదు. అదో పెద్ద వ్యవస్థ. ప్రపంచంలోని పెట్టుబడి దారీ దేశాలు పేద,అభివృద్ధి చెందిన దేశాల్లోని సహజవనరులు దోచుకునేందుకు ఏర్పాటు చేసిందే ప్రపంచబ్యాంకు. నేరుగా దోపిడీ చేయడం కుదరదు కాబట్టి…..ఆర్థిక సహాయం పేరుతో పేద దేశాల బలహీనతలు అవకాశంగా మార్చుకుంటారు. తాము అప్పు ఇవ్వాలంటే దేశంలో ప్రైవేటు వ్యాపారాన్ని ప్రోత్సహించాలని…వ్యాపారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని….దేశంలోని సహజవనరుల్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని ….స్థానికంగా కార్మిక సంఘాలు, చట్టాలు గట్టిగా ఉంటే వాటిని బలహీన పరచాలని షరతులు విధిస్తాయి. ఇలా రకరకాల షరతులు పెడతారు. అలా దేశంలోని విలువైన ప్రకృతి వనరుల్ని, దేశంలోని మార్కెట్ ను తమ చేతుల్లోకి తీసుకునేందుకు అగ్ర రాజ్యాలకు చెందిన కంపెనీలు ప్రపంచ బ్యాంకును ఏర్పాటు చేశాయి. అగ్రరాజ్యాల్ని నడిపిస్తోంది కొన్ని బహుళ జాతి బడా కార్పోరేట్ శక్తులు. అవి తమ స్వార్థం కోసం తమదేశంలోని ప్రభుత్వాల్నే కాదు, ప్రపంచంలోని ఏ దేశంలోని ప్రభుత్వాన్నైనా కూల్చగలవు. అందుకోసం మీడియాను కూడా విస్తృతంగా వాడుకుంటాయి. IMF, WTO ఇలా పేరు ఏదైనా కానీ అంతిమంగా వాటి ఉద్దేశం పేద బలహీన దేశాల్లోని ప్రజల్ని దోచుకోవడమే. ఆఖరుకు మనం గొప్పగా చెప్పుకునే ఐక్యరాజ్య సమితి కూడా అమెరికా లాంటి అగ్రరాజ్యాల చేతిలో కీలుబొమ్మ అని అనేక సార్లు రుజువైంది. అందుకు ఇటీవలి ఇజ్రాయిల్ అరాచకమే పెద్ద ఉదాహరణ.

  ఒక్క ముక్కలో చెప్పాలంటే అగ్రరాజ్యాల కార్పోరేట్ శక్తులకు వాటికి కావాల్సింది వ్యాపారం. అందుకోసం ఏమైనా చేస్తాయి.

  3.మరొక్క ప్రశ్న . అంతర్జాతీయ సమావేశాలలొ కొన్నిదేశాలు పాల్గొని కొన్నిదేశాలను సబ్సీడీలను తగ్గించాలని సామ్రాజ్య దేశాలు పట్టుబట్టి సాధించాయని చదివాను. ఇక్కడి రైతాంగానికి ఇక్కడి ప్రభుత్వం ఇక్కడి డబ్బు సబ్సీడీ ఇస్తే వాళ్ళకేంటి నస్టం. అసలు వ్యవసాయ ఒప్పందాలు అక్కడ ఎందుకు చర్చించాలి? ఆయా దేశాల్లొ వాళ్ళ వాళ్ళ యిస్టం వచ్చినట్టు చేసుకొవచ్చు కదా.
  -ఈ ప్రశ్నకు కూడా పై సమాధానమే వర్తిస్తుంది. అక్కడి వ్యాపార శక్తులకు మార్కెట్ కావాలి. మరి పేద, వెనుకబడిన దేశాలు స్థానికి ప్రజలకు సబ్సిడీలు ఇచ్చి, ఆహార భద్రత లాంటి చట్టాలు తెస్తే వాటి ఉత్పత్తులు ఎవరు కొంటారు. ఉదాహరణకు అమెరికాలో చెరకు బాగా పండుతుంది. అది అమ్ముకోవడానికి మార్కెట్ కావాలి. అందుకోసం అది మన దేశంపై ఒత్తిడి తెచ్చి చక్కెర దిగుమతి చేసుకునేలా చేసింది. ఫలితంగా మన దేశంలో చెరకు పండుతున్నా….మనం చక్కెర దిగుమతి చేసుకుంటున్నాం. ఫలితంగా మన దేశంలో చెరకు పంటకు ధర లేకుండా పోయి రైతులు నష్టపోతున్నారు. ఇలా అనేక కారణాలు.
  WTO చట్టాల్లో భాగంగా, వ్యవసాయ ఒప్పందాల్లో భాగంగా…సబ్సిడీలపై నియంత్రణ విధించారు. సబ్సిడీలను-గ్రీన్ బాక్స్, అంబర్ బాక్స్ లుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణ ప్రకారం పేద దేశాలు తమకిష్టం వచ్చినట్లు సబ్సిడీలు ఇస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉండాలన్నా…., కోట్లాది ఉద్యోగాలు రావాలన్నా WTO నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని అగ్రరాజ్యాలు తీర్మానించాయి.

  మీరు మరో ప్రశ్న వేశారు. వ్యవసాయ ఒప్పందాలు అక్కడ ఎందుకు చర్చించాలని. మనం WTO సంస్థలో సభ్య దేశంగా చేరాం. కాబట్టి ఎగుమతి దిగుమతి విధానాలైనా, పన్నుల విధానాలైనా, వ్యవసాయ విధానాలైనా…ఆ సంస్థ చేసే రకరకాల ఒప్పందాల ప్రకారమే మన ఆర్థిక వ్యవస్థను అనుగుణంగా మార్చుకోవాలి. అది ఒప్పందంలో భాగం. ఒకసారి WTO లో చేరి సంతకం పెట్టాక ఆ నియమావళి ప్రకారం నడుచుకోవాలి. అలా నడుచుకోకపోతే కోర్టుకు ఈడుస్తారు. విచారణ జరిపి భారీగా జరిమానా విధిస్తారు. రకరకాల ఆంక్షలు విధిస్తారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s