రిలయన్స్ చేతిలో ఐ.బి.ఎన్ ఛానెళ్లు, ఎడిటర్ల రాజీనామా


A van of media group Network18 is parked outside the Indian parliament in New Delhi

నెట్ వర్క్ 18 మీడియా గ్రూపుకు చెందిన మీడియా ఛానెళ్లు రిలయన్స్ కంపెనీ చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఆ గ్రూపులోని వివిధ ఛానెళ్ల ఎడిటర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. రిలయన్స్ యాజమాన్యం ఎడిటోరియల్ విధానంలోనూ, న్యూస్ కవరేజీ లోనూ జోక్యం చేసుకోవడం పెరగడంతో తాను రాజీనామా చేయక తప్పలేదని ఒక ఎడిటర్ చెప్పగా అదే విషయాన్ని మరో ఎడిటర్ పరోక్షంగా సూచించారు.

భారత చట్టాలను ఎగవేస్తూ ప్రభుత్వం విధించే కోట్ల రూపాయల అపరాధ రుసుములను ఎగవేయడంలోనూ అగ్రభాగాన ఉన్న కంపెనీ దేశంలోని ప్రధాన మీడియా సంస్ధల్లో ఒకటయిన నెట్ వర్క్ 18 లో ప్రధాన వాటాలను స్వాధీనం చేసుకున్నప్పుడే కొందరు స్వతంత్ర మీడియా నిపుణులు అప్రమత్తం ప్రకటించారు. వారి భయాందోళనలు తగ్గట్టుగానే రిలయన్స్ యాజమాన్యం జోక్యాన్ని నిరసిస్తూ ఎడిటర్లు రాజీనామా చేయడం విశేషం.

ముఖ్యంగా కేంద్రంలో కొత్తగా పగ్గాలు చేపట్టిన బి.జె.పి ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలను కవర్ చేయాలని, ఎడిటోరియల్ లను నిర్వహించాలని కంపెనీ ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్ధ నెట్ వర్క్ 18 గ్రూపులోని వివిధ అధికారులను ఊతంకిస్తూ ప్రత్యేక వార్తా కధనాన్ని ప్రచురించింది. ఒక మీడియా సంస్ధలోని లుకలుకలనూ, వాస్తవాలనూ మరో పోటీ మీడియా సంస్ధ వెల్లడి చేస్తే తప్ప లోకానికి తెలియదు మరి!

సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్, సి.ఎన్.బి.సి-టి.వి18  తదితర ఐ.బి.ఎన్ న్యూస్ నెట్ వర్క్ ఛానెళ్లకు రాజ్ దీప్ సర్దేశాయ్ ఎడిటర్-ఇన్-చీఫ్ గా పని చేస్తుండేవారు. దేశంలో ప్రఖ్యాతి గాంచిన ఈ ఎడిటర్ ఆంధ్ర జ్యోతి దినపత్రిక ఎడిట్ పేజీకి ఒక ప్రత్యేక శీర్షిక నిర్వహిస్తున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ అందుకు కారణంగా కొత్త యాజమాన్యాన్ని పరోక్షంగా వేలెత్తి చూపారు.

rajdeep-sardesai

Rajdeep Sardesai

“నా 26 సంవత్సరాల జర్నలిజం చరిత్రలో ఎడిటోరియల్ స్వతంత్రత, సమగ్రతలు నాపై ఉంచబడిన నమ్మకానికి ప్రధాన ఆర్టికల్స్ గా ఉంటూ వచ్చాయి. బహుశా నేను మారడానికి మరీ పెద్దవాడిని అయి ఉండవచ్చు” అని రాజ్ దీప్ సర్దేశాయ్ తన కింది ఉద్యోగులకి రాసిన సందేశంలో పేర్కొన్నారు. తాను అనుసరిస్తున్న స్వతంత్ర ఎడిటోరియల్ విధానంలో మార్పులు జరగాలని కొత్త యాజమాన్యం కోరుకుంటోందన్న సంగతిని సర్దేశాయ్ ఆ విధంగా స్పష్టం చేశారు. తన స్వతంత్రతను మార్చుకోవడం ఇష్టం లేకనే రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపినట్లయింది.

గతంలో పత్రికలపైన ప్రభుత్వం నుండి ప్రధానంగా ఒత్తిళ్ళు ఉండేవి. నూతన ఆర్ధిక విధానాలను అమలు చేయడానికి ముందు దేశ ఆర్ధిక రంగాన్ని ప్రధానంగా ప్రభుత్వ రంగమే నిర్వహిస్తుండేది. ప్రైవేటు బడా కంపెనీలు ప్రభుత్వ రంగ కంపెనీల్లో కొద్ది వాటాను కలిగి ఉంటూ ప్రభుత్వ కంపెనీల నీడలోనే బడా పెట్టుబడిదారులుగా ఎదిగారు. ఆర్ధికరంగం ప్రధానంగా ప్రభుత్వం చేతుల్లో ఉండడంతోనే మీడియాపై ఒత్తిళ్ళు సైతం ప్రభుత్వం నుండే ఎక్కువగా ఎదురయ్యేవి. మీడియాను కట్టడి చేసే ఉద్దేశ్యంతో ఒక దశలో ‘డిఫమేషన్ బిల్’ పేరుతో చట్టాన్ని చేసేందుకు సైతం కేంద్రం 1988-89లో ప్రయత్నం చేసింది. ప్రజా సంఘాల సాయంతో విలేఖరులు ఆ ప్రయత్నాలను తిప్పి కొట్టడంతో పత్రికా సంస్ధల స్వతంత్రత సాపేక్షికంగా బ్రతికి బట్టకట్టింది.

నూతన ఆర్ధిక విధానాల ప్రవేశంతో దేశ ఆర్ధిక రంగం క్రమంగా విదేశీ, స్వదేశీ ప్రైవేటు గుత్త సంస్ధల చేతుల్లోకి వెళ్లిపోతోంది. లక్షల కోట్ల సంపదలను విదేశీ కంపెనీలకు కట్టబెట్టడం ద్వారా వారితో వాటాలు కలిగి ఉన్న స్వదేశీ దళారీ పెట్టుబడిదారులను సైతం ప్రభుత్వ విధానాలు పెంచి పోషించాయి. దానితో సో కాల్డ్ ప్రజాస్వామ్య వ్యవస్ధకు నాలుగవ స్తంభంగా భాసిల్లుతున్న మీడియాను స్వాధీనం చేసుకోవాల్సిన అగత్యం ప్రైవేటు కంపెనీలకు ముంచుకొచ్చింది. పశ్చిమ దేశాల్లో పూర్తిగా కార్పొరీకరణ చెందిన మీడియా సమస్త రాజకీయ, ఆర్ధిక, మిలట్రీ భావజాలాలను నియంతృస్తోంది. తద్వారా పశ్చిమ దేశాలు సాగించే అమానుష యుద్ధాలకు, దురాక్రమణలకు సైతం కృత్రిమంగా సమ్మతిని తయారు చేసుకోవడంలో అది సఫలం అవుతోంది. అదే పరిస్ధితి ఇండియాలోనూ ఏర్పడుతోందని, ఇప్పటికే ఏర్పడిపోయిందని రాజ్ దీప్ సర్దేశాయ్, నిఖిల్ వాగ్లే ల రాజీనామాలు రుజువు చేస్తున్నాయి.

“ప్రతిరోజూ రిలయన్స్ నుండి ఏదో ఒక జోక్యాన్ని మీరు చూడవచ్చు. వార్తలలో నేరుగా జోక్యం చేసుకుంటున్నారు. వారు ఉత్తరాలు (ఈ మెయిల్) లాంటివేమీ రాయరు. నోటితో మాత్రమే ఆదేశాలు ఇస్తారు. పరోక్షంగా సూచనలు (hints) చేస్తారు” అని ఐ.బి.ఎన్-లోక్ మట్ (హిందీ ఛానెల్) ఎడిటర్ పదవికి రాజీనామా చేసిన నిఖిల్ వాగ్లే తెలిపారు. రిలయన్స్ కంపెనీ మాత్రం తాము ఎన్నడూ మీడియాలో జోక్యం చేసుకోలేదని నమ్మబలుకుతోంది.

ఇతర బడా కార్పొరేట్ కంపెనీలకు మల్లేనే రిలయన్స్ కూడా మోడి ప్రభుత్వానికి గట్టి మద్దతుదారు అని రాయిటర్స్ వార్తా సంస్ధ చెప్పడం విశేషం. నెట్ వర్క్ 18 గ్రూపును రిలయన్స్ కంపెనీ కొనుగోలు చేయడంతో బి.జె.పి పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీలకు అనుకూలంగా వార్తలను, ఎడిటోరియల్స్ ను మళ్లించే ప్రయత్నం జరుగుతుందని ఆనాడే భయపడ్డారని రాయిటర్స్ తెలిపింది. వారి భయాలను రుజువు చేస్తూ ఎన్నికల్లో మోడీకి అనుకూలంగానూ, ఎఎపికి వ్యతిరేకంగానూ వార్తలు, విశ్లేషణలు ప్రసారం చేయాలని ఒత్తిడిలు వచ్చాయని మీడియా సంస్ధలోని ఇన్ సైడర్ వనరులను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. పత్రికలకు పరువు నష్టం తాఖీదులు ఇవ్వడంలో ప్రసిద్ధి చెందిన రిలయన్స్ కంపెనీ మీడియా స్వతంత్రతకు కట్టుబడి ఉంటుందని ఎవరూ పెద్దగా భావించలేదని పత్రిక విశ్లేషించింది.

భారత మీడియా స్ధానిక కార్పొరేట్ కంపెనీల గుత్తాధిపత్యంలోకి వెళుతున్నందుకు ఆందోళన ప్రకటిస్తున్న రాయిటర్స్ సంస్ధ మరోవైపు అదే చేత్తో అమెరికన్ కార్పొరేట్ మీడియా మాత్రం స్వతంత్రంగా వ్యవహరిస్తోందని నమ్మబలుకుతోంది. కార్పొరేట్ కంపెనీల యాజమాన్యంలోనే అమెరికన్ తదితర పశ్చిమ మీడియా ఉన్నప్పటికీ వారి స్వతంత్రత చెక్కు చెదరలేదని సంస్ధ చెబుతూ అందుకు సొంత విశ్లేషకులను మద్దతు తెచ్చుకుంది.

nikhil-wagle

Nikhil Wagle

రాయిటర్స్ ఉద్దేశ్యం స్పష్టమే. భారతీయ కార్పొరేట్ మీడియా పక్షపాతంగా వ్యవహరిస్తుందని, పశ్చిమ కార్పొరేట్ మీడియా మాత్రం మీడియా స్వతంత్రతను పరిరక్షిస్తుందని అది చెప్పదలుచుకుంది. తద్వారా దేశీయ మీడియా సామ్రాజ్యంలోకి విదేశీ పెట్టుబడులను పూర్తిగా అనుమతించాలని పరోక్ష సందేశం ఇస్తోంది. ప్రైవేటు మీడియా పశ్చిమ దేశాల్లో ఒక విధంగానూ, భారత దేశంలో మరొక విధంగానూ వ్యవహరిస్తుందని చెప్పడమే మోసమని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

జోక్యం

రిలయన్స్ కు ప్రధాన వాటాలను అప్పగిస్తూ ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే బి.జె.పి అధ్యక్షుడుగా కొత్తగా ఎన్నికయిన అమిత్ షా పట్ల ఉదారంగా వార్తలు కవర్ చేయాలని ఆదేశాలు వచ్చాయని నెట్ వర్క్ 18 అంతర్గత వ్యక్తులను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. అమిత్ షా పైన గుజరాత్ లో క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రెండు బూటకపు ఎన్ కౌంటర్ల కేసులో అప్పటి హోమ్ మంత్రిగా అమిత్ షా ముద్దాయిగా ఉన్నారు. ఆయన బి.జె.పి అధ్యక్షుడుగా ఎన్నికయిన సందర్భంగా సదరు క్రిమినల్ కేసుల గురించి ఎత్తవద్దని రిలయన్స్ నుండి ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది.

ప్రస్తుతం నెట్ వర్క్ 18 గ్రూపుకు న్యూస్ ప్రెసిడెంట్ గా ఉమేష్ ఉపాధ్యాయ్ నియమితులయ్యారు. ఆయన ఆ పదవిలోకి రాకముందు రిలయన్స్ కంపెనీలోనే మీడియా డైరెక్టర్ గా పని చేశారు. రిలయన్స్ కంపెనీ నుండి నేరుగా దిగుమతి అయిన ఉమేష్ ఉపాధ్యాయ్ నెట్ వర్క్ 18 ను ఏ దిశలో తీసుకెళ్తారో ఊహించడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఆయన మాత్రం రిలయన్స్ జోక్యం లేనే లేదని తిరస్కరించారు. ఏ జోక్యం లేకుండానే రాజ్ దీప్, నిఖిల్ లు ఎందుకు రాజీనామా చేశారో ఆయన వివరించలేదు. 

2012లో నెట్ వర్క్ 18 లో ప్రధాన వాటాలు కొనుగోలు చేసిన రిలయన్స్ 2014 ఎన్నికల కవరేజీని తన అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించిందని ఇద్దరు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. ముఖ్యంగా ఆం ఆద్మీ పార్టీ, దాని అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మీడియా కాన్ఫరెన్స్ వార్తలను కవర్ చేయవద్దని ఆదేశాలు వచ్చాయి. “ఎఎపి కవరేజిని తగ్గించాలని మాకు నిత్యం ఆదేశాలు వచ్చేవి. ఎఎపి ప్రెస్ కాన్ఫరెన్స్ లను కవర్ చేయవద్దని చెప్పిన తరువాత నేను వాటిని పూర్తిగా కవర్ చేయడం మానేశాను. న్యూస్ రూమ్ కేరక్టర్ మారిపోవడం ప్రారంభం అయింది. ఎడిటర్లు నిస్సహాయత వ్యక్తం చేశారు” అని సదరు ఉద్యోగి చెప్పారని రాయిటర్స్ తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రిలయన్స్ కంపెనీ గ్యాస్ ధరలను అక్రమంగా పెంచిందని చెబుతూ ఎ.సి.బి విచారణకు అరవింద్ ఆదేశించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.

నెట్ వర్క్ 18 గ్రూపు వార్తా సంస్ధల ప్రస్తుత పక్షపాత వైఖరిని వెల్లడి చేయడంలో రాయిటర్స్ ఉద్దేశ్యం ఏదయినా దేశంలో మారుతున్న మీడియా ధోరణిని సదరు వాస్తవాలు ప్రతిబింబిస్తాయనడంలో సందేహం లేదు. వార్తా పత్రికల స్ధానంలో వార్తా ఛానెళ్లు ఆక్రమిస్తున్న నేటి కాలంలో ఛానెళ్ల వార్తా కధనాల పట్ల శ్రోతలు మరింత అప్రమత్తంగా ఉండవలసిన పరిస్ధితి ఏర్పడింది. ప్రాంతీయ ఛానెళ్ల ధోరణిని అంచనా వేయడంలో శ్రోతలు కాస్తంత తెలివిగానే ఉంటున్నప్పటికీ ఆంగ్ల ఛానెళ్ల విషయంలో మాత్రం ‘అవి ఏది చెబితే అదే నిజం’ అనుకుంటున్న పరిస్ధితి కొనసాగుతోంది. పత్రికలు, ఛానెళ్లు నెలకొల్పడం స్వతంత్ర విలేఖరులకు ఆమడ దూరంలో ఉంటున్నందున ప్రజలకు ప్రత్యామ్నాయ మీడియాను వెతుక్కోవలసిన పరిస్ధితి దాపురించింది. ఈ పరిస్ధితుల్లో ఉన్న మీడియానే విమర్శనాత్మకంగా పరిగణించడమే పాఠకులకు, శ్రోతలకు మిగిలింది.

7 thoughts on “రిలయన్స్ చేతిలో ఐ.బి.ఎన్ ఛానెళ్లు, ఎడిటర్ల రాజీనామా

  1. రాజ్ దీప్ రాజీనామా చేస్తే ఆ చాలన్ టి ఆర్ పి చాలా పడిపొతుందనుకొన్నారు. కాని అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఆ చానల్ టి ఆర్ పి పెరిగింది. గత పది సంవత్సరాలుగా కార్పోరేట్ మీడీయా పట్టుకొన్న ఒక్క స్కాం లేదు. కేండిల్ లైట్ నిరసనలు వాటికి పిలుపు నిచ్చి దేశ ప్రజల అటేన్షన్ ను స్కాములనుంచి పక్క త్రోవకు పట్టించారు. కార్పోరేట్ మీడీయా వాల్లని వెనుకేసుకు రావలసిన అవసరం లేదు. 2జి నే తీసుకొండి, దాని గురించి మొదట్లో ఎవ్వరు వార్తలు ప్రసారంచేసేవారు కాదు. సోషల్ మీడీయాలో నే వార్తలు వచ్చేవి. సు.స్వామి లాంటి వారు పోరాడి సుప్రీం కోర్ట్ కెళ్లి, జడ్జ్మంట్ తీసుకొస్తే అప్పుడు ఏ ఆప్షన్ లేక వార్తలను ప్రసారం చేయవాసి వచ్చింది. మీడీయా అవసరం మోడి కి లేదు. రిలయన్స్ వాళ్లు ఆయనకు మద్దతు ఇవ్వవలసిన అవసరం అంతకన్నా లేదు. చేతనైతే మీడియావారందరు కలసి రిలయన్స్ మీద పోరాటం చేసుకొమనండి.కోట్లకు పడగలెత్తిన్న రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వారు అన్యాయం కనిపిస్తే
    ప్రైవేట్ గా ఎందుకు న్యాయ పోరాటం చేయకుడదు. ఎవరు అడ్డుకొన్నారు? ఆయన వారి పై పోరాటానికి దిగితే ఇల్లు ఎలా గడుస్తుందనుకొనే పరిస్థితి లేదు కదా!
    విదేశాలకు వేళ్లేటప్పుడు నమో ఎవ్వరిని వెంటబెట్టుకొని కూడా పోవటంలేదన్న విషయం మీకు తెలిసే ఉంట్టుంది.బ్రిక్ దేశల సమావేశానికి ఎవ్వరిని మోడి తీసుకోకపోతే, మీడీయా సంస్థలు ఆ వార్తలకు ప్రాముఖ్యతనివ్వలేదు. కారణం ఆ సమావేశాలు cover చేయాలంటే వారి జేబులో డబ్బుతో ఆ సమావేశాలకు హాజరు అవ్వాలి. చేతి డబ్బులు ఖర్చు పెట్టుకోవటం ఇషట0 లేని ఆ మీడీయా కంపేనిలు బ్రైజిల్ కు పోలేదు. పాత ప్రభుత్వాలు మీడియా వారిని వెంటేసుకొని,ఖర్చులు భరించి తీసుకుపోతే ఆ ఇవెంట్లను కవర్ చేసేవారు.

  2. మొత్తానికి ఈ ప్రపంచంలో ఎక్కడా మీడియా స్వతంత్రంగా ఉన్నట్లు దాఖలాలు లేనట్లుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ మీడియా పార్టీల వారీగా వీడిపోయింది. ఐనా దేశంలోని ఆర్థిక వనరుల్ని….ఒకే వ్యక్తి లేదా ఒక సంస్థ చేతుల్లోకి వెళ్లడం ఎంత ప్రమాదకరమో రిలయన్స్ దురాగతాలు సూచిస్తున్నాయి. భవిష్యత్తులో ( ఇప్పటికే అయి కూడా ఉండవచ్చు) మొత్తం పరిపాలన వ్యవస్థల్ని ప్రభావితం చేసే స్థాయికి రావడం…ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.

  3. కార్పోరేట్ మీడియా ఎదో పోడిచేస్తుందనుకొంటే ఎమి జరగలేదు. రోజు రాత్రి 9 గం తరువాత చర్చలతో ఒకటే గోల. వీరి చానల్స్ లో కన్నా రాజ్యసభ టివి చానల్స్ లో మంచి చర్చలు జరుగుతాయి. సోషల్ మీడీయా ని సక్రమంగా ఉపయోగించుకొంటే రిలయన్స్ వారు ఎన్ని మీడీయా సంస్థాల్ను కొనుగోలు చేసి అబద్దాలను ప్రచారంచేసిన ప్రజలు నిజాలు తెలుసుకొంటారు, అబద్దాలను పట్టించుకోరు. సోషల్ మీడీయా వలన, మీడీయాలో మోనొపలి రోజులు గతించాయి.

  4. చందు తులసి గారు,
    ప్రపంచం లో మీడీయా ఏ దేశం లోను స్వతంత్రంగా ఎమి లేదు. అమెరికా మీడీయా ఎంతో బయాస్డ్ , బిబిసి వారు తక్కువేమికాదు. చిన్నపటి నుంచి బిబిసి చాలా మంచి వార్త సంస్థ అని వింట్టూండేవాడిని. ఈ ప్రపగండా ఎవరు,ఎప్పుడు మొదలుపెట్టరో తెలియదు గాని, అదొక పచ్చి అబద్దం. ఇక రాజ్దీప్ లాంటి వారు, వారి ఉద్యోగాలు పోతే భారతదేశానికి హాని జరిగినట్లు, మీడీయా హక్కులను హరించినట్లు గోల చేస్తారు. వాళ్లు కంపెనిలో పని చేసేటప్పుడు వందలమంది ఉద్యోగాలు పీకి, వార్త ఎక్కడా మీడీయాలో రాకుండా జాగ్రత్తపడతారు. వీళ్ళెమి సామాన్య ప్రజలా? కార్పోరేట్ కంపెనిలలో పెద్ద పెద్ద పొసిషన్ లో ఉంట్టూ, వాళ్ల ఉద్యోగం పోతే, రోజు వారి కూలిలకు ఉద్యోగాలు పోయినట్లు గగ్గోలు పెడతారు. సోషల్ మీడియాలో నిజాయితిగా నిర్దుష్ట ఆరోపణలు చేసి,కార్పోరేట్ సంస్థలతో పోరాడవచ్చు కదా! ప్రజలనుంచి మద్దతు తప్పక వస్తుంది. దేశ వ్యాప్తంగా అందరికి తెలిసిన వారు,ఆక్స్ ఫర్డ్ లో చదివుకొని కార్పోరేట్ కంపెనిలలో లొసుగులు తెలిసిన వీరు పోరాడకపోతే ఎవరు పోరాడుతారు?

    ప్రజాస్వామ్యమ్నికి వచ్చే ప్రమాదమేమిలేదండి. మీడీయా అడ్డుపెట్టుకొని ఎవ్వడెన్ని రకాల మోసం చేసినా చివరికి జరిగేదేమిటి? దేశంలో ధరలు పెరుగుతాయి, కర్పషన్ పెరుగుతుంది, మధ్యతరగతి ప్రజలకి జీవితం భారమౌతుంది. ప్రభుత్వాలు పతనమౌతాయి.
    చాలా మంది అడవులను గుట్టుచప్పుడు కాకుండా తవ్వేస్తున్నారు అని బాధపడిపోతుంటారు. కాని వాస్తవం వేరు, పాలగుమ్మి సాయినాథ్ ఒరిస్సాలో గిరిజనులు వాటిని అడ్డుకొని ఆపేశారు అని చెప్పటమేకాక, వారే స్వయంగా రంగంలో దిగి వాళ్ల సమస్యను పరిష్కరించుకొన్నారంటూ, తరతరాలుగా వాళ్లని రక్షించుకోవటం వాళ్లకి తెలుసు అని ఒకసారి చెప్పుకొంట్టు వచ్చారు. అక్కడ కార్పోరేట్ వారికి ఎదురు దెబ్బలు తగిలితే దొంగకి తేలుకుట్టినట్లు గమ్ముగా ఉండిపోయారు.

  5. మీడియా దేశ స్వాతంత్ర కాలంలో తప్ప ఆ పైన దేశ భక్తి తొ పని చేయలేదు. వర్గ భక్తితో తప్ప. ఈ నాడు పూర్తిగా కార్పొరేట్‌ సంస్థల చెతుల్లొ బందీ అయి పోయింది. దాని గొంతును ఇంకా ఇంక భిగించే కాలం ముందుంది. రిలయన్స్‌ రాజ్‌ దీప్‌ సర్దేశాయి రాజీ నామా చేస్తే ఇంఖొ తేజ్‌ దీప్‌ రాకుండా వుంటాడా?
    //అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఆ చానల్ టి ఆర్ పి పెరిగింది. //
    పెరుగుద్ది ఇంకా ఇంకా. భానిసలకు ఒకప్పుడు తాము భానిసలమనె సంగతి తెలియనే తెలియదు. తెలుసు కో కూడదనే కదా కుట్రలు. తెలుసు కొనే రోజులు త్వరలొ వస్తాయని ఆశిద్దాం.

  6. @తిరుపాలు గారు,
    ఇప్పటికే దేశంలో కొన్ని లక్షల మందికి మీడీయా మానిపులేషన్ గురించి తెలుసు. వాళ్లంతా సోషల్ మీడీయాలో నిన్నటి వరకు హీరోలమనుకొన్నఅర్ణబ్ గోస్వామి, రాజ్దీప్,సాగరికా, భర్ఖా దత్ లాంటివారిని రోజు నిలదీస్తూంటారు.మీడియాలో పని చేసే వారు అనుకొనేదేమిటి? వారు దేశాన్ని ఉద్దరిస్తూన్నామను కొంట్టుంటారు. వాస్తవం ఎమిటంటే వారు పేరు ప్రఖ్యాతుల కొరకు,డబ్బులకొరకు, కేర్రీర్ కొరకు పని చేస్తున్నారు. అదేమి తప్పుగాదు. న్యుస్ ని సెలెక్టివ్ గా ప్రజలకు అందిస్తూ గొప్ప దేశ భక్తులుగా ఫీలవ్వటంలో మాత్రం అర్థం లేదు. ఒక వేళ వారికి అంత దేశభక్తే ఉంటే,తప్పంతా రిలయన్స్ వాడి మీదకు నెట్టి ఏడుస్తూ కూర్చునే కన్నా, సోషల్ మీడీయాలో ఉంట్టూ కూడా దేశసేవ చేసుకోవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s