యు.పి.ఏ-1 ప్రభుత్వంలో విదేశీ మంత్రిగా పని చేసి తొలగింపుకు గురయిన నట్వర్ సింగ్ పుస్తకం ప్రస్తుతం జాతీయ స్ధాయి చర్చల్లో నలుగుతోంది. ‘ఒక జీవితం చాలదు: ఆత్మకధ’ టైటిల్ తో ఈ రోజు వెలువడుతున్న పుస్తకం ఆయన సన్నిహితంగా మెలిగిన సోనియాపై విమర్శలు గుప్పించడంతో పత్రికలకు మేత లభించినట్లయింది.
సోనియా చెప్పుకున్నట్లు అంతరాత్మ ప్రభోదం మేరకు ఆమె ప్రధాని పదవిని వదులుకోలేదని వాస్తవానికి ఆమె కుమారుడు రాహుల్ గాంధీ నిరోధించడం వల్లనే ఆమె పదవిని త్యజించారని నట్వర్ తన పుస్తకంలో పేర్కొన్నట్లు పత్రికల సమాచారం. తన ఇందిర, రాజీవ్ ల వలెనే తన తల్లికూడా హత్యకు గురవుతుందని రాహుల్ భయపడ్డారని దానితో పదవి స్వీకరించవద్దని ఒత్తిడి తెచ్చారని నట్వర్ రాసినట్లు తెలుస్తోంది. పదవిని త్యజిస్తున్నట్లు చెప్పడానికి ఒక రోజు గడువును రాహుల్ విధించారని, లేకపోతే తాను తీవ్ర నిర్ణయం తీసుకుంటానని హెచ్చరిచారని నట్వర్ రాశారట.
పత్రికల ప్రకారం సోనియా నియంతృత్వంతో వ్యవహరిస్తారనీ, గోప్యత పాటిస్తారని కూడా నట్వర్ విమర్శించారు. ప్రధాని పదవిలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పటికీ అసలు అధికారం 10, జనపధ్ (సోనియా నివాసం) లోనే కొనసాగిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ రహస్యాలను చూసేందుకు ఆమెకు రహస్య అనుమతి ఉన్నదని చెప్పారు. మహా గొప్ప కాంగ్రెస్ ను 44 సీట్ల స్ధాయికి తెచ్చిన ఘనత ఆమెదేనని నట్వర్ నిందించారు.
నట్వర్ విమర్శలకు స్పందించిన సోనియా తానూ తన ఆత్మకధ రాస్తానని ప్రకటించారు. తన పుస్తకానికి మార్కెట్ విలువ సంపాదించడానికే నట్వర్ ఈ విధంగా రాశారని మన్మోహన్ సింగ్ కొట్టిపారేశారు.
నట్వర్ విమర్శలు సోనియా గాంధీ ముందు తాటాకు చప్పుళ్లేనని ఈ కార్టూన్ సూచిస్తోంది. ఆయన విమర్శలు తల వెంట్రుకలు సృష్టించగల తుఫానుతో సమానం అని, సోనియాకు సమాన ఎత్తులో నిలబడడానికే ఆయన బల్ల ఎక్కి నిలబడాల్సి వచ్చిందని సూచిస్తోంది. అయితే ‘నేనూ రాస్తా’ అని స్పందించడం ద్వారా సోనియా, నట్వర్ విమర్శలను కార్టూనిస్టు కంటే సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.
రాజకీయ ఆత్మకధలు, పాఠకుల పాలిట ఆత్మహత్యాసాదృశ్యాలు.
అధికారం పోయేసరికి కాంగ్రేసులో కూడా లుకలుకలు బయటపడ్దాయి ఆఖరికి
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే లుకలుకలుంటాయి… కనీసం భాజపాలో ఆ పరిస్థితే కనిపించడంలేదు. స్వయంగా కేంద్ర మంత్రి ఇంట్లో బగ్గింగ్ పరికరాలు దొరికినా.. అందుకు అమెరికానే కారణమని తెలుస్తున్నా చేతకాకుండా చూస్తున్నాం….