ఇజ్రాయెల్ ఓ టెర్రరిస్టు రాజ్యం -బొలీవియా


The President of Bolivia Evo Morales

‘మొనగాడు’ అందామా!

గంజాయి వనంలో తులసి మొక్క’ అందామా!

మానవత్వం ఇంకా బతికే ఉంది’ అనొచ్చా!

‘సాహస బొలీవియా’ అని మెచ్చుకుని అటువంటి ప్రభుత్వం మనకు లేనందుకు సిగ్గుపడదామా?

గాజా పాఠశాలలో ఐరాస నిర్వహిస్తున్న శరణార్ధి శిబిరంపై నిద్రిస్తున్న పిల్లలపై బాంబులు కురిపించి చంపేసిన ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని కనీసం ఖండించడానికి మన కేంద్ర ప్రభుత్వానికి ఇంతవరకు నోరు పెగల్లేదు. దాదాపు 1400 మంది నిరాయుధ అమాయక పౌరుల పైన అత్యాధునిక ట్యాంకులు, జెట్ ఫైటర్లు, గన్ బోట్లతో చంపేసినా ‘కత్తిని, గాయాన్ని’ ఒకే గాటన కట్టే దుర్మార్గ వైఖరిని విడనాడలేదు మన ప్రభుత్వం.

బొలీవియా అత్యంత చిన్న దేశం. దక్షిణ అమెరికా ఖండంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరంగా నిన్న మొన్న కళ్ళు తెరిచిన దేశం. అమెరికా పోషించిన నియంతృత్వ ప్రభుత్వాలను కూలదోసి మొట్టమొదటిసారిగా దేశీయ మూలవాసుడిని అధ్యక్షుడుగా ఎన్నుకున్న దేశం. కేవలం కోటి మందికి కొద్దిగా ఎక్కువ జనాభా ఉన్న దేశం. అటువంటి చిన్న దేశం ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుష హత్యాకాండను, జాతి నిర్మూలనను, యుద్ధ నేరాలను నిర్మొహమాటంగా ఖండించడమే కాకుండా ఆ దేశ ప్రభుత్వాన్ని టెర్రరిస్టు రాజ్యంగా ప్రకటించింది.

“ఇజ్రాయేలీయులు స్వేచ్ఛగా బొలీవియాలో ప్రవేశించే 1972 నాటి ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాం. మరో మాటలో చెప్పాలంటే ఇజ్రాయెల్ ను టెర్రరిస్టు రాజ్యంగా ప్రకటిస్తున్నాం” అని బొలీవియా మొట్టమొదటి మూలవాసీ తెగకు చెందిన అధ్యక్షుడు ఇవా మొరేల్స్ ప్రకటించాడు. తన ప్రకటన ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా జబ్బలు చరుచుకునే ఇండియా, అమెరికా లాంటి దేశాల ప్రభుత్వాల మొఖాల పైన చాచి కొట్టాడు.

“ఇజ్రాయెల్ సాగిస్తున్న ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్ ను చూస్తే, ఇజ్రాయెల్ మానవ జీవితాన్ని గౌరవించే మౌలిక సూత్రాలకు గ్యారంటీ ఇచ్చే దేశం  కాదని స్పష్టంగా అర్ధం అవుతోంది. అంతర్జాతీయ సమాజం శాంతియుతంగా, సౌహార్ద్రపూర్వకంగా కలిసి మెలిసి జీవించడానికి ప్రాధమిక నియమం అనదగ్గ హక్కులకు బద్ధ వ్యతిరేకి అని అర్ధం అవుతోంది” అని బొలీవియా అధ్యక్షుడు ప్రకటించారు.

గురువారం కేబినెట్ సమావేశం నిర్వహించిన ఇవా మొరేల్స్ ఈ మేరకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. “ఇజ్రాయెల్ కు వీసాలు జారీ చేసే విషయంలో జరిగిన ఒప్పందం పైన బొలీవియా రాజ్యం, ప్రజలు గట్టి నిర్ణయం తీసుకున్నారు. బొలీవీయా నియంతృత్వ ప్రభుత్వ హయాంలో ఆగస్టు 17, 1972 తేదీన జరిగిన ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాం” అని బొలీవియా ప్రభుత్వం ప్రకటించింది.

ఇజ్రాయెల్ నుండి తమ రాయబారులను ఇప్పటికే బొలీవియా ఉపసంహరించుకుంది. అంతటితో ఆగకుండా ఐరాస వేదికగా ఇజ్రాయెల్ దుర్మార్గాలను ఎండగట్టడానికి క్రియాశీలకంగా వ్యవహరించడానికి సైతం బొలీవియా వెనుదీయలేదు. గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడుతున్నందుకు గాను ఇజ్రాయెల్ ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ ఐరాస మానవ హక్కుల కమిషనర్ ముందు పిటిషన్ దాఖలు చేసింది. జెనీవా ఒప్పందాల ప్రకారం ప్రత్యర్ధి బలానికి తగిన నిష్పత్తిలో కాకుండా శక్తివంతమైన ఆయుధ శక్తిని ప్రయోగించడం, ప్రత్యర్ధి దేశాల పౌరుల ఆవాసాలపై దాడులు చేసి చంపడం… ఇవన్నీ యుద్ధ నేరాల కిందికి వస్తాయి.

సిరియా, లిబియా, పాకిస్ధాన్ తదితర దేశాల్లో, ప్రాంతాల్లో టెర్రరిస్టులతో కిరాయి తిరుగుబాట్లు ప్రవేశపెట్టడమే కాకుండా, ఉగ్రవాదుల మూకుమ్మడి పౌర హత్యలకు ఆ దేశాల ప్రభుత్వాలను బాధ్యులుగా చేసి ఐరాస భద్రతా సమితి చేత సాయుధ చర్యకు పురమాయించింది అమెరికా. కానీ వాస్తవంగా గాజా పౌరులను హతమారుస్తున్న ఇజ్రాయెల్ కు మాత్రం ఆయుధాలను, మందుగుండును సరఫరా చేస్తోంది. ఆ విధంగా ఇజ్రాయెల్ యుద్ధ నేరాలలో అమెరికా భాగం పంచుకుంటోంది. ఒక పక్క స్కూల్ పై దాడిని నామమాత్రంగా ఖండించి మరో పక్క మందుగుండు సరఫరా చేస్తోంది. ఇటువంటి అమానవీయ దురాక్రమణ దాడుల వాస్తవాన్ని పక్కనబెట్టి గాజా-ఇజ్రాయెల్ ఇద్దరూ స్నేహితులే కనుక సమాన దూరం పాటిస్తామని చెప్పడం కంటే మించిన అర్ధరహిత వైఖరి మరొకటి ఉండబోదు. ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ఇండియాకు ఆ ఘనత దక్కింది.

లాటిన్ అమెరికాలో ఒక్క బొలీవియానే కాదు, ఇంకా అనేక దేశాలు ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని, హత్యాకాండలను నిర్ద్వంద్వంగా ఖండించాయి. చిలీ, ఎల్ స్వాల్వడార్ లు తమ రాయబారులను వెనక్కి పిలిచాయి. ఈక్వడార్, బ్రెజిల్, పెరు దేశాలు సైతం ఇదే చర్య తీసుకున్నాయి. చివరికి ఇజ్రాయెల్ కు అన్నిరకాలుగా మద్దతు ఇస్తున్న అమెరికా కూడా ఐరాస పాఠశాలపై దాడిని ఖండించింది. ఇండియా ప్రభుత్వానికి మాత్రం ఖండించడానికి నోరు రాలేదు. ఎంత దౌర్భాగ్యం?

పశ్చిమ దేశాల వెర్రి మొర్రి ప్రకటనలకు, అమానవీయ చర్యలకు వంత పాడడం తప్ప మరొకటి ఎరుగని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్-కి మూన్ సైతం ఐరాస పాఠశాలపై దాడిలో 20 మందిని హత్య చేయడాన్ని “సిగ్గు లేని చర్య”గా ప్రకటించాడు. నిద్రిస్తున్న పిల్లలపై దాడి చేసి చంపడం కంటే మించిన సిగ్గుమాలిన చర్య అని ప్రకటించాడు. పాఠశాలపై దాడి తీవ్రమైనదని, అన్యాయం అనీ, న్యాయాన్ని డిమాండ్ చేసే చర్య అనీ ఆయన స్పష్టం చేశాడు. భారత పాలకులు ఎందుకు ఖండించరు? పనికిమాలిన ‘సమానదూరం’ సిద్ధాంతంతో ఏం బాపుకుందామని? ఇజ్రాయెల్ వ్యాపార సంబంధాల కోసం రక్తపు కూడు తినడానికికైనా భారత పాలకులు సిద్ధమా?

4 thoughts on “ఇజ్రాయెల్ ఓ టెర్రరిస్టు రాజ్యం -బొలీవియా

  1. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌…. ఇజ్రాయెల్‌ అమానవీయ చర్యల్ని ఖండించకపోవడం అమెరికాకు భయపడటమే అవుతుంది. 121 కోట్ల బారతీయుల ఆత్మాభిమానాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిన మోడీ సర్కార్‌ నీకు వందనం….. బలహీనునివైపు నిలబడాలన్న కనీస ధర్మాన్ని మరిచిన కేంద్ర ప్రభుత్వానికి రక్షణ, రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐల కోసం అర్రులు చాచాడమొక్కటే తెలుసు. ఇదే అమెరికా సంక్లిష్ట సమయంలో పాక్‌ వైపు నిలబడితే మన పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకం…… భారత్‌లో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు మాత్రం ప్రపంచ దేశాలు ఖండించాలని కోరుకుంటోంది. ఇది భారతీయ సంస్కృతి విధానం కాబోదు.

  2. సర్, మీ వెర్రిగానీ,మన విదేశాంగవిధానాన్ని పెద్దన్న నడిపిస్తున్న ప్రస్తుతతరుణంలో ఆమెరిక దాని మిత్రపక్షాల అడుగులకు మడుగులొత్తడంకన్నా మనదేశం ఇంకేమీచేయలేదు!!
    సర్,మీ బ్లాగులద్వారా మన విదేశాంగ విధానాన్ని ఎంత విమర్శించినా అది అరణ్యరోదనేగానీ మరోకటికాదు!!

  3. మార్క్స్ అద్దాలతో ప్రతి అంశాన్ని చూసే స్వయం ప్రకటిత మేధావులకు… లాటిన్ అమెరికా దేశాలతోపాటు కమ్యూనిస్టు దేశాలు పితృదేశాలే…! మాతృభూమి…భారత మాత అంటేనే ఈ మేధావులకు చిన్నచూపు…ఇజ్రాయిల్ గాజాలో చేస్తున్నవి దారుణాలే…! మరి పాక్ పేర్రిత ఇస్లామిక్ మూకలు మనదేశంలోబాంబు పేలుళ్లకు పాల్పడుతున్నప్పుడు ఈ మేధావులు నోరు మెదపరు…వారి పెన్ను కదలదు… ఎందుకుంటే ఈ మెధావులకు ప్రాంతం..దేశం వంటి సంకుచితభావాలు ఉండవు…వీరందరూ విశ్వమానవులు…! ఇలాగే రాస్తారు..!
    – వనకళ్ల సాయి లలిత్ రామ్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s