బస్సు కండిషన్ దాచి డ్రైవర్ పైకి నెట్టేశారు -ఎబిఎన్


Masaipeta bus accident

తెలంగాణలో మాసాయి పేట రైల్వే క్రాసింగ్ దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని అందరూ నిర్ధారించారు. అది వాస్తవం కాదని కండిషన్ లో లేని బస్సును పక్కనబెట్టకుండా తిప్పడం వల్లే ప్రమాదం జరిగిందని స్కూలు పిల్లలను ఉటంకిస్తూ ఎ.బి.ఎన్ ఛానెల్ తెలిపింది. ఈ విషయం అధికారులకు తెలిసినా డ్రైవర్ పైకి తప్పు నెట్టేసి స్కూలు యాజమాన్యాన్ని కాపాడుతున్నారని తెలిపింది.

ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ ఫోన్ లో మాట్లాడుతున్నారని, రైలు వస్తున్న సంగతి చూడకపోవడంతో ప్రమాదం జరిగిందని పత్రికలు చెప్పాయి. ప్రభుత్వ అధికారులు, ఇతర బాధ్యులు కూడా ఇదే విషయం చెప్పారు. కానీ వాస్తవం అది కాదని తెలుస్తోంది. బస్సు చెడిపోయి పట్టాలపైన ఆగిపోయిందని, ఆ సంగతి స్కూలు యజమాని జగదీష్ రెడ్డికి చెప్పడానికే డ్రైవర్ ఫోన్ చేశారని ఎ.బి.ఎన్ తెలిపింది.

ప్రమాదం జరగడానికి ముందు బస్సు అప్పటికే రెండు సార్లు కదలకుండా మొరాయించింది. మొదటిసారి స్కూల్ దగ్గరే బస్సు స్టార్ట్ కాలేదు. అక్కడ ఉన్నవారితో నెట్టించి బస్సును రోడ్డు మీదికి తెచ్చారు. ఆ తర్వాత మధ్యలో మరోసారి బస్సు ఆగిపోయింది. మళ్ళీ నేట్టించుకుని డ్రైవర్ తిప్పలు పడుతూ పిల్లలను ఎక్కించుకున్నాడు. అయితే మూడోసారి పట్టాలపైనే ఆగిపోయింది. పైగా అక్కడ ఒక నిర్మాణం అడ్డుగా ఉండడంతో రైలు వస్తున్నట్లు డ్రైవర్ చూడలేకపోయాడు. దానితో ప్రమాదాన్ని డ్రైవర్ తప్పించలేకపోయాడు.

బస్సు ఆగిపోయిన వెంటనే డ్రైవర్ క్లీనర్ ని అప్రమత్తం చేసి స్కూల్ యజమానికి ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆయన ఫోన్ ఎట్టలేదు. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి విషయం చెప్పడానికి డ్రైవర్ ప్రయత్నిస్తుండగా రైలు రావడం ఢీ కొట్టడం జరిగిపోయింది. ఈ లోపు రైలు రావడాన్ని క్లీనర్ గమనించి హడావుడిగా పిల్లలను దింపే ప్రయత్నం చేశాడు. ఇద్దరు పిల్లలను కిటికీలో నుండి విసిరేశాడు కూడా. అంతలోనే రైలు ఢీ కొట్టి దాదాపు కి.మీ దూరం బస్సును ఈడ్చుకొని పోయింది. ఫలితంగా 18 మంది పిల్లలు, డ్రైవర్ మరణించారు.

బస్సు పట్టాల పైన ఉండడం చూసి 300 మీటర్ల దూరంలో రైలు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారని తెలుస్తోంది. అయితే రైలు పూర్తిగా ఆగడానికి ఆ దూరం సరిపోలేదు. తీవ్ర ప్రమాదం జరిగి 19 మంది మరణిస్తే తప్ప రైల్వే గేటు ఏర్పాటు చేయకపోవడం ద్వారా రైల్వేలు నిర్లక్ష్యం చేయడం కూడా ప్రమాదానికి మరో ముఖ్య కారణం.

బస్సు చెడిపోవడం వల్లనే పట్టాలపై ఆగిపోయిందని, డ్రైవర్ ఫోన్ లో మాట్లాడింది స్కూల్ యజమాని తోనేనని పోలీసులు, అధికారులకు తెలుసు. ఫోన్ రికార్డుల ద్వారా వారు ఆ విషయం తెలుసుకున్నారు. కానీ ఆ సంగతి బైటికి పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నారని, అసలు నిజాన్ని గోప్యంగా ఉంచారని ఎ.బి.ఎన్ ఛానెల్ తెలిపింది.

కండిషన్ లో లేని బస్సును బస్సును రోడ్డు మీదికి అనుమతించిన రవాణా శాఖ, పెద్ద ప్రమాదం జరిగితే తప్ప రైల్వే గేటు నిర్మాణం పూర్తి చేయని రైల్వే శాఖ, లాభార్జనా దృక్పధంతో కొత్త బస్సు కొనకుండా కండిషన్ లో లేని బస్సునే తిప్పాలని డ్రైవర్ లను ఒత్తిడి చేసిన స్కూలు యాజమాన్యం, యాజమాన్యాల డబ్బుకు దాసోహం అయ్యే అవినీతి పాలనా వ్యవస్ధ…. ఇవన్నీ ప్రమాదానికి ముఖ్య కారణాలు. ఇవన్నీ వదిలి తేలికగా కనిపించే డ్రైవర్ మీదికి తప్పు నెట్టడం అన్యాయం.

పిల్లల మరణానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పత్రికలు, అధికారులు చెప్పడంతో డ్రైవర్ కుటుంబాన్ని స్ధానికులు దాదాపు వెలివేశారు. డ్రైవర్ మరణానికి ఎక్స్ గ్రేషియా అటుంచి, కనీసం సానుభూతి కూడా ప్రకటించలేదు. దానితో కుటుంబంలో ప్రధాన సంపాదన పరుడ్ని కోల్పోయి, వెలివేతకు గురై ఎవరికి చెప్పుకోలేక డ్రైవర్ కుటుంబం రోదిస్తోందని ఛానెల్ తెలిపింది.

విచారణ జరగక ముందే నేరాన్ని నిర్ధారించడం ద్వారా పత్రికలు గుంపు న్యాయాన్ని ప్రోత్సహించడం, తాము అందులో భాగం కావడం ఆందోళన కలిగించే విషయం. అధికారులు, ప్రభుత్వ పెద్దలు ప్రామాణిక ప్రక్రియలను (standard procedures) వదిలేసి, నేర నిర్ధారణలో త్వరపడి నిర్ణయానికి వచ్చే ధోరణిని కనబరచడం బాధ్యతారాహిత్యమే కాగలదు. ఈ ధోరణి ప్రజల ఆలోచనా తీరుపై ప్రతికూల ప్రభావం పడవేస్తుంది. సామాజికంగా కింది అంతస్ధులో ఉండే కార్మిక వర్గ ప్రజలను చిన్న చూపు చూసే వైఖరిని మరింత పెంచుతుంది. ఇది గర్హనీయం!

16 thoughts on “బస్సు కండిషన్ దాచి డ్రైవర్ పైకి నెట్టేశారు -ఎబిఎన్

 1. మసాయిపేట దగ్గర గేత్ ఏర్పాటు చెయ్యాలనే దిమాంద్ 30 ఏళ్ళుగా ఉంది. అది ఒకప్పుడు మీతర్ గేజ్ మార్గం. గేజ్ మార్పిడి కోసం ఆ మార్గాన్ని కొంత కాలం పాటు మూసివేశారు కానీ బ్రాద్‌గేజ్ మార్గం తెరిచిన తరువాత పాత దిమాంద్ గురించి మర్చిపోయారు. ఒక రైల్వే గేత్‌కి ముగ్గురు కీపర్లు ఉండాలి. ఒక్కో కీపర్ 8 గంటలు పని చెయ్యాలి, రిలీవర్ వచ్చే వరకు అతను ఎక్కడికీ వెళ్ళకూడదు. గేత్ కీపర్లకి గేత్‌కి దగ్గరలోనే ఇళ్ళు కట్టివ్వాలి. ఇదంతా లక్షలు ఖర్చయ్యే పని. గేత్ ఉన్నా, లేకపోయినా లెవెల్ క్రాసింగ్ దగ్గరకి వచ్చినప్పుడు రైలు ద్రైవర్ హార్న్ కొడతాడు. దాటిపోతామనే నమ్మకంతోనే వాహనదారులు ఆగకుండా వెళ్తుంటారు. యాక్సిదెంత్ జరగడానికి కొద్ది సేపు ముందు రైలు ద్రైవర్ హార్న్ కొట్టాడనే అక్కడి స్థానికులు అంటున్నారు. హార్న్ వినిపించినా దాటిపోతామనుకుని బస్సు ద్రైవర్ ముందుకి పోయాడు కానీ బస్సు క్రాసింగ్ మీద ఆగిపోయింది.

  రైలు పట్టాల పక్కన ఏపుగా పెరిగిన పొదలు ఉన్నప్పుడు లేదా మరీ వంపైన మలుపు ఉన్నప్పుడు రైలు ద్రైవర్‌కి లెవెల్ క్రాసింగ్ కనిపించకపోవచ్చు. ఇక్కడ రైలు ద్రైవర్‌కి లెవెల్ క్రాసింగ్ కనిపించింది, హార్న్ కూడా కొట్టాడు. క్రాసింగ్ మీద ఆగిన బస్సుని చూసి బ్రేక్ కూడా వేశాడు. రైలు ద్రైవర్ ఎయిర్ బ్రేక్ వేసి ఉంటాడు, అందుకే 300 మీతర్లు దూరం వెళ్ళినా రైలు ఆగలేదు. రైలు వేగంగా వెళ్తున్నప్పుడు పవర్ బ్రేక్ వేస్తే రైలు పట్టాలుతప్పుతుందనే భయం వల్ల ద్రైవర్ పవర్ బ్రేక్ కాకుండా ఎయిర్ బ్రేక్ మాత్రమే వేసి ఉంటాడు. ఇక్కడ రైల్వేవాళ్ళని తప్పుపట్టడానికి ఏమీ లేదు. గేత్ వేసి ఉన్నా కింద నుంచి దూరివెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఆ బస్సు ద్రైవర్ గతంలో హైదరాబాద్‌లోని ఒక కంపెనీలో ద్రైవర్ ఉద్యోగం చేశాడు. అతనికి త్రాఫిక్ రూల్స్ తెలిసినా పట్టించుకోలేదు. ఆ డొక్కు బస్సు క్రాసింగ్ మీదే ఆగిపోతుందని అతను అనుకుని కూడా ఉండడు. పది వేలు రూపాయలు ఫైన్ కడితే డొక్కు బస్సుల్ని యజమానులకి తిరిగి ఇచ్చే న్యాయస్థానాలని కూడా ఇక్కడ తప్పు పట్టాలి.

 2. పేపర్లలొ ఒక చిన్న అమ్మాయి ఇద్దరిని కాపాడినట్టు వచ్చింది. అంటె అది నిజం కాదన్నమాట. క్లినర్ చేసిన పనిని ఆ అమ్మాయి చేసినట్టు చెప్పేరన్న మాట!!

 3. ఇందులో ముఖ్యమైన మరో సామాజికకోణముంది! 2000 సం,,లో యన్.డి.ఏ ప్రభుత్వం యస్.యస్.ఏ పథకం ప్రవేశపెట్టింది.
  అందులో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రతీ ఆవాసప్రాంతానికీ 1కి.మీ దూరంలో ప్రాధమిక పాఠశాల, 3 కి.మీ దూరంలో ప్రాధమికోన్నత పాఠశాల ,5 కి.మీ దూరంలో ఉన్నత పాఠశాల ఏర్పాటుచేయలని; అర్.టి.ఈ2009 లో కూడా దీనిని పొందుపరచడం జరిగింది.
  ఆ విధంగా ముసాయిపేట వద్ద కూడా స్థానిక సంస్థలకు చెందిన పాఠశాల అందుబాటులో ఉంది.ఆ పాఠశాలకు ముసాయిపేటకు చెందిన పిల్లలను పంపినట్లయితే పిల్లలు సురక్షితంగా ఉండియుండేవారు!
  కానీ,ప్రస్తుత మనసమాజంలో కార్పోరేట్ సంస్కృతికి ప్రభావితులౌతున్నారు! వ్యక్తిగత ప్రయోజనాలుకు ప్రాముఖ్యతమిస్తూ సంఘప్రయోజలను వదిలేయడంలో ఇదీ ఒకభాగమే!
  విద్యారంగంలో విప్లవానికి కృషిచేసినట్లయితే అదిసమాజానికి అత్యంతప్రాయోజనికమైన మార్పులను సాధించపెట్టగలదని నా భావన!!

 4. క్లీనర్ కూడా ఇద్దరు పిల్లలని రక్షించి ఉండవచ్చు. అయితే రుచిత అనే అమ్మాయి హాస్పిటల్ బెడ్ మీదనుంచి మాట్లాడుతూ, తాను ఇద్దరు పిల్లలని కిటికీ లోనుంచి బయటకు తోసేశానని చెప్పడం టి.వి. లో చూసాను. అలాగే ఇంకో చిన్నబ్బాయి కూడా, ‘ఆ అక్క నన్ను కిటికీ లోనుంచి తోసింది ‘ అని చెప్పాడు.

  అలాగే, ఆ అమ్మాయి అక్కడేం జరిగిందో చెప్తూ, పట్టాల మధ్యలో బస్సు ఆగిపోయిందని, డ్రైవర్ మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్నాడని, ట్రైన్ వస్తుందని తాము చెప్తున్నా వినిపించుకోలేదని కూడా చెప్పింది.

  ఒక ప్రత్యక్ష సాక్షి, చిన్న పిల్ల, ఇంత స్పష్ఠంగా చెప్పినా సరే, బస్సు ఎందుకు ఆగింది అనే విషయాన్ని ఎవ్వరూ పట్టించుకున్నట్లు లేదు.

 5. పత్రికల వాళ్ళూ , మీడియా వాళ్ళూ , వాస్తవాలను తప్పు దోవ పట్టించడం ఎంత సులభమో ఈ సంఘటన వల్ల తెలుస్తూంది !
  నేరాలనూ , బాధ్యతను , బలం లేని వారి మీద తోసి , తప్పించు కుందామనుకునే వారు ఎంతకైనా వెనుకాడరు !
  ఒక ప్రమాదం జరిగిందంటే , దానికి అనేక కారణాలు ఉంటాయి !
  బస్సు కండిషన్ లో లేక పోయినా కూడా గేట్లు మూయడం ద్వారా వాహనాలను పట్టాల కు దూరంగా నిలిపే వ్యవస్థ ఉంటే , ఈ ప్రమాదం జరిగేదే కాదు !
  అట్లాగని కండిషన్లో లేని బస్సులను నడపడాన్ని సమర్ధిస్తున్నట్టు కాదు !
  దేశం మొత్తం మీదా , కాపలా కానీ, గేట్లు కానీ లేని ప్రతి లెవల్ క్రాసింగ్ దగ్గరా ఒక్కో ప్రమాదం జరిగితేనే, రైల్వే శాఖ వారికి తమ కర్తవ్యం గుర్తుకు వస్తుందేమో !

 6.  ప్రైవేత్ స్కూల్‌లలో కూడా చదువు సరిగా చెప్పరు. ఈ విషయం తల్లితండ్రులకి తెలుసు. ప్రభుత్వ స్కూల్‌లలో ఎక్కువగా లేబరోళ్ళ పిల్లలు ఉంటారు. వీళ్ళకి చదువు అంత ముఖ్యం కాదు. వీళ్ళ పక్కన ఉంటే తమ పిల్లలు చదవరనుకుని తమ పిల్లల్ని ప్రైవేత్ స్కూల్‌లకి పంపిస్తారు. ఉన్న ఊరిలో స్కూల్‌ని వదిలేసి పట్టణంలోని ప్రైవేత్ స్కూల్ మీద ఆశపడడం ప్రాణాలు తీసింది.

 7. most of the people influenced by instance justice( just like naxals), but this incidence shows the importance of courts, and importance of another word like 100 criminals may be left from the hands of law but one innocent should not be punished

 8. సుధాకర్ గారు, ప్రతి లెవెల్ క్రాసింగ్ దగ్గర గేత్ ఏర్పాటు చెయ్యడం సాధ్యం కాదు. గేత్ ఏర్పాటు చేసినా గేత్ కింద నుంచి దూరి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. రైళ్ళ సంఖ్య పెరిగితే లెవెల్ క్రాసింగ్ ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. కొత్త రైళ్ళు వేసే బదులు ఉన్న రైళ్ళకే పెట్టెల సంఖ్యని పెంచినా ప్రమాదాలు పెరగకుండా చూడొచ్చు.

 9. బస్సు పట్టాలపైకి వచ్చి నాలుగు నిమిషాలు ఆగిపోయింది. ఆ నాలుగు నిమిషాల్లో పిల్లల్ని కాపాడేందుకు డ్రైవర్, క్లీనర్ ప్రయత్నం చేశారు. ఘటన జరిగింది ఉదయం కాబట్టి రైల్వే క్రాసింగ్ వద్ద ఎవరూ లేరు. అందుకే కొత్తవాడైన డ్రైవర్ భిక్షపతి స్కూల్ కరస్పాండెంట్‌కి ఫోన్ చేశాడు. ఫోన్ చెయ్యడమెందుకు త్వరగా పిల్లల్ని దించివేయవచ్చు కదా అను అనుమానం కలుగుతుంది. అయితే ఆ సమయంలో బస్ డోర్ లాక్ పడిపోయింది. క్లీనర్ రమేష్ ఎంత ప్రయత్నించినా తలుపులు తెరుచుకోలేదు. అందుకే అప్పుడే చిన్నారి రుచిత ఓ వైపు కిటికీ నుంచి ఇద్దర్ని కిందికి తోసింది. క్లీనర్ రమేష్ మరో వైపున ఉన్నకిటికీ నుంచి ఇద్దర్ని దించాడు. అప్పుడే రైలు రావడంతో క్లీనర్, ఆ పిల్లలు చనిపోయారు. రుచిత కాపాడిన వారు, క్లీనర్ కిందికి దించిన చిన్నారులు వేర్వేరు. డోర్ లాక్ పడిపోయిన సంగతి కూడా రుచితే మీడియాకు చెప్పింది. ప్రతి సారీ చెప్తూనే ఉంది. కానీ ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. చివరికి యశోదా ఆసుపత్రిలో మాట్లాడిన అధికారులు, వైద్యులు కూడా డ్రైవర్ పైకే నెపాన్ని నెట్టేస్తున్నారు. ఇప్పటిదాకా స్కూల్ పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇదంతా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రెండ్రోజుల పాటు ప్రసారం చేసింది. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. డ్రైవర్, క్లీనర్ కుటుంబాలకు రైల్వే శాఖ లక్ష చొప్పున పరిహారం ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదు సరికదా వాళ్లనే దోషులుగా చిత్రీకరిస్తోంది. 30 ఏళ్ల పాటు డ్రైవర్ గా పని చేసిన భిక్షపతికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ మధ్యలో ఓ స్కూల్ బస్సు కండిషన్‌లో లేదని అక్కడ పని చెయ్యడం మానేశారు భిక్షపతి. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఎంత అర్జెంట్ ఫోన్ వచ్చినా మాట్లాడే వాడు కాదని ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇదంతా చూశాక ఆ రోజు పిల్లలు చూసింది భిక్షపతి ఫోన్‌లో మాట్లాడటాన్ని కాదు. ఆగిపోయిన బస్సు గురించి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయడాన్నే చూశారు. ఇప్పుడు అదే నేరమైపోయింది. తన తప్పు లేదని నిరూపించుకోవడానికి ఇప్పుడు భిక్షపతి లేకపోవచ్చు. కానీ ఇలాంటి తప్పు మళ్లీ మళ్లీ చేసేందుకు వేలాది ప్రైవేటు స్కూళ్లు, వాటిలో అన్నెంపున్నెం ఎరుగని లక్షలాది మంది చిన్నారులు మాత్రం ఉన్నారు.

 10. స్కూల్ బస్సులకి automatic door locking అవసరమా? వాల్వో బస్సులకైతే అవి ఉంటాయి కానీ…..

 11. @gopinadh : True! In a world where facts are manufactured by (prejudiced) media, we need courts to investigate thoroughly.

  @moola : “కానీ,ప్రస్తుత మనసమాజంలో కార్పోరేట్ సంస్కృతికి ప్రభావితులౌతున్నారు! వ్యక్తిగత ప్రయోజనాలుకు ప్రాముఖ్యతమిస్తూ సంఘప్రయోజలను వదిలేయడంలో ఇదీ ఒకభాగమే!”
  ప్రజల్ని కాయాల్సిన (ఉత్తరాంధ్ర మాండలికం ఎందుకో ఇక్కడ aptగా అనిపించింది) భాధ్యత ప్రభుత్వాలది. ప్రజల బాధ్యత ప్రభుత్వాలకి సమర్ధించడమ్మాత్రమే. ఆమాటికొస్తే పన్నులద్వారా ప్రభుత్వాలని కాసేది (నిజానికి మేపేది) ప్రజలే. ఆ ప్రభుత్వాలు పనిగట్టుకు తమ సంస్థలను నిర్వీర్యంచేస్తూ, ప్రజలు తమతో సంపర్కంపెట్టుకోవడాన్ని నిరుత్సాహపరుస్తుంటే, వేరేదిక్కులేక ప్రజలు కాన్వెంటు చదువులవైపు మళ్ళుతుంటే, దానికి తల్లిదండ్రులను ఎలా తప్పుపట్టగలం? సంఘప్రయోజనాలనులక్ష్యించి-తమపిల్లలను-ప్రభుత్వపాఠశాలల్లో-చదివించాల్సిన-బాధ్యత సమాజంలోని తమ-పిల్లల-భష్యత్తు-ప్రభుత్వపాటశాలలల-విద్యాబోధనవల్ల-మెరుగుపడదు-అన్న-చేదునిజాన్ని-ప్రభుత్వపు-విధానాలద్వారా-ఎరుకపర్చబడిన అట్టడుగువర్గాలవారికే ఎక్కువగా ఉందని భావిస్తున్నారా?

 12. ప్రైవేత్ స్కూల్‌లలో కూడా చదువు సరిగ్గా చెప్పరు. 5,000 రూ… జీతానికి పని చేసే ప్రైవేత్ ఉపాధ్యాయుని కంటే 20,000 రూ జీతానికి పని చేసే ప్రభుత్వ ఉపాధ్యాయుడే చదువు సరిగా చెపుతాడు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో 300 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుణ్ణి పెట్టి కావాలని విద్యా ప్రమాణాల్ని దిగజార్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రైవేత్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలు ఒక విధంగా నయం. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు corporal punishments ఇస్తే DEOకి రిపోర్త్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగాల నుంచి పీకించొచ్చు కానీ ప్రైవేత్ పాఠశాలలో ఉపాధ్యాయులు corporal punishments ఇస్తే స్కూల్ యజమానులు పట్టించుకోరు, పైగా తమ స్కూల్ పరువు కాపాడుకోవడానికి విషయం దాచడానికి ప్రయత్నించగలరు.

 13. @Praveen – ప్రభుత్వ స్కూళ్ళపైన నాకు ఉండాల్సినంత గౌరవం ఉంది (నేను చదివింది అక్కడేమరి. మాస్కూల్లోని బోధనలు అత్యున్నత స్థాయిలో ఉండేవి (మాకు ఇంగ్లీషుబోధించినాయన ఆంగ్లో ఇండియన్ and he could not only speak English but could think it, తెలుగు, హిందీలు బోధించినవాళ్ళు పండితులు and we did have labs for Chemistry and Biology where we used to conduct experiments). కానీ అది ఒక exceptional case అని నాకు చాన్నాళ్ళతరువాత అర్ధమయ్యింది. నా తల్లిదండ్రులిరువురు ఉపాధ్యాయులు so you can be assured that I am biased against govt. teachers). ప్రభుత్వ సంస్థల్లో పదోన్నతులు అనుభవం ఆధారంగా లభించినంతవరకూ పరిస్థితులు బాగుపడవు. It’s the human tendency not to take extra efforts in order to contribute more as long as there is not motivation/reward for it.

  డబ్బున్నోళ్ళు పిల్లల్లను ప్రభుత్వపాఠశాలల్లో చదివించడానికి వెనకాడుతున్న కారణం మీరన్నదే అనుకుంటున్నాను (Hitler తన స్వీయచరిత్రలో కొత్తగా ఆర్ధికంగా పై అంతస్థుకి ఎదిగినవారు తమ ఒకప్పటి అంతస్థులో ఉన్నవారితో సంబంధబాంధవ్యాలను ఎందుకు ఏర్పరుచుకోరు అన్నవిషయాన్ని వివరించారు. సరిగ్గా అదే phenomena ఇక్కడ మనవారి విషయంలోనూ పనిచేస్తుంది). కానీ అల్పాదాయ వర్గాలవారుకూడా తమపిల్లల్ని, తమ తాహతుకు మించి, కాన్వెంటుచదువులకు పంపిస్తున్నారంటే, ప్రభుత్వ పాథశాలల విశ్వసనీయతగురించి మళ్ళీ చెప్పాలంటారా?

  Coming to the issue of punishments, we Indians don’t regard that as much of an issue unless the punishment has led to some serious injury -which, the govt. teachers always avoid as a rule.

 14. What is the proportion of Anglo-Indian population in India that makes private school managements to find Anglo-Indian teachers easily? I was taught English by Kerala teachers who use “ణ” (retroflex variety of “n”) even in English. I learned English grammar and phonology only after I had completed my school education.

 15. బస్సు పాడైతే అరిగిపోయిన లేదా కాలిపోయిన విడి భాగాలు మార్చడం తప్ప రిపైర్ చెయ్యడానికి ఏమీ ఉండదు. ఒక విడి భాగం మార్చడానికి నలభై, ఏభై వేలు ఖర్చవుతాయి. అధికారులు బస్సుని సీజ్ చేస్తే కోర్త్ పది వేలు రూ… పెనాల్తీ వసూలు చేసి బస్సుని యజమాని తిరిగి ఇచ్చేస్తుంది. బస్సుని రిపైర్ చెయ్యించడం కంటే పెనాల్తీ కట్టడమే చాలా చవకైనప్పుడు వీళ్ళు తమ స్కూల్ బస్సుల కందిషన్ గురించి ఎందుకు పట్టించుకుంటారు? ‘పిల్లల్ని తమ ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్‌కే పంపడం, అది ప్రభుత్వ పాఠశాలైనా సరే’ ఇది తల్లితండ్రులు చెయ్యాల్సిన పని.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s