ఇజ్రాయెల్ జాత్యహంకార రాజ్యం ఐరాస నిర్వహిస్తున్న పాఠశాలలు, శరణార్ధి శిబిరాలను సైతం వదలడం లేదు. అత్యంత ఆధునిక జెట్ ఫైటర్ లు, గన్ బోట్లు, ట్యాంకులు వినియోగిస్తూ సమస్త నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం ఈ రోజు జరిపిన ట్యాంకు దాడుల్లో ఐరాస పాఠశాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఒకేసారి 20 మంది మరణించారు. మరణించినవారిలో ఒక పసికూన కూడా ఉన్నదని రాయిటర్స్ తెలిపింది.
ఐరాసకు చెందిన సహాయ పనుల ఏజన్సీ (United Nations Relief and Works Agency -UNRWA) గాజాలో అనేక పాఠశాలను నిర్వహిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ ఏకకాలంలో భూ, వాయు, జల తల యుద్ధానికి తెగబడడంతో గాజా పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేసి ఈ పాఠశాలల్లో తలదాచుకుంటున్నారు. “మీపై బాంబులు కురిపిస్తాం. ఇళ్ళు వదిలి పారిపోండి” అంటూ ఇజ్రాయెల్ కూడా గాజా పౌరులకు సలహా ఇవ్వడంతో వారు భయంతో ఇళ్ళు వదిలి ఐరాస శిబిరాల్లో చేరారు. అయినప్పటికీ ఆ శిబిరాలను సైతం లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండడంతో పౌరుల మరణాలు రోజు రోజుకి వేగంగా పెరుగుతున్నాయి.
ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో ఇప్పటివరకు 1245 మంది పౌరులు మరణించారని పత్రికలు తెలిపాయి. ఐరాస పాఠశాలలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న సంగతిని ఐరాస అధికారులు ధృవీకరించారని ఫ్రెంచి వార్తా సంస్ధ ఎ.ఎఫ్.పి తెలిపింది. ఇజ్రాయెల్ ట్యాంకులు పాఠశాల గదులను లక్ష్యం చేసుకున్నాయని, ఫలితంగా అక్కడ శరణు పొందిన 20 మంది అక్కడికక్కడే మరణించారని UNRWA తెలిపింది. దాడిలో బ్రతికి బైటపడ్డవారు మృతుల మాంస ఖండాలను ఏరుతున్నారని, ఆ దృశ్యం భయానకంగా ఉందని ఎ.ఎఫ్.పి తెలిపింది.
పాఠశాలపై రెండు సార్లు ట్యాంకు పేలుళ్లు జరిగాయని ఆర్.టి (రష్యా టుడే) తెలిపింది. ఒకసారి పాఠశాల ఆవరణపై దాడి జరిగిందని, మరోసారి విద్యార్ధినులు కూర్చునే తరగతి గదిపై దాడి చేశారని ఆర్.టి కరెస్పాండెంట్ హ్యారీ ఫియర్ తెలిపారు. ఇప్పటివరకు కనీసం ఐదు ఐరాస పాఠశాలలు ఇజ్రాయెల్ దాడులు ఎదుర్కొన్నాయని ఆయన తెలిపారు.
ఈ రోజు ఉదయం తెల్లవారు ఝామునే పాఠశాలపై దాడి జరగడంతో నిద్రిస్తున్నవారంతా చనిపోయారని ఇతర పత్రికల ద్వారా తెలుస్తోంది. UNRWA నిర్వహిస్తున్న 83 పాఠశాలల్లో 2 లక్షల మంది వరకు పాలస్తీనీయులు శరణార్ధులుగా ఉన్నారని ఐరాస ఏజన్సీ ప్రతినిధులు చెప్పారు.
రాయిటర్స్ ప్రకారం బుధవారం (జులై 30) ఉదయం జరిగిన దాడుల్లో మొత్తం 43 మంది మరణించారు. తాత్కాలిక కాల్పుల విరమణ కోసం ఈజిప్టు, అమెరికాల మధ్యవర్తిత్వంలో చర్చలు జరపడానికి ఒక పక్క ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి.
గాజా సరిహద్దు దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, గాజా ప్రజలపై ఇజ్రాయెల్ శతృత్వ వైఖరి విడనాడాలని గాజా ప్రభుత్వం నిర్వహిస్తున్న హమాస్ డిమాండ్ చేస్తోంది. గాజా ప్రజలు వినియోగిస్తున్న భూగర్భ సొరంగాలను నాశనం చేయాలని, రాకెట్ దాడులు ఆపాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది.
కానీ గాజా సరిహద్దులను మూసివేసి కేవలం ఐరాస అందించే నామమాత్ర సహాయంతోనే గడిపేయడం గాజా ప్రజలకు దుస్సాధ్యం. గాజా జీవన వ్యవస్ధ మొత్తం సొరంగాల ద్వారా జరిగే సరఫరాలపైనే ఆధారపడి ఉంది. ఇజ్రాయెల్ తో పాటు గాజా దక్షిణ సరిహద్దులో ఉన్న ఈజిప్టు మిలట్రీ ప్రభుత్వం కూడా గాజాపై దిగ్బంధనం అమలు చేస్తోంది. దానితో సరిహద్దుల్లో బాగా లోతుగా సొరంగాలు తవ్వుకుని సరుకులు తెప్పించుకోవడమే గాజాకు మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం. ఈ ప్రత్యామ్నాయాన్ని కూడా రద్దు చేస్తే గాజా చచ్చినట్లు తమ మాట వింటుందని, చమురు, సహజవాయువు సంపదలపై పూర్తి హక్కులు తమకు దఖలు పడతాయని ఇజ్రాయెల్ భావిస్తోంది. పైకి మాత్రం హమాస్ రాకెట్ దాడుల వల్లే తాము దాడు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతుంది.
గాజా ప్రజలను అన్ని విధాలుగా చుట్టుముట్టి, పదే పదే అణచివేతకు గురి చేస్తే లొంగి వస్తారన్న మిలట్రీ తర్కాన్ని ఇజ్రాయెల్ అమలు చేస్తోంది. ఈ అమానుషాన్ని ప్రపంచం మొత్తం చోద్యం చూసినట్లు చూస్తోంది. ఇజ్రాయెల్ పై ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోకుండా అమెరికా కాపలా కాస్తోంది. దానితో ఇండియా లాంటి దేశాలు ‘ఇద్దరూ స్నేహితులే’ అని చెబుతూ ఆచరణలో ఇజ్రాయెల్ పక్షం వహిస్తున్నాయి.
చాలా కొద్ది దేశాలు మాత్రమే గాజా ప్రజలకు సానుభూతిగా తమకు చేతనైన చర్యలు తీసుకుంటున్నాయి. లాటిన్ అమెరికాలోని చిలీ, పెరు దేశాలు ఇజ్రాయెల్ నుండి తమ రాయబారులను వెనక్కి పిలిచాయి. హమాస్ రాకెట్ దాడుల వంక చూపుతూ ఇజ్రాయెల్ గాజా ప్రజలను మూకుమ్మడి శిక్షకు గురి చేస్తోందని, ఇది అమానుషమని చిలీ ప్రభుత్వం ప్రకటించింది. “ఇజ్రాయెల్, గాజా ప్రజలపై ఉమ్మడి శిక్షను అమలు చేస్తున్నది. ఇది అత్యంత విచారకరం. ఇజ్రాయెల్ మిలట్రీ చర్యలు అంతర్జాతీయ మానవతా చట్టాలకు మౌలికంగా విరుద్ధం” అని చిలీ విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఇజ్రాయెల్ స్ధాపన అనంతరం పాలస్తీనా ప్రజలు గణనీయంగా వలస పోయిన దేశాల్లో చిలీ ఒకటి. మధ్య ప్రాచ్యంలోని అరబ్బు దేశాలు కాకుండా పాలస్తీనా ప్రజలకు శరణు కల్పించిన దేశాల్లో చిలీ ప్రధమ స్ధానంలో ఉండడం గమనార్హం. అనగా అరబ్బేతర దేశాల్లో అత్యధిక సంఖ్యలో పాలస్తీనీయులు నివశిస్తున్న దేశం చిలీ.
గాజా ప్రజలకు విద్యుత్ సౌకర్యం అందించే ఏకైక విద్యుత్ కేంద్రాన్ని ఇజ్రాయెల్ రెండు రోజుల క్రితం నాశనం చేసింది. విద్యుత్ ఉత్పత్తి కోసం నిలవ ఉంచిన చమురు ట్యాంకులపై బాంబులు కురిపించడంతో ఇంధనం తగలబడి పోయింది. దానితో గాజా ప్రజలు 90 శాతం చీకట్లో గడుపుతున్నారు. ఇజ్రాయెల్ నుండి అరకొరగా సరఫరా అయ్యే విద్యుత్ మాత్రమే కొన్ని చోట్ల నిలిచి ఉంది.
సర్, మీరు వరుసగా ప్రచురిస్తున్న గాజా పై ఇజ్రాయిల్ దాష్టికం నా ఆలోచనలను ప్రభావితం చేస్తోంది!
ప్రత్యక్ష అనుభూతులకులోనవుతున్న వాళ్ళ పరిస్థితిని ఊహించుకొంటుంటే వెన్నులో వణుకుపుదుతోంది!