గూగుల్ ఇండియా కంపెనీపై పోలీసులు వేసిన కేసు సి.బి.ఐ చేతుల్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. భారత పౌరులకు గూగుల్ నిర్వహించిన మేపధాన్-2013 పోటీ వల్ల దేశ భద్రతకు ప్రమాదం అని బి.జె.పి ఎం.పి లు గత సం. ఫిర్యాదు చేయడంతో గూగుల్ అతి తెలివి వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదును సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్ధారించడంతో పోలీసులు విచారణ చేపట్టినట్లు గత సం. ఏప్రిల్ లో పత్రికలు తెలిపాయి. ఈ కేసును స్వీకరించిన సి.బి.ఐ ‘ప్రాధమిక విచారణ’ ను నమోదు చేసిందని పి.టి.ఐ తెలిపింది.
సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు చేసిన ఫిర్యాదును అనుసరించి ప్రాధమిక విచారణను సి.బి.ఐ నమోదు చేసింది. మేపధాన్ 2013 పోటీ పేరుతో దేశంలోని అత్యంత సున్నితమైన ప్రాంతాలను ఫోటోలు తీసి గూగుల్ మేప్స్ లో ప్రదర్శించినట్లు సర్వేయర్ జనరల్ కార్యాలయం తెలిపింది. దేశ రక్షణ రీత్యా వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాలయిన ఆయా కేంద్రాలను గుర్తించడం వలన జాతీయ భద్రతకు ప్రమాదం వస్తుందని ప్రభుత్వ వర్గాలు నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది.
భారత భూభాగాన్ని మేప్ రూపంలో రికార్డు చేసి ప్రదర్శించే హక్కు ఒక్క సర్వేయర్ జనరల్ వారికి మాత్రమే ఉంటుంది. ఇతర ప్రభుత్వ విభాగాలు గానీ, ప్రైవేటు కంపెనీలు గానీ ఈ పని చేయాలంటే సర్వేయర్ జనరల్ అనుమతి తీసుకోవలసి ఉంటుంది. కానీ గూగుల్ అదేమీ ఎరగనట్లుగా ‘మేపధాన్’ పేరుతో పోటీ నిర్వహించడం ద్వారా ఆయా కీలక ప్రాంతాల ఐడెంటిటీలను గుర్తించిన భారాన్ని దేశ పౌరులపైకే నెట్టడానికి ఎత్తు వేసింది. పోటీకి మేప్ లను సమర్పించేవారే ఆయా ఫోటోల వెల్లడికి బాధ్యులని, తాము బాధ్యత వహించబోమని గూగుల్ షరతు విధించింది. తద్వారా భారత ప్రభుత్వం నుండి కేసులు ఎదుర్కోకుండా ముందే జాగ్రత్తపడింది.
అయితే ఈ జాగ్రత్తను పూర్వపక్షం చేస్తూ సర్వేయర్ జనరల్ ఫిర్యాదు చేయడంతో విషయం సి.బి.ఐ వరకు వెళ్లింది. ఆసుపత్రులు, హోటళ్లు, షాపింగ్ మాళ్ళు మొదలైన ముఖ్యమైన మార్కెట్, వినియోగదారీ కేంద్రాలను గుర్తించడం పోటీలోని అంశంగా గూగుల్ పేర్కొంది. కానీ ఆ పేరుతో వివిధ రక్షణ కేంద్రాలు, ఆయుధ తయారీ పరిశ్రమలు, అణు పరిశ్రమలు, అణు బాంబు నిల్వ కేంద్రాలు మొదలయిన కీలక ప్రాంతాల సమాచారం కూడా గూగుల్ సేకరించినట్లు తెలుస్తోంది.
పైకి చూడడానికి ఈ కేంద్రాల పక్కన ఉన్న ఆసుపత్రులు, హోటళ్ళ లాంటి వినియోగదారి కేంద్రాల మేప్ లుగా ఇవి కనిపిస్తాయి. ఇలాంటి మేప్ లు, ఫోటోల ద్వారా తాము దేశ రహస్యాలను అందజేస్తున్నామన్న ఎరుకలో పోటీలో పాల్గొంటున్నవారు ఉండరు. సరిగ్గా గూగుల్ కి కావలసింది ఇదే. స్ట్రీట్ వ్యూ కార్ ద్వారా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి అనేక దేశాల్లో క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న అనుభవంతో గూగుల్ కంపెనీ ఇలా పరోక్ష పద్ధతుల ద్వారా సమాచారం సేకరిస్తోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలకు ఈ లింకులోని ఆర్టికల్ ని చూడవచ్చు.
సర్వేయర్ జనరల్ ఫిర్యాదు ప్రకారం నిషేధిత ప్రాంతాలను ఫోటోలు తీయడం, మేప్ లలో గుర్తించడం చట్ట విరుద్ధం. చట్ట ఉల్లంఘనను నివారించడానికే ఇలాంటి అంశాల్లో సర్వేయర్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. గూగుల్ కంపెనీ ఇవేమీ పట్టించుకోకుండా తన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు భారత పౌరులను అడ్డం పెట్టుకుంది.
సాధారణంగా ఇలాంటి కేసుల్లో గూగుల్ లాంటి భారీ బహుళజాతి కంపెనీలు ఉన్నప్పుడు కేసుల్లో అంతిమంగా జరిగేది ఏమిటంటే వాటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు చట్టబద్ధమైనవిగా ముద్ర పొందడం. తద్వారా బహుళజాతి కంపెనీల దేశ వ్యతిరేక కార్యకలాపాలను నిర్విఘ్నంగా కొనసాగించుకునే వెసులుబాటు కంపెనీలకు చిక్కుతుంది. అమెరికాలో సరిగ్గా ఇదే జరిగింది. ఇండియాలోనూ ఇదే జరగదన్న గ్యారంటీ లేదు.
గూగుల్ కంపెనీని తమ వ్యూహాత్మక ఆస్తిగా అమెరికా పరిగణిస్తుంది. సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త కొత్త రీతులను ప్రవేశ పెడుతున్నట్లు కనిపించే గూగుల్ కంపెనీ వాస్తవానికి అలాంటి కొత్త రీతులను కనిపెట్టే చిన్న కంపెనీలను (startup companies) కొనుగోలు చేయడం (acquisition) ద్వారా ఆ ఘనత సాధిస్తోంది. తద్వారా చిన్న స్ధాయి కంపెనీలకు చెందవలసిన ఘనతను తన ఖాతాలో వేసుకుంటోంది.
ఇది ఈ సమస్యలోని ఒక కోణం మాత్రమే. అసలు కోణం ఏమిటంటే ఈ కొనుగోళ్ళు, విలీనాల (Mergers & Acquisitions) ద్వారా ప్రపంచ వ్యాపితంగా వివిధ దేశాల్లో విస్తరించి ఉండే సరికొత్త ఇన్నోవేషన్స్ ను అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలకు కట్టబెట్టడం. ఇలా చేయడం ద్వారా రాజకీయంగా అమెరికాకు ఉన్న ఆధిపత్యాన్ని తమ వ్యాపార ప్రయోజనాలకు బహుళజాతి కంపెనీలు ఉపయోగపెట్టుకుంటాయి.
నిజం ఏమిటంటే దీన్ని తిరగేసి చెప్పుకుంటేనే అసలు వాస్తవం ఎరుకలోకి వస్తుంది. అనగా: అమెరికన్ బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసమే అమెరికా తన రాజకీయ, మిలట్రీ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తుంది. ఆ విధంగా గూగుల్ కార్యకలాపాలు అంతిమంగా భారత దేశం అమెరికా ప్రయోజనాలకు లొంగి ఉండేందుకు దోహదపడతాయి.
no
?