త్వరలో జరగబోయే పాక్-భారత్ చర్చల్లో పాకిస్ధాన్ ఒప్పందం ఉల్లంఘన గురించి కూడా చర్చిస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పాకిస్ధాన్ తో చర్చలు అంటేనే అంతెత్తున ఎగిరి పడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పే సో కాల్డ్ సెక్యులరిజాన్ని బూటకపు సెక్యులరిజంగా తిట్టిపోసే బి.జె.పి నేతలు ఇప్పుడు అదే పాకిస్ధాన్ తో చర్చలు చేయబోతున్నారు. చర్చలు జరపడమే ఆశ్చర్యం అనుకుంటే గత కొంత కాలంగా పాకిస్ధాన్ పాల్పడుతున్న కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనను కూడా చర్చిస్తామని చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఎన్.డి.ఏ/బి.జె.పి నేతలు కాస్త ఈ సంగతి కూడా భారత ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది.
శనివారం మీడియాతో మాట్లాడుతూ రక్షణ మంత్రి కూడా అయిన అరుణ్ జైట్లీ ఈ సంగతి స్పష్టం చేశారు. కార్గిల్ యుద్ధం జరిగి 15 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పడం మరింతగా కళ్ళు తెరిపించవలసిన విషయం.
ఎవరికి కళ్ళు తెరిపించాలి? జనానికా? కానే కాదు. అక్కడ తమ నేతలు పాకిస్ధాన్ ను పడదిట్టడం చూసి, అది నిజమే అనుకుని, పాకిస్ధాన్ పైన విపరీతమైన ద్వేషం పెంచుకున్న హిందూత్వ సంస్ధల కార్యకర్తలు కళ్ళు తెరవాల్సిన విషయం ఇది. ఆ ద్వేషాన్ని తమవరకే పరిమితం చేసుకోకుండా మతపరమైన అల్లర్లు జరిగినప్పుడల్లా అవతలి మతాన్ని తిట్టడమే పనిగా చేసుకుని, ఈ అంశాలను చర్చించే మిత్రుల పైన బూతులతో దండెత్తే సో కాల్డ్ సంస్కృతీ పరిరక్షకులు తమకు తాము సమాధానం చెప్పుకోవలసిన సందర్భం కూడా ఇది.
మన సైనికుల తలల్ని నరికి తీసుకెళ్లిన వారితో చర్చలా అని ప్రతిపక్షంలో ఉండగా బి.జె.పి ప్రశ్నించింది. ఇప్పుడు అధికారం చేతిలో ఉండగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినా సరే, అదేమీ తాము జరపబోయే చర్చలపై ప్రభావం వేయబోదని రక్షణ మంత్రి స్పష్టం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో పాకిస్ధాన్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు అవతలివైపు నుండి కాల్పులు జరుపుతున్నారని పత్రికలు, ఛానెళ్లు వార్తలు రాస్తున్నాయి. జులై 22 వరకు ఈ సంవత్సరం సరిహద్దు వెంబడి 49 సార్లు ఉల్లంఘనలు జరిగాయని రక్షణ శాఖ వర్గాలు చెప్పాయి. అయినప్పటికీ ఆగస్టు 25 తేదీన జరగనున్న కార్యదర్శుల స్ధాయి సమావేశంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఈ ఉల్లంఘనలు చూపవని రక్షణ మంత్రి చెప్పారు. చర్చలలో కాల్పుల విరమణ ఉల్లంఘనలను కూడా ఒక ప్రధాన అంశంగా చర్చిస్తాము తప్పితే చర్చల నుండి వెనక్కి తగ్గేది లేదని విలేఖరుల ప్రశ్నకు సమాధానం ఇస్తూ మంత్రి చెప్పారు.
సరిహద్దులలో శాంతి, సుహృద్భావనలు పరిఢవిల్లాల్సిన అవసరం ఎంతగానో ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడి నొక్కి చెప్పారని అరుణ్ జైట్లీ జులై 25 తేదీన రాజ్య సభలో ప్రకటించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. కాశ్మీరులో ఇరు దేశాలు నెలకొల్పిన నియంత్రణ రేఖ పవిత్రతను గుర్తించి కాపాడవలసిన కర్తవ్యం చర్చల సందర్భంగా ప్రస్తావిస్తారని కూడా అరుణ్ జైట్లీ చెప్పారు. పాకిస్ధాన్ ఎన్ని పనులు చేసినా, మన దేశంలో ఉగ్రవాద దాడులు చేయిస్తున్నా ఆ దేశంతో స్నేహ సంబంధాలను మీరు ఎందుకు, ఎలా కోరుకుంటారని ఓ మిత్రుడు ఈ బ్లాగర్ ని ప్రశ్నించారు. ఇప్పుడా మిత్రుడు తన ప్రశ్నను రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ ముందు ఉంచవలసిన అవసరం కనిపిస్తోంది.
బి.జె.పి.కి దేశ భక్తి ఉందనుకోవాలా? ఉక్రెయిన్ ప్రభుత్వం మలేసియా విమానాన్ని కాకుండా భారత విమానాన్ని కూల్చి వేసి ఉంటే, ఆ కూల్చివేతతో అమెరికాకి సంబంధం లేదని నమ్మించడానికి బి.జె.పి.తో పాటు దాని చెంచా పత్రికలు కూడా ప్రయత్నించేవి. ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ కనీసం నిజాలైనా మాట్లాడుతుంది. మన దేశంలో గ్లోబలైజేషన్ ప్రవేశపెట్టినది కాంగ్రెసే అయినా చాలా మంది గ్లోబలైజేషన్‌వాదులు బి.జె.పి.ని నమ్మేది, కాంగ్రెస్‌ని అసహ్యించుకునేది ఇందుకే.