వందకు మించిన పార్లమెంటు సభ్యులకు నాయకత్వం వహించడానికి అలవాటుపడిన నెహ్రూ-గాంధీ కుటుంబం 44 మందికి కుదించుకుపోయిన పార్లమెంటరీ పార్టీకి నాయకత్వం వహించడానికి సిగ్గుపడిందో ఏమో గానీ మొదటిసారి లోక్ సభ నాయకత్వాన్ని కుటుంబేతరుడు మల్లిఖార్జున్ ఖార్గే కు అప్పజెప్పింది.
మొత్తం పార్లమెంటు సభ్యుల్లో కనీసం 10 శాతం సీట్లన్నా గెలుచుకోలేక ప్రతిపక్ష హోదా కోసం కూడా పాలక కూటమిని బతిమాలుకునే పరిస్ధితిలో ఉన్న కాంగ్రెస్, తెలివిగా దళితుడిని లోక్ సభ నేతగా ఎన్నుకోవడం ద్వారా ప్రతిపక్ష నాయకత్వాన్ని సంపాదించాలని ఎత్తు వేసిందని వాదిస్తున్నవారూ లేకపోలేదు.
ఏదో ఒకందుకు హోదా లేని నాయకత్వ పదవిని కుటుంబేతరుడికి అప్పజెప్పినా, చతికిలబడిన పార్టీని వచ్చే ఎన్నికల్లోనయినా విజయ తీరాలకు చేర్చవలసిన బాధ్యత యువనేతకు తప్పదు. ఆరు దశాబ్దాలుగా, కొన్ని సంవత్సరాలు మినహాయించి అవిచ్ఛిన్నంగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెల్ల ఏనుగులా యువ నాయకత్వానికి భారం అయిందని కార్టూనిస్టు సూచిస్తున్నారు.
యువ నాయకత్వం, తాను లాగవలసిన కనపడని భారాన్ని బింకం తెచ్చిపెట్టిన గంభీరత్వంతో కష్టపడి కప్పి పుచ్చుతున్నారు. కాంగ్రెస్ వటవృక్షం కూలిపోతోందని సంబరపడడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆ వటవృక్షం నీడలో ఇన్నాళ్లూ సేద తీరిన దోపిడి వర్గాలు ఇప్పుడు మరో ఎదుగుతున్న వృక్షాన్ని ఎంచుకున్నాయి. పాత వటవృక్షంతో పోలిస్తే కొత్త వృక్షం ఫాసిస్టు పోకడలు జనానికి మరింత ప్రమాదకరంగా పరిణమించడమే అసలు సంగతి!