(రాన్ పాల్ అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ – మన లోక్ సభకు సమానం)లో 2013 వరకు సభ్యుడు. అమెరికా అధ్యక్ష పదవికి లిబర్టేరియన్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు. రిపబ్లికన్ పార్టీ ప్రైమరీల్లో రెండు సార్లు అధ్యక్ష పదవికోసం పోటీ పడ్డారు. అమెరికా రహస్య గూడచార సంస్ధ ఎన్.ఎస్.ఏ అరాచకాలను బైటపెట్టిన ఎడ్వర్డ్ స్నోడెన్ తాను రాన్ పాల్ కే ఓటు వేశానని బహిరంగంగా చెప్పాడు. అమెరికా బహుళజాతి కంపెనీలకు రాన్ పాల్ అంటే గిట్టదు. కాబట్టి ఆయన అధ్యక్షుడుగా ఎన్నిక కావడం ఎన్నటికీ సాధ్యం కాదు. రాన్ పాల్ తన బ్లాగ్ లో శుక్రవారం రాసిన ఆర్టికల్ ను యధాతధంగా అనువదించి ప్రచురిస్తున్నాను. -విశేఖర్)
మలేషియా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఒకటి తూర్పు ఉక్రెయిన్ లో కూలిపోయిన కొద్ది రోజులకే, పశ్చిమ రాజకీయవేత్తలు, మీడియా అందరూ ఒక్కటై ఆ దుర్ఘటన నుండి గరిష్ట ప్రచార విలువ పొందడానికి కృషి ప్రారంభించాయి.
అయితే రష్యా అన్నా కావ్బాలి; లేదా పుతిన్ అన్నా కావాలి అని వారు చెప్పారు.
అధ్యక్షుడు ఒబామా పత్రికల సమావేశం పెట్టి, విచారణ మొదలు కాకుండానే, రష్యా అనుకూల తిరుగుబాటుదారులే విమానం కూల్చివేతకు బాధ్యులని చెప్పారు. ఐరాసలో ఆయన ప్రతినిధి సమంతా పవర్, ఐరాస భద్రతా సమితికి ఇదే సంగతి చెప్పారు. విమానం కూలిపోయిన ఒక్క రోజులోనే వారలా నిర్ధారించారు.
విమాన దుర్ఘటన గురించి ప్రభుత్వ ప్రచారాన్ని పశ్చిమ మీడియా సంస్ధలు పదే పదే చెబుతున్నాయి. వారు చెప్పని విషయాలు కొన్ని ఉన్నాయి.
గత సంవత్సరం చివరలో ఉక్రెయిన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ ప్రభుత్వాన్ని యూరోపియన్ యూనియన్ మరియు అమెరికాలు మద్దతు ఇచ్చిన నిరసనకారులు కుట్ర చేసి కూల్చివేసినప్పటి నుండే అక్కడ సంక్షోభం ప్రారంభం అయిన సంగతిని చెప్పరు. అమెరికా ప్రోత్సహించిన ‘ప్రభుత్వ మార్పిడి’ (regime change) సంభవించకుండా, తదనంతరం వందలాది మంది మరణాలకు దారితీసిన అల్లర్లు జరిగి ఉండేవి కావు. మలేషియా ఎయిర్ లైన్స్ విమానం కూల్చివేత దుర్ఘటన కూడా జరిగి ఉండేది కాదు.
రష్యన్ బలగాలు గానీ, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటుదారులు గానీ విమానాన్ని కూల్చి ఉండాలని మీడియా చెప్పింది. విమానం కూల్చివేతకు కారణమైన క్షిపణి రష్యా తయారీ కావడమే అందుకు కారణం అని వారు చెప్పారు. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా సరిగ్గా రష్యా తయారీ అయిన అవే ఆయుధాలను వినియోస్తున్న సంగతిని వారు చెప్పరు.
ఉక్రెయిన్ (ప్రభుత్వ కూల్చివేత) కుట్ర అనంతరం ప్రభుత్వం తూర్పు ఉక్రెయిన్ లోని లుగాన్స్క్ ప్రాంతంలో గత జూన్ నెల నుండి 250 మందికి పైగా ప్రజలను చంపేసిందని OSCE (Organisation for Security Cooperation in Europe) పరిశీలకులు చెప్పిన విషయాన్ని వారు చెప్పరు. విమానం కూల్చివేసిన తదుపరి రోజు కూడా సిటీ సెంటర్ పై బాంబు దాడి జరిపి 20 మందిని ఉక్రెయిన్ ప్రభుత్వం పొట్టనబెట్టుకుంది! చనిపోయినవారిలో అనేకమంది పౌరులు. అలా చనిపోయినవారి సంఖ్య విమానం కూల్చివేతలో మరణించిన వారి సంఖ్యతో దాదాపు సమానం. దానికి విరుద్ధంగా రష్యా ఉక్రెయిన్ లో ఇంతవరకు ఒక్కరినీ చంపలేదు. తిరుగుబాటుదారులు కూడా ప్రధానంగా మిలట్రీనే లక్ష్యం చేసుకుని దాడులు చేశారు తప్ప పౌరులను కాదు.
పౌరులపై జరిగిన ఈ దాడులను అమెరికా ప్రభుత్వం గట్టిగా సమర్ధించిన సంగతిని పశ్చిమ మీడియా సంస్ధలు చెప్పవు. ఈ హత్యలను “మితమయిన మరియు తగుమాత్రమైన’ హత్యలుగా అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి అభివర్ణించింది.
ప్రయాణీకులతో నిండిన విమానాన్ని కూల్చివేసి వారందరిని చంపడం ద్వారా రష్యా గానీ, తూర్పు ఉక్రెయిన్ లోని తిరుగుబాటుదారులు గానీ పొందగల లాభం వీసమెత్తు కూడా లేదన్న సంగతిని వారు చెప్పరు.
దాడికి బాధ్యత రష్యాకు అంటగట్టడం వలన ఉక్రెయిన్ ప్రభుత్వానికి బోలెడు లబ్ది కలుగుతుందన్న సంగతిని వారు నివేదించరు. మలేషియా విమానంపై దాడికి బాధ్యురాలిగా రష్యాను నిందిస్తున్నందుకు ఉక్రెయిన్ ప్రధాని సంతోషాతిరేకాలు వ్యక్తం చేసిన సంగతిని కూడా వారు చెప్పరు.
విమానాన్ని కూల్చివేయడానికి వినియోగించారని చెబుతున్న క్షిపణి ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించగల అత్యంత ఆధునికమైన క్షిపణి అనీ, దానిని ప్రయోగించడానికి తగిన శిక్షణ ఉండాలనీ, అటువంటి శిక్షణా సామర్ధ్యం తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటుదారులకు లేదని పశ్చిమ మీడియా చెప్పదు.
విమానం కూలిపోవడానికి ముందు వారం రోజుల్లో తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు ఉక్రెయిన్ ప్రభుత్వ సైన్యానికి భారీ నష్టాలు కలుగజేశారన్న సంగతిని వారు చెప్పరు.
గత వేసవిలో సిరియాలోని అస్సాద్ ప్రభుత్వం ఘౌటాలోని తమ సొంత పౌరులపైనే విష వాయువు ప్రయోగించి చంపేసిందని అమెరికా సరిగ్గా ఇదే రీతిలో ఆరోపించిన సంగతిని వారు గుర్తు చేయరు.
అమెరికా మద్దతు కలిగిన తిరుగుబాటుదారులపైన కూడా అస్సాద్ క్రమంగా పై చేయి సాధిస్తున్న నేపధ్యంలో విషవాయు దాడి ప్రభుత్వ బలగాల నుండి జరిగినట్లుగా అమెరికా ఆరోపించింది. అనంతరం, అమెరికా చేసిన ఆరోపణలు మధ్య ప్రాచ్యంలో మరో యుద్ధం అంచులవరకు మనల్ని తీసుకెళ్ళాయి. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఒబామా చివరి నిమిషంలో వెనక్కి తగ్గాడు. విషయాయువు దాడికి సంబంధించిన అమెరికా ఆరోపణలు అబద్ధాలని మనకి ఆ తర్వాత తెలిసివచ్చింది.
ఒబామా ప్రభుత్వం, అమెరికా మీడియా చెబుతున్నట్లు రష్యాగానీ లేదా తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటుదారు గానీ, ఉద్దేశ్యపూర్వకంగానో లేదా అనుకోని విధంగానో విమానం కూల్చివేయడానికి అవకాశాలు ఉండవచ్చు. అసలు విషయం ఏమిటంటే, ఖచ్చితమైన సమాచారం పొందడం చాలా కష్టం. దానితో అందరూ ప్రచార యుద్ధంలో మునిగితేలుతున్నారు.
ఈ పరిస్ధితుల్లో రష్యన్లు ఆ పని చేశారని గానీ, ఉక్రెయిన్ ప్రభుత్వం చేసిందని గానీ లేదా తిరుగుబాటుదారులు చేశారని గాని చెప్పడం తెలివిహీనం కాగలదు. నిజమైన పరిశోధన జరగాలని డిమాండ్ చేయడం అంత కష్టమైన విషయమా?
గంజాయి వనంలో తులసి మొక్క!!!!!