మధ్య ప్రాచ్యంలో ‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’ హత్యలు ఆటంకం లేకుడా కొనసాగుతున్నాయి. పాలస్తీనా ప్రజల మరణాలు 700 దాటిపోయింది. ‘రక్షణ పొందే హక్కు’ ఇజ్రాయెల్ కు ఉందన్న పేరుతో అమెరికా అంతర్జాతీయంగా ఐరాస భద్రతా సమితి తదితర వేదికలపై మారణకాండను వెనకేసుకొస్తుండగా ఇజ్రాయెల్ దుర్మార్గాలు వెల్లడి కాకుండా ఉండడానికి పశ్చిమ పత్రికలు శతధా సహకరిస్తున్నాయి.
‘ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్’ అంటే? ఎడ్జ్ అంటే అంచు అన్న సంగతి తెలిసిందే. గాజా భూఖండం మధ్యధరా సముద్రం అంచున ఉన్న సంగతి మననం చేసుకుంటే గాజాను కాపాడుకునే ఆపరేషన్ ను ఇజ్రాయెల్ చేపట్టిందన్న అర్ధం స్ఫురిస్తుంది. అదే నిజం అయితే కాపాడడం బదులు ఇజ్రాయెల్ హత్యలు ఎందుకు చేస్తోంది? సమాధానం స్పష్టమే. ఇజ్రాయెల్ కాపాడదలుచుకుంది గాజాలోని పాలస్తీనా ప్రజలు కాదు. కేవలం గాజా భూఖండపు అంచును మాత్రమే. పాలస్తీనా ప్రజల నుండి గాజా కాపాడాలన్నది ఇజ్రాయెల్ యోచన!
ఇంతకీ ఆ అంచులో ఏముంది? సమాధానం: చమురు, సహజవాయువు. గాజా తీరానికి సమీపంలో చమురు, సహజవాయువు నిక్షేపాలు ఉన్నాయని బ్రిటిష్ కంపెనీలు కనుగొన్నాయి. ఇజ్రాయెల్ లో సహజవాయువు వినియోగం పెరిగిపోతూ ఆ దేశ నిల్వలు తగ్గిపోతుండడంతో గాజా ఒడ్డున నిక్షేపాలను కూడా సొంతం చేసుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. గాజా నిక్షేపాలను వెలికి తీసినట్లయితే కువైట్ తో సమానంగా పాలస్తీనా ధనిక వంతం కాగలదని ఒక అంచనా. ఇజ్రాయెల్ కు అది ఎలాగూ ఇష్టం ఉండదు.
చమురు, సహజవాయువుల ఆదాయాన్ని హమాస్ తో పంచుకోవలసిన పరిస్ధితిని ఇజ్రాయెల్ ఎదుర్కొంటోంది. అలా కాకుండా నిక్షేపాలు మొత్తం తమకే సొంతం కావాలన్నది ఇజ్రాయెల్ స్వార్ధం. ఈ నేపధ్యంలో గాజా ప్రజలను బెదరగొట్టి, వారి ఇళ్లనుండి తరిమేసి తీర ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాదాపు పదేళ్లుగా ప్రయత్నిస్తోంది. అనుకున్నప్పుడల్లా గాజాపై దండెత్తి హత్యాకాండ సాగిస్తోంది. ఈ లక్ష్యంతోనే గాజా తీరం పొడవునా గన్ బోట్లు మోహరించి గాజన్లు చేపలు పట్టకుండా నిర్బంధం విధించింది. సముద్ర జలాలను కలుషితం చేసి మత్స్య పరిశ్రమను నాశనం చేసింది.
కావున, గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న హత్యాకాండకు కారణం అమెరికా, పశ్చిమ పత్రికలు చెబుతున్నట్లు హమాస్ రాకెట్ల నుండి రక్షణ కోసం కాదు. ఇజ్రాయెలీ-అమెరికన్-యూరోపియన్ పెట్టుబడిదారుల చమురు, గ్యాస్ లాభాల కోసమే ఈ హత్యాకాండలు సాగుతున్నాయి. పదే, పదే దాడి చేసి దయ అనేది లేకుండా ప్రాణ నష్టం వాటిల్లజేస్తే గాజన్లు భయపడి తమ నివాసాలు వదులుకుని పారిపోవాలి. లేదా ఇజ్రాయెల్ పడేసింది తింటూ బిక్కు బిక్కు మని బతుకులు సాగించాలి. ఈ ఎత్తుగడ ఫలితాన్ని కింది ఫొటోల్లో చూడవచ్చు. సాధారణ నీతి, నియమాల సంగతి అటుంచి కనీస యుద్ధ నీతిని కూడా పాటించకుండా గాజా పౌరుల ప్రాణాలను లక్ష్యం చేసుకుని హరించగల ఆటవిక నీతి ఒక్క పెట్టుబడిదారీ కంపెనీలు మాత్రమే పాటించగలవు. ఆసుపత్రులు, పాఠశాలలు చివరికి ఐరాస నెలకొల్పిన పాఠశాలలపై కూడా బాంబులు కురిపించడం ఇంకెవరికి సాధ్యం?
(కింది ఫొటోల్లో కొన్ని చూడలేని విధంగా, అత్యంత హింసాత్మకంగా ఉన్నాయి. కావున హెచ్చరించడమైనది.)
Photos: The Atlantic
I have read your telugu varthalu very knowledble and informative thank you
Hi Chandolu, You are welcome.