పొరబాటున కూల్చారు -అమెరికా


అమెరికా ఇప్పుడు స్వరం మార్చింది. రష్యా ఇంటలిజెన్స్ అధికారుల ప్రత్యక్ష సహకారంతో తూర్పు ఉక్రెయిన్ లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులే బక్ మిసైల్ తో మలేషియా విమానాన్ని కూల్చారని, అందుకు స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్పిన అమెరికా ఇప్పుడు ఆ ఆరోపణల నుండి వెనక్కి తగ్గింది. రష్యా అనుకూల తిరుగుబాటుదారులు పొరబాటున కూల్చి ఉండవచ్చని చెబుతోంది. అయితే అందుకు కూడా తమ వద్ద సాక్ష్యాలు లేవని మెల్లగా చెబుతోంది.

ఈ వ్యవహారం చూస్తే మహా భారతంలోని ఓ సంఘటన గుర్తు రాక మానదు. కురుక్షేత్రంలో ద్రోణాచార్యుడు కౌరవుల తరపున పేట్రేగి పోతున్నాడు. ఆయన ధాటికి పాండవ సైన్యాలు కకావికలై పరుగులు తీస్తున్నాయి. ఎటూ పాలుపోని ధర్మరాజు శ్రీకృష్ణుడిని సలహా అడిగాడట అప్పుడాయన ద్రోణాచార్యుడి రహస్యం చెబుతాడు. ఆయన కుమారుడు అశ్వద్ధామ మరణ వార్త ఆయనను క్రుంగదీస్తుందని ఆ వార్త విన్నవెంటనే నీరసించి ధనుర్బాణాలు విసిరేస్తాడని చెబుతాడు.

మరుసటి రోజు యుద్ధం మొదలైంది. యుద్ధంలో అశ్వద్ధామ అనే ఏనుగు కూడా తనపని తాను చేస్తోంది. కృష్ణుడి ఆదేశంతో భీముడు ఆ ఏనుగుని చంపేస్తాడు. “నేను అశ్వద్ధామను చంపేశానహో” అని అరుస్తాడు. భీముడి మాట నమ్మని ద్రోణుడు ఆడి తప్పని ధర్మరాజును వాకబు చేస్తాడు.  అప్పుడు ధర్మరాజు ” “అశ్వద్ధామ హతః యతి, నరోవా, కుంజరోవా” (అశ్వద్ధామ అయితే చనిపోయారు. కానీ నరుడో, ఏనుగో తెలియదు) అని చెబుతాడు.

ధర్మరాజు చెప్పిన మాటల్లో మొదటి అర్ధభాగాన్ని మామూలుగానే చెప్పనిచ్చిన కృష్ణుడు రెండో అర్ధ భాగం ద్రోణుడికి వినబడకుండా చేయడానికి సైనికుల చేత ఆనందోత్సాహలతో కేకలు వేసి మోతలు మోగించేలా చేస్తాడు. దానితో ద్రోణుడికి అశ్వద్ధామ చనిపోయాడు అని మాత్రమే వినిపిస్తుంది. దుఖితుడైన ద్రోణుడు విల్లంబులు విసిరేసి రధం దిగి ఆసనం వేసుకుని కూర్చుని అశ్వద్ధామ ఆత్మను వెతకడానికి తన ఆత్మను పరలోకానికి పంపిస్తాడు. ఆ అవకాశం చూసుకుని దృష్టద్యుమ్నుడు ద్రోణుడి తల నరికేస్తాడు. ఆ విధంగా ధర్మరాజుకి తన గురువుకి అబద్ధం చెప్పని ఖ్యాతి దక్కుతుంది. పాండవసైన్యాలను దుంపనాశనం చేస్తున్న ద్రోణుడిని అంతం చేయాలన్న లక్ష్యం నెరవేరుతుంది.

ఇప్పుడు అమెరికా చేసిన, ఇంకా చేస్తున్న పని అదే. 298 మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్న విమానాన్ని క్షిపణితో దాడి చేయించి మరీ కూల్చివేసిన అమానుష ఘటనపై లోకం అంతా ఆగ్రహంగా ఉన్న సమయంలో చేసింది రష్యానే అని తమ పత్రికలతో గోల గోల చేయించింది. రష్యాపై కొత్తగా ఆంక్షలు విధించబోతున్నట్లు అధ్యక్షుడు ఒబామా ప్రకటించాడు. విమానం కూల్చివేత ఘటనతోనన్నా ఐరోపా రాజ్యాలు మేలుకోవాలని ఒబామా తన మిత్రులకు హితవు పలికాడు. రష్యా సహజవాయువు కోసం ఆ దేశంపై ఆంక్షలు విధించడానికి ఐరోపా దేశాలు అంగీకరించలేదు. కొన్ని ఆంక్షలు విధించినప్పటికీ అవి నామమాత్రమే. అందుకే ఐరోపా మేలుకోవాలని ఒబామా చెప్పడం.

ఒబామా మాత్రమే కాదు. విదేశీ మంత్రి జాన్ కేర్రీ కూడా ఈ ప్రచారంలో ప్రధాన భాగం పోషించాడు. రష్యా మద్దతుతోనే విమానాన్ని కూల్చివేశారని చెప్పేందుకు సాక్ష్యాలు ఉన్నాయని ఆయన చెప్పాడు. ఉక్రెయిన్ విడుదల చేసిన ఆడియో సాక్ష్యం చాలని చెప్పాడు. రష్యా నుండి తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటుదారులకు బక్ మిసైళ్ళు సరఫరా అవుతున్నట్లు చూపుతున్న యూ ట్యూబ్ వీడియోకు మించిన సాక్ష్యం ఇంకేం కావాలి అని ప్రశ్నించాడు. రష్యా పాత్ర ఉందని స్ఫటికం కంటే స్పష్టంగా రుజువైందని అంతర్జాతీయ విలేఖరుల ముందు నమ్మబలికాడు.

ఇంత చేసిన అమెరికా ఇప్పుడు ఒక్కసారిగా స్వరం తగ్గించింది. అది ప్రయాణీకుల విమానం అని తెలియక తిరుగుబాటుదారులు కూల్చివేసి ఉండవచ్చని చెబుతోంది. ఈ మేరకు పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికన్ ఇంటలిజెన్స్ అధికారులు సమాచారం ఇచ్చారని రాయిటర్స్, బి.బి.సి, యాహూ న్యూస్ చెప్పాయి. “విమానం కూలిన ఐదు రోజుల తర్వాత, ఈ కూల్చివేత పొరబాటున జరిగిందని తెలుస్తోంది” అని ఇంటలిజెన్స్ అధికారి ఒకరు చెప్పారని రాయిటర్స్ తెలిపింది. పొరబాటున కూల్చి ఉండవచ్చని చెప్పడానికే 5 రోజుల సమయం పడితే రష్యా ప్రోద్బలంతో తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటుదారులే బక్ మిసైల్ తో కూల్చేశారని నిర్ధారణగా చెప్పడానికి ఇంకెంత సమయం పట్టాలి? ఈ మాత్రం కనీస జ్ఞానం కూడా లేకుండా ఏకంగా అమెరికా అధ్యక్షుడే “ఈ నేరానికి ప్రతీకారంగా రష్యాపై ఆంక్షలు విధిస్తాము” అని ప్రకటించడం ఎలా సాధ్యం? రష్యాను అప్రతిష్టపాలు చేయాలని కుట్ర బుద్ధి లేకపోతే తప్ప!

ఈ పొరబాటు విషయం కూడా రష్యా తిరుగుబాటుదారుల మాటల్లోనే తెలిసిందని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పడం గమనార్హం. అనగా ఉక్రెయిన్ ప్రభుత్వం విడుదల చేసిన, దొంగ సాక్ష్యం అని రష్యా నిర్ధారించిన ఆడియో టేపులనే వారు ఇంకా ఉటంకిస్తున్నారు. అయినప్పటికీ నిజంగా ఎవరు కూల్చారో తమకు కూడా తెలియదని మెల్లగా చెబుతున్నారు. “ఆ రోజు (బక్ మిసైల్) వ్యవస్ధను ఖచ్చితంగా ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలియదు. అయితే ఇలాంటి మిసైళ్ళు తిరుగుబాటుదారులకు రష్యా సరఫరా చేస్తోందన్న ఫోటో సాక్ష్యం మాత్రం మా దగ్గర ఉంది” అని ఇంటలిజెన్స్ అధికారి చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. సరఫరా చేసిందన్న ఫోటో సాక్ష్యమే గానీ తిరుగుబాటుదారులు ఆ సరఫరాని వినియోగించి కూల్చారనడానికి సాక్ష్యం లేదని అధికారి చెబుతున్నాడు. కాస్త ఆగితే బహుశా అది రష్యా సరఫరా అన్న సాక్ష్యం లేదని, తిరుగుబాటుదారులకే ఆ సరఫరా జరుగుతోందన్న సాక్ష్యామూ లేదని ఈ అధికారులు చెప్పవచ్చు కూడా.

అయిదురోజుల పాటు కాకిగోల చేసి, పూర్తి స్ధాయి గోబెల్స్ ప్రచారం సాగించి ఆనక తీరిగ్గా ఎవరు కూల్చారో తమకు తెలియదని చెప్పడం మోసం తప్ప మరొకటి కాదు. ఇలాంటి కుత్సిత ఎత్తుగడలను, అబద్ధపు ప్రచారాన్ని ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధం ముందు చేశారు.  ఇరాక్ పై దాడి కోసం చేశారు. లిబియా దురాక్రమణ కోసం చేశారు. సిరియా కిరాయి తిరుగుబాటు పొడవునా చేస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్ లో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూల్చడానికి చేశారు. ఆ తర్వాత పచ్చి నాజీ రాజకీయ గ్రూపులను అక్కడ అధికారంలోకి తేవడానికి చేశారు. ఇప్పుడు తూర్పు ఉక్రెయిన్ ప్రజల పోరాటాన్ని అణచివేయడం కోసం, రష్యాను అప్రతిష్టపాలు చేయడం కోసం చేస్తున్నారు.

ఇంతకీ అమెరికా హఠాత్తుగా ఎందుకు స్వరం తగ్గించింది. రష్యాయే కారణం అనడానికి గట్టి సాక్ష్యాలు ఉన్నట్లు ఢంకా భజాయించి చెప్పి ఇప్పుడు ‘అబ్బే, ఎవరు కూల్చారో మాకూ తెలియదు’ అని ఎందుకు చెబుతున్నది?  తిరుగుబాటుదారుల దగ్గర బక్ మిసైళ్ళు లేవని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్  స్వయంగా నిర్ధారించినప్పటికీ పట్టించుకోకుండా గాలి వార్తలు గుప్పించి ఇప్పుడెందుకు మాట మార్చారు? తమ మాటలు శుద్ధ అబద్ధాలని లోకానికి తిరుగులేని విధంగా రుజువు చేసే సాక్ష్యాలు తమ ప్రమేయం లేకుండానే వెల్లడి కానున్నాయా? అంతర్జాతీయ పరిశోధకులు వాస్తవాలను వెలికి తీయక తప్పదని తెలిసిందా? అందుకే ఎందుకైనా మంచిదని ముందే జాగ్రత్తపడుతున్నారా? మరిన్ని రోజులు ఓపిక వహిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్కపోదు.

6 thoughts on “పొరబాటున కూల్చారు -అమెరికా

 1. భారత పొడపడని వారి లో జాన్ కెర్రి ,హిలరి క్లింటన్ ప్రముఖులు. వీరిద్దరికి పాకిస్తాన్,అరబ్బుదేశాలంటే ఎనలేని మక్కువ. పాకిస్థాన్ ఎన్ని తప్పులు చేసినా జాన్ కెర్రి మాత్రం వాటిని పరిగణలోకి తీసుకోకుండా, పాక్ కు అమెరికా బిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయం చేయటానికి ప్రముఖపాత్ర వహిస్తాడు. పాక్ అధికార గణం ఆర్ధిక సహాయం తీసుకొని సగం పైగా (ఆ డబ్బు బహుశా ఆ దేశానికి కూడా రాదేమో ) స్వాహా చేస్తారు. ఇదొక విష వలయం. దానికి జాన్ కెర్రి గారు చాలా చక్కగా సహకరిస్తారు.

 2. Sir, please replace “ఈ నేరానికి ప్రతీకారంగా అమెరికాపై ఆంక్షలు విధిస్తాము” with “ఈ నేరానికి ప్రతీకారంగా రష్యా పై ఆంక్షలు విధిస్తాము” in 7th para…..

 3. ఈ మాత్రం కనీస జ్ఞానం కూడా లేకుండా ఏకంగా అమెరికా అధ్యక్షుడే “ఈ నేరానికి ప్రతీకారంగా అమెరికాపై ఆంక్షలు విధిస్తాము” అని ప్రకటించడం ఎలా సాధ్యం? రష్యాను అప్రతిష్టపాలు చేయాలని కుట్ర బుద్ధి లేకపోతే తప్ప!
  sir in this i didn’t understand the words in quotes. can u explain whether it is America or Russia.
  Your article is so good.

 4. Thank u sir, You are always welcome

  2014-07-24 13:50 GMT+05:30 “జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ” :

  > విశేఖర్ commented: “ప్రవాహంలో అలా వచ్చేసింది. సవరించాను. మిత్రులకు
  > ధన్యవాదాలు.”
  >

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s