అదేదో సినిమాలో తాను ఈల వేస్తే గోల్కండ కోట ఎగిరి పడుద్ది అని పాడతాడు. ఆయన సంగతేమో గానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అది కూడా ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు రాజకీయ పెద్దల అవినీతి, అవకతవకల గురించి ఈల వేయడం మొదలు పెడితే జనానికి తెలియని చాలా అఘాయిత్యాలు బైటికి వస్తాయి.
ఒక సంస్ధలో పని చేస్తూ, ఆ సంస్ధలో జరిగే అక్రమాలను బైటికి, రహస్యంగా గానీ బహిరంగంగా గానీ, చెబితే దానిని ఆంగ్లంలో విజిల్ బ్లోయింగ్ అంటారు. ఫుట్ బాల్ ఆటలో ఆటగాళ్లు తప్పులు చేస్తే అంపైర్ విజిల్ ఊది ఎత్తి చూపుతాడు కదా, అలా అన్నమాట! తెలుగులో వీళ్ళకి ప్రత్యేకమైన పేరు ఏమీ లేదు. (ఒకవేళ ఉంటే తెలిసినవారు చెప్పగలరు).
ఈ విధంగా ఈల వేసే వాళ్ళ సంఖ్య దేశంలోనూ, ప్రపంచ స్ధాయిలోనూ క్రమంగా పెరుగుతోందని కార్టూనిస్టు సూచిస్తున్నారు. ఆర్.టి.సి లో జాబ్ చేస్తూ ఆర్.టి.సి లో రహస్యంగా జరిగే అవతావకలను బైటపెడితే అది అంతిమంగా సంస్ధకు, తద్వారా జనానికి లాభం. అలాగే ఇతర సంస్ధలు కూడా. ఇదే సూత్రం ప్రభుత్వ పాలనా వ్యవస్ధకు కూడా వర్తిస్తుంది. బ్యూరోక్రాట్ అధికారులు ఈల వేస్తే వ్యవస్ధలకే లాభం.
ఇలా ఈల వేసేవారిని అదుపు చేయడానికి ప్రభుత్వ రహస్యాలను కాపాడే చట్టాలను కఠినతరం చేయాలని యు.పి.ఏ ప్రభుత్వం భావించింది. కానీ ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. అయితే అణచివేత పనిని వివిధ రూపాల్లో అమలు చేసే అవకాశాలు వివిధ చట్టాల ద్వారా ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయి. కాకపోతే అవన్నీ నేరుగా కాకుండా వివిధ చట్టాల మాటున ఉన్నాయి. అలా కాకుండా నేరుగా అణచివేత అమలు చేయడానికి చట్టం చేయబోయి ప్రతిపక్షాల సహాయ నిరాకరణతో యు.పి.ఏ భంగపడింది.
కొత్త ప్రభుత్వంలోనూ ఇలా ఈల ఊదుడుగాళ్లకు కళ్ళెం వేసే పని సరికొత్త పేర్లతో ఆమలు చేసే పోకడలు కనిపిస్తున్నాయి. ఇవి ఇంకా ఒక రూపం తీసుకోలేదు. త్వరలో అవి స్పష్టంగా జనం ముందుకు రావచ్చు. అభివృద్ధి, జి.డి.పి వృద్ధి లాంటి కంపెనీలు నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడం కోసం కొన్ని సూత్రాలను ప్రకటిస్తున్నారు. ఫిస్కల్ ప్రుడెన్స్, మైండ్ లెస్ పాపులిజం, బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్ మెంట్… ఇత్యాధి పదబంధాల రూపంలో ఆ సూత్రాలు ఉంటున్నాయి.
వీటి ప్రభావం ఆచరణలో జనంపై ఎలా పడేదీ ఇప్పటికే కొన్ని చర్యలు తెలిపాయి. రైల్వేల్లో ఎఫ్.డి.ఐ, ఛార్జీల పెంపు, సబ్సిడీల తగ్గింపుకు బడ్జెట్ లో పెట్టుకున్న లక్ష్యం…. ఇవన్నీ వాటిలో కొన్ని మాత్రమే.
ఈ చర్యలు నిజంగా జనానికి ఉపయోగమా లేదా అన్న సంగతులను బ్యూరోక్రాట్లు నిజాయితీగా వెల్లడి చేయగలిగితే అది నిజంగా ప్రజలకు మేలు చేసే విజిల్ బ్లోయింగ్. కొత్త ఆంధ్ర ప్రదేశ్ లో గత పాలకులు ఎక్కడెక్కడ అక్రమ కేటాయింపులు చేసింది లెక్క తేల్చాలని తాజా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు నిజానికి జనం కోసం కాదని తమ అక్రమాలకు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నది తెలుసుకోవడానికేనని ఏం.ఎల్.సి ఒకరు అసలు సంగతిని వెల్లడి చేశారు. రానున్న కాలంలో ఇలాంటి భూ అక్రమాలను బ్యూరోక్రట్లు వెల్లడిస్తే అది మరో రూపంలో జనానికి మేలు చేసినట్లే.
ప్రభుత్వాలు ప్రకటించి అమలు చేసే వివిధ విధానాలు జనానికి నిజంగా మేలు చేసేవో లేక కొద్ది మంది ధనిక వర్గాలకు మేలు చేసేవో అధికారులు ససాక్ష్యాలతో చెప్పగలిగితే అంతకుమించిన విజిల్ బ్లోయింగ్ ఇంకెక్కడా ఉండబోదు.
అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ, ఇంటర్నెట్ వినియోగదారులపై సాగిస్తున్న అక్రమ గూఢచర్యాన్ని ఎడ్వర్డ్ స్నోడెన్ వెలుగులోకి తెచ్చాడు. ఆయన అంటకుందు ఎన్.ఎస్.ఏ లో పని చేసిన వాడే. ఆయన వేసిన ఈల మామూలు ఈల కాదు. ఉన్మత్త మదగజం అయిన అమెరికా సామ్రాజ్యవాదం అసలు రూపాన్ని పచ్చిగా వెల్లడి చేసిన ఈల అది. ఆ ఈల వల్ల స్నోడెన్ దేశం వదిలి రష్యాలో తలదాచుకోవాల్సి వచ్చింది.
మన దేశంలోనూ ఆర్.టి.ఐ చట్టం ద్వారా విజిల్ బ్లోయింగ్ తో సమానమైన సాహసాలకు కొంతమంది పూనుకుంటున్నారు. ఆ క్రమంలో చాలామంది హత్యలకు గురయ్యారు. 2జి కుంభకోణం, కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం తదితర మహా కుంభకోణాలను కాగ్ సంస్ధ వెలికి తీసింది. అది చట్టబద్ధ సంస్ధ కాబట్టి, దాని పనే అది కాబట్టి అది విజిల్ బ్లోయింగ్ కాకపోవచ్చు. కానీ ఇంతవరకు ఎంతమంది కాగ్ పదవిలో పని చేయలేదు? వారంతా చేయలేని పనిని వినోద్ రాయ్ చేసి చూపారు. ఆ విధంగా ఆయన విజిల్ బ్లోయింగ్ తో సమానమైన పని నిర్వర్తించారు. ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నందున ధనిక వర్గాలు ఏమీ చేయలేకపోయారు గానీ అదే పని మరొకరు చేసి ఉంటే ప్రమాదకరమైన పరిస్ధితులను ఎదుర్కొని ఉండేవారు.
విజిల్ బ్లోయింగ్ ప్రభుత్వ పెద్దలకు కర్ణ కఠోరంగా ఉంటుంది. కానీ సామాన్యులకు వీనుల విందుగా ఉంటుంది.
విజిల్ బ్లోయర్ ను ఈనాడు పత్రిక తెలుగులో ప్రజా వేగు అని రాస్తున్నట్లు గుర్తు. ప్రజా వేగు అనడం కొంత సమంజసంగానే ఉందనిపిస్తోంది.
ఇక విజిల్ బ్లోయర్ చట్టంతో ఎంతో కొంతైనా జనానికి మేలు జరిగితే సంతోషమే. కానీ మన పాలకులు గుడిని, గుడిలో లింగాన్ని మింగే మాయగాళ్లు కాబట్టి….చట్టం ఎంత అమలవుతుందో చూడాలి.
అవును. ప్రజావేగు కొంత సమంజసం అనిపిస్తోంది. కానీ ఆంగ్ల పదానికి వచ్చే అర్ధం పూర్తిగా అందులో ధ్వనించడం లేదు. బహుశా అలవాటయితే ధ్వనిస్తుందేమో. ఏమీ లేకపోవడం కంటే అది కొంత మేలే.