దాగలేని నిజం: వార్ జోన్ మీదికి విమానాన్ని ఎందుకు మళ్లించారు?


ఉక్రెయిన్ తిరుగుబాటు ప్రాంతంలో కూల్చివేసిన మలేషియా విమానం MH17, తన రోజు వారీ రూట్ లో కాకుండా జులై 17 తేదీన కాస్త ఉత్తర దిశకు జరిగి ప్రయాణం చేసింది. రోజువారీ రూట్ లో ప్రయాణం చేసి ఉన్నట్లయితే MH17 అసలు తిరుగుబాటు ప్రాంతం దోనెత్స్క్ ప్రాంతం మీదకు వెళ్ళి ఉండేదే కాదు. కూలిపోయిన రోజున యధాప్రకారం ఆంస్టర్ డాం నుండి ఆగ్నేయ దిక్కులో నేరుగా ప్రయాణించకుండా కాస్త పైకి దిశ మార్చుకుని ప్రయాణించింది. ఆ రోజు విమానం దారి మార్చడానికి కారణం ఎవరు?

మార్చి 8 తేదీన హిందూ మహా సముద్రంలో కూలిపోయిందని భావిస్తున్న MH370 కూడా ఇలాగే హఠాత్తుగా ప్రయాణ దిశ మార్చుకుని ఈశాన్యం వైపు కాకుండా నైరుతి దిశకు సరిగ్గా వెనక్కి కాస్త దూరం ప్రయాణించి అనంతరం పడమటి దిక్కుకు ప్రయాణించింది. అండమాన్ సముద్రం మీదికి వచ్చాక దక్షిణ దిక్కుకు మళ్ళి, హిందూ మహా సముద్రంలో కూలిపోయింది. ఈ రెండు విమానాలు ఇలా హఠాత్తుగా ఎందుకు ప్రయాణ దిశను మార్చుకున్నాయి? ఈ రెండు దుర్ఘటనలకు మధ్య ఏమన్నా సంబంధం ఉన్నదా?

ఒకవేళ సంబంధం ఉంటే అది భవిష్యత్తులో వెల్లడి అవుతుందని ఆశిద్దాం. MH17 విమానం సంగతికి వస్తే అది దిశ మార్చుకోవడమే కాకుండా వాస్తవ విమాన మార్గం (flight path) కంటే తక్కువ ఎత్తులో ప్రయాణం చేసింది. సుదీర్ఘ దూరం ప్రయాణించే విమానాలు సాధారణంగా 35,000 అడుగుల నుండి 39,000 అడుగుల వరకు ఎత్తులో ప్రయాణిస్తాయి. కానీ MH17 మాత్రం ఆ రోజు 33,000 అడుగుల ఎత్తుకు దిగి ప్రయాణం చేసింది.

ఆంస్టర్ డామ్ నుండే MH17 విమానం నిర్దేశించిన ఎత్తు కంటే కింద ఎత్తులో ప్రయాణం చేసిందా? లేదు. ఉక్రెయిన్ లో ప్రవేశించే ముందు వరకు విమానం 35,000 అడుగుల ఎత్తులోనే ప్రయాణం చేసింది. ఉక్రెయిన్ గగనతలం (ఎయిర్ స్పేస్) లోకి ప్రవేశించిన తర్వాతనే విమానం 33,000 అడుగుల ఎత్తుకు దిగింది. అనగా MH17 విమానం కూలిపోయిన రోజున రెండు విధాలుగా నిర్దేశించిన దారి నుండి తప్పింది. ఒకటి: దిశ, రెండు: ఎత్తు. ఇలా ఎందుకు జరిగింది?

వీటిలో ఒక మార్పుకు కారణం ఎవరో మలేషియా ఎయిర్ లైన్స్ చెప్పింది. ఒక దేశం గగనతలంలో విమానం ఎంత ఎత్తులో వెళ్లవలసింది ఆ దేశానికి చెందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నిర్దేశిస్తారని, ఉక్రెయిన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆదేశాల మేరకు తమ విమానం ఉక్రెయిన్ గగనతలంలో 33,000 అడుగుల ఎత్తుకు దిగి ప్రయాణించిందని ఆ కంపెనీ చెప్పింది.

“MH17 ఉక్రెయిన్ గగనతలం పొడవునా 35,000 ఎత్తులో ప్రయాణించెందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఫ్లైట్ ప్లాన్ సమర్పించాము. ఇది వాంఛనీయమైన ఎత్తుకు దగ్గర. అయితే విమానం ఎంత ఎత్తులో వెళ్ళవలసిందీ భూమిపై ఉండే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నిర్దేశిస్తారు. ఉక్రెయిన్ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత 33,000 అడుగుల ఎత్తులో ఎగరాలని ఉక్రెయిన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆదేశించారు” అని మలేషియన్ ఎయిర్ లైన్స్ సంస్ధ తెలిపింది. ఈ సంగతిని పశ్చిమ పత్రికలు తెలియనట్లే నటిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక కింది పటంలో చూపినట్లుగా విమానం ఎత్తు మార్చారని చెప్పినప్పటికీ ఉక్రెయిన్ ఆదేశాల మేరకే అది జరిగిన సంగతి చెప్పలేదు.

విమానం మార్గంలో జరిగిన మరో మార్పు, దిశ. కింద ఒక పటంలో చూపినట్లుగా MH17 విమానం ఎప్పటిలాగా ఆగ్నేయ దిశలో కాకుండా కాస్త పైకి జరిగి ప్రయాణించింది. ఎప్పటి దిశలోనే ప్రయాణించి ఉంటే తూర్పు ఉక్రెయిన్ లోని తిరుగుబాటు ప్రాంతం దోనెట్స్క్ పైన కాకుండా దానికి కాస్త కింద ఉన్న అజోవ్ సముద్రం మీదుగా ప్రయాణించి ఉండేది. ఈ మార్గం విమానాలకు సర్వ సాధారణం. యూరోప్ నుండి ఆసియా వచ్చే విమానాలన్నీ ఈ మార్గంలోనే ప్రయాణిస్తాయి. ఆ రోజు MH17 కంటే ముందు కూడా అనేక విమానాలు ఈ మార్గంలో ప్రయాణం చేశాయి. కానీ MH17 అనూహ్యంగా దారి మళ్ళి దోనెట్స్క్ మీదికి వెళ్లింది. సాధారణంగా విమాన పైలట్లు తమంతట తాము నిర్దేశించిన మార్గాన్ని వదలరు. బలవంతంగా మళ్లిస్తే తప్ప.

సరిగ్గా ఇక్కడే రష్యా కీలక సమాచారం ఇచ్చింది. MH17 కూలిపోవడానికి ముందు వరకు ఉక్రెయిన్ కి చెందిన మిలట్రీ ఫైటర్ జెట్ విమానం (SU-25) దానికి సమీపంలోనే (ముందు భాగాన) ఎగురుతున్నట్లు తమ రాడార్లు గుర్తించాయని రష్యన్ రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ అందజేసిన పటాన్ని కింద చూడవచ్చు. SU-25 ఫైటర్ జెట్ కు గాలిలో నుండి గాలిలోకి (Air-to-Air) పేల్చగల క్షిపణులు అమర్చి ఉంటాయి. మలేషియా విమానాన్ని కూల్చింది బక్ మిసైళ్లే అని ఇంతవరకు నిర్ధారణ కాలేదు. అసలు విచారణే మొదలు కానప్పుడు నిర్ధారణ ఎలా జరుగుతుంది? కానీ ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే బక్ మిసైల్ తో MH17 ని కూల్చివేశారని ఉక్రెయిన్ లోని పశ్చిమ దేశాలు నిలిపిన మితవాద ప్రభుత్వం చెప్పేసింది?

రష్యా ఇచ్చిన సమాచారం బట్టి రెండు అనుమానాలు కలుగుతున్నాయి. ఒకటి: మిలట్రీ విమానం ఎస్కార్ట్ గా వచ్చి బలవంతంగా దారి మళ్లించినందునే MH17 ను అజోవ్ సముద్రం మీదుగా కాకుండా దోనెత్స్క్ మీదుగా వెళ్ళేలా చేసి ఉండవచ్చు. రెండు: భూమి నుండి గాలిలోకి ప్రయోగించబడే బక్ మిసైల్ వల్ల కాకుండా SU-25 ప్రయోగించిన ఎయిర్-టు-ఎయిర్ మిసైల్ వల్ల విమానం కూలి ఉండవచ్చు.

విమానం ఎప్పటిలాగా ఆగ్నేయ (South-East) దిశలో కాకుండా కాస్త ఉత్తరానికి జరిగి ప్రయాణించిన సంగతిని పశ్చిమ పత్రికలు అంగీకరిస్తున్నాయి. దానికి కారణం కూడా అవే చెప్పేస్తున్నాయి. అజోవ్ సముద్రం పైన ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉన్నదని అందుకే విమానం పక్కకు మళ్ళి దోనెత్స్క్ పైకి ప్రయాణించిందని అవి చెబుతున్నాయి. కానీ ఐరోపా గగనతలంలో విమాన మార్గాలను నిర్దేశించే ‘యూరో కంట్రోల్’ ఈ సూచనను తిరస్కరించింది. MH17 ప్రయాణించిన సమయానికి అజోవ్ పైన వాతావరణం మామూలుగానే ఉన్నదని ప్రతికూల వాతావరణం ఏమీ లేదని నిర్ధారించింది. ఉక్రెయిన్ గగనతలాన్ని ఊడా యూరో కంట్రోల్ పర్యవేక్షిస్తుంది. విమాన ప్రయాణాలను పర్యవేక్షించే అంతర్జాతీయ సంస్ధల్లో యూరో కంట్రోల్ ఒకటి.

వాస్తవాలు ఇలా ఉండగా విమానం కూల్చివేతకు రష్యాను, దోనెట్స్క్ తిరుగుబాటుదారులను బాధ్యులను చేసేందుకు పశ్చిమ దేశాలు తీరిక లేకుండా కృషి చేస్తున్నాయి. విచారణ మొదలు కాకుండానే తీర్పు ఇచ్చేసి దోషులను నిర్ధారించడానికి తొందరపడుతున్నాయి. ఆ దేశాలు త్వరపడకపోతే అసలు నిజం వెల్లడి అవుతుంది. నిజమైన దోషులెవరో తెలుస్తుంది. నిజం చెప్పులు తొడిగే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్న నానుడిని నిజం చేస్తూ పశ్చిమ పత్రికలు గోబెల్స్ ప్రచారంలో నిండా మునిగిపోయాయి.

ఈ పత్రికలే బ్లాక్ బాక్స్ లను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారని, వాటిని తీసుకెళ్లి రష్యాకు ఇచ్చేశారని ఇక సాక్ష్యాలను తారుమారు చేయడం రష్యాకు సులభం అనీ రాశాయి. అందుకు విరుద్ధంగా బ్లాక్ బాక్స్ లను తిరుగుబాటుదారులు తమకు ఇచ్చారని మలేషియా ప్రధాని ప్రకటించారు. బ్లాక్ బాక్స్ లను నాశనం చేస్తారని పశ్చిమ పత్రికలు చెప్పగా అవి చెక్కు చెదరలేదని, అంత ఎత్తునుండి పడినందున గీతలు పడ్డాయి తప్ప ఏమీ కాలేదని ఆయన చెప్పారు. మృత దేహాలను అటూ ఇటూ ఈడ్చుతున్నారని పశ్చిమ పత్రికలు కాకిగోల చేశాయి. కానీ ఏ.సి కంటెయినర్లతో కూడిన రైలులో మృత దేహాలు భద్రంగా ఖార్కివ్ చేరాయని అక్కడి నుండి ఆయా దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని మలేషియా ప్రధాని ప్రకటించారు.

అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ, తాము నియమించిన ఉక్రెయిన్ మితవాద ప్రభుత్వం విడుదల చేసిన ఆడియో రికార్డింగ్ ను బట్టి తిరుగుబాటుదారులే కూల్చివేశారని స్పష్టంగా తెలుస్తోందని కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. ఆడియోలో ఉన్నది రష్యా మిలట్రీ అధికారి, తిరుగుబాటు దారుల కమెండోల మధ్య జరిగిన సంభాషణగా ఆయన చెబుతున్నాడు. ఆ సంభాషణ నిజంగా జరగలేదని కష్టపడి తయారు చేశారని రష్యా స్పష్టం చేసింది. బక్ మిసైళ్లను తిరుగుబాటుదారులకు రష్యాయే సరఫరా చేసిందని చెబుతూ సదరు సరఫరాకు సంబంధించిన రవాణా వీడియోను ఇటర్నెట్ లో పోస్ట్ చేయగా దాన్ని కూడా కెర్రీ సాక్ష్యంగా చెబుతున్నాడు. అయితే దోనెత్స్క్ లో ఉన్న బక్ మిసైల్ లాంచర్లు వాస్తవానికి ఉక్రెయిన్ ప్రభుత్వానికి చెందినవని తిరుగుబాటుదారులవి కావని ఇతర వార్తా సంస్ధలు (రష్యా టుడే మొ.వి) తెలిపాయి. ఈ విధంగా అమెరికా, పశ్చిమ పత్రికలు చూపుతున్న సాక్ష్యాలు ఒట్టివేనని తేలిపోయాయి.

భవిష్యత్తులో బహుశా మరిన్ని వాస్తవాలు వెల్లడి కావచ్చు. అవి పశ్చిమ పత్రికల్లో మాత్రం చస్తే కనిపించవు. మలేషియా ప్రజలకు వాస్తవాలు కావాలి కనుక ఆ దేశ పత్రికల్లో వాస్తవానికి దగ్గరగా ఉండే వార్తలు లభించవచ్చు. పశ్చిమ కార్పొరేట్ పత్రికల వార్తలనే భారత దేశ పత్రికలు తాటికాయంత హెడ్డింగ్ లు పెట్టి మోస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త!

కింది ఫోటోలు ఆయా విమానయాన సంస్ధల వెబ్ సైట్ల నుండి, రష్యా టుడే పత్రిక నుండి సేకరించినవి. ప్రతి ఇమేజ్ ను జాగ్రత్తగా పరిశీలించి ఒక అభిప్రాయానికి పాఠకులు రావాలని సూచించడమైనది. మొదటి పటంలో సాధారణ ప్రయాణ మార్గాన్ని, జులై 17 తేదీన ప్రయాణించిన మార్గాన్ని మార్చి మార్చి చూడవచ్చు. చివరి నాలుగు పటాలు జులై 17 కు ముందు రోజుల్లో సాధారణ మార్గంలో MH17 ప్రయాణించిన మార్గాలు. రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ అందించిన Su-25 ఫైటర్ మరియు MH17 స్ధానాలా పటం కూడా కింద ఇవ్వబడింది. పొడవుగా ఉన్న పటం వాల్ స్ట్రీట్ జర్నల్ అందించింది.

 

2 thoughts on “దాగలేని నిజం: వార్ జోన్ మీదికి విమానాన్ని ఎందుకు మళ్లించారు?

  1. తాము కూల్చేసి తిరుగుబాటుదారుల మీదకి నెట్టడానికి కాకపోతే దాన్ని ఎందుకు దారిమళ్ళించినట్టు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s