మలేషియా విమానాన్ని కూల్చివేసింది తూర్పు ఉక్రెయిన్ లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులే అని పశ్చిమ పత్రికలు, పశ్చిమ రాజ్యాధినేతలు తెగ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా సైతం ఇదే పల్లవి అందుకుని మిలిటెంట్లను పోరాట విరమణ చేసేలా సహకరించడం లేదని రష్యాకి కూడా పాపం అంటగట్టే ప్రయత్నం చేశారు. అయితే మిలిటెంట్ల దగ్గర అసలు బక్ మిసైళ్లే లేవని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ చెప్పడంతో ఈ ఆరోపణలు అవాస్తవం అని స్పష్టం అయిపోయింది.
MH17 అనే మలేషియా విమానం (బోయింగ్ 777) కూలిపోయిందని, బక్ మిసైల్ తో దాన్ని కూల్చేశారని మొట్టమొదట ప్రకటించింది ఉక్రెయిన్ హోమ్ శాఖ ప్రతినిధి. హోమ్ మంత్రి ఆంటోన్ గెరషెంకో సైతం ఈ ఆరోపణని పదే పదే వల్లిస్తూ దానికి సాక్ష్యంగా ఒక సంభాషణ టేపును విడుదల చేశాడు. ఆ టేపులో మాట్లాడుకున్నది మిలిటెంట్ కమాండర్లు అని ఒక పత్రిక చెబితే, రష్యా మిలట్రీ అధికారులు అని మరో పత్రిక చెప్పింది. ఈ టేపుల ద్వారా విమానం కూల్చివేతకు మిలిటెంట్లే కారణం అని తేలిపోయిందని ఉక్రెయిన్ ప్రభుత్వం, పశ్చిమ పత్రికలు తామే నిర్ధారించి చెప్పేస్తున్నాయి.
అయితే వీటన్నింటికీ భిన్నమైన వార్తను కీవ్ పోస్ట్ పత్రిక ప్రచురించింది. ఆ వార్త ప్రకారం మిలిటెంట్లు ఉక్రెయిన్ ప్రభుత్వానికి చెందిన బక్ మిసైళ్లను వేటినీ స్వాధీనం చేసుకోలేదని, దోనెట్స్క్ రీజియన్ లో ప్రభుత్వం మోహరించిన బక్ మిసైళ్ళు, లాంచర్లన్నీ మనవద్దే ఉన్నాయని మిలట్రీ అధికారులు ఉక్రెయిన్ అధ్యక్షుడికి చెప్పారని ఆ దేశ ప్రాసిక్యూటర్ జనరల్ విటలి ప్రావ్దా పత్రికకు చెప్పాడు.
“మన బక్, మరియు ఎస్-300 ఎయిర్ డిఫెన్స్ మిసైళ్ళు ఏవీ టెర్రరిస్టుల (తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు) దగ్గర లేవని ప్రయాణీకుల విమానం కూలిపోయిన తర్వాత అధ్యక్షుడికి మిలట్రీ అధికారులు చెప్పారు. ఈ ఆయుధాలు వేటినీ వారు స్వాధీనం చేసుకోలేదు” అని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ చెప్పారని ప్రావ్దా పత్రిక తెలిపింది.
ఉక్రెయిన్ హోమ్ మంత్రి గెరషెంకో కూడా మొట్టమొదట విమానం కూల్చివేతపై ప్రకటన చేసినప్పుడు మలేషియా విమానం బక్ మిసైల్ ప్రయోగం వల్ల కూలిపోయిందని చెప్పాడే తప్ప ఆ మిసైల్ ని ఎవరు ప్రయోగించారో చెప్పలేదు. ఆ తర్వాత మాత్రమే మిలిటెంట్లే మిసైల్ ప్రయోగించారనీ, వారికి రష్యా సహకరించిందని చెప్పడం మొదలు పెట్టాడు. అసలు విమానం కూలిపోయింది బక్ మిసైల్ వల్లనే అన్న సంగతి ఆయనకు ఎలా తెలిసిందో చెప్పలేదు. విమానం కూలిపోయిన ప్రాంతం పూర్తిగా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. అక్కడికి ఇంతవరకు ప్రభుత్వ అధికారులు ఎవరూ వెళ్లలేదు. కేవలం నాటో కి చెందిన అంతర్జాతీయ పరిశోధన బృందం మాత్రమే వెళ్లింది. అలాంటిది బక్ మిసైల్ వల్లనే విమానం కూలిందని ఉక్రెయిన్ హోమ్ మంత్రి ఎలా చెప్పాడు?
విమానం కూల్చివేతపై నిస్పాక్షిక విచారణ జరగాలని, రష్యా అందుకు సహకరించాలని ఒబామా సైతం కోరాడు. అంటే ప్రాధమిక విచారణ కూడా ఇంకా మొదలు కాలేదు. కానీ పశ్చిమ పత్రికలు మాత్రం ఇది తిరుగుబాటుదారుల పనే అని ప్రచారం చేస్తున్నాయి.
యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరైనా మొట్టమొదట చేసే ఆలోచన దానివల్ల ఎవరికి ప్రయోజనం అని. తూర్పు ఉక్రెయిన్ మిలిటెంట్లు ఉక్రెయిన్ నుండి స్వతంత్రాన్ని కోరుతున్నారు. దోనెట్స్క్, లుగాన్స్క్, ఖార్కివ్ ప్రాంతాలు ఇలా స్వతంత్రాన్ని కోరుతున్నాయి. రష్యన్ భాశీయులు ఎక్కువమంది ఇక్కడ నివసిస్తారు. నియో నాజీ, మితవాద గ్రూపులు అధికారం లాక్కున్నాక రష్యన్ భాషను అధికార భాషగా రద్దు చేశారు. దానితో వారు ఉక్రెయిన్ నుండి విడిపోయి రష్యాలో కలుస్తామని పోరాటం చేస్తున్నారు.
కాబట్టి మిలిటెంట్లు మూడో దేశానికి చెందిన ప్రయాణీకుల విమానాన్ని కూల్చివేయడం వల్ల ప్రయోజనం లేకపోగా అంతర్జాతీయ సమాజం నుండి కోరి వ్యతిరేకత తెచ్చుకున్నట్లు అవుతుంది. అలాంటి పిచ్చి పనికి వాళ్ళేందుకు పూనుకుంటారు అన్నది ఆలోచించవలసిన ప్రశ్న.
మిలిటెంట్లు ఉగ్రవాదులని ఉక్రెయిన్ ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారాన్ని పశ్చిమ దేశాలు, పత్రికలు యధాశక్తి నెత్తిన వేసుకుని మోస్తున్నాయి. ప్రయాణికుల విమానం కూల్చివేతతో వాళ్ళు నిజంగా ఉగ్రవాదులే అని ప్రపంచం నమ్ముతుంది. అది ఉక్రెయిన్ లోని పశ్చిమ అనుకూల పాలకులకు ఎంతో ప్రయోజనం. వాళ్ళు తూర్పు ఉక్రెయిన్ ప్రజలపై సాగిస్తున్న యుద్ధానికి అది మద్దతు సమకూర్చుతుంది.
ఈ పరిస్ధితుల నేపధ్యంలో మలేషియా విమానం కూల్చివేతకు కారకులు ఎవరో పరిశీలించాలి. కూల్చివేతకు కారకులు ఎవరో ఇదమిద్ధంగా తెలియడానికి మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావాలి. అప్పటివరకూ ఎవరు కారణమో నిర్ధారించలేము. ఈ లోపు అబద్ధపు ప్రచారానికి లోను కోకపోవడమే మనం చేయగలింది.