మలేషియా విమానం: ఎవరు కూల్చారు?


ఉక్రెయిన్ లో కూలిపోయిన విమానం దానికదే కూలిపోలేదని, ఎవరో కూల్చివేశారని పత్రికలన్నీ చెబుతున్నాయి. రష్యా తయారీ అయిన బక్ మిసైల్ తో విమానాన్ని కూల్చివేశారని, ఇది రష్యా అనుకూల తిరుగుబాటుదారుల పనే అనీ ఉక్రెయిన్ ప్రభుత్వం చెబుతోంది. తిరుగుబాటుదారులు మాత్రం అది తమ పని కాదని తమ వద్ద ఆ స్ధాయి మిలట్రీ పరికరాలు లేవని చెబుతున్నారు. భుజం మీద పెట్టుకుని ప్రయోగించే మిసైళ్ళు మాత్రమే తమ వద్ద ఉన్నాయని వాటితోనే ఉక్రెయిన్ ఫైటర్ జెట్ లను కూల్చగలుగుతున్నామని స్పష్టం చేస్తున్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రమాదం గురించి ఉక్రెయిన్ ను హెచ్చరించారు. తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటు ప్రాంతాలపై ఉక్రెయిన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున యుద్ధం చేస్తోందని, తాము కోరినట్లుగా చర్చలు జరపడం ద్వారా ఘర్షణకు స్వస్తి పలికి ఉన్నట్లయితే ఈ ప్రమాదం జరిగేది కాదని ఆయన గుర్తు చేశారు. అంతకు మించి ఆయన ఏమీ ఆరోపణలు చేయలేదు. తిరుగుబాటుదారులే కూల్చివేశారన్న ఆరోపణను ఆయన తిరస్కరించలేదు కాబట్టి దానికాయన అంగీకరిస్తున్నట్లే అని డెయిలీ మెయిల్ లాంటి పశ్చిమ పత్రికలు ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నాయి.

పశ్చిమ పత్రికల వార్తా కధనాలు ఎలా ఉన్నాయంటే ‘అదిగో పులి, అంటే ఇదిగో తోక’ అన్నట్లుగా. బక్ మిసైల్ తో రష్యా అనుకూల తిరుగుబాటుదారులే విమానాన్ని కూల్చేశారన్న ఆరోపణలు చేయడమే గానీ అందుకు సాక్ష్యాలనేమీ ఉక్రెయిన్ అధికారులు చూపలేదు. కనీసం ఫలానా సాక్ష్యం ఉందన్న ప్రస్తావన కూడా చేయలేదు. ఉక్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ అయితే రష్యా గూఢచారులే విమానాన్ని కూల్చారని ఆరోపించాడు. ఉక్రెయిన్ వాదనను మోసే పనిలో పశ్చిమ పత్రికలు పూర్తిగా నిమగ్నం అయ్యాయి.

బక్ మిసైళ్ళు తమ వద్ద లేవని విమానం కూలిన దోనెత్స్క్ ప్రాంత తిరుగుబాటు ప్రభుత్వం చెబుతూ కూల్చివేత పని ఉక్రెయిన్ మిలట్రీదే కావచ్చని ప్రత్యారోపణ చేశారు. కానీ వాళ్ళు కూడా అందుకు తగిన సాక్ష్యాలను ఏమీ చూపలేకపోయారు.

ఈ లోపు ఇది రష్యా అనుకూల తిరుగుబాటుదారుల పనే అని ప్రచారం చేయడంలో పశ్చిమ పత్రికలు నిండా మునిగిపోయాయి. బక్ మిసైళ్లను ప్రయోగించే లాంచర్ ను పశ్చిమ దేశాల విలేఖరి ఒకరు దోనెత్స్క్ లో చూశారని ఆ ప్రాంతం విమానం కూలిన చోటికి దగ్గరగానే ఉందని డెయిలీ మెయిల్ రాసింది. బక్ మిసైల్ లాంచర్ ని చూసినట్లు చెబుతున్న విలేఖరి సైతం అందుకు తగిన సాక్ష్యాన్ని చూపలేదు. ఇలాంటి గాలి వార్తలను కుమ్మరించడంలో కొందరు పశ్చిమ విలేఖరులు పండిపోయి ఉన్నందున రూఢి అయిన సాక్ష్యం లభ్యం అయ్యేవరకు వారి మాటలను నమ్మలేము.

కాగా ఉక్రెయిన్ మిలట్రీ వద్ద కూడా బక్ మిసైళ్ళు ఉన్నాయి. అవి ఒకప్పుడు రష్యా సరఫరా చేసినవి. కానీ ఉక్రెయిన్ మిలట్రీలో ఇప్పుడు పని చేస్తున్నవారంతా సుశిక్షిత సైనికులు కాదు. యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన మితవాద గ్రూపుల సభ్యులే ఇప్పుడు ఉక్రెయిన్ సైనికులుగా పెత్తనం చెలాయిస్తున్నారు. క్రమబద్ధమైన యుద్ధ శిక్షణ వారికి లేదు.

తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలపై యుద్ధం సాగిస్తున్న ఉక్రెయిన్ బక్ మిసైల్ లాంచర్లను ఇటీవల కాలంలో దోనెత్స్క్ ప్రాంతానికి తరలించిందని రష్యా టుడే పత్రిక తెలిపింది. సదరు మిసైళ్లను ప్రయోగించగల శిక్షణ, నైపుణ్యం లేని సైనికులు పొరబాటున మలేషియా విమానాన్ని కూల్చి ఉండవచ్చని కొందరు సూచిస్తున్నారు.

తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు గత కొన్ని నెలలుగా యుద్ధ ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్కడి ప్రజలపై అన్ని రకాల అఘాయిత్యాలకు పాల్పడుతోంది. అనగా తన ప్రజలపై తానే యుద్ధం చేస్తోంది. అయినా పశ్చిమ దేశాలు గానీ, పశ్చిమ పత్రికలు గానీ, చివరికి ఐరాస కూడా దానిని పల్లెత్తు మాట అనడం లేదు.

సిరియా అధ్యక్షుడు తన ప్రజలను తానే చంపుతున్నాడని దొంగ సాక్ష్యాలు సృష్టించి, ఆయనను ఎదుర్కొనే పేరుతో ఇస్లామిక్ టెర్రరిస్టులను దించి వారికి డబ్బు, ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి పశ్చిమ దేశాలు. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం నిజంగానే తమ ప్రజలపై యుద్ధం చేస్తున్నా అదేమీ ఎరగనట్లు నటిస్తున్నాయి. సిరియాలో ఆల్-ఖైదా ఉగ్రవాదులకు రసాయన ఆయుధాలు ఇచ్చి ప్రజలపై ప్రయోగింపజేసి ఆ నేరాన్ని సిరియా అధ్యక్షుడి మీదకు నెట్టినట్లే తూర్పు ఉక్రెయిన్ లో మలేషియా విమానాన్ని కూల్చి ఆ నేరాన్ని తిరుగుబాటుదారులపై నేట్టేందుకు కుట్ర పన్నినా ఆశ్చర్యం లేదు.

నిజానికి అటువంటి అఘాయిత్యాలకు ఉక్రెయిన్ సైన్యంలో చేరిన మితవాద, నియో-నాజీ గ్రూపులు పాల్పడిన చరిత్ర ఉంది. యనుకోవిచ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న జనాన్ని తామే చంపి ఆ నేరాన్ని యనుకోవిచ్ పైకి నెట్టిన చరిత్ర వారిది. ఆ సంగతి లాత్వియా అధికారి ఒకరు వెల్లడి చేయడంతో వారి కుట్ర లోకానికి తెలిసింది. అదే తరహాలో వారు మలేషియా విమానంపై దురాగతానికి పాల్పడి ఉండవచ్చని కొందరు సూచిస్తున్నారు.

కానీ ప్రస్తుతానికి ప్రమాద కారణాలపై ఎటువంటి సమాచారము లేదు. కనుక అప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుంది. రానున్న రోజుల్లో వాస్తవాలు ఏదో విధంగా వెలుగు చూడక మానవు. అప్పటి వరకు వివిధ వాదనలను శల్య పరీక్షకు గురి చేయాల్సిందే.

ఈ కింది ఫోటోలను డెయిలీ మెయిల్ పత్రిక ప్రచురించింది.

2 thoughts on “మలేషియా విమానం: ఎవరు కూల్చారు?

  1. ఆ విమానం ఎవరు కూల్చినా, ఒకటి మాత్రం అర్థమౌతున్నాది. యురోప్ వాళ్ల దగ్గర డబ్బులు లేవు. దివాలా తీశారు. వాళ్ళు డబ్బులు ఖాళీ చేసుకొన్న ప్రతిసారి వారు యుద్దాలకు దిగుతారు. అవి ప్రపంచ యుద్దాలుగా మారాయి. ఇది ఆరంభమేమో! ఒకప్పుడు వారి ఆర్ధిక లోటును పూడ్చటానికి, మూడో ప్రపంచ దేశాలైన ఇండియా,ఆఫ్రికా దేశాలపై పడేవారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. మనం సైకలాజికల్ గా వారి దగ్గర ధనం, అధికారం ఉన్నాదని అనుకొంట్టున్నాము. వాస్తవం వేరు. జూదము, డ్రగ్స్, వ్యభిచారం మొదలైన వాటి మీద వచ్చే ఆదాయాన్ని వాళ్ళు జిడిపి లో కలుపుతున్నారంటే, అవి కూటిర పరిశ్రమలు లాగా మారినట్లు ఉన్నాయి. పరిస్థితి చాలా దిగజారినట్లు ఉన్నాది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s