ఉక్రెయిన్: మలేషియా విమానం కూలి 295 మంది మరణం?


ఉక్రెయిన్, రష్యా సరిహద్దులో మలేషియా ఎయిర్ లైన్స్ కి చెందిన ప్రయాణీకుల విమానం కూలిపోయింది. విమానంలో 280 మంది ప్రయాణీకులు, 15 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వంపై పోరాడుతున్న తిరుగుబాటుదారులే క్షిపణి ప్రయోగంతో విమానాన్ని కూల్చివేశారని ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ ఆరోపణలను పశ్చిమ కార్పొరేట్ సంస్ధలు పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టాయి. ఆరోపణలను తిరుగుబాటుదారులు తిరస్కరించారు. విమానాన్ని కూల్చగల మిలట్రీ పరికరాలు తమవద్ద లేవని తెలిపారు.

హిందూ మహా సముద్రంలో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా విమానం ఆచూకీ ఇంకా తెలియకముందే ఆదేశానికే చెందిన మరో విమానం కూలిపోవడం గమనార్హం. ఉక్రెయిన్, రష్యా సరిహద్దులో విమానంతో సంబంధాలు తెగిపోయాయని మలేషియా ఎయిర్ లైన్స్ అధికారులు ధృవీకరించారు. విమానం ఆంస్టర్ డాం నుండి కౌలాలంపూర్ కి ప్రయాణిస్తోందని తెలుస్తోంది. మరో 40 కి.మీ ప్రయాణిస్తే రష్యాలో ప్రవేశిస్తుందనగా విమానం కూలిపోయింది.

కూలిపోయిన సమయానికి విమానం 10 కి.మీ ఎత్తులో ప్రయాణిస్తోంది. ప్రయాణీకుల విమానం ప్రయాణ ఉచ్ఛదశలో ఈ ఎత్తులో ప్రయాణిస్తుందని, అంత ఎత్తునుండి కూలిన విమానంలో ఎవరూ ప్రాణాలతో మిగిలే అవకాశం లేదని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఉక్రెయిన్ కి చెందిన మిలట్రీ ఫైటర్ జెట్ లు కూలిపోయాయి. రష్యాయే తమ ఫైటర్ జెట్ లను కూల్చివేసిందని ఉక్రెయిన్ ఆరోపించగా రష్యా తిరస్కరించింది. అర్ధంలేని ఆరోపణలతో అపరిపక్వతను వెల్లడించుకోవద్దని హితవు పలికింది.

అదే ప్రాంతంలో మలేషియా ప్రయాణీకుల విమానం కూలిపోవడం ఈ సంగతిని మొదటిసారిగా ఉక్రెయిన్ ప్రభుత్వమే లోకానికి వెల్లడి చేయడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్లకు అలవాటు పడిన దుష్ట శక్తులు తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటుదారులను అప్రతిష్టపాలు చేసేందుకు ఈ దురాగటానికి పాల్పడ్డారా అన్న అనుమానాలను కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

తూర్పు ఉక్రెయిన్ లోని దోనెత్స్క్ ప్రాంతంలో విమానం కూలిందని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. శఖ్ తెర్స్క్ కు సమీపంలోని టోరెజ్ వద్ద విమానం కూలిందని రష్యా వార్తా సంస్ధ ఇంటర్ ఫాక్స్-ఉక్రెయిన్ ను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. కూలిపోయిన విమానం MH-17గా మలేషియా ఎయిర్ లైన్స్ అధికారులు పేర్కొన్నారు. ఈ విమానం కూడా బోయింగ్-777 మోడలే కావడం గమనార్హం.

విమానం కూలిందని భావిస్తున్న చోటి నుండి భారీ పొగలు వస్తున్న దృశ్యాలను సి.ఎన్.ఎన్ వార్తా ఛానెల్ ప్రసారం చేసింది. స్ధానికులు తీసిన వీడియోగా చానెల్ పేర్కొంది. విమాన శకలాలుగా కనిపిస్తున్న భాగాలను తాము చూశామని పౌరులు కొందరు చెప్పారని రష్యా టుడే (ఆర్.టి) పత్రిక తెలిపింది. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన శిధిలాల ఫోటోలను ఆర్.టి ప్రచురించింది. మృత దేహాలేవీ తాము చూడలేదని పౌరులు పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

బి.బి.సి వార్తా సంస్ధ ఏకంగా విమానం కూలిన స్ధలం ఫోటో ప్రచురించింది. విమానం కూలిన చోట మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని బి.బి.సి తెలిపింది. 10 కి.మీ ఎత్తులో ప్రయాణించే విమానాన్ని కూల్చాలంటే భుజం పైన పెట్టుకుని ప్రయోగించే క్షిపణులు పనికి రావని, surface-to-air మిసైళ్ళు కాకుండా air-to-air మిసైళ్ళు అయితేనే ఇది సాధ్యమని బి.బి.సి విశ్లేషకులు జొనాధన్ బీలే స్పష్టం చేశాడు. దీనిని బట్టి కూల్చివేయడం నిజం అయిన పక్షంలో అది తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటుదారుల పని కాదని భావించవచ్చు.

ఏదన్నా దేశానికి చెందిన మిలట్రీ జెట్ విమానం ప్రయోగించిన క్షిపణి వల్ల విమానం కూలి ఉండాలి. లేదా విమానంలోనే ఏదన్నా సాంకేతిక లోపం వలన కూలి ఉండాలి. క్షిపణి ప్రయోగం వల్ల విమానం కూలిందని చెబుతోంది ఉక్రెయిన్ ప్రభుత్వం మాత్రమే. తమ ఆరోపణలకు ఏ సాక్ష్యాలను ఉక్రెయిన్ ప్రభుత్వం చూపలేదు. వివరాలు పూర్తిగా వెల్లడి కాక మునుపే ఒక నిర్ధారణకు రావడం తొందరపాటుతనం కాగలదు. విమానాన్ని కూల్చివేసినట్లు తమ వద్ద సమాచారం ఏదీ లేదని మలేషియా అధికారులు తెలిపారు.

విమానం కూలిన వార్త తెలిసిన వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని పుతిన్ ప్రతినిధిని ఉటంకిస్తూ ఆర్.టి తెలిపింది. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతం పై నుండి ప్రయాణాలను తప్పించాలని అమెరికా గత ఏప్రిల్ లోనే తమ విమానయాన సంస్ధలకు సలహా ఇవ్వడం గమనార్హం.

2 thoughts on “ఉక్రెయిన్: మలేషియా విమానం కూలి 295 మంది మరణం?

  1. అతి దారుణమైన ఏహ్యమైన చర్య. ప్రపంచంలోని అగ్రదేశాలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. ఈటువంటి పాశవిక చర్యలు భవిష్య్త్తులో మరోసారి జరగకుండా ఉండటానికి ప్రపంచ దేశాలన్ని సమాయుక్తమై మానవాళి మనుగడకు ముప్పులేని విఢానాలకు దోహదపడాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s