ఇజ్రాయెల్ దౌష్ట్యం: రాతి గుండెలైతేనే ఈ ఫోటోలు చూడండి!


ఎల్లలు లేని దౌష్ట్యం ఇజ్రాయెల్ సొంతం. అందుకు ఈ ఫోటోలే సాక్ష్యం. బుధవారం నాటికి ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన గాజన్ల సంఖ్య 213. దాడులు ఇంకా కొనసాగుతున్నందున ఈ సంఖ్య పెరగడానికి ఎన్నో గంటలు పట్టదు.

ఇజ్రాయెల్ దాడులకు పశ్చిమ పత్రికలు ఎప్పుడూ గాజా యుద్ధం అనే పేర్కొంటాయి. తద్వారా ఇజ్రాయెల్ తాను దురాక్రమించిన ప్రాంతాలపై విధ్వంశకరమైన దాడులకు తాగబడుతున్న సంగతి పేరులో దొర్లకుండా జాగ్రత్త పడతాయి.

ఈ సో కాల్డ్ ‘గాజా యుద్ధం’ ఫోటోలను దాదాపు పశ్చిమ పత్రికలన్నీ కవర్ చేస్తాయి. అయితే ఆ ఫొటోల్లో పేలుళ్ళ మంటలు, కూలిపోయిన భవనాలు, రాకెట్ లు వదిలే పొగ మార్గాలు, దట్టంగా అల్లుకుని ఉండే పేలుళ్ళ పొగలు మాత్రమే కనిపిస్తాయి. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా ప్రజల హింసను అవి చూపించవు.

ఇజ్రాయెల్ దాడుల ఫలితం మహా హింసతో కూడుకుని ఉంటుంది. ఇజ్రాయెల్ చెప్పే విధంగా దాడుల్లో చనిపోయే వారంతా మిలిటెంట్లు కాదు. ప్రధానంగా మరణించేది పసి పిల్లలు, స్త్రీలే. దాడుల్లో బ్రతికి బైటపడేవారి పరిస్ధితి ఎలా ఉంటుందంటే దానికంటే చనిపోయి ఉంటేనే బాగుండేది అనుకునేంత ఘోరంగా ఉంటుంది. కళ్ళు, కాళ్ళు, చేతులు ఇలా శరీరంలో ఒక్కో భాగం కోల్పోయి జీవితాంతం కసి, క్రోధాలను వెంటబెట్టుకుని ప్రయాణించేవారు అనేకమంది అక్కడ ఉంటారు.

ఇప్పటివరకు 213 మంది చనిపోగా వారిలో 75 శాతం మంది అమాయక పౌరులు. ఇది హమాస్ లెక్క కాదు. ఐరాస విడుదల చేసిన లెక్క. వారిలో 43 మంది పిల్లలే. నిన్న బుధవారం (జులై 16) ఇజ్రాయెల్ నౌకా బలగాలు జరిపిన వాయు దాడిలో గాజా బీచ్ లో ఫుట్ బాల్ ఆడుతున్న నలుగురు పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. మరింత మంది గాయపడి ఆసుపత్రుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోతున్నవారిలో ఎక్కువమంది బాంబు దాడుల్లో కూలుతున్న ఇళ్ల కింద పడి చనిపోతున్నారు. హమాస్ కావాలనే ఇళ్ల మధ్య నుండి రాకెట్ లు ప్రయోగిస్తోందని తద్వారా పౌరులను ‘హ్యూమన్ షీల్డ్’గా ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది.

కానీ వాస్తవం ఏమిటంటే గాజా కేవలం 40 కి.మీ పొడవు, 10 కి.మీ వెడల్పు ఉన్న చిన్న భూభాగం. ఈ భూభాగంలో 17 లక్షల మంది నివసిస్తున్నారు. ప్రత్యేకంగా యుద్ధ క్షేత్రాలను నిర్మించుకునే వసతి గాజాలో లేదు. గాజా ప్రజలు ఏమి చేసినా ఆ పరిమిత భూభాగంలోనే జరుపుకోవాలి. ప్రభుత్వ భవనాలు, జనవాసాలు, మిలట్రీ బ్యారక్స్ అంటూ వేరువేరుగా నిర్మించుకునే వసతి అక్కడ లేదు.

అంతే కాకుండా ప్రపంచం మొత్తం గుర్తించిన వాస్తవం మరొకటి ఉంది. నిజానికి గాజాపై ఇజ్రాయెల్ తరచుగా చేసే విశృంఖల దాడులకు అదే అసలు కారణం. గాజా ప్రజలను ఎంత గట్టిగా, ఎంత సూటిగా, ఎంత భారీ నొప్పి కలిగేంతగా బాధిస్తే వారు అంత కుక్కిన పేనుల్లా పడి ఉంటారని ఇజ్రాయెల్ భావిస్తుంది. ఇలాంటి అమానవీయ, పెర్వర్షన్ తో కూడిన మిలట్రీ ఎత్తుగడలను ఐ.డి.ఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) అధికారులు, రాజకీయ నేతలు వ్యక్తం చేసిన ఘటనలు గతంలో అనేకం ఉన్నాయి.

ఇంతకు మించిన ఉగ్రవాదం మరొకటి ఉంటుందా? అసలు టెర్రరిస్టులు హమాస్ కాదు, ఇజ్రాయెల్ రాజ్యం. ఒక జాతి మొత్తాన్ని నిర్మూలించడానికి కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ రాజ్యం కేవలం గూండాయిజంతోనే అది సాధిస్తోంది. ప్రపంచ దేశాలతో, ముఖ్యంగా అరబ్ రాజ్యాలతో సంబంధాలను అది గూండాయిజంతోనే సాగిస్తుంది.

ఇంత విధ్వంసం సాగిస్తూ, మానవ ప్రపంచం ఊహించలేని అమానవీయ యుద్ధ నేరాలకు పాల్పడుతూ కూడా తాను చెప్పేదే నమ్మాలని ఇజ్రాయెల్ ఇతర దేశాలను డిమాండ్ చేస్తుంది.

పాలస్తీనా అణచివేతను గుర్తించి సంఘీభావం పలకడం భారతదేశం మొదటినుండి ఒక విధానంగా అవలంబిస్తోంది. ఈ పరిస్ధితి ఎన్.డి.ఏ -1 ప్రభుత్వం నుండి మారిపోయింది. ఆ తర్వాత యు.పి.ఏ 1, 2 కూడా అదే విధానాన్ని కొనసాగించాయి. ఇజ్రాయెల్ దాష్టీకాన్ని ఖండించడం మాని మన ప్రభుత్వం ఇరు పక్షాలకు శాంతి బోధలు చేసి గమ్మున ఉండిపోయింది. అదేమని అడిగితే ఇరు దేశాలతోనూ సత్సంబంధాలు ఇండియాకు ఉన్నాయని ఒకరిని విమర్శించి మరొకరిని దూరం చేసుకోలేమని విదేశీ మంత్రి సుష్మా పార్లమెంటుకు చెప్పారు. విదేశీ శాఖ కార్యదర్శి కూడా ఇదే వల్లించారు. ఈ వైఖరిని విడనాడి ఇజ్రాయెల్ దాడులను ఖండించాలని ప్రతిపక్షాలు కోరినా ప్రభుత్వం ససేమిరా అంటోంది.

శీర్షికలో చెప్పినట్లుగా కాస్త గుండె నిబ్బరం ఉంటేనే కింది ఫోటోలు చూడండి. ‘గ్లోబల్ పోస్ట్’ ప్రచురించిన ఫొటోల్లో కొన్ని ఇంకా ఘోరంగా ఉన్నాయి. అవి ప్రచురించడానికి నాకే ధైర్యం చాలక కాస్త ఫర్వాలేదు అనుకున్నవి ప్రచురిస్తున్నాను.

2 thoughts on “ఇజ్రాయెల్ దౌష్ట్యం: రాతి గుండెలైతేనే ఈ ఫోటోలు చూడండి!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s