పశ్చిమాసియాలో అంతులేని ఘర్షణ -ది హిందూ సంపాదకీయం


GAZA attacks

పాలస్టీనియన్ హమాస్ రాకెట్ దాడుల అనంతరం, ఇజ్రాయెల్ నిరవధిక వాయుదాడులు ప్రారంభించిన దరిమిలా గాజాలో మృత్యువు మళ్ళీ విలయతాండవం చేస్తోంది. హమాస్ దాడులకు ప్రతిస్పందనగా (ఇజ్రాయెల్) సాగిస్తున్న బలప్రయోగం పూర్తిగా విషమానుపాతం (disproportionate) ఉన్న సంగతి (మరణాల) సంఖ్యలోనే స్పష్టం అవుతోంది. హమాస్, 500 పైగా రాకెట్ దాడులు చేసినప్పటికీ ఇజ్రాయెల్ లో ఒక్క మరణమూ సంభవించలేదు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఇజ్రాయెల్ దాడుల్లో 165 మంది (తాజా సంఖ్య 200 పైనే) పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. పౌరుల మరణాలు తీవ్రంగా పెరగడం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. పోరాటంలో లేని పౌరుల మరణాలను ఇజ్రాయెల్ అనుబంధ నష్టం (collateral damage)గాను, పాలస్తీనా ఉగ్రవాద స్ధావరాలపై కేంద్రీకరించి చేస్తున్న దాడుల వల్ల సంభవిస్తున్న అనుద్దేశ్యపూర్వక పరిణామాలుగానూ అభివర్ణిస్తుండగా, అనేకమంది ఇజ్రాయెలీ వ్యాఖ్యాతలు ఇజ్రాయెల్ అధికారిక వివరణను ముక్తకంఠంతో తిరస్కరిస్తున్నారు.

ఇజ్రాయెలి దినపత్రిక హారెట్జ్ లో విశ్లేషణ రాస్తూ గిడియోన్ లెవీ పౌరులను ఉద్దేశ్యపూర్వకంగానే టార్గెట్ చేస్తుండవచ్చని తెలిపారు. (పాలస్తీనా) సమాజానికి గరిష్ట స్ధాయి నెప్పిని అనుభవంలోకి తేవడం ద్వారా ప్రశాంతత చేకూర్చవచ్చన్న అత్యంత ముష్కరమైన మిలట్రీ తర్కం ఫలితమే పౌరుల మరణాలని తెలిపారాయన. పౌరుల ఆవాసాల మధ్య రాకెట్ ప్రయోగ స్ధావరాలను ఉంచడం ద్వారా పౌరులపై దాడులు జరిగేలా చూడడం హమాస్ ఒక ఎత్తుగడగా అనుసరిస్తోందని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎత్తి చూపవచ్చు. హమాస్ అనుసరించే కొన్ని యుద్ధ ఎత్తుగడలు ఎంతగా ఖండనీయం అయినప్పటికీ, అత్యధిక జనసాంద్రతతో కిటకిట లాడుతూ ఇరుకైన వాతావరణం కలిగిన గాజా స్ట్రిప్ లో పాలస్టీనియన్ మిలిటెంట్లకు వాస్తవంగా జనంలో ఉంటూ పోరాడడం తప్ప మరో అవకాశం లేదన్నది వాస్తవం.

గాజాలో ఆవిష్కృతం అవుతున్న ట్రాజెడీ పట్ల ఐరాస స్పందన ధైర్యం ఇచ్చేదిగా ఉన్నది. పిల్లలతో సహా పౌరుల మరణాలు సంభవిస్తున్నట్లు వస్తున్న నివేదికలు మనసును తీవ్రంగా కాలిచివేస్తున్నాయని ఐరాస మానవ హక్కుల హై కమిషనర్ నవీ పిళ్లై ప్రకటించారు. ఆమె ఇలా అన్నారు: “ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయ మానవతా చట్టం మరియు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు అనుగుణంగానే జరుగుతున్నాయా అన్న అనుమానాలను ఇటు వంటి నివేదికల ద్వారా కలుగుతోంది.” దీనికి పూర్తి విరుద్ధంగా గాజా సంక్షోభం పట్ల భారత ప్రభుత్వం నుండి స్పందనే కరువయింది. ఇజ్రాయేలీయులు మరియు పాలస్తీనీయుల మధ్య సమానదూరం పాటించాలన్న ఇటీవల కాలపు అనిశ్చిత వైఖరికి తగినట్లుగానే ఈ స్పందన ఉన్నది.

పాలస్తీనా సమస్య పట్ల స్పష్టమైన, నైతిక వైఖరిని కలిగి ఉండడాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే ఎగవేసే ధోరణి, ఐరాస భద్రతా సమితి శాశ్వత సభ్యత్వం లాంటి ప్రపంచ స్ధాయి ఆకాంక్షలు కలిగి ఉన్న దేశానికి ఏ విధంగానూ ఉపయోగపడదు. అపరిష్కృత ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య పరిష్కారంలోనే ఇండియాకు ప్రయోజనాలు ఉన్నాయని (అంతర్జాతీయ) వ్యవహార జ్ఞానం ఉన్నవారు గుర్తిస్తారు. పశ్చిమాసియాలో అస్ధిరతకు ఇదే కీలక కారణం. ఇండియా ఆర్ధిక వ్యవస్ధకూ, ఇంధన బధ్రతకు అత్యంత ప్రాముఖ్యమైనది పశ్చిమాసియా. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యలో మరింత మెరుగైన, సరైన వైఖరిని చేబడితే ఇజ్రాయెల్ నుండి ప్రతిఘటన ఎదురవుతుందని దానివల్ల జాతీయ భద్రతకు నష్టం చేకూరుతుందని భావిస్తే అది ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పడం అవుతుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా న్యూ ఢిల్లీ, టెల్ అవీవ్ (ఇజ్రాయెల్ రాజధాని) లు పరస్పరం ఆధారపడిఉన్న సంబంధాలను అభివృద్ధి చేసుకున్నాయి.

(ఐరాస ప్రకటన ధైర్యం ఇచ్చేదిగా ఉందన్న పరిశీలనతో నాకు ఏకీభావం లేదు. నిజానికి పాలస్తీనా విషయంలో ఐరాస ప్రధానంగా అమెరికా పనిముట్టుగానే పని చేస్తోంది. ఇదే తరహా దురహంకార యుద్ధాన్ని 2007 డిసెంబర్ లో ఇజ్రాయెల్ సాగించినప్పుడు 1400 మందికి పైగా పౌరులు చనిపోగా రిచర్డ్ గోల్డ్ స్టోన్ చేత ఐరాస విచారణ జరిపించింది. ఆయన చేసిన సిఫారసులను ఇంతవరకు ఐరాస పట్టించుకోలేదు. గాజా సహాయార్ధం వచ్చిన అంతర్జాతీయ నౌకల వరుసపై ఇజ్రాయెల్ సైన్యం ముష్కర దాడి చేసి 11 మందిని చంపేసిన ఘటన విషయంలోనూ నిర్ణయాలు గానీ చర్యలు గానీ లేవు. ఇజ్రాయెల్ కు అమెరికా అండదండలు పుష్కలంగా ఉండడంతో ఇజ్రాయెల్ దాష్టీకం నిరాటంకంగా కొనసాగుతోంది. ఐరాస అమెరికా మాట జవదాటదు. ఈ పరిధితుల్లో ఐరాస చేసే ప్రకటనలు కేవలం నామమాత్రమే. ఆ ప్రకటనల వల్ల వాస్తవంగా ఎటువంటి ఫలితమూ ఉండదు. ధైర్యం కలగడం అన్నది ఒట్టిమాట. ది హిందూ పత్రికకు ఏమన్నా ధైర్యం కలిగిందేమో గానీ పాలస్తీనా ప్రజలకైతే ఏ ప్రయోజనమూ కలగదు. -విశేఖర్)

4 thoughts on “పశ్చిమాసియాలో అంతులేని ఘర్షణ -ది హిందూ సంపాదకీయం

 1. Mugguru israel yuvakulani (students ) Hamas athyantha darunangaa champesindani vinnaanu.
  Daniki pratheekaaranga ee dadulu ani chadivaanu.
  kalpula viramanani Hamas oppukoledani chadivaanu.
  nijamena ?

 2. ముగ్గురు ఇజ్రాయెలీ యువకుల్ని చంపింది హమాస్ కాదు, ఇసిస్/ఇసిల్ అనుబంధ జిహాది సంస్ధ. దాడి చేస్తున్నది ఇజ్రాయెల్. హమాస్ కేవలం బదులు మాత్రమే ఇస్తోంది. కాబట్టి కాల్పుల విరమణని హమాస్ అంగీకరించకుండా పోయే సమస్య ఉండదు. ఈ ఘర్షణ వల్ల హమాస్ కి ప్రయోజనం లేదు.

  ఈ బ్లాగ్ లో కొద్ది రోజుల క్రితం వివరించినట్లుగా ఇసిస్ అన్నది అమెరికా-ఇజ్రాయెల్-ఐరోపా రాజ్యాల పనిముట్టు. ఇజ్రాయేలీయులను చంపడం ద్వారా గాజాపై దాడికి అవసరమైన కారణాన్ని ఇసిస్ తయారుచేసి పెట్టింది. పెరుగుతున్న హమాస్ పలుకుబడి ఇజ్రాయెల్ కు కంటగింపు అయింది. పైన సంపాదకీయంలో సూచించినట్లు హమాస్ ని ఆదరించవద్దని పాలస్తీనా ప్రజల్ని హెచ్చరించడానికి ఇజ్రాయెల్ తాజా దాడులకు తెరతీసింది.

 3. హమాస్ దాడులకు ప్రతిస్పందనగా (ఇజ్రాయెల్) సాగిస్తున్న బలప్రయోగం పూర్తిగా విషమానుపాతం (దిస్ప్రొపొర్తిఒనతె) ఉన్న సంగతి (మరణాల) సంఖ్యలోనే స్పష్టం అవుతోంది.
  సర్,నాదో చిన్నవిన్నపం “విషమానుపాతం” పదప్రయోగం కన్నా విలోమానుపాతం పదప్రయోగం(గణిత శాస్త్రం పదజాలం-ఎందుకంటే ఆ పదం సంఖ్యలకు సంభంధించిన విషయలో ప్రయోగించడం జరిగింది కాబట్టి) సందర్భానిసారమేమో!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s