ఇజ్రాయెలీల హత్యలకు బాధ్యులు హమాస్ కాదు ఇసిస్!


Israel missile from Irone Dome

Israel missile from Iron Dome

గాజా మరోసారి ఇజ్రాయెల్ జాత్యహంకార ముట్టడికి గురవుతోంది. ముగ్గురు ఇజ్రాయెలీ యువకుల కిడ్నాప్ మరియు హత్యలను సాకుగా చూపుతూ గాజా పౌర నివాసాలపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ లతో విరుచుకుపడుతోంది. ఫలితంగా 200కు పైగా గాజా పౌరులు దుర్మరణం చెందగా ఉనికిలో ఉన్న కాసిన్ని ఇళ్ళు కూడా నేలమట్టం అవుతున్నాయి. ఇజ్రాయెల్ ఏకపక్ష దాడిని హమాస్ రాకెట్ దాడికి ప్రతీకారంగా ముద్ర వేయడంలో పశ్చిమ పత్రికలు శ్రమిస్తున్నాయి. కాగా శాంతి ప్రవచనాలు వల్లించడం వరకే ఐరాస పరిమితం అయింది.

జూన్ 12 తేదీన ఆక్రమిత పాలస్తీనాలో అక్రమ సెటిల్మెంట్లలో నివశిస్తున్న ముగ్గురు ఇజ్రాయెలి యువకులు కనపడకుండా పోయారు. వారిని వెతికే పేరుతో ఇజ్రాయెల్ సైన్యం గాజా పౌరుల ఇళ్లను తనిఖీ చేస్తూ భయభ్రాంతులకు గురి చేసింది. కిడ్నాప్ అయిన యువకులు వారు అదృశ్యం అయిన చోటుకు సమీపంలోనే శవాలై కనిపించడంతో ఇజ్రాయెల్ ప్రధాని ప్రతీకారం తీర్చుకుంటామని శపధం చేశాడు. దాడికి హామస్ మిలిటెంట్లే బాధ్యులని ఏకపక్షంగా ప్రకటించి రక్తానికి రక్తం బదులు తీర్చుకుంటామని ప్రకటించాడు.

యువకుల కిడ్నాప్ హత్యలతో తమకు సంబంధం లేదని హమాస్ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ పట్టించుకోలేదు. మూడు వారాలుగా గాజాపై బాంబుల వర్షం కురిపిస్తూ పౌరుల ఆవాసాలను నేలమట్టం చేయడం ప్రారంభించాడు. పదుల సంఖ్యలో పౌరులు మరణిస్తున్నప్పటికీ లెక్క చేయలేదు. కాల్పుల విరమణ పాటించాలని, పౌరులను బలి తీసుకోవద్దని అమెరికా, ఐరోపా రాజ్యాలు ఇజ్రాయెల్ కు విన్నవిస్తూ బూటకపు ప్రకటనలు విడుదల చేశారు. పశ్చిమ దేశాధినేతలు మొసలి కన్నీరు కార్చారే గానీ ఇజ్రాయెల్ ని కట్టడి చేయడానికి వీసమెత్తు కూడా కదల్లేదు. ఆచరణాత్మక చర్యలు తీసుకునేందుకు ఎటువంటి ఆసక్తి చూపలేదు.

యూదు యువకులను కిడ్నాప్ చేసి, హత్య చేయవలసిన అవసరం హమాస్ కి ఇప్పటి పరిస్ధితుల్లో ఎంత మాత్రం లేదు. యూదు సైనికులను పట్టుకుని అక్రమంగా ఖైదు చేసిన పాలస్తీనా పౌరులను విడిపించుకోవడానికి గతంలో హమాస్ ప్రయత్నించింది గానీ (కొన్ని సార్లు సఫలం అయింది కూడా) ఈ విధంగా పౌరులను కిడ్నాప్ చేసి హత్య చేసిన చరిత్ర లేదు.

పైగా ఇటీవలి కాలంలో హమాస్ ప్రతిష్ట, పలుకుబడి ఉచ్ఛదశలోనే ఉన్నాయి. పాలస్తీనా ఆధారిటీ పేరుతో ప్రభుత్వం నడుపుతున్న ఫతా సంస్ధతో స్నేహ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఉప్పు, నిప్పు గా ఉన్న హమాస్, ఫతా ల మధ్య శాంతియుత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఫతా, హమాస్ సంస్ధలే కాకుండా పాలస్తీనా కూడా గతంలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ స్ధాయి మద్దతును సంపాదించింది.

ఉదాహరణకి పాలస్తీనాకు పరిశీలక సభ్య దేశంగా గుర్తింపు ఇస్తూ ఐరాస జనరల్ అసెంబ్లీ కొద్ది నెలల క్రితం తీర్మానం చేసింది. (చూడండి: అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులను చీత్కరిస్తూ పాలస్తీనాకు ఐరాసలో స్ధానం -1 మరియు 2) ఇజ్రాయెల్ తో వ్యాపారం చేస్తున్న కంపెనీలతో వ్యాపారం చేయొద్దన్న ప్రచారోద్యమానికి విస్తృత మద్దతు సమకూరుతోంది. ఇన్నాళ్ళూ ఘర్షణ పడిన హమాస్, ఫతాలు సంధి చేసుకుని యూనిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా పాలస్తీనా ప్రజలకు అంతులేని ఉపశమనం కల్పించాయి.

ఇటువంటి పరిస్ధితుల్లో కోరి దాడులను కొని తెచ్చుకునే పనికి హమాస్ దిగడం సామాన్య తర్కానికి కూడా అందని విషయం. శాంతియుత పద్ధతుల ద్వారా ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా విస్తృత మద్దతు సంపాదిస్తున్న పరిస్ధితులను దూరం చేసుకోవడం, ప్రపంచ దేశాల వ్యతిరేకతను కొని తెచ్చుకోవడం మూర్ఖులు తప్ప ఎవరూ చేయరు. ఒకవేళ హమాస్ కార్యకర్తలే ఈ హత్యలకు పాల్పడినట్లయితే అది ఖచ్చితంగా హమాస్ నాయకులకు తెలియకుండా జరిగి ఉండాలని అనేకమంది మధ్య ప్రాచ్య రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు కూడా.

యూదు పత్రిక డెయిలీ ఫార్వర్డ్ ప్రకారం హమాస్ పై తీవ్ర స్ధాయిలో దాడి చేయాలని తమకు ఆదేశాలు అందాయని ఇజ్రాయెల్ మిలట్రీ అధికారి బ్రిగేడియర్ జనరల్ మోటి అల్మోజ్ ఒక ఆర్మీ రేడియాలో మాట్లాడుతూ వెల్లడి చేశాడు. సాధారణంగా పౌరులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్న దాడిలో ఉన్నపుడు ఏ ప్రభుత్వమూ ఇంత బహిరంగంగా తమ అంతర్గత సంభాషణలను వెల్లడి చేయరు. “అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం” అనో, లేదా “ఇజ్రాయెల్ ప్రభుత్వం తన పౌరుల భద్రతను ఎట్టి పరిస్ధితుల్లోనూ కాపాడుతుంది” అనో చెబుతారు తప్ప “పౌరుల్ని చంపమని మా ప్రభుత్వమే ఆదేశాలిచ్చింది అని ఏ మిలట్రీ అధికారీ చెప్పడు.

ఎవరు చంపారు?

ఇజ్రాయెల్ పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్” ప్రకారం ఇజ్రాయెలీ యువకుల హత్యకు తామే బాధ్యులమని ఓ కొత్త జిహాది సంస్ధ ప్రకటించింది. ఆ సంస్ధ పేరు “ఇస్లామిక్ స్టేట్ ఇన్ బైత్ ఆల్-మక్దిస్ (జెరూసలేం ముస్లిం నామం). ఇరాక్ లో మెరుపు వేగంతో పురోగమిస్తోందంటూ పశ్చిమ పత్రికలు వార్తలు గుప్పిస్తున్న ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS) కు ఈ సంస్ధ తన విధేయతను ప్రకటించింది. ఇరాక్, సిరియాలలో తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను కాలిఫేట్ (పవిత్ర ముస్లింల రాజ్యం) గా ప్రకటించుకున్న ఇసిస్ అధినేత అబు బకర్ ఆల్-బఘ్దాది కి గౌరవ సూచనగా తాము ఇజాయెలీ యువకులను కిడ్నాప్ చేసి హత్య చేశామని ఈ సంస్ధ తన ప్రకటనలో పేర్కొంది.

ఇరాక్, సిరియాలను అమెరికా, పశ్చిమ రాజ్యాలకు లొంగి ఉండే మూడు సెక్టేరియన్ రాజ్యాలుగా (సున్నీ కాలిఫేట్, షియా ఇరాక్, సున్నీ కుర్దిస్తాన్) విడగొట్టే పధకాన్ని అమలులోకి తెచ్చేందుకు పనిముట్టుగా ఇసిస్ ఉపయోగపడుతోంది. అదే తరహాలో పాలస్తీనాను మధ్య యుగాల్లోకి తీసుకెళ్ళే దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ కు కావలసిన కారణాలను ఇసిస్ సృష్టించి పెట్టింది. తద్వారా మధ్య ప్రాచ్యంలో అమెరికా, పశ్చిమ రాజ్యాలు పన్నిన వ్యూహాలను ఇసిస్ అమలు చేస్తోంది. తాజా ఇజ్రాయెల్ దాడులు సైతం అందులో భాగమే. అందుకే ఇజ్రాయెల్ ఎంత ఘోరంగా, అనైతికంగా దాడులు చేస్తున్నా అమెరికా, ఐరోపా రాజ్యాలు పల్లెత్తు మాట అనవు.

పాలస్తీనాను మధ్య యుగాల్లోకి నెట్టివేయడమే లక్ష్యంగా దాడులు చేయాలని 2012 నాటి గాజా యుద్ధంలోనే వివిధ ఇజ్రాయెల్ నాయకులు ప్రకటనలు విడుదల చేశారు. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఏరియల్ షరాన్ కుమారుడు గిలాద్ షరాన్ అయితే గాజాను నేలమట్టం చేయాలని జెరూసలేం పోస్ట్ పత్రికలో ఆర్టికల్ రాశాడు. “గాజా మొత్తాన్ని నేలమట్టం చేయాల్సిన అవసరం ఉంది. అమెరికన్లు హీరోషిమా పై దాడితోనే ఊరుకున్నారా, లేదు -జపనీయులు అనుకున్నంత త్వరగా లొంగిరావడం లేదు. అందువల్ల నాగసాకి పైన కూడా వాళ్ళు (అణు బాంబు) దాడి చేశారు. గాజాలో విద్యుత్ అనేదే ఉండకూడదు. గ్యాస్ ఉండకూడదు. అసలు ఎటువంటి వాహనమూ అక్కడ రోడ్లపై తిరగకూడదు” అని గిలాద్ షరాన్ రాయడం బట్టి ఇజ్రాయెల్ పాలకులు ఎంత కరుడుగట్టిన జాత్యంహంకారులో తేటతెల్లం అవుతుంది.

ఇటువంటి జాత్యహంకార ప్రభుత్వం కనుకనే 200 మందికి పైగా పౌరులు మరణించినా వీసమెత్తు విచారం కూడా ప్రకటించడానికి సిద్ధంగా లేదు. జెనీవా సదస్సు ఆమోదించిన అంతర్జాతీయ చట్టాల ప్రకారం విచక్షణారహితంగా బలప్రయోగం చేయడం చట్ట విరుద్ధం. అలాగే కొద్ది మంది చర్యలకు (ఒకవేళ హామాస్ మిలిటెంట్లే నిజంగా ఇజ్రాయెలీ యువకుల్ని చంపారని వాదనకు అంగీకరిస్తే) ఉమ్మడిగా ప్రతీకారం/శిక్ష అమలు చేయడం కూడా చట్ట విరుద్ధం. పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, వారిని చంపడం జెనీవా సదస్సు తీర్మానాలకు, మానవ హక్కుల చట్టాలకు కూడా విరుద్ధమే. కాబట్టి ఇజ్రాయెల్ అంతర్జాతీయ యుద్ధ నేరాలకు పాల్పడుతోంది. యుద్ధ నేరాలకు పాల్పడడం ఇజ్రాయెల్ కి ఇది కొత్త కాదు. ఇజ్రాయెల్ చరిత్ర అంతా తన పెద్దన్న అమెరికా వలెనే యుద్ధ నేరాల మరకలతో నిండిపోయి ఉంటుంది.

అంతర్జాతీయ సమాజం ఎప్పటి వలెనే గాజన్లను వారి ఖర్మానికి వదిలివేసింది. ది హిందూ సంపాదకీయం పేర్కొన్నట్లు భారత ప్రభుత్వం నుండి స్పందన కరువవడం అత్యంత ఘోరం. భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం కాంక్షిస్తున్న దేశానికి ఇటువంటి స్పందనా రాహిత్యం తగని పని!

One thought on “ఇజ్రాయెలీల హత్యలకు బాధ్యులు హమాస్ కాదు ఇసిస్!

  1. పాలస్థీనాలో పరస్పరం తలపడే హమాస్, ఫతా సంస్థలు రెండూ ఒక ఒప్పందాని కొచ్చి, వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుగమం అవ్వబోతున్న సూచనలు కనిపిస్తున్న ఈ సంధర్బంలో; సమరశీలంగా ఉండే హమాస్ సంస్థ వాస్తవానికి ఇటీవలికాలంలో తన మిలిటెంటు స్వభా వాన్ని వదులుకుంటున్న దశలో-పాలస్తినాను అంతర్గతంగా అస్తిరపరచి;హమాస్,ఫతా సంస్తల ఒప్పందాన్ని చెడగొట్టే సూచనలు కనిపిస్తున్నాయి! ఈ దశలో పాలస్థినాలో వివిద గ్రూపులు తమ ఐక్యతను ఏవిధముగా చాటుకొంటాయో చూదాల్సిందే!!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s