ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ పై కేంద్రం మరో 579 మిలియన్ డాలర్ల (సుమారు రు. 3.5 వేల కోట్లకు సమానం) జరిమానా విధిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ చమురు సహజవాయువు మంత్రి ధరేంద్ర ప్రధాన్ ఈ సంగతి తెలిపారు. 2013-14 సంవత్సరంలో కాంట్రాక్టు మేరకు సహజవాయువు ఉత్పత్తి చేయనందుకు గాను ఈ జరిమానా విధించామని చెప్పారు. దీనితో రిలయన్స్ కంపెనీపై విధించామని కేంద్రం చెప్పిన జరిమానా మొత్తం గత 4 సం.లకు గాను 2.376 బిలియన్ డాలర్లకు (సుమారు 14.25 వేల కోట్లకు సమానం) చేరుకుంది.
కృష్ణా-గోదావరి బేసిన్ లో రిలయన్స్, బ్రిటిష్ పెట్రోలియం (బి.పి), నికో రిసోర్సెస్ కంపెనీలు ఉమ్మడిగా చమురు, సహజవాయువులను వెలికి తీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఈ మూడు కంపెనీలకు మధ్య కుదిరిన ఉత్పత్తి పంపిణీ ఒప్పందం (Production Sharing Contract -PSC) ప్రకారం KG-D6 బ్లాగ్ లోని ధీరూభాయ్-1, 3 సహజవాయు క్షేత్రాల నుండి రోజుకు 80 మిలియన్ ఘనపు మీటర్ల (million standard cubic meters per day –mmscmd సహజవాయువును కంపెనీలు ఉత్పత్తి చేయవలసి ఉంది.
అయితే ఏప్రిల్ 1, 2010 తో మొదలయిన నాలుగు సంవత్సరాల నుండి గ్యాస్ ఉత్పత్తి అమాంతం పడిపోయింది. 2011-12లో రోజుకు 35.33 మిలియన్ ఘ.మీ కు తగ్గిపోయింది. 2012-13 సం.లో రోజుకు ఉత్పత్తి ఇంకా తగ్గిపోయి 20,88 మిలియన్ ఘ.మీ కు చేరుకుంది. 2013-14లో మరింత తగ్గిపోయి రోజుకు 9.77 మిలియన్ ఘ.మీ మాత్రమే గ్యాస్ ను కంపెనీలు ఉత్పత్తి చేశాయి. ఈ సంవత్సరం అయితే రోజు ఉత్పత్తి 8.05 మిలియన్ ఘనపు మీటర్లు మాత్రమే గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. దీని ఫలితంగా గ్యాస్ ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే పలు పరిశ్రమలు పూర్తిగా మూతపడడమో, పాక్షికంగా కార్యకలాపాలు నిర్వహించడమో జరుగుతోంది.
పి.ఎస్.సి ప్రకారం ఉత్పత్తిని తగ్గిస్తే ఆ మేరకు కంపెనీలు చూపిన ఉత్పత్తి వ్యయంలో తగిన భాగాన్ని చెల్లించకుండా ప్రభుత్వం నిలిపివేయాలి. ఉత్పత్తి చేసిన సహజవాయువును ప్రభుత్వ సంస్ధ గెయిల్, చెన్నై పెట్రోలియం కంపెనీలు కొనుగోలు చేసి సరఫరా, పంపిణీ చేస్తాయి. సదరు అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం నుండి పూర్తి వ్యయాన్ని కంపెనీలు వసూలు చేసుకుంటాయి. దానితో పాటు లాభాలను కూడా పంచుకుంటాయి. పి.ఎస్.సి ప్రకారం ఉత్పత్తి తగ్గించడం వల్ల జరిగిన నష్టాన్ని వ్యయం వసూలు నుండి మినహాయించడం ద్వారా జరిమానా విధించాలి.
ఈ విధంగా ఉత్పత్తి తగ్గుదల వలన 2010-11లో $457 మిలియన్లు, 2011-12లో $548 మిలియన్లు, 2012-13లో $792 మిలియన్లు వ్యయం వసూలు నుండి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత సంవత్సరానికి (2013-14) కు గాను ఈ మొత్తం $579 మిలియన్లు అని చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్ సభలో ఈ రోజు తెలిపారు. దీనితో కలుపుకుని రిలయన్స్, బి.పి, నీకో కంపెనీల వ్యయంలో ఇప్పటివరకు $2.376 మిలియన్లు చెల్లించకుండా మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లయింది. ఈ మొత్తం పైన ప్రభుత్వ వాటాగా వచ్చే లాభం నాలుగు సంవత్సరాలు కలుపుకుని $195 మిలియన్లు పెరగవలసి ఉంది.
వ్యయం మినహాయింపు, లాభం పెరుగుదల వాస్తవంగా అమలు చేశారా లేదా అన్నది తెలియదు. ప్రభుత్వ వాదనను సవాలు చేస్తూ కంపెనీలు ఆర్బిట్రేషన్ కు నోటీసులు ఇచ్చాయి. అనగా ఇరు పక్షాల ప్రతినిధులు బేరసారాలు జరిపి ఒక అంతిమ నిర్ణయానికి వస్తాయి. అంతిమ నిర్ణయం ప్రకారం జరిమానా, లాభాల సంగతి నిర్ణయిస్తారు. అయితే, వాస్తవానికి ఇలాంటి వివాదాలకు పరిష్కారం ఏమిటో కాంట్రాక్టు ఒప్పందం లోనే నిర్ణయించారు. ఉత్పత్తి తగ్గుదల మేరకు వ్యయాన్ని మినహాయించడం, ఆ మేరకు ప్రభుత్వ లాభం పెరగడమే ఆ పరిష్కారం. ఈ పరిష్కారానికి ఒప్పుకోకపోవడం కాంట్రాక్టు ఉల్లంఘనే. కంపెనీలకు సకల సౌకర్యాలు వడ్డించే వాళ్ళే ప్రభుత్వంలో ఉండడంతో నాలుగేళ్ల పాటు ఉత్పత్తి తగ్గిస్తున్నా రిలయన్స్ ఆటలు సాగిపోతున్నాయి.
ఉత్పత్తి తగ్గుదల మేరకు ప్రభుత్వానికి లాభం ఇంకా అందలేదని ప్రధాన్ మాటల ద్వారా అర్ధం అవుతోంది. “KG-D6 బ్లాక్ లో ఉత్పత్తి అయ్యే సహజవాయువును కొనుగోలు చేసే కంపెనీలు గెయిల్, చెన్నై పెట్రోలియం లను KG-DWN-98/3 (KG-D6) బ్లాక్ లోని క్రూడ్ ఆయిల్/కండెన్సేట్/సహజవాయువు అమ్మకాలను తక్షణం ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ఆదేశాలు ఇచ్చాము. అమ్మకాల్లో కనీసం 50 శాతం జమ చేయాలని కోరాము” అని ప్రధాన్ లోక్ సభలో చెప్పారు. అనగా ఉత్పత్తి తగ్గుదల మేరకు ప్రభుత్వానికి అందవలసిన లాభ వాటా ఇంకా అందవలసి ఉంది.
రిలయన్స్ కంపెనీ 80 mmscmd ల గ్యాస్ ఉత్పత్తికి సరిపడా నిర్మాణ సౌకర్యాలను నెలకొల్పినప్పటికీ ఫీల్డ్ డెవలప్ మెంట్ ప్లాన్ కు కట్టుబడి ఉత్పత్తి తీయడంలో విఫలం అయిందని మంత్రి చెప్పారు. డ్రిల్లింగ్ చేయడం, ఉత్పత్తిని ప్రవాహంలోకి పంపడం, తగినన్ని బావులను ఆపరేట్ చేయడం లాంటి కార్యకాలాపాలకు కంపెనీ దిగకపోవడంతో ఉత్పత్తి తగ్గిపోయిందని ప్రభుత్వం తెలిపింది.
చమురు మంత్రిత్వ శాఖ, దాని ఆధీనంలో ఉండే డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రో కార్బన్స్ కార్యాలయం వాళ్ళు చెప్పేదాని ప్రకారం బావులు తవ్వినప్పటికీ వాటి నుండి డ్రిల్లింగ్ చేయకపోవడం వలన ఉత్పత్తి పడిపోయింది. రిలయన్స్ కంపెనీ యేమో భూగర్భ సంబంధిత ఆటంకాలు ఎదురయినందున ఉత్పత్తి తగ్గిపోయిందని చెబుతోంది. కానీ రిలయన్స్ వాదనలో నిజాలు లేవని, కావాలనే ఉత్పత్తి తగ్గించి తద్వారా పెంచిన ధరల నుండి మరింత లాభం సంపాదించడానికి చూస్తోందని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. ఈ వాదనల్లో ఏది వాస్తవమో, యు.పి.ఏ, ఎన్.డి.ఏ లాంటి కంపెనీ అనుకూల ప్రభుత్వాలు ఉన్నంతవరకూ ప్రజలకు తెలిసే అవకాశం లేదు.