మనకిక్కడ ఒకప్పుడు ముఖ్యమంత్రి – ఆత్మ బంధువు జంట ఒకటి ఉండేది. ఒకరి హఠాన్మరణం వలన ఆ రెండో పెద్దాయన కూడా హఠాత్తుగా ఒంటరి అయ్యారు. (తెలంగాణ ఆందోళన పుణ్యామని ఆ తర్వాత కూడా ఆయన కింగ్ మేకర్ గా కొనసాగారని కొన్ని పత్రికలు చెవులు కొరుకుతాయి.)
గుజరాత్ లో కూడా ముఖ్యమంత్రి – ఆత్మ బంధువు జంట ఒకటి ఉండేది. ఈ జంటకి ప్రమోషన్ వచ్చి రాష్ట్ర స్ధాయి నుండి కేంద్ర స్ధాయికి ఎగబాకింది. వారు పరస్పరం ఒకరికొకరు అన్నట్లుగా వ్యవహరించి ఉన్నత స్ధానాలకు ఎగబాకారని ఈ కార్టూన్ సూచిస్తోంది.
బి.జె.పి అధికార ప్రస్ధానంలో అమిత్ షా పన్నిన ఎత్తుగడలు అనన్య సామాన్యం అని పొగడని పత్రిక లేదంటే అతిశయోక్తి కాదు. బి.జె.పి వరకి చూసుకుంటే అది నిజం కూడా. ఏమిటి ఆయన వేసిన ఎత్తుగడలు? చాలా సింపుల్. గుజరాత్ లో అనుసరించిన ఎత్తుగడలనే అవసరమైన చోట అనుసరించి అనుకున్నది సాధించారని ఫ్రంట్ లైన్ లాంటి పత్రికలు ససాక్ష్యంగా వివరించాయి.
ఉత్తర ప్రదేశ్ లో ముజఫర్ నగర్ మత అల్లర్లు అక్కడి రాజకీయ విధేయతలను తిరగబడేలా చేశాయి. జాట్-ముస్లింల ఐక్యత ఘోరంగా దెబ్బతిని కాంగ్రెస్, అజిత్ సింగ్ పార్టీలు మట్టిగొట్టుకునిపోగా బి.జె.పి కి సరికొత్త ఓటు బ్యాంకు సమకూరి జాక్ పాట్ ని అందించాయి. బహుముఖ పోటీలో చీలిన ఓట్లు ఆ పార్టీకి అదనపు లాభాన్ని అందించాయి.
బీహార్ లోనూ అంతే. బోధ్ గయలో బాంబు పేలుళ్లు, మోడి ప్రసంగించిన సభలో పేలిన బాంబులు ఆ రాష్ట్రంలో ప్రజలు పోలరైజ్ కావడానికి దోహదపడింది. చివరి నిమిషంలో రాం విలాస్ పాశ్వాన్ తో పెట్టుకున్న పొత్తు మరింత లాభం చేకూర్చింది.
ప్రధానంగా ఈ రెండు రాష్ట్రాలే బి.జె.పి కి అధికారాన్ని అందించాయి. ఆంధ్రలో టి.డి.పితో పొత్తు, మహారాష్ట్రలో అవినీతి వ్యతిరేకత, మధ్య ప్రదేశ్ లో చౌహాన్ పలుకుబడి, రాజస్ధాన్ లో ప్రభుత్వ వ్యతిరేకత…. ఇలా ఒక్కో చోట ఒక్కో కారణం పని చేయగా కాంగ్రెస్ అవినీతి యధాశక్తి దోహదపడింది.
ఈ అంశాలన్నింటినీ ఏకోన్ముఖ ప్రవాహంగా మార్చడంలోనే అమిత్ షా సఫలం అయ్యారని పత్రికలు చెబుతున్నాయి. ఏ రాజ్యాధీశునికయినా ఇంతటి ప్రతిభావంతుడైన లెఫ్టినెంట్ దొరకడం అదృష్టం కాక మరేమీటని ప్రశ్నించేవారూ లేకపోలేదు.
అధికారం దక్కాక ఇక పార్టీ అధ్యక్షుడిని చెక్కడం ప్రధాన మంత్రికి పెద్ద పని కాదు. పదేళ్ళు పస్తు పెట్టిన అధికారం, స్వంత మెజారిటీతో సహా దరి చేరిన తర్వాత, దానికి కారణం అయినవారిని మరో శిఖరం ఎక్కనివ్వకుండా అడ్డుకోగల సాహసం ఎవరి ఉంటుంది? ఆ విధంగా జాతీయ అధ్యక్షుడిని విజయంవంతంగా మోడి నియమించుకున్నారు.
ఇప్పుడిక ప్రధాని ప్రయాణం నల్లేరు మీద నడకే. అమిత్ షా ప్రయాణం కూడాను.