వర్తమాన చరిత్రలో నియంతృత్వం-ప్రజాస్వామ్యంల మధ్య సరిహద్దు రేఖ చెరిగిపోయి ఉంది. అతి పెద్ద ప్రజాస్వామ్యం అనీ, సుదీర్ఘ ప్రజాస్వామ్యం అనీ చెప్పుకునే దేశాల్లో ప్రజల ప్రయోజనాలకు కాణీ విలువ కూడా లేదు. నియంతృత్వ ప్రభుత్వాలుగా సో కాల్డ్ ప్రజాస్వామ్య దేశాలు ముద్రవేసిన దేశాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలకు కొదవలేని పరిస్ధితి.
సద్దాం హుస్సేన్ నాయకత్వంలో ఇరాక్ దేశం అన్నీ విధాలుగా అభివృద్ధి చెంది ఉండేది. చమురు వనరులను ప్రతి పైసాను దేశం దాటి పోనివ్వనందుకు సద్దాం హుస్సేన్ నియంతగా ముద్రవేయబడినప్పటికీ అక్కడి ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లారు. మధ్యప్రాచ్యంలో ప్రగతిశీల సెక్యులర్ శక్తి అయిన బాతిస్టు పార్టీ ప్రభుత్వం ముస్లిం మతోన్మాదాన్ని అదుపులో పెట్టడమే కాకుండా స్వార్ధం తప్ప మరొకటి ఎరుగని పశ్చిమ సామ్రాజ్యవాద కంపెనీలను కాలు పెట్టనివ్వలేదు.
ఫలితంగా ఇరాక్ ప్రజలు విద్య, వైద్యం, గృహ నిర్మాణం, ఔషధాలు తదితర సౌకర్యాలను పుష్కలంగా అనుభవించారు. ప్రజాస్వామ్య సంస్ధాపన పేరుతో పశ్చిమ దేశాలు ఆ దేశాన్ని సర్వనాశనం చేసిన ఫలితంగా ఇప్పుడు ఇరాక్ సెక్టేరియన్ ఘర్షణలకు, రాజ్యరహిత వ్యవస్ధలకు నిలయం అయిపోయింది. జరగడానికి ఎన్నికలు జరుగుతాయి గానీ అక్కడ అమెరికా ఆశీస్సులు లేనిదే ప్రభుత్వాలు నిలబడవు.
నియంతృత్వ దేశంగా పశ్చిమ దేశాలు ముద్ర వేసే మరో దేశం ఉత్తర కొరియా. ఉత్తర కొరియా దేశం గురించి పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ఎంత హీనంగా, అపహాస్య ధోరణితో వ్యాఖ్యానిస్తాయంటే అక్కడ ఉన్నది కూడా ప్రజలే అన్న కనీస గౌరవం ఆ పత్రికలకు ఉన్నదా అన్న అనుమానం కలుగుతుంది. ఆ దేశంలో దరిద్రం తాండవిస్తోందన్న ప్రచారాలకయితే లెక్కే లేదు. దక్షిణ కొరియాలో అసలు సిసలు నియంతృత్వ ప్రభుత్వాన్ని రెండున్నర దశాబ్దాల పాటు కాపాడిన చరిత్ర అమెరికాదయితే అదే అమెరికా ఉత్తర కొరియాను నియంతృత్వ దేశంగా అభివర్ణించడం కంటే మించిన హిపోక్రసీ ఏముంటుంది?
ఉత్తర కొరియా నుండి వెలువడే ఫోటోలను ప్రభుత్వమే ఏర్పాటు చేసిన ఫోటోలుగా పశ్చిమ పత్రికలు చెప్పడం పరిపాటి. పశ్చిమ కార్పొరేట్ విలేఖరులను టూర్లకు తిప్పి మరీ ఫోటోలు తీసే అనుమతి కల్పించినా ఫోటోల కోసం దృశ్యాలను ఏర్పాటు చేస్తారని రాస్తారు. ఇందులోని బూటకత్వాన్ని కాస్త వివరిస్తూ గతంలో రాసిన టపాను కింది లింక్ లో చూడవచ్చు.
ఉత్తర కొరియా: కొన్ని వాస్తవాలు
ఈసారి ఏకంగా ఉత్తర కొరియా యువ నేత కిమ్-జోంగ్-ఉన్ ఫోటోలనే ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది. దేశాధినేత దేశంలో చేసే పర్యటనలను కుటుంబ సంప్రదాయంగా అభివర్ణిస్తూ కింది ఫోటోలను పత్రిక అంచజేసింది. దేశాధినేత ప్రజల వద్దకు వెళ్ళి ముచ్చటించడం, వారితో ఫోటోలు దిగడం, వారి సమస్యలను కనుగొని స్ధానిక ప్రభుత్వ యంత్రాంగానికి తగిన సూచనలు ఇవ్వడం చేస్తే అదేమన్నా చెయ్యగూడని పనా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాధినేతలం అని చెబుతూనే ఇల్లు, కార్యాలయాల చుట్టూ ముళ్ళకంచెలు నిర్మించుకుని, జెడ్ ప్లస్ సెక్యూరిటీల మధ్య గడిపే ప్రజాస్వామ్య ప్రభువులకు, వారి తైనాతీ పత్రికలకు అది వింత కావచ్చు గానీ ప్రజలకు మాత్రం అవసరమైన పనే.
‘ఫీల్డ్ గైడెన్స్’ పేరుతో ఉత్తర కొరియాలో దేశాధినేత దేశ పర్యటన చేయడం ఒక విధానంగా అమలు చేస్తారు. ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు, మిలట్రీ స్ధావరాలు మొదలైన వసతులు సందర్శించి అవసరమైతే మార్పులు, చేర్పులు సూచిస్తారు. ఆ విధంగా గత సంవత్సర కాలంలో ఉత్తర కొరియా యువ నేత కిమ్-జోంగ్-ఉన్ సాగించిన పర్యటనల ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.
సర్,తైనాతి పత్రికలంటే ఏమిటి?
రోజుకు 47 రూపాయలు సంపాదాస్తే సౌఖ్యంగా బ్రతకొచ్చు అనే ప్రజా స్వామ్య దేశాల్లో జెడ్ కెటగెరీ సెక్యురిటీ ఎయిర్ కండీంష్డ్ గదుల్లో హాయిగా ప్రపంచమంతా తమ లాగే సుఖంగా ఉంది అని నిదుర పోయే వారికి ప్రజల దగ్గ రికి వెళ్లి వాస్తవ పరిస్తితులు కనుక్కోవడమంటే నామోషి కాదా?
మూల గారూ తైనాతీ అంటే సేవకుడు అని అర్ధం.