వ్యవసాయ రంగం
భారత దేశంలో ఇప్పటికీ 60 శాతం ప్రజానీకానికి వ్యవసాయ రంగమే ఉపాధి ఇస్తోంది. బ్యాంకులు, ఇన్సూరెన్స్, హోటళ్లు లాంటి సేవా రంగాలతో పాటు వ్యాపార రంగానికి, నిర్దిష్ట పారిశ్రామిక రంగాలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ ఆదాయం ప్రధాన వనరుగా ఉపయోగపడుతుంది. అనగా వ్యవసాయరంగం కుంటుబడితే దాని ఫలితం బహుళవిధాలుగా ఆర్ధిక వ్యవస్ధపై పడుతుంది.
వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ ఆదాయంపై ఆధారపడిన రంగాలన్నీ ప్రభావితమై అనేక రేట్లు ప్రతికూల ప్రభావం ఆర్ధిక వ్యవస్ధపై పడుతుంది. భారత దేశ వ్యవసాయ రంగానికి ప్రపంచ స్ధాయిలో ఎంతటి ప్రాముఖ్యత ఉన్నదంటే ఇండియాలో నైరుతి ఋతుపవనాల రాకను ప్రపంచ మార్కెట్లన్నీ శ్రద్ధగా గమనిస్తాయి. వర్షపాతం సాధారణమా లేక తగ్గుతుందా అన్నది పరిశీలించి దాన్ని బట్టి వివిధ అంచనాలను, పధకాలను రూపొందించుకుంటారు.
కానీ దేశంలో మాత్రం వ్యవసాయం మొదటి నుండీ సవతి తల్లి ప్రేమకు గురవుతోంది. జి.డి.పి లో వ్యవసాయ ఉత్పత్తి వాటా ఎంతో చెబుతూ దాన్ని బట్టి ఆ రంగాన్ని పరిగణిస్తారే గానీ, వ్యవసాయంపై ఇతర రంగాలు ఆధారపడి ఉన్న సంగతిని తెలియనట్లు నటిస్తారు. 2014-15 బడ్జెట్ కూడా ఇదే ఒరవడిని కొనసాగించింది.
4 శాతం వ్యవసాయ వృద్ధి రేటు లక్ష్యం అని చెప్పడమే గానీ అది ఎలా సాధిస్తారో వివరం లేదు. 8 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి ప్రకటించారు తప్ప ఆ లక్ష్యం సాధిస్తామన్న నిబద్ధత ప్రకటించలేదు. బడ్జెట్ నిండా పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కల్పించడానికి పదే పదే నిబద్ధత ప్రకటించిన ఆర్ధిక మంత్రి వ్యవసాయ రుణాల లక్ష్యానికి మాత్రం నిబద్ధత ప్రకటించలేకపోయారు.
ఈ 8 లక్షల కోట్లు బడ్జెట్ కేటాయింపులు కాదని పాఠకులు గమనించాలి. ఈ మొత్తాన్ని బ్యాంకులు సమకూర్చాలి. బ్యాంకులు సవాలక్షా నిబంధనలతో రుణాలు ఇస్తాయి. ధనిక రైతులు అనేక బ్యాంకుల్లో రుణాలు తీసుకోగలరు. నిజంగా రుణం అవసరమైన రైతులకు మాత్రం ఈ రుణాలు దక్కవు. అదీకాక వ్యవసాయదారుల్లో అనేకమంది కౌలు రైతులు. వారికి ఏ బ్యాంకూ రుణం ఇవ్వదు. ప్రైవేటు రుణాలు తీసుకునే కౌలు రైతులకు ఏ ఋణ మాఫీలూ వర్తించవు.
దీర్ఘకాలిక గ్రామీణ ఋణ నిధిని నెలకొల్పుతామని, అందుకు ప్రారంభంగా 5,000 కోట్లు నిధులు కేటాయిస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ నిధి వివరాలు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. నీటి పారుదల కోసం ‘ప్రధాన మంత్రి కృషి సించాయి యోజనా” పేరుతో కేవలం 1000 కోట్లు కేటాయించారు. వాటర్ షెడ్ నిర్మాణాలకు మరో 2,000 కోట్లు. ఇలా నామమాత్ర కేటాయింపులు చేయకపోతేనేమీ? జాతీయ గృహ బ్యాంకు పధకం పేరుతో కేటాయించిన 8.000 కోట్ల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మొత్తంతో గ్రామాల్లో ఇళ్లను నిర్మిస్తారట. ఏ ప్రాతిపదికన నిర్మించేది వివరాలు ఇవ్వలేదు.
మహాత్మాగాంధి గ్రామీణ ఉపాధి పధకానికి చిల్లి పెట్టేవైపుగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆర్ధిక మంత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు చెబుతున్నాయి. సంవత్సరంలో కనీసం 100 పనిరోజులు గ్యారంటీ చేసే పధకాన్ని వృధా పనులకు కాకుండా ఆస్తుల సృష్టికి దారి తీసేలా చూస్తామని హామీ ఇచ్చారు. నిజంగా ఆస్తుల సృష్టికి వినియోగిస్తే అభ్యంతరం ఉండదు. గత అనుభవాలను బట్టి వృధా పేరుతో ఈ పధకం కింద చేసే పనులను కత్తిరించేందుకు తగిన భూమికను మంత్రి సిద్ధం చేశారని భావించవలసి వస్తోంది.
స్ధూలంగా….
స్ధూల ఆర్ధిక వివరాలకు (Macro-economics) వెళ్తే 2014-15 ఆర్ధిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్ 17.95 లక్షల కోట్లుగా ఆర్ధిక మంత్రి ప్రకటించారు. మధ్యంతర బడ్జెట్ కంటే ఇది 5,000 కోట్లు ఎక్కువ. ఇందులో 2.29 లక్షల కోట్లను కేవలం రక్షణ రంగానికే కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్ లో 12.75 శాతం. మధ్యంతర బడ్జెట్ లో చిదంబరం కేటాయించిన మొత్తం కంటే ఇది 6,000 కోట్లు ఎక్కువ కాగా గత సం. కంటే 12 శాతం ఎక్కువ. గత మూడేళ్లుగా అత్యధిక మొత్తంలో ఆయుధ దిగుమతులు చేసుకుంటున్న దేశాల్లో మొదటి స్ధానంలో ఇండియా ఉంటోంది.
పన్ను ఆదాయంకు సంబంధించి మధ్యంతర బడ్జెట్ లో చిదంబరం ప్రతిపాదించిన అంకెలను జైట్లీ ఆమోదించారు.
రెవిన్యూ లోటు జి.డి.పి లో 2.9 శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెట్టుబడి వసూళ్లు 73,950 కోట్లు కాగా ప్రభుత్వ రంగ కంపెనీలు ఈ సంవత్సరం 2,47,941 కోట్ల మేరకు పెట్టుబడులు పెడతాయి. స్మార్ట్ నగరాల నిర్మాణానికి 7,060 కోట్లు, వేర్ హౌస్ ల నిర్మాణానికి 5,000 కోట్లు, రహదారులకు 37,800 కోట్లు, ఎస్.సి ప్లాన్ కోసం 50,548 కోట్లు కేటాయించారు. వీటిలో ఎస్.సి ల కోసం కేటాయించిన మొత్తంలో పావు భాగం లక్ష్యిత జనం కోసం ఖర్చు పెట్టినా గొప్పే. భారీ కేటాయింపులు చేసి, దానిని విడతలు విడతలుగా ఇతర రంగాలకు తరలించడం పాలకులకు ఉన్న అలవాటు.
బడ్జెట్ లోటు (fiscal deficit) మధ్యంతర బడ్జెట్ లో నిర్దేశించిన 4.1 శాతానికి కట్టుబడి ఉంటామని జైట్లీ చెప్పారు. ఇది కష్టమే అయినా సవాలు స్వీకరిస్తామని చెప్పుకున్నారు. 2016-17 కల్లా దీనిని 3 శాతానికి తగ్గిస్తామని మరో లక్ష్యం ప్రకటించారు.
ముందు చెప్పినట్లు ఇది ఆర్ధిక సంస్కరణలను వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న బడ్జెట్. ఈ సంస్కరణలు స్వదేశీ, విదేశీ కంపెనీలకు అనుకూలం, సాధారణ శ్రామిక ప్రజలకు వ్యతిరేకం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. GAAR చట్టం లాంటి విదేశీ కంపెనీల నుండి వచ్చే ఆదాయ మార్గాలను మూసేస్తూనే వాటికి ఎదురు లాభం ఇచ్చే చర్యలకు జైట్లీ ప్రాధాన్యం ఇచ్చారు. తాను ప్రకటించినవి కేవలం ప్రారంభ చర్యలేనని రానున్న సంవత్సరాల్లో ఇవి మరింత ఉధృతం అవుతాయని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. దేశ ప్రజలకు కాసిని తాయిలాలు విదిలించి, ప్రధాన భాగాన్ని ప్రైవేటు ధనిక వర్గాలకు అప్పగించిన ఈ బడ్జెట్ దిశను ప్రజలు తిరస్కరించాల్సిన అవసరం ఉంది.
shekargaru me vaarthalu analysis chala useful ga unnayi. Science and techonology medha kuda me analysis chesthe cometative aspariants ki inka use avuthundhi sir
your analysis is excellent sir.