బడ్జెట్ 2014-15: సామాన్యుడు కాదు సంస్కరణలే లక్ష్యం


Finance Minister Arun Jaitley (Centere) with Nirmala Sitaraman

Finance Minister Arun Jaitley (Centere) with Nirmala Sitaraman

ఎన్.డి.ఏ 2 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొదటి బడ్జెట్ జి.డి.పి వృద్ధి-ఆర్ధిక క్రమశిక్షణ-కోశాగార మెలకువ తదితర పదాడంబరాల మాటున సంస్కరణలలు ఉధృతం చేయడమే లక్ష్యంగా చేసుకుంది. రైల్వేలతో పాటు రక్షణ రంగం, భీమా రంగాల్లో విదేశీ పెట్టుబడులను 26 శాతం నుండి 49 శాతానికి పెంచారు. పన్ను ఆదాయాన్ని పెంచే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమలుకు డిసెంబర్ లోపల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లగ్జరీ సరుకులను ప్రజలకు అందుబాటులో తేవడానికి, తద్వారా కంపెనీల అమ్మకాలు, లాభాలు పెంచడానికి అనేక రంగాల్లో ఎక్సైజ్ డ్యూటీకి మినహాయింపు ఇచ్చారు.

కార్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు చౌక చేశారు. ఉద్యోగులకు కనీస ఆదాయ పన్ను పరిమితిని 2 లక్షల నుండి 2.5 లక్షలకు పెంచుతూ 80(c) సెక్షన్ కింద పొదుపు పరిమితిని 1 లక్ష నుండి 1.5 లక్షలకు పెంచారు. ఆ విధంగా మధ్యతరగతిని ఆకట్టు కున్నారు. రైతులకు 8,00,000 లక్షల రుణాలు ఇవ్వడం లక్ష్యం అన్నారు. కానీ ఆ లక్ష్యం నెరవేర్చే నిబద్ధతకు హామీ ఇవ్వలేదు. కంపెనీలు, ధనిక వర్గాలు, ఉన్నత మధ్యతరగతి వర్గాలకు తరతమ స్ధాయిల్లో మద్దతు ఇచ్చిన బడ్జెట్ రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలను విస్మరించింది. వాళ్లసలు ఆర్ధిక మంత్రి దృష్టిలోనే లేరు. ఈ బడ్జెట్ ప్రధానంగా స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలకు సమాధానం చెప్పింది తప్ప భారత ప్రజలకు కాదు.

ప్రజలకు ఇచ్చే సబ్సిడీలను తగ్గించేవైపుగా కృషి చేస్తామని, ఎరువుల సబ్సిడీలను పునఃపరిశీలిస్తామని అరుణ్ జైట్లీ కంపెనీలకు హామీ ఇచ్చారు. ఆర్ధిక క్రమ శిక్షణ అని ఆర్ధిక మంత్రులు, మార్కెట్ ఎకానమీ పండితులు చెప్పేది ప్రధానంగా సబ్సిడీలను దృష్టిలో పెట్టుకునే. ఎరువులు, ఇంధనం (కిరోసిన్, గ్యాస్ మొ.వి), ఆహారం (ప్రజా పంపిణీ వ్యవస్ధ -రేషన్ షాపులు) తదితర సబ్సిడీలను వృధా ఖర్చుగా మార్కెట్ ఆర్ధికవేత్తలు లెక్కిస్తారు. కాబట్టి సబ్సిడీ ఖర్చును ఎంత తగ్గిస్తే అంత భేషైన ఆర్ధిక క్రమ శిక్షణగానూ, కోశాగార మెలకువ (fiscal prudence) గానూ వారు పరిగణిస్తారు. బడ్జెట్ నిండా మన ఆర్ధిక మంత్రి ఈ తరహా క్రమ శిక్షణను, మెలకువను దండిగా ప్రదర్శించారు. ఒకవైపు అనేక వినియోగదారీ సరుకులపై ఎక్సైజ్ పన్నుకు మినహాయింపు ఇస్తూ మరోపక్క సబ్సిడీలను కత్తిరించేందుకు హామీ ఇవ్వడం ఈ కోవలోనిదే.

GAAR నీరుగారినట్లే?

ప్రణబ్ ముఖర్జీ ప్రవేశ పెట్టిన GAAR చట్టాన్ని రద్దు చేస్తారని విదేశీ బహుళజాతి కంపెనీలు బాగా ఆశ పెట్టుకున్నాయి. కంపెనీల విలీనం మరియు స్వాధీనం (Mergers & Acquisitions) సందర్భంగా ఆయా కంపెనీలకు పెట్టుబడి లాభాలు సమకూరుతాయి. ఈ లాభాలు పెద్ద మొత్తంలో (లక్షల కోట్లలో) ఉంటాయి. వీటిపైన ఏ దేశమైనా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ విధిస్తుంది. ఈ పన్నును తప్పించుకోవడానికి బహుళజాతి కంపెనీలు పేపర్ కంపెనీలను సృష్టించి వాటిని పన్నులు ఉండని చిన్న చిన్న దేశాల్లో నెలకొల్పే ఎత్తుగడను అనుసరిస్తున్నాయి.  తద్వారా పదుల వేల కోట్ల క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ను ఎగవేస్తున్నాయి.

ఉదాహరణకి హాచిసన్ కంపెనీని విలీనం చేసుకున్న వోడా ఫోన్ కంపెనీ 11,000 కోట్ల పన్ను ఎగవేసింది. (అది వడ్డీతో కలిపి 20,000 కోట్లు దాటిపోయింది.) గత ముప్ఫై యేళ్లలో దాదాపు 50,000 కోట్లు భారత ప్రభుత్వానికి విదేశీ కంపెనీలు ఎగవేశాయి. ఈ ఎగవేతను అడ్డుకోవడానికి GAAR (General Anti Avoidance Rules) చట్టాన్ని ప్రణబ్ ముఖర్జీ 2012 మార్చి బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. చట్టాన్ని గతం నుండి (retrospective effect) అమలు చేసే ఏర్పాటు చేశారు.

ఈ చట్టంపైన పశ్చిమ పత్రికలు అప్పటి నుండి విషం కక్కుతూనే ఉన్నాయి. విదేశీ పెట్టుబడులకు (FDI) ఇది ఆటంకం అయిందని ఆడిపోసుకున్నాయి. చట్టాన్ని రద్దు చేయాలని అమెరికా, ఐరోపా దేశాలు తీవ్ర ఒత్తిళ్ళు తెచ్చాయి. ఈ ఒత్తిడి ఫలితంగా చట్టం అమలును యు.పి.ఏ ప్రభుత్వం చిదంబరం మంత్రసానితనంతో 5 సం.లు వాయిదా వేసింది. ఈ చట్టం ద్వారా ఎఫ్.డి.ఐ లను బెదరగొట్టారని, పన్నుల విధానంలో అనిశ్చితి ఏర్పడిందని ఫలితంగా పెట్టుబడులు ఆగిపోయాయని పశ్చిమ కార్పొరేట్ పత్రికలతో పాటు బి.జె.పి కూడా విమర్శించింది.

స్పష్టమైన మెజారిటీతో బి.జె.పి అధికారంలోకి రావడంతో GAAR రద్దవుతుందని బహుళజాతి కంపెనీలు నమ్మకం పెట్టుకున్నాయి. అరుణ్ జైట్లీ, చట్టాన్ని రద్దు అయితే చేయలేదు గానీ ఆ చట్టాన్ని అమలు చేసే ఉద్దేశ్యం తమకు జైట్లీ పరోక్షంగా చెప్పారు. తాము పరిశ్రమలకు స్నేహపూర్వకమైన పన్నుల విధానం అనుసరించడానికి కట్టుబడి ఉన్నామని, ఊహాశక్యమైన (predictable) పన్నుల విధానం పాటిస్తామని, రిట్రాస్పెక్టివ్ చట్టాల విషయంలోనూ ఈ విధానాన్ని అనుసరిస్తామని జైట్లీ బడ్జెట్ లో స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆ విధంగా GAAR చట్టాన్ని అమలు చేయబోవడం లేదని విదేశీ కంపెనీలకు హామీ ఇచ్చారు. బడ్జెట్ ముగిసిన వెంటనే “అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోసం మేము ప్రయత్నాలు కొనసాగిస్తాం” అని వోడా ఫోన్ ప్రకటించడం బట్టి ఆ కంపెనీకి సానుకూలమైన సంకేతాలను బడ్జెట్ అందజేసిందని గ్రహించవచ్చు.

ఎఫ్.డి.ఐ ల పెంపు

విదేశీ బహుళజాతి కంపెనీలకు మేలు చేకూర్చుతూ ఆర్ధిక మంత్రి రెండు ప్రధాన నిర్ణయాలను ప్రకటించారు. భీమా రంగంలో విదేశీ పెట్టుబడుల వాటాను 26 శాతం నుండి 49 శాతానికి పెంచారు. అలాగే రక్షణ రంగంలోనూ విదేశీ పెట్టుబడులను 26 శాతం నుండి 49 శాతానికి పెంచారు. దేశ భద్రత కోసం ఏ ప్రభుత్వామైనా రక్షణ రంగం తమ చేతుల్లోనే ఉండాలని భావిస్తుంది. బి.జె.పి, యు.పి.ఏ ప్రభుత్వాలకు మాత్రం రక్షణ రంగాన్ని కూడా విదేశీ పెట్టుబడులకు అప్పజెప్పడానికి ఏ మాత్రం అభ్యంతరం లేదు. విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చాక మన రక్షణ అవసరాలను కూడా ఇక విదేశీ కంపెనీలే శాసిస్తాయి.

బీమా రంగంలో విదేశీ ప్రైవేటు పెట్టుబడుల వాటా 49 శాతం పెంచిన ఫలితాన్ని విదేశీ భీమా కంపెనీలయిన ప్రుడెన్షియల్ (అమెరికా), మిత్సుయి సుమిటోమో ఇన్సూరెన్స్ (జపాన్),  స్టాండర్డ్ లైఫ్ (బ్రిటన్), అలయెంజ్ (అమెరికా), ఆక్సా (ఫ్రాన్స్), దాయిచి (జపాన్), సన్ లైఫ్ (అమెరికా) మొదలైన 20కి పైగా విదేశీ కంపెనీలు లబ్ది పొందనున్నాయి. భారతీయులు తమ భవిష్యత్తు భద్రత కోసం దాచుకునే సొమ్ము ఆ విధంగా విదేశీ ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అనగా దేశ ప్రజల పొదుపు భారత ప్రభుత్వానికి బదులు విదేశీ కంపెనీలు నిర్వహిస్తాయి. ఈ కంపెనీలన్నీ తమ తమ దేశాల్లో నష్టాలకు నిలయంగా ప్రసిద్ధి చెందాయి. పాలసీదారుల సొమ్మును సొంత పెట్టుబడులకు వాడుకుని క్లయిమ్ లు ఎగవేయడంలో ప్రసిద్ధి చెందాయి. అలాంటి కంపెనీలను మన ప్రభుత్వాలు పిలిచి మరీ భారతీయుల పొదుపును అప్పగిస్తున్నారు.

రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టుబడి ట్రస్టులను నెలకొల్పడానికి మోడి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా డి.ఎల్.ఎఫ్, యూనిటెక్, ఫీనిక్స్, పార్శ్వనాధ్ తదితర ప్రైవేటు కంపెనీలు లబ్ది పొందుతాయి. ఈ కంపెనీలు భారతీయ కంపెనీలే అయినప్పటికీ వాటి పెట్టుబడులు మాత్రం వాల్ స్ట్రీట్ కంపెనీలవే. విదేశీ బహుళజాతి బ్యాంకులు, ద్రవ్య సంస్ధల నుండి తెచ్చుకున్న డబ్బుతో ఇవి కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఆ విధంగా భారత దేశంలో ఏర్పడే రియల్ బూమ్ లో గణనీయ మొత్తాన్ని విదేశీ లబ్దిదారులు స్వాహా చేస్తారు. 100 స్మార్ట్ నగరాలను నిర్మిస్తామన్న నిర్ణయం కూడా ఈ కంపెనీలకు ప్రయోజనకరమే. ఈ స్మార్ట్ నగరాలు ఎలా నిర్మిస్తారో, ఎక్కడ నిర్మిస్తారో, విధి విధానాలు ఏమిటో వివరాలు లేవు.

విదేశీ తయారీ (మాన్యుఫాక్చరింగ్) పరిశ్రమలు ఈ-కామర్స్ వేదికల ద్వారా తమ ఉత్పత్తులను నేరుగా అమ్ముకునేందుకు అవకాశం ఇస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. అనగా విదేశీ వినియోగదారీ కంపెనీలు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ ల ద్వారా నేరుగా భారతీయ మార్కెట్ ను సొంతం చేసుకోబోతున్నారు. స్ధానికంగా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండానే వారు ఈ ఫలితాన్ని పొందుతారు. ఉదాహరణకి స్పోర్ట్స్ బూట్లు, చొక్కాల కంపెనీలు నైక్, పూమా, డిపార్ట్ మెంటల్ స్టోర్స్ కంపెనీ మార్క్స్ అండ్ స్పెన్సర్ గ్రూప్ మొదలైన కంపెనీలు ఇక నుండి ఇండియాలో ఈ-కామర్స్ ద్వారా తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు.

పి.పి.పి (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్) పద్ధతి ద్వారా రోడ్లు, నౌకాశ్రయాలు నిర్మించడానికి బడ్జెట్ లో భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల కోసం 37,887 కోట్ల రూపాయలను ఆర్ధిక మంత్రి కేటాయించారు. ఎల్&టి, ఐ.ఎల్&ఎఫ్.ఎస్ ట్రాన్స్ పోర్టేషన్, ఐ.ఆర్.బి ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ మొదలైన కంపెనీలకు పండగే పండగ.

……………..ఇంకా ఉంది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s