ఈ దేశంలో బిచ్చగాళ్లూ ధనికులే -కార్టూన్


Above Poverty Line

మేధావులు: ఈయన భోజనంలో రు. 15/- ల అన్నం, రు. 10/- ల పప్పు, రు. 5/0 ల ఉల్లి, రు. 5/- ల మసాలాలు ఉన్నాయి. కాబట్టి ఈయన దారిద్ర్య రేఖకు పైన ఉన్నట్లే!

***

ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ తాజాగా తన దరిద్ర ప్రమాణాల లెక్కలు విడుదల చేయడంతో దేశంలో పేదలు ఎంతమంది అన్న చర్చ మరోసారి రేగింది. సురేష్ టెండూల్కర్ లెక్క సరికాదని చెప్పిన రంగరాజన్ పట్టణ, గ్రామీణ దరిద్రం లెక్కని కాస్త సవరించారు. ఆయన సవరణ ఫలితంగా దేశంలో 2011-12 నాటి దరిద్రుల సంఖ్య గతం కంటే 10 కోట్లు ఎక్కువగా తేల్చారు.

సురేష్ టెండూల్కర్ ఫార్ములా ప్రకారం పట్టణంలో రోజుకు రు. 33 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే దరిద్రులు కానట్లే. గ్రామంలో నైతే రోజుకు రు 27 సంపాదిస్తే చాలు. వారు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్లే. ఈ ఫార్ములా ప్రకారం 2011-12లో 21.9 శాతం మంది దరిద్రులు (దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు) అని తేల్చారు.

ఈ లెక్క బాగా లేదని సి.రంగరాజన్ యాష్టపోయారు. పట్టణంలో రోజుకు రు. 47 సంపాదించినా గ్రామాల్లో రోజుకు రు. 32 సంపాదించినా వాళ్ళు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్లేనని ఆయన లెక్కలు వేసి తేల్చారు. ఈ యిద్దరు దారిద్ర్య మేధావుల లెక్కల్లో తేడా పట్టణం విషయంలో రు 14/- కాగా గ్రామం విషయంలో రు. 5. ఈ మాత్రం తేడా తోనే దేశ జనాభాలో దరిద్రుల సంఖ్య అమాంతం 29.5 శాతానికి ఎగబాకింది.

ఈ దెబ్బతో రంగరాజన్ గారు దరిద్రుల మేధావిగా ఖ్యాతికెక్కాలి!

ఈ దెబ్బతో రంగరాజన్ గారు దరిద్రుల మేధావిగా ఖ్యాతికెక్కాలి!

శాతాల్లో కాకుండా వాస్తవ అంకెల్లో చూస్తే సురేష్ టెండూల్కర్ లెక్కలో 2011-12లో దరిద్రుల సంఖ్య 26.9 కోట్లు కాగా 2009-10లో 35.4 కోట్లు. రంగరాజన్ లెక్క ప్రకారం 2011-12లో దరిద్రుల సంఖ్య 36.3 కోట్లు కాగా 2009-10లో 45.4 కోట్లు. అనగా సురేష్ టెండూల్కర్ లెక్క దరిద్రుల సంఖ్యను రెండేళ్లలో 8.5 కోట్లు తగ్గిస్తే రంగరాజన్ లెక్క 9.1 కోట్లు తగ్గించింది. అనగా సురేష్ టెండూల్కర్ కంటే సి.రంగరాజన్ గారే యు.పి.ఏ ప్రభుత్వానికి ఎక్కువ కీర్తిని అంటగట్టారు.

మరో విధంగా చూస్తే 2009-10 సంవత్సరంలో ఇద్దరు మేధావుల లెక్కల్లో తేడా 10 కోట్లు కాగా 2011-12లో ఇద్దరి లెక్కల్లో తేడా 9.4 కోట్లు. ఇలా కాలం గడిచేకొద్దీ ఇద్దరి ఫార్మూలాల తేడా తగ్గుతూ పోతుంది.

రోజువారీ సంపాదన లెక్కలు చూస్తే పట్టణ పేదలు రోజుకు రు 33/- సంపాదించడానికి బదులు రు. 47 సంపాదిస్తే వాళ్ళు అదనంగా బావుకునేది ఏమన్నా ఉంటుందా? 14 రూపాయల్లో 2011-12 లోనే అయినా అదనంగా తినేది ఎంత ఉంటుంది? గ్రామీణ పేదల విషయం ఐతే ఇంకా ఘోరం. రోజుకి రు 27/- కి బదులు రు. 32 సంపాదిస్తే, అనగా అదనంగా రు 5/- సంపాదిస్తే వాళ్ళ కొనుగోలు శక్తి అమాంతం పెరిగిపోతుందా?

ఇంతోసి దానికి నా లెక్క ప్రపంచ ప్రమాణాలతో సరితూగుతుంది అని రంగరాజన్ గారు తనకు తానే క్రెడిట్ ఇచ్చేసుకున్నారు. దరిద్రుల లెక్కని ఒక 9 కోట్లు పెంచడం వాస్తవిక అంచనాగా ఆయన చెబుతున్నారు. అందుకు ఉదాహరణగా ప్రపంచ బ్యాంకు రోజుకు 2 డాలర్లు సంపాదిస్తే దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్లేనని చెప్పిందని గుర్తు చేశారు.

డిసెంబర్ 3, 2011 తేదీన అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి మారకం విలువ రు. 51.5 పై.లు. ఈ లెక్కన 2 డాలర్లు అంటే రోజుకి రు. 103 అవుతుంది. మరి రోజుకి రు 47/- సంపాదిస్తే దరిద్రుడు కాదని చెబుతూ అది ప్రపంచ బ్యాంకు ప్రమాణమే అని రంగరాజన్ గారు ఎలా చెప్పారు?

ఎలాగంటే ఒక పట్టణ కుటుంబంలో 5 గురు సభ్యులు ఉంటారని వారంతా కలిసి నెలకు రు 7,035 సంపాదిస్తారని రంగరాజన్ లెక్క కట్టారు. అలాగే గ్రామీణ కుటుంబం నెలకి రు. 4,860 సంపాదిస్తారని లెక్కించారు. అందువల్ల వాళ్ళు దరిద్రులు కారని ఆయన చెప్పేశారు. అదీ కాకుండా ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇస్తోందని వాటి వల్ల కూడా జనం లబ్ది పొందుతుంటారని కాబట్టి ఆ విధంగానూ దరిద్రం తగ్గుతుందనీ నిర్ధారించారు.

అంటే రంగరాజన్ గారి అభిప్రాయంలో ఒక కుటుంబంలో ఉండే సభ్యులంతా పడీ పడీ పని చేసేస్తుంటారు. వాళ్ళలో పాలు తాగే చిన్న పిల్లలు గానీ, బడికి, కాలేజీ వెళ్ళే విద్యార్ధులు గానీ ఉండరు. లేదా పాలు తాగే పిల్లాడి దగ్గర్నుండి యూనివర్సిటీలో చదివే విద్యార్ధి వరకూ అందరూ పని చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ ఉంటారు.

ఇంతకు మించిన తలకుమాసిన లెక్క ఎక్కడన్నా ఉంటుందా? అసలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల్లో ఎక్కువ భాగం నిజంగా అవసరమైనవాళ్ళకి చేరడం లేదని, మధ్యలో దళారీలు భోంచేస్తున్నారని ప్రతి సంవత్సరం ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, మంత్రులు ఇంకా ఇతర నాయకులు చెప్పే మాటే గదా?

సబ్సిడీ ఎరువులని దారి మళ్లించి కాంప్లెక్స్ ఎరువులుగా మార్చి అధిక ధరలకి అమ్ముకున్న మాజీ ముఖ్యమంత్రి గారి బామ్మర్ది ఉదంతం రెండేళ్ల క్రితం నాటిదే. రేషన్ షాపుల్లో సరుకులు, వెల్ఫేర్  హాస్టళ్లలో భోజనం ఎన్ని దళారీ పందికొక్కుల్ని మేపేదీ రహస్యం ఏమీ కాదు. అంతెందుకు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సమక్షంలోనే ఒక బహిరంగ సభలో టి.వి ఛానెళ్ల సాక్షిగా తాము ఇందిరమ్మ ఇళ్ళు మూడు కట్టుకున్నామని అమాయక అతివ ఒకరు ధైర్యంగా ప్రకటించి సబ్సిడీల సంక్షేమం ఎవరికి సొంతం అవుతుందో చాటి చెప్పింది.

ఇలాంటి సబ్సిడీలతోనా దరిద్రులు లబ్ది పోందుతోంది?

ఈ లెక్కన భారత దేశ దరిద్రులందరినీ అర్జెంటుగా ఫోర్బ్స్ జాబితాలో చేర్చాలని భారతదేశ మేధావులూ, బ్యూరోక్రాట్ల సంఘం న్యూయార్క్ ఫోర్బ్స్ పత్రిక ఆఫీసు ముందు ఆందోళన చేపట్టినా ఆశ్చర్యం లేదు.

తధాస్తు దేవతలు ఈ బ్లాగ్ చదవకుండు గాక!

 

4 thoughts on “ఈ దేశంలో బిచ్చగాళ్లూ ధనికులే -కార్టూన్

  1. అసలు రంగ రాజన్‌ కమిటీ నివేదిక జీవన ప్రమాణాల్ని చాలా తగ్గించి చూపిం చారు . ఆయనకు ఏ మాత్రం తెలిసి ఉన్నా రోజుకు రెండు రూపాయలుంటే పట్టణాల్లో ఒక రూ పాయ ఉంటే గ్రామీన ప్రాంతాల్లో మృస్టాన్న బోజనం చెయ్యొచ్చని ఆ విధంగా ప్రజల విడిచే త్రేంపుల వల్లా భయో గ్యాస్‌ కు రిలయంచె మీద ఆదార పడాల్సిన అవసరం రాదని చెప్పే వారు కాదా?. ఆ విధంగా మనదేశం లో పేదిరికెమే లేదు. ఆయన లేని దాన్ని ఉన్నా ట్లు చూపించటం ఎంత దారుణాతి దారుణం. ఇది ప్రంచ దేశాల్లో మన డేశాన్ని పలచన చేయట కాదా? దేశ భక్తి ఉన్న వారు ఇది వప్పుకోవచ్చా?

  2. పదేళ్ల క్రితం బాలకార్మికుల సమస్య గురించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆ సందర్భంగా గోడలపై నినాదాలు రాయించేవారు. “బాలకార్మికులను నిర్మూలించండి” అని…అంటే ఎలాగైనా బాలకార్మికులను మాయం చేయాలని. వాస్తవానికి రాయాల్సింది బాలకార్మిక సమస్యను నిర్మూలించండి అని.
    ఇప్పుడు మన ప్రభుత్వం కూడా దేశంలో పేదరికాన్ని కాకుండా పేదల్ని నిర్మూలించాలని కంకణం కట్టుకున్నట్లున్నారు.

    పేదల జీవితాల్ని మెరుగుపరచాలంటే మౌలిక సౌకర్యాలు పెరగాలి. విద్య, వైద్యం ఉచితంగానో, నామమాత్రం ఖర్చు తోనో అందుబాటులో ఉండాలి. ఉపాధి అవకాశాలు,న్యాయమైన వేతనాలు అందాలి. ఇలాంటి చర్యలు చేపడితే పేదరికం అదే తగ్గిపోతుంది. అంతే కాని కేవలం ఏవో కాకి లెక్కల ద్వారా పేదరికాన్ని తగ్గించేందుకు ఆరాటపడితే….ఏం ప్రయోజనం. ఇటువంటి గణాంకాల ఆధారంగా ఏదో ఓ రోజు ఈ దేశంలో అసలు పేదరికమే లేదు అంటారేమో..?

  3. 47 రూపాయలంటే పాకీవాడు కూడా తీసుకోడు. ఈ లెక్కలతో పాకీవాళ్ళు కూడా ధనవంతులే కనుక పాకీవృత్తిని నిర్మూలించక్కరలేదు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s