రైల్వే బడ్జెట్: ఎఫ్.డి.ఐతో సేవల మెరుగు(ట)


D.V.Sadananda Gowda

D.V.Sadananda Gowda

నరేంద్ర మోడి/ఎన్.డి.ఏ 2 ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్, ఇంతదాకా రైల్వేరంగంలో లేని ఎఫ్.డి.ఐలకు స్వాగతం పలకడంతో మొదలయింది. బహుళ బ్రాండు రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐల వల్ల భారతీయుల ఉపాధి పోతుందని వాదించిన బి.జె.పి అదే ఎఫ్.డి.ఐలకు రైల్వేల్లో రెడ్ కార్పెట్ పరవడానికి సిద్ధం అయింది. కేవలం రైల్వేల అభివృద్ధి కోసమే మౌలిక నిర్మాణాలలో (ఇన్ఫ్రా స్ట్రక్చర్) ఎఫ్.డి.ఐలను ఆహ్వానిస్తాం తప్ప రైల్వేల నిర్వహణలో కాదని హామీ ఇచ్చింది.

ఎక్కడికి పిలిచినా ఎఫ్.డి.ఐ, ఎఫ్.డి.ఐ యే. అదేమీ భారత రైల్వేలను అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకోదు. కేవలం తమ లాభాల కోసమే ఎక్కడికైనా వస్తుంది. వచ్చాక సవాలక్షా షరతులు పెడుతుంది. మొత్తం చట్టాలను తమ కోసం మార్చేయాలంటుంది. ‘ఇలా అయితే వెళ్ళి పోతాం’ అని బెదిరిస్తుంది. తమ ప్రభుత్వాలు, వారి రాయబారుల చేత బెదిరింపులు జారీ చేయిస్తుంది. లేబర్ చట్టాలు తమకు వర్తించకూడదు అంటుంది. హోండా కార్ల కంపెనీ అనుభవం చెప్పేది ఇదే. దేశ ప్రజలకు ఉపాధి పరంగా, అభివృద్ధి పరంగా ఏ మాత్రం ఉపయోగపడకపోగా అనేక షరతులు విధించే ఎఫ్.డి.ఐలతో రైల్వేలను అభివృద్ధి చేయడం ఎలా సాధ్యం? అసలు రిటైల్ రంగంలో మేలు చేయని ఎఫ్.డి.ఐ, రైల్వేల్లో అభివృద్ధి ఎలా తెస్తుంది?

యధావిధిగా గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితం తమ నెత్తిపైకి వచ్చిందని రైల్వే మంత్రి సదానంద గౌడ కూడా నిన్న ఆర్ధిక మంత్రి పాడిన పాటే పాడారు. రైల్వే ప్రయాణాన్ని స్వర్గంగా చేస్తామన్నట్లుగా ఆయన ప్రకటించిన వివిధ సౌకర్యాలు కేవలం ఉన్నత ఆదాయ వర్గాలకు ఉద్దేశించినవే. సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునే వైఫై లాంటి సౌకర్యాల ద్వారా 20 శాతం ఉండే వ్యాపార, ఉన్నత తరగతి వినియోగదారుల సౌకర్యానికి పెద్ద పీట వేస్తూ 80 శాతం ఉండే సామాన్య ప్రయాణీకులకు గాలికి వదిలేశారు. 58 కొత్త రైళ్లు ప్రకటించినా వాటికి రెండో ప్రాధామ్యం మాత్రమే ఇస్తామని చెప్పారు. అంటే కొత్త రైళ్ల ప్రకటన ప్రకటనకే పరిమితం అని చెప్పకనే చెప్పారు.

2013-14లో ట్రాఫిక్ ఆదాయం 1,39,558 కోట్ల రూపాయలు వచ్చిందని మంత్రి తెలిపారు. ఇవి అంతకు ముందరి సంవత్సరం కంటే 942 కోట్ల రూపాయలు తక్కువ అని తెలిపారు.

2014-15 కోసం ప్రతిపాదించిన బడ్జెట్ లో సరుకు రవాణా ద్వారా రు. 1,05,770 కోట్ల ఆదాయం, ప్రయాణీకుల రవాణా ద్వారా రు. 44,645 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. నెలవారీ సీజన్ టికెట్ల వల్ల రు. 610 కోట్ల ఆదాయం త్యాగం చేస్తామని చెప్పారు. ఇతర ఆదాయాలను కూడా కలుపుకుని మొత్తం రు. 1,64,374 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తూ రు. 1,49,176 కోట్ల ఖర్చులను చూపారు.

వజ్ర చతుర్భుజి పేరుతో కొత్త పధకాన్ని రైల్వే మంత్రి ప్రకటించారు. ఈ పధకం కింద నౌకా రేవు నగరాలన్నింటినీ కలుపుతామని అందుకోసం 9 లక్షల కోట్లు అవసరం అవుతుందని చెప్పారు. ముంబై-అహ్మదాబాద్ సెక్షన్ లో మొట్ట మొదటి బులెట్ ట్రైన్ ప్రవేశ పెడతామని ఆ ఒక్క ప్రాజెక్ట్ కోసమే రు. 60,000 కోట్లు అవసరం అని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రయాణీకులపైన భారం వేయలేమ్ గనుక పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్ షిప్ (పి.పి.పి) కింద ఎఫ్.డి.ఐలను ఆహ్వానిస్తామని తెలిపారు.

భారీ ప్రాజెక్టులు, భారీ వ్యయాలు ప్రకటించడం ఆ పేరుతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గేట్లు తెరిచేయడం పాలకులు అవలంబించే మాసిపోయిన ఎత్తుగడే. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభం అయిన నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణం కూడా ఇలానే పి.పి.పి కిందా, ప్రపంచ బ్యాంకు అప్పుల తోనూ ప్రారంభించి ఎక్కడ పడితే అక్కడ టోల్ రుసుములు వసూలు చేస్తూ జనం నడ్డి ఇంకా విరుస్తూనే ఉన్నారు. పి.పి.పి కాంట్రాక్టు ముగిసే నాటికి జనం నడ్డి తెరిగి లేవలేనంతగా విరిగిపోవడమే కాకుండా రోడ్లు మళ్ళీ యధా స్ధితికి చేరడం ఖాయం. రైల్వేలలో కూడా పి.పి.పి ఇంత కంటే భిన్నంగా ఏమీ ఉండదు. ఆ ఖర్చంతా మళ్ళీ ప్రయాణీకుల నుండే ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు.

ఈసారి ఛార్జీల పెంపకం లేదని కొందరు మురిసిపోతున్నారు. కొద్ది రోజుల క్రితమే బడ్జెట్ కంటే ముందే పెంచిన రైల్వే ఛార్జీలను ఏమంటారో ఈ మురిసిపోతల పెద్ద మనుషులను అడగాలి. ఆ నెపాన్ని యు.పి.ఏ పైకి నెట్టినంత మాత్రాన వాస్తవంగా బాదిన క్రెడిట్ బాదినవారికి చెందకుండా పోతుందా? రైల్వే బడ్జెట్ తేనెటీగ కాటు వేసింది గానీ తెలివిగా ఆ కాటు కంటే ముందే కొండిని జనంపైకి వదిలింది. తీరా అసలు బడ్జెట్ లో పెంపకం కాటు లేదు కదా అని ప్రశ్నిస్తే అది వారి తెలివి కావచ్చు గానీ, కాటు నొప్పి ప్రయాణీకులు భరించక తప్పదు కదా?

రైల్వే బడ్జెట్ నిండా ఆధునిక గాలి మూటలు బాగానే కట్టారు. ప్రధాన స్టేషన్లలో వై.ఫై సౌకర్యం కల్పిస్తారట. బులెట్ రైలు తెస్తారట. వజ్ర చతుర్భుజి నిర్మిస్తారట. ప్రణాళికా వ్యయం పెంచారట. 58 కొత్త రైళ్లు వస్తాయి గానీ అవి బడ్జెట్ కాగితాల వరకే పరిమితం. 18 కొత్త లైన్లను సర్వే చేస్తారట. ఉన్న లైన్లలో డబులింగ్, ట్రిపిలింగ్ లైన్లుగా మార్చుతారుట. ఇవన్నీ ఎప్పటికీ పూర్తయ్యేనో లేక్కా పత్రం లేదు.

5 ప్రీమియం ట్రైన్లు ప్రకటించిన మంత్రి వాటిలో నాలుగు ఉత్తరాదికే కేటాయించారు. ఆ మిగిలింది సొంత రాష్ట్రం కర్ణాటకకు రాసేసుకున్నారు. మహిళా ప్రయాణీకుల రక్షణ కోసం కొత్తగా 4,000 మహిళా రైల్వే పోలీసులను నియమిస్తారు. తద్వారా మహిళల రక్షణ పట్ల నిబద్ధత ప్రకటించారు. పట్టాల రిపేర్లు, కాపాలా లేని రైల్వే క్రాసింగ్ ల తొలగింపు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు-అండర్ బ్రిడ్జిలు లాంటి ప్రయాణీకుల భద్రతా చర్యల కోసం 40,000 కోట్లు అవసరం అని చెప్పారు గానీ అవి నెరవేర్చుతామని చెప్పలేదు. ఓవర్-అండర్ బ్రిడ్జిల కోసం 1,785 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన భద్రతా సౌకర్యాలకు నిధులు ప్రకటించలేదు.

ఐ.టి వినియోగం పేరుతో ఇక నుండి పేపర్ లెస్ రైల్వేలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. మొబైల్ ఫోన్ల ద్వారా  నిమిషానికి 72,000 టికెట్లను బుక్ చేసుకుని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ సౌకర్యం ద్వారా ఒకేసారి 1,20,000 మంది టికెట్లు బుక్ చేసుకోవచ్చుట. ఈ సౌకర్యం పస ఎంతో ఆచరణలో గాని తెలియదు. ఆన్ లైన్ లో తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు చెప్పినా, వాస్తవంలో టికెట్లన్నీ దళారీలకే అప్పజెబుతున్న పరిస్ధితి ఉంది. తత్కాల్ కౌంటర్ ఓపెన్ చేసిన వెంటనే దళారీ కంపెనీలకు టికెట్లు అమ్మేసుకుని ప్రయాణీకులకు మాత్రం ఎంతకీ లోడ్ గాని సర్వర్లను అప్పజెబుతున్నారు. మొబైల్ టికెట్ బుకింగ్ పరిస్ధితి ఇంతకంటే భిన్నంగా ఉంటుందా అన్నది ఆచరణలో చూడవలసిందే.

రైల్వే బడ్జెట్ లో ప్రధాన మైన విషయం ఎఫ్.డి.ఐల ఆహ్వానం. మిగిలందంతా గత ప్రభుత్వాల ఒరవడినే ఎన్.డి.ఏ పాటించింది. మంచి రోజుల మోడి ప్రభుత్వం రైల్వేలను మొదటిసారిగా విదేశీ, స్వదేశీ ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం ద్వారా తమ భిన్నత్వాన్ని, కొత్తదనాన్ని చాటుకుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s