మూడు దశాబ్దాల నాటి సముద్ర జలాల సరిహద్దు వివాదంలో ఐక్యరాజ్య సమితి సంస్ధ ఒకటి ఇండియాకు వ్యతిరేకంగానూ, బంగ్లాదేశ్ కు అనుకూలంగానూ తీర్పు చెప్పింది. పొరుగు దేశాలతో వివాదాల్లో హిందూ-ముస్లిం సెంటిమెంట్లను చొప్పించి ఎట్టి పరిస్ధితుల్లోనూ ఇండియా వైపే మొగ్గు చూపాలని వాదించే బి.జె.పి/ప్రధాని మోడి ఆశ్చర్యకరంగా తీర్పును స్వాగతించారు. ప్రమాణ స్వీకారం రోజే సార్క్ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపి స్నేహ పూర్వక పొరుగు సంబంధాలకు ప్రాధాన్యతను ప్రకటించిన మోడి ఆ అవగాననే ఐరాస తీర్పు సందర్భంగానూ అనుసరించినట్లు కనిపిస్తోంది.
బంగాళా ఖాతం సముద్ర జలాలకు సంబంధించి బంగ్లాదేశ్, ఇండియాల మధ్య సరిహద్దు వివాదం నలుగుతోంది. దాదాపు 25,000 చదరపు కి.మీ పరిధిలోని సముద్ర జలాలు, అందులోని సహజ సంపద ఈ వివాదంలో కేంద్ర బిందువుగా ఉన్నాయి. ఈ ఏరియాలో దాదాపు ఐదింట నాలుగు వంతుల సముద్ర జలాలను బంగ్లాదేశ్ కు అప్పగిస్తూ ఐరాస ఆధ్వర్యంలోని పర్మినెంట్ కోర్ట్ ఫర్ ఆర్బిట్రేషన్ (పి.ఏ.సి) తీర్పు చెప్పింది.
పి.ఏ.సి తీర్పును ఇరు దేశాల స్నేహ సంబంధాల విజయంగా బంగ్లాదేశ్ అభివర్ణించింది. “ఇది మా స్నేహం సాధించిన విజయం. బంగ్లాదేశ్, ఇండియా ఇరు దేశాల ప్రజలకూ ఇది విజయమే (win-win)” అని బంగ్లాదేశ్ విదేశీ మంత్రి అబుల్ హాసన్ మహ్మూద్ విలేఖరుల సమావేశం పెట్టి ప్రకటించాడు. గత 30 యేళ్లుగా ఇరు దేశాల అభివృద్ధి ఈ వివాదం వల్ల కుంటుబడిందని ఆయన తెలిపారు. హాలండ్ (నెదర్లాండ్స్) లోని హేగ్ నుండి పని చేసే పి.సి.ఏ ఈ రోజు (జులై 8) వివాదంపై అంతిమ తీర్పు ప్రకటించింది.
వివాదం పరిష్కారానికి శాంతియుత మార్గాలను అనుసరించడానికే ఇండియా నిర్ణయించుకుందని అందుకు ఇండియాను అభినందిస్తున్నామని బంగ్లాదేశ్ విదేశీ మంత్రి కొనియాడారు. “న్యాయ మార్గం ద్వారా, శాంతియుత పద్ధతుల్లో సమస్యను పరిష్కరించుకోవడానికి ఇండియా సుముఖత చూపింది. అందుకే ఆ దేశాన్ని ప్రశంసిస్తున్నాము. ట్రిబ్యునల్ తీర్పును సైతం ఇండియా అంగీకరించింది” అని అబుల్ హసన్ తెలిపారు.
ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా సార్క్ నేతలందరినీ ఆహ్వానించడం ద్వారా మోడి కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. సదరు చర్య ద్వారా పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలనే తాము కాంక్షిస్తున్నామని, ఘర్షణ వాతావరణం తమకు ఇష్టం లేదని మోడి ప్రభుత్వం చెప్పినట్లయింది.
ప్రతిపక్షంలో ఉండగా పాక్ తో వివాదాలలోనూ, బంగ్లా వలసల విషయంలోనూ యు.పి.ఏ ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యనూ వివాదాస్పదం చేసి, సెంటిమెంట్లను రెచ్చగొట్టడానికి ఆసక్తి చూపిన బి.జె.పి/మోడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా యు-టర్న్ తీసుకోవడం పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ప్రతిపక్షంలో ఉండగా తాము అవలంబించిన ఘర్షణ వైఖరి వాస్తవంగా ఆచరణలో అమలు చేయబోమని, అప్పటి వైఖరి కేవలం జనం కోసమేననీ ఎన్.డి.ఏ ప్రభుత్వం పరోక్షంగా చెప్పిందని పరిశీలకులు కొందరు విశ్లేషించారు.
“సముద్ర జలాల సరిహద్దు వివాదం పరిష్కారం ద్వారా ఇండియా, బంగ్లా దేశ్ ల మధ్య పరస్పర అవగాహనను మరింతంగా పెంపొందిస్తుంది. దీర్ఘకాలిక వివాదాన్ని ఒక కొలిక్కి తెస్తుంది” అని భారత విదేశాంగ శాఖ జారీ చేసిన ప్రకటన పేర్కొంది. “బంగాళాఖాతం లోని ఈ భాగం ఆర్ధికంగా అభివృద్ధి సాధించడానికి ఈ తీర్పు మార్గం సుగమం చేస్తుంది. సదరు అభివృద్ధి ఇరు దేశాలకు లాభకరం” అని ప్రకటన పేర్కొంది.
సరిహద్దు వివాదంపై ఆర్బిట్రేషన్ కు బంగ్లాదేశ్ 2009లో ప్రతిపాదనలు పంపగా దానికి ఇండియా అంగీకరించింది. సముద్ర చట్టాలపై ఐరాస సదస్సు (U.N. Convention on the Law of the Sea) సూత్రాల ప్రాతిపదికన అంతర్జాతీయ సముద్ర జల వివాదాల పరిష్కారానికి యంత్రాంగాన్ని ఐరాస ఏర్పరిచింది. ఇండియా-బంగ్లాల వివాదం పరిష్కారం కూడా ఈ సూత్రాలకు అనుగుణంగానే జరిగింది.
బంగ్లాదేశ్, మియాన్మార్ ల మధ్య కూడా బంగాళాఖాతం జలాలపై వివాదం నెలకొంది. దీనిని హ్యాంబర్గ్ లోని ‘ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఆన్ ద లా ఆఫ్ ద సీ’ సంస్ధ నిర్వహించిన ఆర్బిట్రేషన్ ద్వారా 2012లో ఇరు దేశాలు పరిష్కరించుకున్నాయి. ఈ రెండు పరిష్కారాల ద్వారా బంగ్లాదేశ్ మొత్తం 118,813 చదరపు కి.మీ సముద్ర జలాలను ఆధీనంలోకి తెచ్చుకుంది. దానితో పాటు 200 నాటికల్ మైళ్ళ దూరం వరకు ఎక్స్ క్లూజీవ్ ఎకనమిక్ జోన్ హక్కులను సంపాదించింది. ఎక్స్ క్లూజివ్ ఎకనమిక్ జోన్ కిందకు వచ్చే సముద్ర జలాల్లో సజీవ, నిర్జీవ సహజ వనరులను సొంతం చేసుకునే హక్కు లభిస్తుంది. అనగా మత్స్య సంపద, చమురు, సహజవాయువు సంపదలు సొంతం అవుతాయి.
న్యాయం ఎటు ఉంటే తీర్పు అటు ఉంటుంది. బంగ్లాకు న్యాయం జరిగితే సంతోషమే. దాన్ని మనదేశం కూడా అంగీకరించడం సంతోషం. అటు నదీ జలాల విషయంలోనూ ఇరుదేశాలూ ఓ ఒప్పందానికి వస్తే బాగు.
అన్నట్లు PAC కోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది మరి మమతా బెనర్జీ గారు ఒప్పుకుంటారో లేదో..?