మంచి రోజులు కాదు యు.పి.ఏ రోజులే తిరిగొచ్చాయ్


Arun Jaitley

“అచ్ఛే దిన్ ఆనేవాలా హై” (మంచి రోజులు వస్తున్నాయ్)… ఇది బి.జె.పి/ఎన్.డి.ఏ/నరేంద్ర మోడి ఎన్నికల నినాదం. ఇవ్వడానికి ఈ నినాదమే ఇచ్చినా తాము అమలు చేస్తున్నది మాత్రం యు.పి.ఏ విధానాలే అని పార్లమెంటు సాక్షిగా ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఆహార ధరలు పెరగడమే కాకుండా ద్రవ్యోల్బణం ఊర్ధ్వ స్ధాయిలో కొనసాగుతుండడంతో స్వల్ప కాల చర్చకు సమాధానం ఇస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. యు.పి.ఏ చేసిన నిర్ణయాలనే తాము అమలు చేస్తున్నామని ఆయన చెప్పడంతో వచ్చింది మోడి చెప్పినట్లు మంచి రోజులు కాదని యు.పి.ఏ రోజులే ఎన్.డి.ఏ రూపంలో వచ్చాయని స్పష్టం అయింది.

ఉల్లి, బంగాళాదుంప ధరలు అదుపులోనే ఉన్నాయని ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇస్తూ జైట్లీ రాజ్యసభలో చెప్పారు. ద్రవ్యోల్బణంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ప్రభుత్వం స్వల్ప కాల చర్చకు అనుమతి ఇచ్చింది. “మంచి రోజులు వస్తున్నాయి” అని హామీ ఇచ్చిన మోడి ప్రభుత్వం మంచి రోజులంటే రైల్వే ఛార్జీలు పెంచడం, ఆహార ధరలు పెరగడమా అని బి.ఎస్.పి, ఎస్.పి, సి.పి.ఎం, కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు ప్రశ్నించారు.

ప్రతిపక్షాల విమర్శలకు అరుణ్ జైట్లీ సమాధానం ఇస్తూ బాధ్యత అంతా యు.పి.ఏ పైకి నెట్టేశారు. 41 రోజుల తమ ప్రభుత్వంపైన ప్రతిపక్షాలు దాడి చేయడం సమంజసం కాదంటూ యు.పి.ఏ వారసత్వమే తమ ప్రభుత్వాన్ని పీడిస్తోందని చెప్పారు. వాదనకు అంతవరకు అంగీకరించినా జైట్లీ చెప్పిన మరి కొన్ని అంశాలు వింటే దేశ ప్రజలు ముక్కున వేలు వేసుకోక తప్పదు.

రైల్వే సరుకు రవాణా ఛార్జీలు 6.5 శాతం, ప్రయాణీకుల ఛార్జీలు 14.2 శాతం మోడి ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. మంచి రోజులు అంటే ఇవేనా అని ప్రశ్నించాయి. దానికి సమాధానం ఇస్తూ జైట్లీ ఈ నిర్ణయం తమది కాదని అసలు గుట్టు విప్పారు. ఫిబ్రవరి 11 తేదీనే రైల్వే ఛార్జీల పెంపుదలకు యు.పి.ఎ ప్రభుత్వం నిర్ణయించిందని ఆ నిర్ణయాన్నే తాము అమలు చేశామని ఆయన చెప్పారు. ఈ నిర్ణయాన్ని యు.పి.ఎ మే 16 నుండి అమలు చేయడానికి పూనుకుందని కానీ దేశ ప్రజలు తమను అధికారం నుండి తప్పించనున్నారని అర్ధం కావడంతో కొన్ని గంటలలోనే అమలును ఉపసంహరించుకున్నారని తెలిపారు.

బానే ఉంది గానీ యు.పి.ఎ తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేసేపనైతే దేశ ప్రజలు ఎన్.డి.ఎ ని ఎందుకు గెలిపించినట్లు? వారు హామీ ఇచ్చినట్లు ఏవో మంచి రోజులు వస్తాయనే కదా? మంచి రోజులకు బదులు యు.పి.ఎ నిర్ణయాలను అమలు చేయడానికే ఎన్.డి.ఎ ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. యు.పి.ఎ నిర్ణయం భేషుగ్గా ఉంది కనకనే ఎన్.డి.ఎ ప్రభుత్వం అమలు చేస్తోందని భావించాలా? అదే నిజమైతే యు.పి.ఎ వారసత్వమే తమకు వచ్చిందని వెటకారం ఎందుకు? యు.పి.ఎ రోజులు చెడ్డవైతే దాని నిర్ణయాలు రద్దు చేయాలి. దానికి బదులు వాటినే అమలు చేస్తున్నారు గనుక యు.పి.ఎ రోజులు మంచి రోజులే అని చెప్పదలిచారా?

రైల్వే మంత్రి సదానంద గౌడ ముందు హాబ్సన్స్ ఛాయిస్ మాత్రమే ఉందని, రైల్వేల పరిస్ధితి అత్యంత ఘోరంగా ఉండడంతో ఆ ఛాయిస్ ని ఎంచుకోక ఆయనకు తప్పలేదని జైట్లీ భాషా పరిజ్ఞానం ప్రదర్శించారు. హాబ్సన్స్ అనే పెద్దాయన ఇంగ్లాండ్ కి చెందిన గుర్రాల వ్యాపారి. తమ గుర్రాలన్నీ అమ్ముడుబోవడానికి ఆయన ఒక ఎంపిక పద్ధతిని మాత్రమే కస్టమర్ల ముందు ఆయన ఉంచేవాడుట. గుర్రపు శాల గేటుకు ఏ గుర్రం దగ్గరగా ఉంటే దానినే కొనాలని లేదంటే అసలు కొననే అక్కర్లేదనీ ఆయన చెప్పేవాడు. దానితో కస్టమర్ కి ఆచరణలో కేవలం ఒకే ఒక్క ఛాయిస్ మాత్రమే దక్కేది. ఇదే హాబ్సన్స్ ఛాయిస్ గా వాడుకలోకి వచ్చింది.

రైల్వేల పరిస్ధితి ఘోరంగా ఉంది కాబట్టి రేట్లు పెంచామని జైట్లీ చెబుతున్నారు. ఇంతకీ హాబ్సన్ ఎవరు? యు.పి.ఏ ప్రభుత్వామా లేక రైల్వే మంత్రి సదానంద గౌడ గారా? యు.పి.ఏ ప్రభుత్వమే హాబ్సన్ అయితే ప్రభుత్వం మారింది గనుక ఇక హాబ్సన్ పెత్తనం ముగిసినట్లే. కాబట్టి కొత్త యజమాని సదానంద గౌడ/ఎన్.డి.ఏ ప్రభుత్వం తన నిర్ణయం తాను తీసుకుని ఉండాలి. నిర్ణయం తీసుకుంది తామే అయితే ఇక యు.పి.ఏ ని నిందించడం మానుకోవాలి. నిర్ణయం మాత్రం తామే తీసుకోవాలి, నెపం మాత్రం యు.పి.ఏ పైకి నెట్టొచ్చన్న మోస బుద్ధితోనే యు.పి.ఏ నిర్ణయాన్ని ఎన్.డి.ఏ ప్రభుత్వం అమలు చేసిందన్నది అసలు వాస్తవం. వాస్తవాన్ని మాసిపూసి మారేడు కాయ చేస్తూ ప్రజల ఈతి బాధలతో సంబంధం ఉన్న నిర్ణయాన్ని సామెతలతో కమ్మి పుచ్చడం ఏ మంచి రోజులకు సూచిక?

“ఆయన (రైల్వే మంత్రి) తనకు ముందరి శక్తిహీన ప్రభుత్వం తీసుకున్న తీసుకున్న ప్రజా వ్యతిరేక (unpopular) నిర్ణయాన్ని, అది జాతీయ ప్రయోజనాలు కాంక్షించేదే అయినప్పటికీ కొనసాగించడం మానుకోవాలా లేక ఆ నిర్ణయాన్ని తీసేసుకుని అది రైల్వేలను నడపడానికి అవసరమైందని దేశ ప్రజలకు నచ్చజెప్పాలా?” అని రైల్వే మంత్రి నిర్ణయాన్ని వెనకేసుకోస్తూ అద్భుతమైన హాబ్సన్స్ ఛాయిస్ ని జైట్లీ రాజ్య సభ ముందు ఉంచారు.

జైట్లీ గారి లాజిక్ చూడడానికే అద్భుతం. కానీ అది ఎంత దుర్భరమో తరిచి చూస్తే గాని తెలియదు. గత ప్రభుత్వం గుణం లేని శక్తిహీన ప్రభుత్వం అట. అది ప్రజావ్యతిరేక నిర్ణయం తీసుకుందిట. కానీ అది జాతీయ ప్రయోజనాల రీత్యా అవసరమైనదేనట. అలాంటప్పుడు యు.పి.ఏ ప్రభుత్వం శక్తిహీనం ఎలా అయింది? బహుశా నిర్ణయం తీసుకుని కూడా అమలు చేయలేనందుకు, ఓడిపోతామన్న భయంతో అమలు చేసిన గంటల్లోనే వెనక్కి తీసుకున్నందుకు అది శక్తిహీన ప్రభుత్వం అని జైట్లీగారి భావన! బి.జె.పి/ఎన్.డి.ఏ ప్రభుత్వం మాత్రం శక్తివంతమైనది. ఎందుకంటే మంచి రోజులు తెస్తారని జనం ఎగబడి ఓట్లు గుద్ది అధికారం ఇచ్చారు గదా, అందుకు. ఆ జనం ఇచ్చిన శక్తితోనే జనవ్యతిరేకం అయినప్పటికీ జాతీయ ప్రయోజనాల కోసం ధరలను అమాంతం పెంచేశారు.

కాబట్టి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు వ్యతిరేకంగా ఉపయోగించే ధైర్యం చేసే ప్రభుత్వాలు శక్తివంతమైన, ధైర్యవంతమైన ప్రభుత్వాలు. జనం ఓట్లు వేయరేమోనని భయపడి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుని కూడా అమలు చేయకపోతే అది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం. ఇంతకీ జైట్లీ గారు చెప్పిన జాతీయ ప్రయోజనాలంటే అందులో జనం ప్రయోజనాలు ఉండవా? దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న పెద్దాయన మాటలకు వీసమెత్తు విలువ కూడా లేదా? జాతీయ ప్రయోజనాలు అంటే ప్రజల కొనుగోలు శక్తి పెంచకుండానే ధరలు అమాంతం పెంచేయడమా?

డీజెల్ రేటు లీటర్ కి రూపాయి పెంచడాన్ని కూడా ఇదే లాజిక్ తో జైట్లీ సమర్ధించుకున్నారు. డీజెల్ రేట్లు ప్రతి నెలా అర్ధ రూపాయి పెంచాలని యు.పి.ఏ నిర్ణయం తీసుకుందని దానినే తాము అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా యు.పి.ఏ తీసుకుందని చెప్పేస్తే ఇక ఎన్.డి.ఏ అంటూ ఇంకో కూటమి పెట్టుకోవడం ఎందుకని? అందరూ కలిపి ఒకే ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఎన్నికల గోల లేకుండా పదవుల్ని రొటేషన్ పద్ధతి మీద అనుభవిస్తే సరిపోతుంది గదా? ఆ మేరకు జనానికి కూడా అందరూ ఒకటే అని తెలుస్తుంది.

నిజానికి జరుగుతోంది ఇదే. యు.పి.ఏ, ఎన్.డి.ఏ అంటూ రెండు కూటములు పెట్టుకోవడం కేవలం తమలో తమకు ఉన్న విభేదాలను పరిష్కరించుకోలేకపోవడం వల్లనే. తమ మధ్య వైరుధ్యాలను పాలకవర్గ గ్రూపులు సామరస్యంగా పరిష్కరించుకోలేక ఎన్నికల పేరుతో జనం వద్దకు వస్తున్నారు. ఓట్ల జాతర నిర్వహించి ఓటర్ల తీర్పు అంటూ అధికారం ఏ గ్రూపు నిర్వహించాలో నిర్ణయించుకుంటున్నారు. అధికారం ఏ గ్రూపుకు అప్పగించాలో నిర్ణయించడం వరకే ప్రజల పాత్ర. ఇక ప్రభుత్వ పాలన పేరుతో జరిగే సంపదల భోజ్యం అంతా  రాజులకు (ఎం.పిలు, ఎమ్మేల్యేలు, బ్యూరోక్రాట్లు తదితర రూపాలలో ఉన్న ఒకనాటి రాజులు)  మాత్రమే పరిమితం. సదరు రాజులకు సవాలక్షా సేవలు చేయాలి గనుకా, వారి వైరుధ్యాలను అప్పుడప్పుడూ ఓట్ల గుద్దుడు ద్వారా పరిష్కరించాలి గనకా జనం పాత్ర కాస్త అవసరం అవుతుంది.

ఏతావాతా తేలేది ఏమిటంటే యు.పి.ఏ, ఎన్.డి.ఏ అంటూ వారిలో వారినే ఒకరిని దించి మరొకరిని ఎక్కిస్తూ పోతే జనానికి మంచి రోజులు అంటూ ఏమీ రావు. ఆ మంచి రోజులు ఏమన్నా ఉంటే వాటి కోసం రాజులపై ఆధారపడడం బదులు జనమే తమకు తాము తెచ్చుకోవాలి.

2 thoughts on “మంచి రోజులు కాదు యు.పి.ఏ రోజులే తిరిగొచ్చాయ్

  1. ఎవరో వస్తారని….ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా….
    నిజం మరచి నిదురపోకుమా……

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s