(ఈ సంపాదకీయం ది హిందూ పత్రిక ఎప్పటి అవగానలో భాగంగా కనిపించడం లేదు. మోడి అధికారంలోకి వచ్చినప్పటి నుండీ బి.జె.పి నూతన హయాంలో సానుకూల అంశాలను కనిపెట్టడానికి ఆపసోపాలు పడుతున్నట్లు కనిపిస్తున్న ది హిందూ ధోరణిలోనే ఈ సంపాదకీయం సాగింది. లేదంటే తెలిసి తెలిసీ అమెరికాతో సత్సంబంధాలను కోరే దుస్సాహసానికి పత్రిక ఎందుకు పూనుకుందో అంతుబట్టని విషయం. కోరి దృత రాష్ట్ర కౌగిలిలోకి వెళ్ళమని ప్రోత్సహిస్తున్న ఇటువంటి సంపాదకీయం ది హిందూ నుండి వెలువడడం ఒకింత ఆశ్చర్యకరమే కాక బెంగ కలిగించే విషయం కూడా. కుడి-ఎడమల మధ్య సరిహద్దు రేఖ అంతకంతకూ మసకబారుతున్న విదూషక ధోరణికి ది హిందూ గురికాలేదు కదా!? -విశేఖర్)
ఇండియా అమెరికా సంబంధాలలో నెర్రెను కనిపెడుతూ ఎప్పుడూ ఏదో ఒకటి మార్గానికి అడ్డు వస్తూ ఉంటోంది. (భారత)రాయబారి దేవయాని ఖోబ్రగదే తగాదా నెలకొన్నప్పటికీ, గుజరాత్ మారణకాండ వల్ల ప్రధాని నరేంద్ర మోడీకి వీసా ఇవ్వడానికి అమెరికా నిరాకరించినప్పటికీ ద్వైపాక్షిక సంబంధాల్లో కాస్త ఉత్సాహం ప్రవేశపెట్టడానికి ఇరు పక్షాలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు శాపగ్రస్తం అయినట్లు కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ పైన గూఢచర్యం నిర్వహించడానికి (అమెరికన్) నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ 2010లో అధికారికంగా అనుమతి కోరి, సఫలం అయిందన్న వెల్లడి తాజా అవాంతరం. ఈ వ్యవహారం రిపబ్లికన్ సెనేటర్ మరియు విదేశీ వ్యవహారాల సెనేట్ కమిటీ సభ్యుడు అయిన జాన్ మెక్ కెయిన్ భారత సందర్శనను సైతం మబ్బులు కమ్మినట్లు కమ్మేసింది. విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్, ద వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ద్వారా తాజాగా వెల్లడి చేసిన పత్రాల్లో భాగంగా ఈ సంగతి (బి.జె.పిపై గూఢచర్యం) వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ బహిరంగంగా అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం గూఢచర్యానికి ఏ పద్ధతులను వినియోగించారో, పార్టీలో ఏ నాయకులను లక్ష్యంగా చేసుకున్నారో ఇంకా స్పష్టంగా తెలియదు. బి.జె.పి అధికారంలోకి రావడానికి 4 సంవత్సరాల ముందే ఇది జరగడం ఒకింత ఆసక్తికరం.
అయితే ఈ వెల్లడిలో అంతగా ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు. దాదాపు ప్రతి దేశమూ ప్రతి ఇతర దేశంపై గూఢచర్యం నిర్వహిస్తుంది. ఆ క్రమంలో ప్రాముఖ్యత ఉన్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టవు. అత్యంత ప్రాచీనమైన వృత్తులలో గూఢచర్యం ఒకటి. కేవలం పద్ధతులు మాత్రమే ఆధునిక రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఒక దేశం యొక్క పద్ధతులు ఎంతటి ఆధునికం అన్నదీ ఆ దేశానికి అందుబాటులో ఉన్న వనరులు నిర్ణయిస్తాయి. ఇతర దేశాల కంటే ఎక్కువగా అమెరికా చాలా తరచుగా బహిరంగం కావడమే జరుగుతోంది. గూఢచర్యం ‘ఆమోదయోగ్యం’ కాదని అభివర్ణిస్తూ ఇండియా సీనియర్ అమెరికా రాయబారిని పిలువనంపి అభ్యంతరం తెలిపింది. కానీ నిజాయితీగా మాట్లాడుకుంటే ఇతర దేశాల్లోగాని, దేశం లోపల గానీ రాజకీయ పార్టీలపైన గూఢచర్యం చేయబోనని న్యూ ఢిల్లీ చెప్పజాలదు. కాబట్టి భారత్ తెలిపిన నిరసన అసలుకే గూఢచర్యం ఉండరాదన్న దాని నైతిక సాధికారతతో కూడినదిగా పొరబాటుపడరాదు.
తాజా వెల్లడి చేసిందేమిటంటే భారతీయుడి మనసులో అమెరికా పట్ల మరింత ప్రతికూలతను పాదుకొల్పడం. దీనివల్ల గతాన్ని త్వరగా వెనక్కి నెట్టడం ఇరు దేశాల ప్రభుత్వాలకు కష్టం అవుతుంది. ఇప్పటికే ఖోబ్రగదే వ్యవహారానికి సంబంధించి ద్వైపాక్షిక సంబంధాలపైన ఒక మేఘం ఆవరించి ఉంది. వచ్చే సెప్టెంబర్ లో వాషింగ్టన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి రెడ్ కార్పెట్ స్వాగత సత్కార్యాన్ని అందిస్తామని ఒబామా ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వీసా రద్దు చేసిన విషయం మాత్రం ఇంకా మర్చిపోలేదు.
పొరుగునే ఉన్న దక్షిణాసియా దేశాలకు స్నేహహస్తం చాచడం బట్టి చూసినా, చైనా, రష్యా, ఫ్రాన్స్, సింగపూర్ దేశాలకు స్వాగతం పలకడాన్ని బట్టీ తమ విదేశీ విధాన ప్రాధామ్యాలు గత ప్రభుత్వం కంటే భిన్నమైనవని న్యూఢిల్లీ సందేశం పంపినట్లు కనిపిస్తోంది. నూతన ప్రభుత్వంతో సంబంధం పెట్టుకోవడానికి (అమెరికా) అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ (ఉప విదేశాంగ మంత్రికి సమానం) నిశా బిశ్వాల్ ఇండియా సందర్శించగా, అది కూడా అత్యున్నత స్ధాయి చైనా విదేశీ మంత్రి రాకతో వెలతెలాపోయింది. కానీ అమెరికా-ఇండియా మధ్య మంచి సంబంధాలు నెలకొంటే అవి ఇరు పక్షాలకూ “చైతన్యయుతమైన జాతీయ ప్రయోజనాల” కోవలోకి వస్తాయి. సెప్టెంబర్ నాటి వాషింగ్టన్ శిఖరాగ్ర సమావేశం నాటికన్నా మంచు తెరలు తొలగడానికి ఏదో ఒక మార్గాన్ని వెతికి పట్టుకోవాలి.