హెలికాప్టర్ కుంభకోణం: గవర్నర్ల తొలగింపు బి.జె.పి మెడకు!


M.K.Narayanan and B.V.Wanchoo

M.K.Narayanan and B.V.Wanchoo

యు.పి.ఏ నియమించిన గవర్నర్లను తప్పించడానికి హెలికాప్టర్ల కుంభకోణాన్ని వేగవంతం చేసిన బి.జె.పి ప్రభుత్వం చివరికి సదరు కుంభకోణం ఎన్.డి.ఏ మెడకు చుట్టుకునే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి సలహా మేరకు పదవిలో కొనసాగుతున్న కాంగ్రెస్/యు.పి.ఏ గవర్నర్లు ఇద్దరినీ సి.బి.ఐ సాక్షుల హోదాలో ప్రశ్నించింది. తీరా విచారణ సందర్భంగా గవర్నర్లిద్దరూ ఎన్.డి.ఏ మొదటి పాలనలోనే హెలికాప్టర్ కుంభకోణానికి బీజం పడిన సంగతిని బైటికి తీయడంతో పరిస్ధితి తారుమారయింది.

అగస్టా వెస్ట్ లాండ్ వి.వి.ఐ.పి హెలికాప్టర్ల కొనుగోలు విషయంలో లంచాలు చేతులు మారినట్లు ఇటలీ ప్రభుత్వం గత సంవత్సరం జనవరిలో తమ కంపెనీ ఫిన్ మెక్కానికా సి.ఇ.ఓ గిసెప్పే ఒర్శి ని అరెస్టు చేయడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రధాని, రాష్ట్రపతి తదితర అత్యున్నత నేతల ప్రయాణ, రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షించే కమ్యూనికేషన్ స్వాడ్రన్ (ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగం) కోసం 12 (3 ఇంజన్ల) హెలికాప్టర్లను ఆగస్టా వెస్ట్ లాండ్ కంపెనీ నుండి కొనుగోలు చేసేందుకు రు. 3,700 కోట్ల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో రు. 350 కోట్లు లంచం నిమిత్తం చేతులు మారినట్లు ఇటలీ ప్రభుత్వం ఆరోపించింది.

పర్యవసానంగా భారత ప్రభుత్వం సైతం ఒప్పందాన్ని రద్దు చేసుకోక తప్పలేదు. గత రక్షణ మంత్రి ఆంటోనీ ఒప్పందాన్ని రద్దు చేసి విచారణకు ఆదేశించడంతో సి.బి.ఐ విచారణ చేసి ఐ.ఏ.ఎఫ్ మాజీ అధిపతి ఎస్.పి.త్యాగీ పైన కేసు నమోదు చేసింది. హెలికాప్టర్లు ఎగరవలసిన గరిష్ట ఎత్తును 6,000 మీటర్ల నుండి 4,000 మీటర్లకు తగ్గించాలని ఐ.ఏ.ఎఫ్ నిర్ణయించిందని, ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీ కోసమే ఈ మార్పు జరిగిందని సి.బి.ఐ ఆరోపించింది. ఐ.ఏ.ఎఫ్ అధిపతిగా ఎస్.పి.త్యాగి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపించారు. అసలు కొనుగోళ్ల క్రమం అంతా తాను రిటైర్ అయ్యాక జరిగిందని చెబుతున్న త్యాగి ఇటలీ కంపెనీ దళారిని కలిసిన సంగతిని మాత్రం అంగీకరించారు.

అయితే ఒప్పందం చేసుకుంది యు.పి.ఏ కాదు. మొదటి ఎన్.డి.ఏ పాలనలో వాజ్ పేయి ప్రధానిగా ఉండగా ఈ ఒప్పందం జరిగింది. హెలికాప్టర్ ఎగరాల్సిన గరిష్ట ఎత్తును తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్న సమావేశంలో అప్పటి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న ఎం.కె.నారాయణన్, అప్పటి ఎస్.పి.జి (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు) అధిపతిగా ఉన్న బి.వి.వాంఛూలు పాల్గొన్నారు. బి.జె.పి ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం జరిగినందున ఈ కుంభకోణం కాస్తా బి.జె.పి మెడకే చుట్టుకుంటోందని పరిశీలకులు భావిస్తున్నారు.

కుంభకోణంలో ప్రధాన విషయం ఎత్తు తగ్గించడమే అని సి.బి.ఐ గుర్తించింది. ఇలా ఎత్తు తగ్గించినందునే టెండర్లలో పాల్గొనే అవకాశం ఆగస్టా వెస్ట్ లాండ్ కంపెనీ (ఫిన్ మెక్కానికా కంపెనీకి అనుబంధం) కి దక్కింది. హాలికాప్టర్లు గరిష్టంగా 6,000 మీటర్ల ఎత్తు ఎగరాలని మొదట నిర్ణయించారు. కానీ ఆగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్లు అంత ఎత్తు ఎగరలేవు. సదరు కంపెనీ టెండర్లు దాఖలు చేయడానికి వీలుగా ఎత్తు తగ్గించారని సి.బి.ఐ నిర్ధారణ. ఎలా ఎత్తు తగ్గించి ఆగస్టా కంపెనీకే కాంట్రాక్టు దక్కే విధంగా చేయడంలో త్యాగి ప్రధాన పాత్ర పోషించారని సి.బి.ఐ ఆరోపిస్తోంది.

అయితే ఇలా ఎత్తు తగ్గించే నిర్ణయం సూత్రబద్ధంగా ఎన్.డి.ఏ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని పశ్చిమ బెంగాల్ (మాజీ) గవర్నర్ గా ఉన్న ఎం.కె.నారాయణన్, గోవా (మాజీ) గవర్నర్ బి.వి.వాంఛూలు సి.బి.ఐ విచారణలో స్పష్టం చేశారని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ది హిందూ తెలిపింది.

వాంఛూ ఇచ్చిన వివరాల ప్రకారం ప్రధానమంత్రి కార్యాలయంలోని అత్యున్నత అధికారులు 2003లో సమావేశం ఏర్పాటు చేసి ఎత్తు తగ్గించాలని సూత్రబద్ధంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో నిర్ణయానికి ముందు జాతీయ బధ్రతా సలహాదారు, ఎస్.పి.జి అధిపతి  అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం ఎయిర్ హెడ్ క్వార్టర్స్ మరియు రక్షణ శాఖలకు పి.ఎం.ఓ నుండి లేఖలు వెళ్ళాయి. వి.వి.ఐ.పి హెలికాప్టర్ల కొనుగోళ్ల వ్యవహారాన్ని పునఃపరిశీలించి “ఆచరణ సాధ్యమైన ప్రమాణాలను” నిర్ణయించాలని ఆ లేఖలు కోరాయి. తద్వారా కాప్టర్ కొనుగోళ్లలో పోటీని ప్రోత్సహించాలని పి.ఎం.ఓ కోరింది.

తదనంతరం 2005 మార్చి 1 తేదీన ఒక సమావేశం జరగ్గా అందులో వాంఛూ, నారాయణన్ లు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే ‘సర్వీసింగ్ సీలింగ్’ ను 6,000 నుండి 4,5000 మీటర్లకు తగ్గించాలని అంతిమ నిర్ణయం జరిగింది. అనగా ఎత్తు తగ్గించాలన్న సూత్రబద్ధ నిర్ణయం ఎన్.డి.ఏ హయాంలో జరిగితే, వాస్తవ నిర్ణయం యు.పి.ఏ హయాంలో జరిగింది. ఆ విధంగా లంచాలు చేతులు మారిన కుంభకోణంలో యు.పి.ఏ, ఎన్.డి.ఏ లు రెండూ భాగం పంచుకున్నాయి.

మోడి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నియమిత గవర్నర్లను తొలగించి తమ రాజకీయ నిరుద్యోగులను వారి స్ధానంలో నియమించుకోవాలని బి.జె.పి భావించింది. అయితే పశ్చిమ బెంగాల్, గోవా గవర్నర్లు అందుకు మొరాయించారు. వారు రాజీనామా చేయాల్సిందేనని బి.జె.పి నేతలు బహిరంగ ప్రకటనలు చేసినప్పటికీ వారు లొంగి రాలేదు. ఈ నేపధ్యంలో హెలికాప్టర్ల కుంభకోణం కేసులో గవర్నర్లు ఇద్దరినీ సాక్షులుగా విచారించాలని సి.బి.ఐ యు.పి.ఏ హయాంలో చేసిన విన్నపం ఎన్.డి.ఏ పాలకులకు అక్కరకు వచ్చింది. గవర్నర్లకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది గనుక విచారణకు అనుమతి ఇవ్వబోమని యు.పి.ఏ ప్రభుత్వం చెప్పింది. ఆ నిర్ణయాన్ని ఎన్.డి.ఏ నియమించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి తిరగదోడారు. గవర్నర్లు అయినప్పటికీ సాక్షులుగా విచారించవచ్చని ఆయన సలహా/ఆదేశం ఇచ్చేశారు.

ఫలితంగా ఇద్దరు గవర్నర్లు రాజీనామా చేయక తప్పలేదు. సి.బి.ఐ తమను ప్రశ్నించాకనే ఇద్దరు గవర్నర్లు రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎం.కె.నారాయణన్ జూన్ 30 తేదీన రాజీనామా చేయగా గోవా గవర్నర్ జులై 4 తేదీన రాజీనామా చేశారు. పోతూ పోతూ ఎన్.డి.ఏ ప్రధాని కార్యాలయం పాత్రను వెల్లడి చేసి మరీ వెళ్లారు. ఆ విధంగా ఎన్.డి.ఏ సైతం యు.పి.ఏ తానులో గుడ్డే అని భారత ప్రజలకు తెలుసుకునే భాగ్యం దక్కింది. పాలకుల మధ్య వైరుధ్యాల వల్ల ఇలా అనుకోకుండా ఒక్కోసారి జనానికి పచ్చి నిజాలు తెలుసుకునే అవకాశం వస్తుంది.

One thought on “హెలికాప్టర్ కుంభకోణం: గవర్నర్ల తొలగింపు బి.జె.పి మెడకు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s