రు. 70 వేల కోట్ల ఆస్తుల అమ్మకానికి మోడి రెడీ


గెలిపించిన జనానికి చేదు మాత్రలు

గెలిపించిన జనానికి చేదు మాత్రలు

కోశాగార క్రమ శిక్షణ గురించి ఈ సరికే విడతలు విడతలుగా లెక్చర్లు దంచిన మోడి ప్రభుత్వం రు. 70 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ ఆస్తులను స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీల విందు భోజనం కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కోశాగార క్రమ శిక్షణ (Fiscal Discipline) లేదా కోశాగార స్ఢిరీకరణ (Fiscal Consolidation), ఆర్ధిక క్రమ శిక్షణ, ఆర్ధిక పొదుపు… ఈ పదజాలాలన్నీ ఒకే ఆర్ధిక ప్రక్రియకు వివిధ రూపాలు. అన్నింటి అర్ధం ఒకటే బడ్జెట్ నుండి జనానికి ఇచ్చేదానిలో కోత పెట్టి ఆ వార స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలను మేపడం.

ఇందులో భాగంగా వచ్చే గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో ఏకంగా 11.7 బిలియన్ డాలర్ల మేరకు (దాదాపు 70,200 కోట్ల రూపాయలకు సమానం) ప్రభుత్వ రంగ కంపెనీల ఆస్తులను తెగనమ్మడానికి ప్రభుత్వం పధక రచన చేస్తోందని ప్రభుత్వ వర్గాలు సమాచారం ఇచ్చాయని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ఇది యు.పి.ఏ ప్రభుత్వం గత నాలుగేళ్లలో తెగనమ్మిన ప్రభుత్వ ఆస్తుల కంటే ఎక్కువ. ప్రభుత్వ కంపెనీల వాటాలను ప్రైవేటు కంపెనీలకు అమ్మేయడం ద్వారా గత 4 సంవత్సరాలలో యు.పి.ఏ ప్రభుత్వం రు 56,900 కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు సమకూర్చింది. ఆ మేరకు ప్రభుత్వ ఆర్ధిక శక్తి, ఆదాయం కుదించుకుపోగా ఉపాధి సైతం మట్టిగొట్టుకుపోయింది.

1991లో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటికీ ఆర్ధిక వ్యవస్ధలోని వివిధ అంగాలు ఇంకా ప్రభుత్వం గుప్పెట్లోనే ఉన్నాయని పశ్చిమ కార్పొరేట్ వార్తా సంస్ధలు తరచుగా బాధపడుతుంటాయి. అందువల్లనే ఆర్ధిక వృద్ధి మందగించిందని నిర్ధారిస్తూ తీర్పు చెబుతాయి. మరి పూర్తిగా మార్కెట్ ఎకానమీయే ఆధిపత్యంలో ఉన్న అమెరికా, ఐరోపా రాజ్యాలు పదే పదే ఆర్ధిక సంక్షోభాల్లో ఎందుకు కూరుకుపోతున్నాయో అవి చెప్పనే చెప్పవు.

పైగా, 2007-08 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దెబ్బకి అమెరికా ఆర్ధిక వృద్ధి తీవ్రంగా కుంటుపడిపోగా ఐరోపా రాజ్యాలు ఋణ సంక్షోభంలో కూరుకుపోయి ఆర్ధిక క్షీణతను నమోదు చేశాయి. కానీ ప్రభుత్వ రంగం ఇంకా ఆధిపత్యంలో ఉన్న చైనా, ఇండియాలు మాత్రం ఆర్ధిక వృద్ధిని కొనసాగించడమే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధనే మహా మాంద్యం (Great Recession) నుండి బైటికి లాగాయన్న కీర్తిని కూడా పొందాయి. సదరు కీర్తిని చైనా, ఇండియాలకు ఆపాదించింది కూడా ఈ పశ్చిమ కార్పొరేట్ పత్రికలే. వాస్తవం ఇలా ఉండగా ఏ ఆధారంగా భారత ప్రభుత్వ రంగ కంపెనీలు భారత వృద్ధికి ఆటంకం అంటూ పశ్చిమ పత్రికలు నాలుకలు మడతేస్తాయో ఎప్పటికీ తెలియదు. నిజానికి లేని ఆధారాలను అవి మాత్రం ఎలా చూపగలవు?

ఒక్క అమెరికా, ఐరోపాలే కాదు. అభివృద్ధికి ఆనవాళ్ళుగా పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు పేర్కొన్న ఆసియా టైగర్ దేశాలు 1995-96లో ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలాయో వివరించిన మార్కెట్ ఎకానమీ ఆర్ధికవేత్త ఇంతవరకు లేరు. 2000 నాటి డాట్ కామ్ బుడగ ఎందుకు బద్దలయిందో చెప్పిన నిపుణుడు లేడు. పశ్చిన దేశాల ఒకనాటి ఆర్ధిక నమూనా అర్జెంటీనా బుడగ బద్దలై విస్తృత ప్రజాందోళనా విస్ఫోటనానికి దారితీయడమే కాకుండా సరికొత్త ప్రభుత్వాలు ఏర్పడి ప్రభుత్వ రంగ ఆర్ధిక వ్యవస్ధను పునరుద్ధరించుకుని ఆర్ధిక స్ధిరీకరణను సాధించడం నుండి ధైర్యంగా గుణపాఠం తీసిన ఆర్ధిక మార్కెట్ పండితుడు లేడు. అంతెందుకు? 90వ దశకపు అర్ధభాగం నుండి ఇటీవలి వరకూ ప్రతి ద్రవ్యోల్బణం లాంటి తీవ్ర సమస్యలతో తీసుకుంటూ ఏకంగా రెండు దశాబ్దాలను ‘లాస్ట్ డికేడ్స్’ గా బహుమానం పొందిన జపాన్ ఆర్ధిక మందగమనానికి ఎన్ని కారణాలు చెప్పగలరు?

మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధల చరిత్ర నిండా ఇన్నేసి గాయాలను నాక్కుంటున్న పెట్టుబడిదారీ ఆర్ధిక పండితులు, పెట్టుబడిదారీ విషపుత్రికలు ఇంకా తగుదునమ్మా అంటూ భారత ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా తెగనమ్మాలంటూ నీతిబోధలు చేయడం ఏయే రాజపోషకుల మేలు కాంక్షించో ఇంకేయే ప్రజా సామాన్యపు పతన గమనాలను శాసించో మనమే అర్ధం చేసుకోవాలి. కాగా ఇలాంటి నీతి బోధలను ఒంటినిండా పట్టించుకున్న భారత నూతన పాలకులు భారత ప్రజల ఆర్ధిక పతనానికి మరిన్ని కొత్త దారులను వేస్తూ పోవడం ఎన్నికల ఏరు దాటాక ఓటర్ల తెప్ప తగలేయడమే. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు నాలుగేళ్ల యు.పి.ఏ అమ్మకాలకు సమానంగా ఒక్క యేడు అమ్మకాలతో పోటీకి నిలవడం, అది కూడా బడ్జెట్ వెల్లడికి మునుపే విదేశీ పత్రికలకు లీక్ చేసి మరీ సంతోష పెట్టడం విడ్డూరం.

పత్రికకు లీక్ చేసిన వివరాలే నిజం అయినట్లయితే కొత్త కంపెనీలను తెగనమ్మడం ప్రారంభించడానికి ముందు ఇప్పటికే కొంత వాటాలను అమ్మేసిన భారీ ప్రభుత్వ కంపెనీలను మరింత కొరుక్కోవడానికి ప్రైవేటు కంపెనీలకు మోడి ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతున్నది. స్టీల్ ఆధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), కోల్ ఇండియా లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ లాంటి లీడింగ్ ఆయిల్ కంపెనీలు… తదితర ప్రభుత్వ రంగ కంపెనీల వాటాలను బేరం పెట్టడానికి అరుణ్ జైట్లీ బడ్జెట్ వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.

స్టీల్ ఆధారిటీ ఆఫ్ ఇండియా కంపెనీలో 5 శాతం వాటాలు అమ్మడం ద్వారా 340 మిలియన్ డాలర్లు (దాదాపు రు. 2 వేల కోట్లు) సంపాదించాలని జైట్లీ భావిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు మైనింగ్ కంపెనీ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ లో 10 శాతం వాటాలు అమ్మడం ద్వారా 4 బిలియన్లు (దాదాపు రు. 24 వేల కోట్లు) సంపాదించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. చమురు కంపెనీలు, ఇంకా ఇతర కంపెనీల వాటాల అమ్మకం ద్వారా మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేయనున్నారు. జర్మనీకి చెందిన డ్యూశ్చ్ బ్యాంకు ఈ ఆర్ధిక సంవత్సరంలో కొత్త ప్రభుత్వం 60 నుండి 80 వేల కోట్ల రూపాయల వరకూ ప్రభుత్వ రంగ వాటాలను అమ్మకానికి పెట్టవచ్చని ముందే అంచనా వేసింది. ఈ రెండు పరిమితులకు సరిగ్గా సగటు సంఖ్య మేరకు అమ్మకం ప్రతిపాదనలు చేయనున్నట్లు కేంద్ర అధికార వర్గాలు చెప్పడం గమనార్హం.

మోడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంస్కరణలలో జి.ఎస్.టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) ముఖ్యమైనది. ప్రణబ్ ముఖర్జీ ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పటి నుండీ జి.ఎస్.టి ని ప్రవేశ పెట్టడానికి భారత పాలక వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. భారత పన్ను పునాదిని ఇంకా విస్తరించి పన్నుల ఆదాయాన్ని మరింతగా పెంచడానికి జి.ఎస్.టి ని ఉద్దేశించారు. ఓ.ఈ.సి.డి దేశాల్లో జి.డి.పిలో పన్నుల ఆదాయం 35 శాతం వరకూ ఉంటే ఇండియా జి.డి.పి లో పన్నుల ఆదాయం 8.9 శాతం (2013-14లో) మాత్రమేనని ఇందుకు సాక్ష్యంగా చూపుతున్నారు.

విదేశీ కంపెనీలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్న సంస్కరణల్లో జి.ఎస్.టి ఒకటి. ఎప్పుడు ఏ పన్ను విధిస్తారో, ఏ రాష్ట్రంలో ఎంత అదనపు పన్ను విధిస్తారో ఊహించడం తమకు కష్టంగా ఉందనీ, ఇలాంటి అనూహ్య పన్నుల విధానం వల్ల పెట్టుబడులు పెట్టడం కష్టంగా మారుతోందని విదేశీ బహుళజాతి కంపెనీలు చాన్నాళ్లుగా నిరసిస్తున్నాయి. వారి డిమాండ్లకు సమాధానంగా దేశం అంతా ఒకే తరహా యూనిఫాం పన్నుల విధానాన్ని ప్రవేశ పెట్టాలని భావిస్తూ విదేశీ బాసుల ఆదేశపూరిత మార్గదర్శకాల మేరకు జి.ఎస్.టి కోడ్ కు రూపకల్పన చేశారు. ఈ పన్నుల కోడ్ రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని చెబుతూ బి.జె.పి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు అడ్డం కొట్టాయి. తీరా అధికారం చేతిలోకి వచ్చాక బి.జె.పి కూడా జి.ఎస్.టి ఆమోదానికి దారులు వేస్తోంది.

ప్రధాని మోడి ఇటీవల చెప్పినట్లుగా ప్రజల చేత మరిన్ని చేదు మాత్రలు మింగించడానికి కూడా బడ్జెట్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు ఇస్తున్న సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయనున్నారు. ఇంధనం (సహజ వాయువు, పెట్రోల్, డీజెల్, కిరోసిన్ మొ.వి), ఎరువులు, ఆహారం (ప్రజా పంపిణీ వ్యవస్ధ) తదితర సరుకులకు ఇస్తున్న సబ్సిడీలలో కోత పెట్టడానికి మోడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సబ్సిడీలను “మతిమాలిన పాపులిజం” (Mindless Populism) గా ఇటీవల ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొనడం ద్వారా ప్రజా సబ్సిడీలపై ఆయనకు గల చిన్న చూపు ఏ పాటిదో స్పష్టం చేశారు.

నిజానికి ఎదురు సబ్సిడీలు ఇస్తున్నది ఒళ్ళు వంచి శ్రమ చేసే శ్రామిక ప్రజలే తప్ప స్పెక్యులేషన్లు, లాభ దోపిడీల ద్వారా పారసైట్ బతుకులు బతికే పెట్టుబడిదారీ ధనిక వర్గాలు, భూస్వామ్య వర్గాలు కానే కాదని అనేకమార్లు సాక్ష్యాలతో నిపుణులు తేల్చిన సత్యం. అలాంటి ప్రజా ధనాన్ని ప్రజలకు తిరిగి చెల్లించడాన్ని మతిమాలినతనంగా చెప్పడానికి సాహసించే సచివుల మతిమాలినతనాన్ని ప్రజలు నెత్తిన పెట్టుకున్నారని కూడా ఆయన స్పష్టం చేశారు.

3 thoughts on “రు. 70 వేల కోట్ల ఆస్తుల అమ్మకానికి మోడి రెడీ

  1. 1990 వరకు లాభాలతో నడిచిన ప్రభుత్వ రంగ సంస్థలు 1991 నుంచే నష్టాలని చూడడం మొదలుపెట్టాయంటే ఎలా నమ్మాలి? పాలకులే కావాలని ప్రభుత్వరంగ సంస్థలని నష్టాలలోకి నెట్టి వాటిని అమ్మేస్తున్నారు.

    సబ్సిదీల విషయానికొస్తే, ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఆ పన్ను డబ్బులతోనే సబ్సిదీలు ఇవ్వడం కంటే పన్నులు తగ్గించడం మేలు కదా. కనుక నేను సబ్సిదీలని వ్యతిరేకిస్తాను. విద్యుత్ చార్జిలు పెంచి, అలా వచ్చిన డబ్బుతోనే రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వడం మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం కదా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s