రిలయన్స్ గ్యాస్: యు.పి.ఏ ధర పెంపుకు ఎన్.డి.ఏ కోత


Gas Price

ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ కమిటీ రూపొందించిన ఫార్మూలను అనుసరిస్తూ రిలయన్స్ కంపెనీ వెలికి తీస్తున్న గ్యాస్ ధరను యు.పి.ఏ రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. సదరు పెంపును తగ్గిస్తూ ఎన్.డి.ఏ/మోడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సి.రంగరాజన్ రూపొందించిన ఫార్ములాను ఆమోదించడానికి ఎన్.డి.ఏ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయం ఎంతకాలం అమలులో ఉంటుందో వేచి చూడాల్సిన విషయం.

కె.జి. బేసిన్ లో గ్యాస్ వెలికి తీస్తున్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ గత రెండు, మూడు సంవత్సరాల నుండి గ్యాస్ ఉత్పత్తిని హఠాత్తుగా తగ్గించివేసింది. కాంట్రాక్టులో ఆమోదించిన మొత్తంలో దాదాపు నాలుగో వంతు మాత్రమే ఉత్పత్తి తీయడంతో ఆంద్ర ప్రదేశ్ లో గ్యాస్ ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు మూలన పడ్డాయి. ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తీవ్ర విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నారు. ఆపరేటింగ్ ఖర్చులు పెరిగిపోయాయని, గ్యాస్ ఎక్కువగా లేదని చెబుతూ రిలయన్స్ కంపెనీ తన కాంట్రాక్టు ఉల్లంఘనను సమర్ధించుకుంది. పైగా గ్యాస్ ఉత్పత్తి ధరను పెంచాలంటూ యు.పి.ఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది.

ఈ నేపధ్యంలో యు.పి.ఏ ప్రభుత్వం సి.రంగరాజన్ నేతృత్వంలో కమిటీ వేసింది. గ్యాస్ ధరలను నిర్ణయించేందుకు ఫార్ములా రూపొందించాలని కమిటీని కోరింది. రోగి కోరిందే డాక్టర్ చెప్పినట్లుగా రిలయన్స్ కంపెనీ కోరికను రంగరాజన్ కమిటీ అక్షరాలా నెరవేర్చింది. గ్యాస్ ధరను రెట్టింపు చేసి రిలయన్స్ కు చెల్లించాలని సిఫారసు చేసింది. దానికి కమిటీ విచిత్రమైన కారణం చెప్పింది. బ్రెంట్ క్రూడ్, నిమస్ క్రూడ్ తదితర అంతర్జాతీయ గ్యాస్ మార్కెట్లలోని ధరలకు భారత దేశంలోని గ్యాస్ ఉత్పత్తి ధరలు సమానంగా లేవని ఆ ధరలతో సమానం కావాలంటే ఇక్కడి ధరలను రెట్టింపు చేసి చెల్లించాలని సిఫారసు చేసింది.

అసలు ఎక్కడో సింగపూర్, లండన్ ల గ్యాస్ ధరలకు మన గ్యాస్ ధరలు సమానంగా ఉండవలసిన అవసరం ఏమిటి? ఈ ప్రశ్నకు తాటిచెట్టు-దూడ మేత లాంటి మరో కారణాన్ని కమిటీ చెప్పింది. అంతర్జాతీయ ధరల కంటే ఇండియా ధరలు తక్కువగా ఉన్నందున భారతీయ గ్యాస్ ఉత్పత్తి రంగంలోకి విదేశీ పెట్టుబడులు ప్రవేశించడానికి వెనకాడుతున్నాయని చెప్పింది. అసలు విదేశీ పెట్టుబడుల అవసరం లేకుండా రిలయన్స్ కంపెనీయే తవ్వి తీస్తున్నపుడు విదేశీ పెట్టుబడుల కోసం అంగలార్చాల్సిన అవసరం ఏమిటో కమిటీ చెప్పలేదు. కె.జి. బేసిన్ గ్యాస్ భారత ప్రజల ఆస్తి. దానిని వినియోగంలోకి తెచ్చే శక్తి యుక్తులు భారత ప్రభుత్వ కంపెనీ ఓ.ఎన్.జి.సికి ఉన్నాయి. 

ప్రభుత్వ కంపెనీని పక్కన బెట్టి ప్రవేటు కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వడమే అతి. ఆ కంపెనీ తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఉత్పత్తిని అమాంతం తగ్గించేసి ప్రజలను పస్తు పెట్టడం మరో తప్పు. కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించి పాత బాకీతో సహా రాబట్టుకోవడం మాని కంపెనీకి ఎదురు బహుమతి ఇస్తూ ధరలు పెంచడానికి వీలుగా చమురు, గ్యాస్ వ్యవహారాలతో ఏ మాత్రం సంబంధం లేని సి.రంగరాజన్ కమిటీని వేయడం ఇంకా పెద్ద తప్పు. పేనుకు పెత్తనం ఇచ్చినందుకుగాను కుంటి సాకులు చూపిస్తూ గ్యాస్ ధరను ఏకంగా రెట్టింపు చేయాలని కమిటీ సిఫారసు చేస్తే దానిని యు.పి.ఏ ప్రభుత్వం ఆమోదించడం బట్టి ఈ ప్రభుత్వాలు ఎవరికోసమో అర్ధం చేసుకోవచ్చు. నీరా రాడియా టేపుల్లో వెల్లడి అయినట్లు “యు.పి.ఏ ప్రభుత్వం మా సొంత షాపే” అని అంబానీ వ్యాఖ్యానించారంటే మరి వ్యాఖ్యానించరా?

భారత గ్యాస్, చమురు రంగంలో పెట్టుబడులకు కొదవలేదు. కానీ ప్రైవేటు కంపెనీలకు మేలు చేయడం కోసం కె.జి.బేసిన్ ను రిలయన్స్ కు అప్పగించారు. రిలయన్స్ కంపెనీ పెట్టుబడుల్లో అత్యధిక భాగం వాల్ స్ట్రీట్ బ్యాంకుల పెట్టుబడులు. ఆ బ్యాంకులకు మన గ్యాస్ పైన వస్తున్న లాభాలు చాల్లేదు. ఫలితంగా ఒత్తిడి తెచ్చి ఉత్పత్తి తగ్గించి వేయడం, దానికి ఏవేవో కుంటి సాకులు చెబితే ప్రభుత్వం ఆమోదించడం జరిగిపోయాయి.

ఈ నేపధ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన అరవింద్ కేజ్రీవాల్ అక్రమంగా గ్యాస్ రేట్లను పెంచారని చెబుతూ చమురు మంత్రి వీరప్ప మొయిలీ, చమురు శాఖ కార్యదర్శి, రిలయన్స్ కంపెనీ తదితరులపై ఏ.సి.బి విచారణకు ఆదేశించారు. ఫలితంగానే బి.జె.పి, కాంగ్రెస్ లు కుమ్మక్కై తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర చేశాయని రాజీనామా చేసే పరిస్ధితిని కల్పించాయని అరవింద్/ఎఎపి ఆరోపించారు. ఈ వివాదంపై తన అవగాహన ఏమిటో చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ వెళ్ళి ఆందోళన చేసినప్పటికీ మోడి స్పందించలేదు.

మోడి ప్రభుత్వంలో చమురు, సహజవాయువు శాఖ మంత్రిగా నియమితులయిన ధర్మేంద్ర ప్రధాన్ తాజాగా చేసిన ప్రకటనను బట్టి సి.రంగరాజన్ కమిటీ ప్రతిపాదించినట్లుగా ఒకేసారి రెట్టింపు ధర చెల్లించడానికి మోడి ప్రభుత్వం సుముఖంగా లేదు. అంతిమ వినియోగదారుడి చెల్లింపు సామర్ధ్యాన్ని పట్టించుకోకుండా యు.పి.ఏ ధరను నిర్ణయించిందని ప్రధాన్ వ్యాఖ్యానించారు.

పోయిన మార్చి 31 తేదీ వరకు ఒక మిలియన్ బ్రిటిష్ ధర్మల్ యూనిట్ (mBtu) గ్యాస్ కి గాను 4.2 డాలర్ల ధర అమలులో ఉంది. (నిజానికి ఇది కూడా యు.పి.ఏ పెంచిన ధరే. అంతకు ముందు ఒక mBtu కి 2 నుండి 3 డాలర్ల మధ్య చెల్లించేవారు) ఈ ధరను దాదాపు రెట్టింపు చేసి ఒక mBtu కి 8.34 డాలర్లు చెల్లించాలని రంగరాజన్ కమిటీ సిఫారసు చేసింది. గ్యాస్ ఉత్పత్తి చేసేది ఇండియా కంపెనీ. వినియోగదారులు ఇండియన్లు. అలాంటిది ధరను మాత్రం డాలర్లలో నిర్ణయించాల్సిన అవసరం ఏమిటని ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించినా జవాబు చెప్పినవారు లేరు. విదేశీ ఫైనాన్స్ కంపెనీల లెక్కలన్నీ డాలర్లలోనే ఉంటాయి కనుక మన ధరలు కూడా సదరు కంపెనీల లెక్కల్లోనే ఉండాలన్నది అసలు విషయం. ఉత్పత్తి చేసేదీ, వినియోగం చేసేది అంతా భారతీయులే అయినా లాభాలలో ప్రధాన వాటా విదేశీ ఫైనాన్స్ పెట్టుబడికే వెళ్తుందని ఇక్కడ తేలికగా అర్ధం అయ్యే విషయం.

ఏప్రిల్ 1, 2014 నుండి పెంచిన ధరలు అమలులోకి వస్తాయని యు.పి.ఏ ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఎన్నికల నేపధ్యంలో ధరల పెంపు వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో వాయిదా పడిపోయింది. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పెంచిన ధరలను యు.పి.ఏ అమలు చేయకుండా ఆ బాధ్యతను ఎన్.డి.ఏ నెత్తిన వేసి వెళ్లింది. ఇక ఇప్పుడు మోడి ప్రభుత్వం గ్యాస్ ధరల్ని రెట్టింపు చేసి చెల్లిస్తే ప్రజల్లో వ్యతిరేకత రావడం తధ్యం.

అదీ కాక fiscal descipline (కోశాగార క్రమ శిక్షణ – అనవసర ఖర్చులు చేయకుండా క్రమశిక్షణ పాటించడం) పాటించడం గురించి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మధ్య వరుసగా లెక్చర్లు దంచారు. ఒకవైపు క్రమ శిక్షణ పాటించమని చెబుతూ మరోవైపు రిలయన్స్ కంపెనీకి రెట్టింపు ధరల్ని చెల్లించడం ఎన్.డి.ఏ ప్రభుత్వానికి నిస్సందేహంగా అప్రతిష్ట తెచ్చి పెడుతుంది. రిలయన్స్ కంపెనీకి పెంచిన ధర చెల్లిస్తే ఆ మేరకు మరింత సబ్సిడీని కేంద్రం భరించాల్సి ఉంటుంది. లేదా ఆ భారాన్ని ప్రజాలపైకి నేట్టాలి. ఈ రెండిట్లో ఏది చేసినా ప్రభుత్వానికి అప్రతిష్ట తధ్యం.

ఈ పరిస్ధితుల్లోనే రిలయన్స్ ఉత్పత్తి ధరను “ఒకేసారి పెంచకుండా” కాస్త కాస్త పెంచడం ద్వారా వ్యతిరేకత నుండి బైటపడాలని మోడి ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పెంచిన ధరను ఇంకా అమలు చేయనందుకు రిలయన్స్ కంపెనీ ఇప్పటికే ప్రభుత్వానికి ఆర్బిట్రేషన్ నోటీసు ఇచ్చింది. “సహజ వనరులకు యజమాని ప్రభుత్వమే అని సుప్రీం కోర్టు చెప్పింది. దేశ వనరులను మొట్టమొదట వినియోగించుకునే హక్కు ఈ దేశ పేదలకే ఉందని ప్రధాని మోడి పార్లమెంటులో చెప్పారు” అని ప్రధాన్ ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు. అటు వ్యాపార సంస్ధలకు నష్టం లేకుండా ఇటు ప్రజలపై భారం పడకుండా నిర్ణయం తీసుకుంటామని ప్రధాన్ చెబుతున్నారు.

అనగా ఒకేసారి బాదే బదులు సుతి మెత్తగా అనేకసార్లు బాదే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ రాయాయితేనేం పళ్ళు ఊడగొట్టుకోవడానికి. మెల్లగా కొట్టినా, గట్టిగా కొట్టినా అంతిమ బాధితులు జనమే. చిల్లి పడేది జనం జేబులకే.

4 thoughts on “రిలయన్స్ గ్యాస్: యు.పి.ఏ ధర పెంపుకు ఎన్.డి.ఏ కోత

  1. మోడి సర్కారు రిలయన్స్ కు అనుకూలంగా వ్యవహరించడంలో వింతేమీ లేదు. తనకు మద్దతునిచ్చి….తనకు విస్తృత ప్రచారం చేసి ప్రధానమంత్రి పీఠానికి చేరువ చేసిన మీడియా ఎవరిదో…వారికే ఇప్పుడు మేలు చేసి రుణం తీర్చుకుంటున్నారు. ఇది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా మొత్తం ముందుంది.

  2. అది U.P.A.ప్రభుత్వమైనా,N.D.A.ప్రభుత్వమైనా రిలయన్స్ కంపెనీ వంటి బడాపెట్టుబడిదారులకు అనుకూలంగానే ఉంటుంది.తప్పుడు వాగ్దానాలతో గెలుస్తారు.తర్వాత అసలు స్వరూపం బయటపడుతుంది.

  3. గత యు.పి.ఎ. ప్రభుత్వ పాలనలో అంబాని కుటుంబ వాణిజ్యాన్ని వారికి లోబడి, నల్లధనార్జనకు కక్కుర్తిపడి తత్సంభందిత అమాత్యులు వారి పెత్తనానికి బానిసలై గంగిరెద్దు వేషాలు వేశారు. ముసుగులో లొసుగు కారణంగా జైపాల్ ని రాత్రికి రాత్రే శాఖను మార్చిన సోనియా వారికి ఊడిగం చేసి ప్రజల ఉసురుపోసుకుంది. కె.జి.బి. వాటాలో తన వంతు వాటా కోసం అధికార వాటంతో ధరల పెంపును ఇరకాటంలో పెట్టింది. మరోసారి ఇటువంటి బలహీనతలకు తావులేకుండా మోడి ప్రభుత్వం వారి అజమాయిషికి కళ్ళెంవేసి చమురు ఉత్పత్తి ధరల పెంపు మీద కోతను నిర్భందించి తద్వారా ప్రజాపక్షాన్ని దృష్టిలో పెట్టుకుని అంబాని సోదరుల వాణిజ్యవిధానాలకు తిలోదకాలివ్వడం తప్పని సరి. రంగరాజన్ వంటి ఆర్ధికవేత్తలు కూడా వారి వారి పదవి వ్యామోహానికి తమ విజ్ఞతను తాకట్టుపెట్టి ప్రజలను పిండుతున్నారు.

  4. గత ఎన్‌ డి ఏ ప్రభుత్వ అనుభాల దృష్ట్యా ఆర్ధి సంస్కరణలకు ఆధ్యుడైనా మన్‌ మోహన్‌ సింగ్‌ కంటె వాటిని అమలు జరపడంలో ముందంజలో ఉంది. అదీ మోది నాయకత్వంలోని ఎన్‌.డి.ఏ ప్రభుత్వ ఇంకా ఎంత ముందంజలో ఉండాలి. అలా ఉండక పోతే ఆశ్చర్య పడాలి కాని ఉండటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని మనకు తెలుసు. ఇంకా ఇలాంటి ముందంజలు ఎన్నెన్నీ చూడాలో వేచి చూడాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s