కేంద్ర మాజీ మంత్రి శశి ధరూర్ భార్య హఠాన్మరణం విషయంలో తాజాగా వివాదం రగులుతోంది. ఆమె మరణానికి కారణాలు తెలియజేసే పోస్ట్ మార్టం నివేదిక తయారీలో తనపై తీవ్రమైన ఒత్తిడి వచ్చిందని పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ ఆరోపించడంతో సంచలనం రేగుతోంది. డాక్టర్ ఆరోపణలను ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ అధికారులు హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించడంతో మరిన్ని అనుమానాలు కలగడానికి ఆస్కారం ఏర్పడింది. తన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్త ఈ రోజు మరోసారి స్పష్టం చేశారు.
సునంద పుష్కర్ కుటుంబ సభ్యులు తమకు ఆమె మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని చెబుతున్నారు. సునంద వంటి పైన అనేక చోట్ల గాయాలు ఉన్నాయని ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్త తన పోస్ట్ మార్టం నివేదికలో తెలిపారు. ఈ నివేదికను మార్చాలని యు.పి.ఎ ప్రభుత్వ హయాంలో తనపై తీవ్ర ఒత్తిడిలు వచ్చాయని డాక్టర్ ఆరోపించడంతో సునంద మరణంపై మళ్ళీ అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి.
దర్యాప్తును వేగవంతం చేసి త్వరగా ఒక నిర్ణయానికి రావాలని సునంద భర్త శశి ధరూర్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. సునంద కుమారుడి నుండి గానీ, ఇతర కుటుంబ సభ్యుల నుండి గానీ శశి ధరూర్ పై ఎలాంటి అనుమానాలు వ్యక్తం కాకపోవడంతో పత్రికల ఊహాగానాలకు బ్రేకులు పడినట్లయింది. అయితే సునంద శరీరంపైన అన్ని చోట్ల గాయాలు ఎందుకు ఉన్నదీ వివరాలు వెల్లడి కావడం లేదు.
భార్యా భర్తల మధ్య ఘర్షణ జరిగి ఉండవచ్చని భావించినప్పటికీ కేంద్ర మంత్రి స్ధాయి వ్యక్తి భార్యపై చేయి చేసుకోవడం బొత్తిగా అర్ధం చేసుకోలేని విషయం. పాకిస్ధాన్ జర్నలిస్టు మెహర్ తరార్ తో శశి ధరూర్ అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని, ఆమె ఐ.ఎస్.ఐ ఏజెంటు కావచ్చని సునంద పుష్కర్ ఆరోపించిన మరుసటి రోజే ఆమె మరణించడంతో సమాధానం లేని ప్రశ్నలు మరిన్ని ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
తనపై ఒత్తిడి వచ్చిందన్న అంశాన్ని ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ అధికారులు ఖండించడం పట్ల డాక్టర్ సుధీర్ గుప్త ఆశ్చర్యం ప్రకటించారు. ఒత్తిడి వచ్చిందని తనపై కాబట్టి ఆ విషయం తానే చెప్పగలనని తనపై ఒత్తిడి లేదని అధికారులు ఎలా చెప్పగలరని ఆయన ప్రశ్నించారు. “నాపై ఒత్తిడి లేదని వారికి ఎలా తెలుసు? నాపై ఒత్తిడి లేదని స్పష్టం చెయ్యడానికి వాళ్లెవరు? హడావుడిగా పత్రికల సమావేశం పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?” అని డాక్టర్ సుధీర్ గుప్త ప్రశ్నించారు.
“సునంద పుష్కర్ పోస్ట్ మార్టం విషయంలోనే కాదు, అనేక కేసుల్లో పోస్ట్ మార్టం నివేదికలను నేనే తుది రూపు ఇచ్చాను. వైద్య సూత్రాలు, నియమావళి ప్రకారం, నైతికపరమైన, చట్టపరమైన నిబంధనల ప్రకారం పోస్ట్ మార్టం నివేదికలను తయారు చేసే బాధ్యత నాపై ఉంటుంది. నా జీవితంలో ఎన్నడూ ఒత్తిళ్లకు లొంగలేదు” అని డాక్టర్ గుప్త చెప్పారని పి.టి.ఐ (ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా) తెలిపింది.
ఇదిలా ఉండగా సునందా పుష్కర్ మరణం విషయంలో వెంటనే నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ పత్రికలకు సమాచారం ఇచ్చారు. నరేంద్ర మోడి నేతృత్వంలో బి.జె.పి ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం శశి ధరూర్ హఠాత్తుగా మోడిని ప్రశంసలలో ముంచెత్తడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. సునంద పుష్కర్ తో ఎంగేజ్ మెంట్, వివాహం సందర్భంగా వారి బంధాన్ని వ్యంగ్య వ్యాఖ్యల ద్వారా మోడి గేలి చేసిన సంగతి ప్రస్తావనార్హం.
ఐ.పి.ఎల్ కేరళ ప్రాంఛైజీ ద్వారా అందిన సంభావన మొత్తాన్ని ఉదహరిస్తూ అంత విలువ గల గర్ల్ ఫ్రెండ్ అని సునందను మోడి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మోడి-ధరూర్ ల మధ్య ప్రకటనల రూపంలో, పత్రికలతో వ్యాఖ్యల రూపంలో వివాదం నడిచింది. అలాంటి పరిస్ధితుల్లో ఇంకా యు.పి.ఎ ప్రభుత్వం కొనసాగుతుండగానే మోడిని ప్రశంసించడంతో పత్రికలు, పరిశీలకులు ముక్కున వేలేసుకున్నారు. మోడి ప్రశంసలు ఎందుకు ఉద్దేశించినవో డాక్టర్ గుప్త ఆరోపణల ద్వారా ఏమన్నా క్లూ అందినట్లేనా?