ఇసిస్: మెరుపు పురోగమనం కాదు, సామ్రాజ్యవాదుల కుట్ర


ISIS crisis

Map credit: The Telegraph

సౌదీ అరేబియా, కతార్, టర్కీల ప్రత్యక్ష, పరోక్ష పాత్ర ద్వారా అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాదులు సిరియాలో రెచ్చగొట్టి కొనసాగిస్తున్న కిరాయి తిరుగుబాటులో ఐ.ఎస్.ఐ.ఎల్/ఐ.ఎస్.ఐ.ఎస్ పాత్ర రహస్యం ఏమీ కాదు. వారిని మోడరేట్ ఉగ్రవాదులుగా పేర్కొంటూ కొన్నిసార్లు బహిరంగంగానే ఆయుధ, ధన, గూఢచార సహాయం అందజేసింది అమెరికా. తాజాగా బహిరంగంగానే సిరియా తిరుగుబాటుదారులకు 500 మిలియన్ డాలర్ల సహాయం చేస్తామని ఒబామా ప్రకటించాడు. టర్కీ, జోర్డాన్ లలో శిక్షణా శిబిరాలు నెలకొల్పి ఆల్-ఖైదా ఉగ్రవాదులకు సి.ఐ.ఏ సైనిక శిక్షణ ఇస్తున్న సంగతి నడుస్తున్న చరిత్రే.

చివరికి రసాయన ఆయుధాలను ప్రయోగించడంలో సైతం ఆల్ నుస్రా, ఎఫ్.ఎస్.ఏ (ఫ్రీ సిరియన్ ఆర్మీ), ఐ.ఎస్.ఐ.ఎల్ ఉగ్రవాదులకు ఈ శిబిరాల్లో శిక్షణ ఇచ్చి సిరియాలో ప్రవేశపెట్టారు. (ఐ.ఎస్.ఐ.ఎస్ కు విధేయత ప్రకటిస్తూ ఎఫ్.ఎస్.ఏ పత్రికలకు ప్రకటన విడుదల చేసిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.) రసాయన ఆయుధాలతో దాడి జరిగాక ఆదాడి చేసింది సిరియా ప్రభుత్వమే అని ఆరోపిస్తూ ఆ దేశంపై దాడికి అమెరికా సిద్ధపడింది. సిరియా రసాయన ఆయుధాలను ఐరాస పర్యవేక్షణలో నాశనం చేయడానికి రష్యా జోక్యంతో సిరియా అంగీకరించడంతో దాడి చేసే అవసరం అమెరికాకు తప్పింది గానీ లేదంటే తాను గీసిన ఎర్ర గీత దాటినందుకు సిరియా యుద్ధంలో పీకలలోతులో కూరుకుపోయి ఆర్ధికంగా, సైనికంగా నానా అగచాట్లకు అమెరికా గురవుతూ ఉండేది. అది వేరే సంగతి.

వాస్తవం ఇది కాగా విప్లవ ఉత్సాహపరులు కొందరు ఇసిల్ పురోగమనాన్ని పూర్తిగా దేశభక్తియుత జాతీయోద్యమంగానూ, అమెరికా సామ్రాజ్యవాదాన్ని తిప్పి కొడుతున్న ఉద్యమంగానూ కొనియాడడం తొందరపాటు అవగాహన. అమెరికా, ఇస్లామిక్ ఉగ్రవాదం మధ్య అంతర్గతంగా కొనసాగుతున్న వ్యూహాత్మక స్నేహ సంబంధాలను పసిగట్టక పోవడం వలన ఇలాంటి పొరబాటు అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది.

ఆల్-ఖైదాను మట్టుబెట్టామని ఒకసారీ, సజీవంగానే ఉన్నదని మరొకసారీ అమెరికా అధ్యక్షుడి దగ్గర్నుండి ఇతర ప్రభుత్వాధి నేతలవరకూ వివిధ సందర్భాల్లో వాదించడం వారి అవసరాల ప్రకారమే జరుగుతుంది. మధ్యప్రాచ్యంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవలసిన అవసరం వచ్చినప్పుడు గానీ లేదా ఆఫ్-పాక్, సోమాలియా, యెమెన్ తదితర దేశాలపై సాగిస్తున్న హంతక డ్రోన్ దాడులను సమర్ధించుకోవలసిన అవసరం వచ్చినప్పుడు గానీ, దేశీయంగా నెలకొన్న ఆర్ధిక సంక్షోభ పరిస్ధితుల్లోనూ పెద్ద ఎత్తున సాగిస్తున్న మిలట్రీ ఖర్చును సమర్ధించుకోవలసిన అవసరం తటస్ధించినప్పుడు గానీ అమెరికా నేతలు ఆల్-ఖైదా బతికే ఉందని తమ ప్రజలకు గుర్తు చేస్తారు.

ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ ల ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాల వినియోగదారులపైన అమెరికా ఎన్.ఎస్.ఏ నిఘా పెట్టిన సంగతిని ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించినప్పుడు, సదరు గూఢచర్యం ద్వారానే ఆల్-ఖైదాను మట్టుబెట్టామని అమెరికా అధ్యక్షుడు తన ప్రజలకు నమ్మబలికాడు. 2012 (2013) అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం ఆల్-ఖైదాను మట్టుబెట్టామని ఒబామా ప్రచారం చేసుకున్నాడు. అమెరికాకు అవసరం అయితే చచ్చిన ఆల్-ఖైదా క్రీస్తు వలే పునరుద్ధానం చెందుతుంది. అదే అమెరికాకు మరో అవసరం ఏర్పడితే ఆల్-ఖైదా మళ్ళీ మళ్ళీ మరణించడానికి అభ్యంతరం ఏమీ ఉండదు. అమెరికా ప్రజల జ్ఞాపకశక్తి, రాజకీయ వివేచన కార్పొరేట్ పత్రికలకు దాసోహం అయినంతకాలం ఆల్-ఖైదా మళ్ళీ మళ్ళీ చచ్చిపోవడం తిరిగి లేవడం కొనసాగుతూనే ఉంటుంది.

వర్తమాన చరిత్రలో అమెరికన్, యూరోపియన్ సామ్రాజ్యవాదులకు మహా సానుకూలంగా అందుబాటులో ఉంటున్న ఏకైక బూచి ఆల్-ఖైదా. ఆల్-ఖైదాకు ఒక్కో దేశంలో ఒక్కో పేరు. ఒకే దేశంలో వివిధ పేర్లతో సంచరించగల అదృష్టం కూడా ఆల్-ఖైదా సొంతం. వడ్డించే సామ్రాజ్యవాద ప్రభువుకు నమ్మకమైన బంటు కావడం మూలాన ఎన్ని పేర్లతోనైనా వ్యవహరించగల సౌకర్యం ఆల్-ఖైదాకు సొంతమైంది. లిబియాలో LIFG, AQIM లుగా వ్యవహరించిన ఆల్-ఖైదా, మాలి దేశంలో అన్సార్ దినే, ముజవో పేర్లు ధరించింది. సోమాలియాలో ఆల్-షబాబ్ గాను, యెమెన్ లో AQAP గానూ, సిరియాలో ఆల్-నుస్రా ఫ్రంట్ గానూ ఆల్-ఖైదా వ్యవహరిస్తోంది. ఇరాక్ లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ (ISI) పేరుతో వ్యవహరించిన ఆల్-ఖైదా గత సంవత్సరం ఏప్రిల్ నుండి ISIL/ISIS గా పేరు మార్చుకుని సిరియాలోని ఇతర గ్రూపులను కలుపుకుంది. ఇరాక్, సిరియాలతో పాటు లెవంత్ లోని ఇతర దేశాలు కూడా కలిసి వచ్చేలా ఈ పేరు ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. లెవంత్ పేరు చేర్చడం ద్వారా మధ్యధరా సముద్రం తూర్పు తీరాన ఉన్న ఇతర ప్రతికూల దేశాలపైన (లెబనాన్, పాలస్తీనా) కూడా తమ కన్నుపడినట్లు సామ్రాజ్యవాదులు పరోక్షంగా సూచించారు.

నిజానికి ఈ కన్ను పడడం కొత్తదేమీ కాదు. ఇరాక్, సిరియాలను కలిపి మూడు స్వతంత్ర రాజ్యాలుగా విడగొట్టాలన్న పన్నాగం గత కొన్ని యేళ్లుగా అమెరికా వ్యూహంలో భాగంగా ఉంటోందని కొన్ని స్వతంత్ర వార్తా సంస్ధలు వెల్లడించాయి. సిరియాలో ప్రభుత్వ బలగాల చేతుల్లో ఆల్-నుస్రా తదితర ఉగ్రవాద సంస్ధలు వరుస ఓటములు ఎదుర్కొంటున్న కాలంలోనే ISIS/ISIL ఉనికిలోకి రావడం కాకతాళీయం ఏమీ కాదు. అమెరికా పన్నిన భౌగోళిక రాజకీయ వ్యూహం ప్రకారం సిరియాలో ఈపాటికి ప్రభుత్వం కూలిపోయి ఉండాలి. దానికి భిన్నంగా రష్యా, చైనాల మద్దతుతో సిరియా ప్రభుత్వం నిలదొక్కుకుంది. అయితే సిరియా ఉత్తర-తూర్పు ప్రాంతాలు ఇసిస్ ఆధీనంలో కొనసాగుతున్నాయి. ఇరాక్ లోనూ కుర్దిస్తాన్ స్వయంప్రతిపత్తి ప్రాంతాన్ని మినహాయించి ఉత్తర ఇరాక్ అంతా ఇసిస్ నియంత్రణలోకి వచ్చినట్లు పత్రికల వార్తలు తెలియజేస్తున్నాయి.

ఇరాక్, సిరియాలను మూడు స్వతంత్ర దళారీ రాజ్యాలుగా విడగొట్టడం అమెరికా సామ్రాజ్యవాదుల ఎజెండాలో భాగం. ఈ ఎజెండా ప్రకారం సున్నీ ఇస్లామిస్ట్ కాలిఫేట్, అరబ్ షియా రిపబ్లిక్, రిపబ్లిక్ ఆఫ్ కుర్దిస్తాన్ అనే మూడు ప్రాంతాలుగా ఇరాక్, సిరియాలను విభజించాలి.

రాజకీయంగా సిరియా, ఇరాక్ ల ఉనికి కొనసాగుతున్నప్పటికీ ఆచరణలో, పాలనా పరంగానూ, పన్నుల వసూళ్ల పరంగానూ ఇరాక్, సిరియాలలో ఈ మూడు భాగాలు ఇప్పటికే ఉనికిలోకి వచ్చాయి. నౌరి ఆల్-మాలికి నేతృత్వంలోని షియా ప్రభుత్వం బాగ్దాద్ కేంద్రంగా దక్షిణ ఇరాక్ ను అదుపులో పెట్టుకోగా, ఇరాక్ లో భాగంగా స్వయం ప్రతిపత్తి ప్రాంతంగా ప్రకటించబడిన ఉత్తర ఇరాకీ కుర్దు ప్రాంతం ఆచరణలో స్వంత పాలనను నడుపుతోంది. ఆల్-మాలికి ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఇతర దేశాలతో ఆయిల్ కాంట్రాక్టులను కుర్దిస్తాన్ కుదుర్చుకుంటోంది. ఇరాక్ లో చమురు బావులన్నీ ఇప్పుడు తగిన చట్టం లేకుండానే అమెరికా, ఐరోపా కంపెనీలు నిర్వహిస్తున్నాయి. సద్దాం హయాంలో జాతీయం చేయబడిన చమురు బావులు ప్రైవేటు బహుళజాతి కంపెనీలు నిర్వహించడానికి తగిన చట్టం ఏమీ అమలులో లేదు. అనగా నౌరి ఆల్-మాలికి ప్రభుత్వం గానీ, కుర్దిస్తాన్ ప్రభుత్వం గానీ సాగిస్తున్న చమురు అమ్మకాలు చట్ట విరుద్ధం. అయితే సరైన ప్రభుత్వమే లేని పరిస్ధితుల్లో ఇరాక్ ప్రజల సొంతమైన చమురును పశ్చిమ బహుళజాతి కంపెనీలు తవ్వుకుపోవడాన్ని పట్టించుకునేవారు ఎవరు?

ఇరాక్, సిరియాలలో ప్రజల అనుమతితో నడిచే నిఖార్సయిన రాజ్యం ఉనికిలో లేకపోవడమే అమెరికా, ఐరోపాల కంపెనీల ప్రయోజనాలకు అనుకూలం. ఈ ప్రాంతంలో ఎంత అస్ధిరత నెలకొంటే చమురు కంపెనీలకు అంత ప్రయోజనం. అనగా ఉగ్రవాద మూకలు ఆధిపత్యం వహించడం, సరిహద్దులు లేని రాజ్యాలు నిర్వహించడం బహుళజాతి చమురు కంపెనీల కోసమే అమలులోకి వచ్చిన వ్యూహం. ఎందుకంటే పనిచేస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్ధ గానీ లేదా సద్దాం లాంటి నియంతృత్వ ప్రభుత్వం గానీ సామ్రాజ్యవాదుల ప్రవేశానికి వివిధ ఆటంకాలు ఏర్పరుస్తాయి. అంతర్జాతీయ చట్టాలను పాటించాల్సి ఉంటుంది. మానవ హక్కులంటూ అనవసర రగడ ఎదుర్కోవాలి. ఆల్-ఖైదా లాంటి రాజ్యరహిత పాలనలో అలాంటి ఆటంకాలు ఉండవు. ఒకవేళ ఆల్-ఖైదా గ్రూపులు తోక జాడిస్తే వాటితో వ్యవహరించడం సామ్రాజ్యవాదులకు చాలా తేలిక. ఐరాస లాంటి అంతర్జాతీయ సంస్ధల ప్రమేయం లేకుండానే ‘టెర్రరిస్టులు’ అన్న ఒకే ఒక్క ముద్రతో దాడి చేసి దారికి తెచ్చుకోవచ్చు. అటువంటి ప్రమాదం గురించి తెలుసు గనక ఉగ్రవాద మూకలు చచ్చినట్లు లొంగి ఉంటాయి.

ఈ ఈక్వేషన్ లో ఇంకా ఇమడని ఒకే ఒక ప్రాంతం బషర్ ఆల్-అస్సాద్ నేతృత్వంలో కొనసాగుతున్న సిరియా. అస్సాద్ ను కూడా పదవి నుండి తప్పిస్తే పశ్చిమ సామ్రాజ్యవాదుల భౌగోళిక రాజకీయ వ్యూహం సంపూర్ణం అవుతుంది. కానీ అది మరో కోణంలో రష్యా, చైనాల ఉనికికి విఘాతం. అస్సాద్ కూలిపోతే ఇరాన్ ను దారిలో తెచ్చుకోవడం తేలికవుతుంది. అదే జరిగితే రష్యా, చైనాల వాణిజ్య, చమురు ప్రయోజనాలతో పాటు భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి. ఈ ప్రమాదం వల్లనే అస్సాద్ ను కాపాడుకోవడంలో ప్రధానంగా రష్యా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆ కక్షతోనే ఉక్రెయిన్ విషయంలో ఇచ్చిన వాగ్దానాలను అమెరికా తుంగలో తొక్కి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చివేసింది. అయితే రష్యా వేగంగా స్పందించి క్రిమియాను కలుపుకోవడం ద్వారా నల్ల సముద్రంలో అత్యంత ముఖ్యమైన నౌకా స్ధావరాన్ని కాపాడుకుంది.

పశ్చిమ సామ్రాజ్యవాదుల సమీకరణంలో ఇమడని మరో శక్తి నౌరీ ఆల్-మాలికి. ఆయనకు ఇరాన్ అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆయనను అధికారంలో కొనసాగనివ్వడం అమెరికాకు ఇష్టం లేకుండా పోయింది. సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలోనూ మాలికి సహకారం లేదు. పైగా ఇరాన్ సహకారంతో బషర్ అస్సాద్ కు సాయం చేస్తున్న అనుమానాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో మాలికిని పదవి నుండి తప్పించేందుకు అమెరికా వివిధ గ్రూపులను కూడగడుతోంది. అమెరికా ప్రయత్నాలు ఫలిస్తే త్వరలో మాలికికి పదవీ గండం తప్పదు.

తాజాగా ఇసిల్/ఇసిస్ సంక్షోభం లోనూ మాలికి అమెరికా వ్యతిరేక ప్రకటనలు ఇస్తున్నాడు. అమెరికా డ్రోన్ దాడులను స్వాగతిస్తూనే సౌదీ అరేబియా, కతార్ లే ఇరాక్ లో సంక్షోభాన్ని సృష్టించాయని ఆయన ఆరోపిస్తున్నాడు. అమెరికా ప్రోద్బలంతోనే సౌదీ, కతార్ లు ఇసిల్ కు సహాయం చేస్తున్న సంగతిని మాత్రం ఆయన ప్రస్తావించడం లేదు. కానీ ఇరాన్ ఆ మేరకు ప్రకటనలు జారీ చేసింది. స్వప్రయోజనాల కోసం అమెరికాయే ఇరాక్ సంక్షోభాన్ని రేపిందని ఇరాన్ సుప్రీం నేత ఖోమైనీ ఆరోపించాడు. P5+1 దేశాలతో అణు చర్చలలో ఉన్నందున ఇరాన్ అధ్యక్షుడు మాత్రం ప్రకటన చేయలేదు.

ఇరాక్ సంక్షోభంలోని ముఖ్యమైన కోణం ఏమిటంటే ఘర్షణలో ఉన్న రెండు పక్షాలకూ అమెరికా-నాటోలు ఆయుధాలు సరఫరా చేయడం. కొత్తగా మరిన్ని ఎఫ్-35 ఫైటర్ జెట్ విమానాలను ఇరాక్ కు అమ్మడానికి నౌరీ ఆల్-మాలికి తో అమెరికా కాంట్రాక్టు కుదుర్చుకుంటోంది. అదే సమయంలో సిరియా తిరుగుబాటుకు సాయం పేరుతో ఇసిల్ కు ఆయుధాలు ఇచ్చి శిక్షణ ఇవ్వడానికి 500 మిలియన్ డాలర్లను అమెరికా సిద్ధం చేస్తోంది. అమెరికన్ మిలట్రీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అధినేతలకు ఇంతకంటే మించిన గ్యారంటీ ఆదాయం ఇంకెక్కడ లభిస్తుంది? సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం అన్న లెనిన్ సూత్రం ఇన్ని రూపాలలో వ్యక్తం కావడం ఆ మహాశయుని సార్వజనీనతను నిర్ద్వంద్వంగా రుజువు చేస్తున్న సత్యం.

ఇన్ని చెప్పుకుని ఇజ్రాయెల్ పాత్రను విస్మరిస్తే శాపం తగులుతుంది. ఇరాక్, సిరియాల విచ్ఛిన్నానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. అరబ్ జాతీయ నేతలు బలహీనపడితేనే ఇజ్రాయెల్ ఉనికికి బలం. ఇరాక్, సిరియాల విచ్ఛిన్నం దిశలో కృషి చేస్తున్న ఇజ్రాయెల్ తాజా ఇరాక్ సంక్షోభం లోనూ తన ఉద్దేశ్యాలను దాచుకోలేదు. కుర్దిస్తాన్ స్వతంత్రానికి తాము మద్దతు ఇస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ కొద్ది రోజుల క్రితం ప్రకటించాడు. తద్వారా ఇరాక్ నుండి కుర్దిష్ రీజినల్ గవర్న్ మెంట్ స్వంతంత్రం ప్రకటించుకోవాలని ఆయన నేరుగా పిలుపిచ్చారని భావించవచ్చు. ఇజ్రాయెల్ కు చమురు సరఫరా చేయడాన్ని ఇరాక్ నిషేధించగా, ఇసిల్ సంక్షోభం మాటున కుర్దు ప్రభుత్వం ఇజ్రాయెల్ కు చమురు ట్యాంకర్ పంపిన సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ వార్తను ప్రచురించిన ఫోర్బ్స్ పత్రిక కుర్దుల సద్బుద్ధిని ఆకాశానికెత్తింది. ఇరాక్ విచ్ఛిన్నం కోసం పశ్చిమ బహుళజాతి కంపెనీలు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నాయో ఈ సంగతి స్పష్టం చేస్తోంది. కుర్దులు టర్కీ, ఇరాన్, సిరియా లలోనూ విస్తరించి ఉన్నందున స్వతంత్ర కుర్దిస్తాన్ ను ఆ దేశాలు ఒప్పుకోవు. టర్కీ ఇప్పటికే తన వ్యతిరేకతను ప్రకటించింది కూడా.

ఈ వాస్తవాల నేపధ్యంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లిబియా సంస్ధ మెరుపువేగంతో పురోగామిస్తోందని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు తాదాత్మతతో చేస్తున్న ప్రచారాన్ని అర్ధం చేసుకోవాలి. ఇసిల్ పురోగమనం సామ్రాజ్యవాదుల ప్రయోజనాలను మాత్రమే నెరవేర్చుతుంది. మధ్య ప్రాచ్యంలో రాజ్యరహిత చమురు ఉత్పత్తి భూభాగాలను సృష్టించే కుట్రలో భాగంగా ఇరాక్, సిరియాల విచ్ఛిన్నానికి పశ్చిమ సామ్రాజ్యవాదులు, ముఖ్యంగా అమెరికా కుట్ర పన్నారు. వారి మహా వ్యూహంలో భాగంగానే సిరియాలో చావు దెబ్బలు తిన్న ఉగ్రవాద మూకలు ఇరాక్ లో ప్రవేశించాయి. ఇరాక్, సిరియా జైళ్లను బద్దలు కొట్టి విడుదలయిన వేలాది మంది ముఠాలు వారికి జతకలిశారు. వారందరిని ఒకచోట చేర్చి ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ అని సామ్రాజ్యవాదులు పేరు పెట్టారు. ఈ మూకలు ఇరాక్, సిరియా ప్రజల ప్రయోజనాలకు ఏ మాత్రం నిబద్దులు కాదు. కేవలం తమ యజమానులయిన అమెరికా సామ్రాజ్యవాదులకు మాత్రమే వారు నిబద్దులు. ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రధానంగా అమెరికా సృష్టి. ప్రపంచ దేశాల్లోని ముస్లిం యువత అమాయకంగా ఈ వలలో పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. దేశభక్తియుత చైతన్యంతో సామ్రాజ్యవాద వ్యతిరేక యుద్ధంలో భాగం కావలసిన యువత కూడా నమ్మకమైన సంస్ధల లేమి వలన ఉగ్రవాదం వలలో చిక్కుకుంటోంది. ఇటువంటి ప్రమాదాన్ని నివారించేది కేవలం జాతీయ శక్తులు మరియు విప్లవ చైతన్యం కలిగిన సంస్ధలు మాత్రమే.

…అయిపోయింది.

2 thoughts on “ఇసిస్: మెరుపు పురోగమనం కాదు, సామ్రాజ్యవాదుల కుట్ర

  1. Visekhar sir!!i remember I have read in this blog there are mainly 3 groups of muslims but I am not sure whether it is here or not..i already tried to find out that in your posts..could you please clarify that..Thanks for giving us valuable info

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s