ఇసిస్ మెరుపు పురోగమనం: ఇరాక్, సిరియాల విచ్ఛిన్న కుట్రలో భాగం


ఇరాక్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా జూన్ మూడో వారం నుండి పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ఒక్కసారిగా వార్తలు గుప్పించడం మొదలు పెట్టాయి. ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ఆల్-షామ్ (ISIS)’ అలియాస్ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS)’ అలియాస్ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవంత్ (ISIL)’ అనే ముస్లిం టెర్రరిస్టు సంస్ధ మెరుపు వేగంతో ఇరాక్ లో దూసుకు వెళ్తోందని, అమెరికా శిక్షణ గరిపిన సుశిక్షిత ఇరాక్ బలగాలను తుత్తునియలు చేస్తూ రెండో ప్రధాన, పెద్ద నగరం మొసుల్ ను ఆక్రమించుకుందని, అనంతరం సద్దాం హుస్సేన్ పుట్టిన ఊరు తిక్రిత్ ను కూడా స్వాధీనం చేసుకుని బాగ్దాద్ ఆక్రమణవైపుగా పురోగమిస్తోందని ఈ వార్తల సారాంశం.

ఇంకేం, ఇరాక్ మరోసారి ఉగ్రవాదుల గుప్పెట్లోకి వెళ్లిపోతోందని, ఏడేళ్లపాటు అమెరికా, మిత్రపక్ష దేశాలు పడ్డ శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందనీ చెబుతూ అమెరికా వెంటనే సైనిక జోక్యం చేసుకోవాలని అరబ్ రాజ్యాల నుండి విజ్ఞప్తులు అందుతున్నట్లుగా వార్తా సంస్ధలు చెప్పాయి. ఇది నిజమే అన్నట్లుగా ఇరాక్ అధ్యక్షుడు నౌరి ఆల్-మాలికి సైతం అమెరికా గగనతల దాడులకు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించాడు. తమకు కూడా అర్జెంటుగా ఫైటర్ జెట్ విమానాలు సరఫరా చేయాలని కోరాడు. సున్నీ టెర్రరిస్టులుగా చెబుతున్న ఇసిస్ లేదా ఇసిల్ పురోగమనాన్ని అడ్డుకునే శక్తియుక్తులు ఇరాక్ బలగాలకు లేవని, కాబట్టి అమెరికా మళ్ళీ చొరవ తీసుకుని డ్రోన్ దాడులు చేయడం మినహా మరోదారి లేదన్న రీతిలో పశ్చిమ పత్రికలు ఏకాభిప్రాయ సమ్మతి తయారీలో (manufacturing consent) ప్రస్తుతం నిమగ్నం అయి ఉన్నాయి.

మధ్యధరా సముద్రం తూర్పు తీరాన ఉన్న భూభాగాన్ని లెవంత్ అని పిలుస్తారు. అనగా సైప్రస్, ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, సిరియా, పాలస్తీనా, దక్షిణ టర్కీ భూభాగాలను కలిపి ఇలా లెవంత్ అని పిలిచే వాడుక దాదాపు ఐదారు శతాబ్దాలనాటిది. లెవంత్, ఇరాక్ లను కలిపి ఉమ్మడి ఇస్లామిక్ కాలిఫేట్ రాజ్యాన్ని ఏర్పరచడం ఇసిల్ లక్ష్యం. అంటే ఈ దేశాల స్వతంత్ర ఉనికిని ఇసిల్ గుర్తించదు. అది సాధ్యమా కాదా అన్నది తర్వాత సంగతి. దశాబ్దాలుగా ఉనికిలో ఉన్న స్వతంత్ర రాజ్యాలను రద్దు చేసి విశాలమైన సున్నీ కాలిఫేట్ రాజ్యం స్ధాపించడం ఎవరి ప్రయోజనాల కోసం? ఆయా దేశాల్లోని ప్రజల ప్రయోజనాల కోసం అయితే కాదు. ఇరాక్, సిరియా దేశాలను విచ్ఛిన్నం కావించి తమ ప్రయోజనాలకు అనుగుణంగా సెక్టేరియన్ ప్రాతిపదికన మూడు రాజ్యాలుగా విడగొట్టాలన్నది అమెరికా సామ్రాజ్యవాద ఎజెండాలో ఒక భాగంగా ఉందన్న సంగతి తెలిసినట్లయితే ఇసిల్ అకస్మాత్తుగా పురోగమించడం ఎలా సాధ్యపడిందో  అర్ధం అవుతుంది. ఈ అంశాన్ని పరిశీలించే ముందు కొన్ని ఇతర అంశాలను ప్రస్తావించుకోవడం ఉపయుక్తం కాగలదు.

ఆల్-ఖైదా టెర్రరిస్టు సంస్ధ అమెరికాకు ప్రబల శత్రువు అని పశ్చిమ పత్రికలు తరచుగా చెప్పే మాట. అయితే ఇది ఉపరితల పరిశీలనలో మాత్రమే వాస్తవం. నిజానికి సంఘటిత ఇస్లామిక్ ఉగ్రవాదం పశ్చిమ సామ్రాజ్యవాదులకు వ్యూహాత్మక మిత్రుడు. అమెరికా తదితర పశ్చిమ సామ్రాజ్యవాదులు తాము సైనిక జోక్యం చేసుకోవాలని భావించినచోట మొదట ఆల్-ఖైదా లేదా దానికి అనుబంధంగా ఉండే సంస్ధలు ప్రవేశించి సాయుధ చర్యలకు పాల్పడతాయి. వెనువెంటనే ఆల్-ఖైదా చర్యలను చూపిస్తూ పశ్చిమ సామ్రాజ్యవాదులు ముఖ్యంగా అమెరికా తన జాతీయ భద్రతకు, వ్యూహాత్మక ప్రయోజానాలకు తీవ్ర ప్రమాదం ముంచుకొచ్చిందని గగ్గోలు ప్రారంభిస్తుంది. తద్వారా అమెరికా ప్రజల్లో తాను ప్రారంభించబోయే సాయుధ జోక్యానికి మద్దతు సమకూర్చుకుంటుంది.

ఒకవేళ సాయుధ జోక్యానికి ప్రజలు సిద్ధంగా లేకపోతే తన ఆధీనంలోని మీడియా సంస్ధల ద్వారా ప్రజల సమ్మతిని తానే తయారు చేసుకుంటుంది. సాయుధ జోక్యానికి అనుకూలంగా అమెరికా ప్రజల్లో క్రమక్రమంగా మద్దతు ఎలా పెరిగిపోతున్నదీ సామ్రాజ్యవాద మీడియాలో అత్యంత విశ్వసనీయమైన నైపుణ్య సర్వేల పేరుతో చిలవలు పలవలుగా కధలు, కధనాలు, విశ్లేషణలు వెలువడతాయి. అనంతరం సాయుధ జోక్యం అనివార్యం అన్న సంగతిని అమెరికా కాంగ్రెస్ కూడా గుర్తిస్తుంది. లేకపోతే ప్రజలే ఊరుకోరని గుర్తిస్తుంది. ఆనక జోక్యానికి అవసరమైన బడ్జెట్ కు ఆమోదం ఇవ్వాలని అధ్యక్షుడు కాంగ్రెస్ ను కోరడం, సదరు కోరికను కాంగ్రెస్ మంజూరు చేయడం జరిగిపోతుంది. (కాంగ్రెస్ అనుమతి అనేది అమెరికాలో వివిధ పాలకవర్గ గ్రూపులను కలుపుకుపోయేందుకు ఉద్దేశించిన వ్యవహారం మాత్రమే.)

ప్రస్తుతం దాదాపు అదే తంతు నడుస్తోంది. సిరియా తిరుగుబాటుదారులకు మరింత సహాయం అందించడానికి అమెరికా అధ్యక్షుడు ఒబామా కాంగ్రెస్ అనుమతిని కోరాడు. 500 మిలియన్ డాలర్ల మేరకు ఆయుధాలు, సైనిక శిక్షణ రూపంలో అవసరం అవుతుందని ఒబామా, కాంగ్రెస్ ను కోరాడు. సిరియాలో పచ్చి ప్రజావ్యతిరేకిగా మారిన బషర్ ఆల్-అస్సాద్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఈ సాయం అవసరమని ఆయన కాంగ్రెస్ కు విన్నవించాడు. తద్వారా తన నిర్ణయానికి కాంగ్రెస్ ను కూడా బాధ్యురాలిని చేసేందుకు ఒబామా నిర్ణయించాడు. ఇంతకీ ఒబామా సహాయం అందుకోనున్న సిరియా తిరుగుబాటుదారులు ఎవరో కాదు, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా!

బ్రిటన్ నుండి వెలువడే డెయిలీ టెలిగ్రాఫ్ పత్రిక జూన్ 12, తేదీన ఓ వార్త ప్రచురించింది. సదరు వార్తలో పత్రిక ఇలా తెలియజేసింది.

“ఈ వైపరీత్యాన్ని అర్ధం చేసుకోవాలంటే మొదట దానిని ఉనికిలోకి తెచ్చింది ఏమిటో గ్రహించాలి. దాని (ఇసిల్) ఆవిర్భావం ఆనవాళ్లను నేరుగా ఇరాక్ దాడిలో వెతుక్కోవచ్చు. ఇసిల్ ఫైటర్లు కొందరు బాతిస్టు సైనికులు. వారివల్లే దానికంత శక్తి వచ్చింది. మిగిలినవారు అమెరికా సృష్టించిన ‘మేలుకొలుపు పోరాట” గ్రూపులకు చెందినవారు. ఈ గ్రూపులను 2007లో అమేరికాయే పూర్తిస్ధాయి సివిల్ వార్ ను ప్రేరేపించడానికి సృష్టించింది. సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ ను కూలదోయడానికి పశ్చిమ దేశాలు ప్రారంభించిన యుద్ధం ఇసిల్ ఆవిర్భావానికి దారితీసిన మరో కారణం. అస్సాద్ దిగిపోవాలని పిలుపులు ఇచ్చే మన నాయకులు నేరుగా జోక్యం చేసుకోవడానికి మాత్రం సిద్ధంగా లేరు. అందుకు బదులుగా ప్రధానంగా తమ మిత్రదేశాలైన సౌదీ అరేబియా, కతార్ లాంటి దేశాల ద్వారా మిలిటెంట్ తిరుగుబాటు గ్రూపులను పశ్చిమ దేశాలు పెంచి పోషించాయి. ఆ గ్రూపులే అనంతర కాలంలో ఐ.ఎస్.ఐ.ఎస్/ఐ.ఎస్.ఐ.ఎల్ మరియు ఇతర ఆల్-ఖైదా గ్రూపులుగా పరివర్తన చెందాయి.”

ఇరాక్ ను కబళిస్తోందంటూ పశ్చిమ పత్రికలు గగ్గోలు పెడుతున్న ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ (ISIS/ISIL) మూల చరిత్ర ఇదీ. బాతిస్టు సైనికులు ఈ గ్రూపులో ఉన్నారంటే, వారంతా సద్దాం హుస్సేన్ తరహాలో మెలికలు తిరిగిన జాతీయ నేతలుగా ఊహించుకోనవసరం లేదు. బాతిస్టు ప్రభుత్వాన్ని పశ్చిమ సామ్రాజ్యవాదులు కూల్చివేసిన తర్వాత వారంతా నిరుద్యోగులుగా మారారు. ప్రధానంగా సున్నీ మతానికి చెందిన ఆ సైనికులు సహజంగానే సున్నీ గ్రూపులతో చేరి ఉపాధి వెతుక్కున్నారు.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఇరాక్ లో ఉద్దేశ్యపూర్వకంగా సెక్టేరియన్ ముఠాలను పెంచి పోషించి వారు నిరంతరం కొట్టుకు చచ్చేవిధంగా ఏర్పాట్లు చేశాయి. సి.ఐ.ఏ గూఢచారులే షియా, సున్నీ వేషాలు వేసుకుని మసీదులపై హంతక దాడులు జరిపిన ఉదంతాలు ఇరాక్ లో కోకొల్లలు. అటువంటి ఉదంతాలు కొన్నింటిని సాక్ష్యాలతో సహా పరిశోధనాత్మక పత్రికలు వెల్లడి చేశాయి. ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఇరాక్ ప్రజలు ఎంత తీవ్రంగా సెక్టేరియన్ తగాదాలతో తన్నుకు చస్తే పశ్చిమ సామ్రాజ్యవాదుల దోపిడి ప్రయోజనాల పైకి అంత తక్కువగా ఇరాక్ ప్రజల దృష్టి కేంద్రీకృతం అవుతుంది. సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా ప్రతిఘటనా పోరాటంలో పని చేస్తున్న శక్తులు కూడా ఇరాక్ లో కొనసాగుతున్నప్పటికీ అవి ప్రభావవంతంగా లేవు. అదీగాక అలాంటి శక్తుల పోరాటాలను సైతం ఉగ్రవాద గ్రూపుల కలహాలుగా, దాడులుగా ముద్రవేయడం ఇప్పుడు పశ్చిమ సామ్రాజ్యవాదులకు చాలా తేలిక.

…..ఇంకా ఉంది

One thought on “ఇసిస్ మెరుపు పురోగమనం: ఇరాక్, సిరియాల విచ్ఛిన్న కుట్రలో భాగం

  1. ఈ ఆల్ ఖైదా-అమెరికా సంబంధాల్ని చూస్తే ఓ వైరుధ్యం కనిపిస్తుంది. ఆల్ ఖైదా ప్రధాన ఆశయం ముస్లిం రాజ్యం స్థాపించడం. దానికి అమెరికా సహాయం తీసుకోవడం. అమెరికా కావాల్సింది వ్యాపారం. మత ప్రయోజనాలు కూడా ఉన్నాయోమో తెలీదు కానీ, ప్రధానంగా వ్యాపార ప్రయోజనాలే మఖ్యం. ఆల్ ఖైదాను ప్రోత్సహించిన పాపానికి ఫలితంగా కూడా అనుభవించిన అమెరికా , ఉగ్రవాద గ్రూపులతో సంబంధాల వల్ల ఎటువంటి పర్యవసానాలు, ఫలితాలు ఉంటాయో ఇంకా గ్రహించలేదా…?

    అమెరికా చమురు ఇంధనానికి ప్రత్యామ్నాయంగా షెల్ గ్యాస్ పై ఆధారపడేందుకు నిర్ణయించుకుందని. ఇందుకోసం ఇప్పటికే ఆ దేశంలో భారీ నిల్వలు గుర్తించి వెలికి తీసేందుకు ఏర్పాట్లు చేస్తోందని, అమెరికా సైనికులు కూడా ఇరాక్ వెళ్లేందుకు మానసికంగా సిద్ధంగా లేరని…, అందువల్ల ఇప్పుడు ఇరాక్ సమస్యపై తలదూర్చకపోవచ్చని కూడా కొందరి అభిప్రాయం.
    ఇరాక్, ఆప్ఘన్ ల వ్యవహారాల్లో తలదూర్చి ఆ సమస్యలకు ఎలాంటి ముగింపు ఇవ్వాలో తెలీక సతమతవుతున్న అమెరికా గతం నుంచి పాఠాలు గ్రహించాల్సిన అవసరముంది.
    తన వ్యాపార ప్రయోజనాల కోసం పశ్చిమాసియా మొత్తాన్ని రావణకాష్ఠంగా మార్చి….చివరకు తాను కూడా అందులో సమిధగా మారే దుస్థితి నెలకొంది.

    పశ్చిమా దేశాల పరిస్థితులు బయటి దేశాల జోక్యంతో (అమెరికానో, ఐక్యరాజ్య సమితో) ఎప్పటికీ పరిష్కరించలేవు.
    (పరిష్కరించే ఉద్దేశం కూడా వాటికి ఉండకపోవచ్చు..!)
    ఈ వ్యవహారంలో అమెరికాని పక్కకి పెట్టే భారత్, చైనా లాంటి తృతీయ ప్రపంచ దేశాలు దృష్టి సారించాల్సిన అవసరముంది. పశ్ఛిమాసియా సరిహద్దు దేశాలుగానే కాక, చమురు వనరులపై ప్రధానంగా ఆధారపడిన దేశాలకు పశ్చిమాసియా సంబంధాలు చాలా కీలకం.
    భారత్, చైనా దేశాలు ఈ దిశగా చొరవచూపాల్సిన అవసరముంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s