ప్రతిపక్షంలో ఉంటే ఓ మాట, అధికారంలో ఉంటే మరొక మాట. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఓట్ల కోసం సవాలక్షా మాట్లాడితే అధికారంలోకి వచ్చాక ఆచితూచి మాట్లాడడం. అధికారం మోపే అనివార్య జాతీయ, అంతర్జాతీయ బాధ్యతల బరువు నిరంతరం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని గుర్తు చేస్తుంటే బలవంతాన నాలుక తీటను అణిచిపెట్టుకోవలసిన అగత్యం దాపురిస్తుంది. తోటి సచివులకి ఆదర్శ వంతులుగా వ్యవహరించాలని హిత బోధలు చేసేందుకు కూడా ప్రేరేపిస్తుంది. ఎన్నికల ముందు అక్రమ బంగ్లాదేశ్ వలస జనం వెనక్కి వెళ్లిపోక తప్ప దంటూ హుంకరించిన బి.జె.పి తీరా అధికారంలోకి వచ్చాక బంగ్లాడేస్ అక్రమ వలస సమస్య బహు సున్నితం అంటూ సన్నాయి నొక్కులు నొక్కడాన్ని ఇంకే విధంగా అర్ధం చేసుకోవాలి?
విదేశీ మంత్రిగా తన మొట్టమొదటి విదేశీ పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్ ఏతెంచిన సుష్మా స్వరాజ్ ఇరు దేశాలకు చెందిన 4,000 కి.మీ వెంబడి సాగుతున్న వలసల సమస్యను చాలా జాగ్రత్తగా, వివిధ పాత్రధారులందరి అభిప్రాయాలను పరిగణిస్తూ పరిష్కరించాలని, అలాగే పరిష్కరిస్తామని ఉద్భోదిస్తూ హామీ ఇచ్చారు. పరస్పరం సుహృద్భావక చర్చల ద్వారానే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఉపదేశించారు. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో ఇరు దేశాలు అనుభవించిన స్నేహ సంబంధాలను ముందుకు కొనిపోవడమే కాకుండా నూతన ఉన్నత ఎత్తులకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారామె.
“గత ప్రభుత్వ హయాంలో ఇరు దేశాలు నెరిపిన సంబంధాలను కొనసాగిస్తూ వాటిని నూతన స్ధాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని భావిస్తున్నాము. అక్రమ వలసల సమస్య ఏ దేశంలోనైనా చాలా సున్నితమైన సమస్యగా ఉంటుంది. అందువలన చాలా జాగ్రత్తగా దానిని పరిష్కరించాల్సి ఉంటుంది” అని ఆమె బంగ్లా దినపత్రిక ప్రోధోమ్ ఆలో కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాకృచ్చారు. ఈ సంగతి బి.జె.పి పాలకులకు అధికారంలో లేనప్పుడు తెలియదా? తెలిసే ఉండాలి. తెలిసి ఉండీ అక్రమంగా వలస వచ్చినవారు వెనక్కి వెళ్లిపోక తప్పదని ఆ పార్టీ ప్రచార సారధి నరేంద్ర మోడి ఖరా ఖండీగా ఎలా ప్రకటించగలిగారు? బలవంతంగానైనా అక్రమ వలసదారులు వెనక్కి పంపేస్తామని ఎలా బెదిరించగలిగారు? అసలు జనం ఏది నమ్మాలి? ఎన్నికల ముందు ప్రకటనను నమ్మాలా లేక అధికారంలోకి వచ్చాక చేసే ప్రకటనను నమ్మాలా?
బంగ్లాదేశ్ తో ఇండియా అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నదనీ, అంతేకాకుండా ఈ సరిహద్దు అనేకచోట్ల వలసలకు అనువుగా ఉన్నదని మంత్రి గుర్తు చేశారు. అందువల్ల భద్రతా పరంగా ఈ సమస్య ఇరు దేశాలకూ ముఖ్యమైన సమస్య అనీ ఆమె తెలిపారు. “అది అనేక రంధ్రాలు కలిగిన సరిహద్దు. దానివెంట నివసించే ప్రజలందరూ కడు పేదలు. దట్టమైన సాంద్రతతో ప్రజలు సరిహద్దు వెంబడి నివసిస్తున్నారు. ఈ కారణం వల్ల అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయి… ఈ పరిస్ధితుల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడానికి ఇరు దేశాలు ఉమ్మడిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది” అని సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు.
“భద్రత పటిష్టంగా ఉన్నట్లయితే మన సరిహద్దు ప్రాంతాలు సంపన్నం అవుతాయి. అందుకోసం చట్టబద్ధ పాలనను శక్తివంతం చేసుకోవాలి. నిస్సహాయులయిన అమాయక ప్రజలు బుద్ధిలేని కార్యకలాపాలకు బాధితులుగా మారడానికి అనుమతించరాదు” అని స్వరాజ్ స్పష్టం చేశారు. అక్రమ వలసదారులను బలవంతంగానైనా వెనక్కి పంపేస్తామన్న నరేంద్ర మోడి హెచ్చరికను విదేశీ మంత్రి పూర్వపక్షం చేసేస్తున్నారు. తాము ఎన్నికల్లో రెచ్చగొట్టిన భావోద్వేగాలకు విరుద్ధంగా ఇప్పుడు మాట్లాడదలిస్తే దానికి తగిన వివరణను బి.జె.పి మంత్రులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రజలకు గానీ, ఎన్నికల్లో వెలువరించే ప్రేలాపనలకు గానీ బాధ్యత వహించాలన్న తెలివిడి భారత పాలకవర్గాలకు ఏనాడూ ఉన్నది గనక?
తీస్తా నదీజలాల పంపకం విషయంతో పాటు, భూ సరిహద్దు ఒప్పందం అంశంలో దేశంలో వివిధ పార్టీల మధ్య ఏకాభిప్రాయం తెప్పించడానికి తాము కృషి చేస్తామని సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. కానీ ఆ ఏకాభిప్రాయం ఎలా సాధిస్తారో ఆమె చెప్పలేదు. అసలు ఏకాభిప్రాయం రప్పించడానికి ఇతర పార్టీలు సహకరిస్తాయా? యు.పి.ఏ అధికారంలో ఉన్నప్పుడూ ఏకాభిప్రాయ సాధన అన్నారు గానీ అందుకు బి.జె.పి పక్షం సహకరించలేదు. ఇప్పుడు బి.జె.పి అందుకు ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ సహకరిస్తుందా? తాము విపక్షంలో ఉంటేనేమో ‘ఇచ్చిపుచ్చుకునేందుకు చేసే ప్రయత్నాలన్నింటినీ దేశ ప్రయోజనాలకు విఘాతంగా అభివర్ణిస్తూ అరిచి గోల చేయడం, అధికారంలోకి వస్తేనేమో మళ్ళీ అదే ఏకాభిప్రాయం కబుర్లు వల్లించడం రాజకీయ పార్టీలకు ఒక విధానంగా మారిందా?
“తీస్తా నదీజలాల ఒప్పందం విషయంలో దేశంలో అంతర్గతంగా ఏకాభిప్రాయ సాధనకు మేము కృషి చేస్తున్నాము. భూ సరిహద్దు ఒప్పందం అంశంలో రాజ్యాంగ సవరణ బిల్లును ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశపెట్టాము. ఈ విషయంలో కూడా రాజకీయ ఏకాభిప్రాయం సాధించడానికి మేము కృషి చేస్తున్నాము” అని సుష్మా చెప్పారు.
ఇరు దేశాలు తలపెట్టిన భూ సరిహద్దు ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు పరస్పరం ప్రతికూల ప్రాంతాలను, ప్రజలను ఇచ్చి పుచ్చుకోవాలని భావిస్తున్నారు. అనగా భారత దేశంలో భాగంగా ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ లో కలపగల భాగాలతో, బంగ్లాదేశ్ లో భాగంగా ఉన్నప్పటికీ భారత దేశంలో కలపగల భాగాలను పరస్పరం మార్పిడి చేసుకోవాలని భావిస్తున్నారు. తద్వారా అక్రమ వలసలను అరికట్టడమే కాకుండా శతృభావనలను ప్రజల్లో పోగ్గొట్టుకోవచ్చు. ఈపాటి సహనశీలత, డిప్లొమసీ, పరిష్కార ధోరణి ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎక్కడికి వెళ్లిపోతాయన్నదే అసలు సమస్య.
ఒక్క బంగ్లాదేశ్ తోనే కాదు, మరే ఇతర దేశంతోనైనా సరే శాశ్వత సరిహద్దులను నిర్ధారించుకునే ఒప్పందం కుదరాలంటే పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి తప్పనిసరి. ప్రపంచంలో అనేక దేశాల మధ్య, చివరికి తీవ్ర శతృభావనాలు కలిగి ఉండే జాతి దేశాల మధ్య కూడా ఇలాగే సరిహద్దులు నిర్ణయం అయ్యాయి. కానీ సరిహద్దు సమస్యను వీలయినప్పుడల్లా అనవసర భావోద్వేగాలతో రెచ్చగొడుతూ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవడానికే బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలు అలవాటు పడ్డాయి. కాబట్టి ఈ రెండింటిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మరో పార్టీ సరిహద్దు సమస్య సామరస్య పరిష్కారానికి సహకరించదుగాక సహకరించదు.
సరిహద్దు సమస్య ముఖ్యంగా చైనా, బంగ్లాదేశ్, పాకిస్ధాన్ లతో ఉన్న సరిహద్దు సమస్య భారత పాలకవర్గాలకు బంగారు ఓట్లు రాల్చే చెట్టులాంటింది. కాబట్టి ఆ సమస్య నిరంతరం రగులుతూ ఉండడమే వారికి కావాలి. అందువల్లనే అధికారంలో ఉన్నప్పుడూ ఒకమాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ మరో మాట వల్లిస్తూ ప్రజలను రెచ్చగొడుతూ ఉంటాయి. ఈ సంగతి గ్రహించని సో కాల్డ్ దేశభక్త మహాశయులు మాత్రం ఆవేశకావేశాలు ప్రదర్శిస్తూ ‘ముక్కలు కానివ్వం’, ‘నా తల్లి సింధూరం’, ‘అక్రమ ఓటుబ్యాంకు పౌరసత్వం’ అంటూ పనికిమాలిన భావోద్వేగాలు ప్రదర్శిస్తూ ఆయాసపడిపోతుంటారు. ఇలాంటి బాపతు మంద కనీసం తమ నాయకుల మాటల మధ్య తేడాలను గ్రహించి నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తారా అన్నది ఎన్నటికీ తేలని సమస్య.
సరిహద్దు సమస్యనూ, నదీజలాల పంపిణీ సమస్యను పరిష్కరించుకుని ఇరు దేశాల మధ్య స్నేహపూర్వకమైన వాణిజ్య సంబంధాలు పెంచుకోవడానికి కొత్త ప్రభుత్వం కృషి చేస్తుందని చెబుతున్న సుష్మా స్వరాజ్ మాటలు ఎంతవరకూ ఆచరణ రూపం దాల్చేది, ఆచరణలోకి వచ్చేవరకూ అనుమానమే.
ఈ సమస్య పై నా అభిప్రాయం;సహజకారణాలవలన బంగ్లాదేశ్ నుండి వలసలు పూర్తిగా అరికట్టడం సాధ్యం కాకపోవచ్చును.అందులో ఎక్కువమంది పొట్టకూటికై వచ్చే వాళ్ళే.అందువల్ల వలసదార్లు స్థానిక ముస్లిముల్లో కలిసి పోకుండా వారికి work permits ఇచ్చి వేరే గుర్తింపుకార్డులు ఇవ్వాలి.వారు ఎన్నాళ్ళు వున్నా వోటు హక్కుగాని ,ఆస్తి సంపాదించే హక్కుగాని,సిటిజెన్ షిప్ గాని లేకుండా చెయ్యాలి.జీవనోపాధి సంపాదించుకొని,కొంతసొమ్ము బంగ్లాదేశ్ లో వారి కుటుంబాలకు పంపుకోవచ్చును.ఆ విధంగా గట్టి కట్టుబాట్లు చెయ్యవచ్చును.(గల్ఫ్ దేశాల్లో విదేశీ పనివారిలాగ) .ఇన్నాళ్ళు వారిని వోటుబాంకుల్లాగ వాడుకొన్నారు.కనీసం ప్రస్తుత B.J.P.ప్రభుత్వమైనా ఈ పని చెయ్యవలసివుంటుంది.
తనదాకా వస్తే కానీ తత్వం బోధపడదన్నట్లు…,అధికారంలోకి వచ్చాక భారతీయ జనతా పార్టీకి సరిహద్దు దేశాలతో సానుకూల సంబంధాలు, ప్రతిపక్షాలతో సహకారం అవసరమయ్యాయన్న మాట..
ఈ సరిహద్దు సమస్య, అక్రమ వలసల పైనే వెంకయ్య నాయుడు భారతదేశం సరిహద్దు మొత్తం ఓ పర్యటన చేసినట్టున్నారు. ఆ పర్యటనపై ఓ పుస్తకం కూడా వేస్తే నేను చదివాను. ప్రధానంగా చికెన్ నెక్ ప్రాంతంలో జరుగుతున్న వలసల మీద వాళ్లు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ, దేశంలో పెరిగిపోతున్న ఉగ్రవాదానికి, మతకలహాలకు బంగ్లా వలసలే కారణమని కూడా రాశారు. తాము అధికారంలోకి వస్తే కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని, ఒక్క బంగ్లాదేశస్తున్ని కూడా మనదేశంలోకి రాకుండా కర్ర పట్టుకుని కాపలాకాస్తామని రాశారు.
ఇప్పుడేమో సున్నిత సమస్య అని, పరస్పరం పరిష్కరించుకోవాలని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉండగా పాకిస్తాన్ తో యూపిఏ ప్రభుత్వం ఏమాత్రం సానుకూలంగా వ్యవహరించినా…, సైనికుల తలలు నరికిన వారితో చర్చలా, కాశ్మీర్ పండిట్లను వేధించిన వారితో చర్చలా అంటూ…విదేశీ వ్యవహారాల్ని, అంతర్గత కలహాల్ని కలగాపులగం చేసి….ప్రజలను రెచ్చగొట్టేవారు.
ఇక చైనాతో సంబంధాల గురించి బీజేపీ పార్టీ ప్రచారం గురించి చెపితే పెద్ద పుస్తకం రాయొచ్చు
చైనా పని ఎప్పుడూ మన దేశాన్ని ఆక్రమించుకోవడమేనని, చైనా ఇప్పటికే మన భారతదేశాన్ని చాలా ప్రాంతం ఆక్రమించిందని… ఏదో ఒకరోజు మనదేశాన్ని ఆక్రమించడం కోసం కాచుకొని కూచుందని…ఆ పార్టీలో చాలా మంది ప్రచారం చేస్తారు. భారత్-చీనీ భాయీ భాయీ అనే సానుకూల వాతావరణాన్ని చైనా యుద్ధం కన్నా, ఆసెస్సెస్, సంఘ్ పరివార్ శక్తుల దుష్ప్రచారమే చెడగొట్టింది.
మన ఇరుగు పొరుగును మనం నిర్ణయించుకోలేం అన్న అటల్ బీహారీ వాజ్ పేయ్ వ్యాఖ్య చాలా ప్రముఖమైనవి.
తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సరిహద్దు దేశాలతో సుహృద్భావ సంబందాలు అంటూ నీతిబోధలు చేస్తున్నారు. మొదటి నుంచి ఇలా ఉంటే బాగుండేది కదా.
ఐతే ఇక్కడ భాజపా ఎటువంటి వైఖరి అవలంబిచాలన్నది ఆ పార్టీ ఇష్టం. దానిలో ఎవరూ జోక్యం చేసుకోరు. కానీ అధికారంలో ఉండగా ఒకలా…, ప్రతిపక్షంలో ఒకలా మాట్లాడాన్ని మాత్రం ఎవరూ సమర్థించరు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న, ఆ విద్యలో తాను కూడా తీసిపోలేదని బీజేపీ నిరూపించుకుంటోంది.
సరిహద్దు దేశాలతో శతృత్వం వల్ల రాజకీయ పార్టీలకు తాత్కాలికంగా ఓట్లు పడొచ్చేమో కానీ…దీర్ఘకాలికంగా మాత్రం దేశానికి తీరని నష్టం వాటిల్లుతుంది. సరిహద్దు దేశాలతో భారత్ సంబంధాలే ఇందుకు ప్రముఖ నిదర్శనం.