ఓ మృత శరీరాన్ని తట్టి లేపేందుకు చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. మరుపు పొరల్లో సమాధి అయిన పంచశీల సూత్రాలు ఇప్పటికీ శిరోధార్యమేనని చైనా అధ్యక్షుడు, భారత ఉపాధ్యక్షుడు బీజింగ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు.
చైనా, మియాన్మార్, ఇండియాలు కుదుర్చుకున్న పంచ శీల ఒప్పందానికి 60 యేళ్ళు పూర్తయిన సందర్భంగా బీజింగ్ లో ఓ కార్యక్రమం జరిగింది. ఇరుగు పొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించే ఉద్దేశ్యం తమకు ఏ కోశానా లేదని ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు చాటగా, ఇండియా, బర్మాలను మచ్చిక చేసుకునేందుకు ఆయన ప్రత్యత్నిస్తున్నారని పశ్చ్గిమ పత్రికలు భాష్యం చెబుతున్నాయి.
1954లో చైనా, ఇండియా, మియాన్మార్ లు శాంతియుత సహజాజీవనానికి సంబంధించిన 5 సూత్రాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇదే పంచశీల ఒప్పందంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. శాంతియుత సహజీవనం, పొరుగు దేశపు అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం, పొరుగు దేశంపై దాడికి సిద్ధపడకపోవడం లాంటి ఈ సూత్రాలు అనంతర కాలంలో అలీన ఉద్యమంలోకి ప్రవేశించి ఇండియాకు ప్రపంచ వేదికలపై ఒక ఉత్కృష్ట స్ధానాన్ని కల్పించాయి.
అమెరికా, సోవియట్ రష్యాలు ప్రధాన ధృవాలుగా కొనసాగిన నాటి ప్రపంచ రాజకీయాల్లో అలీన ఉద్యమం ద్వారా భారత్, చైనాలు ప్రత్యేకంగా నిలిచాయి. కానీ ఆచరణలో ఇండియా సోవియట్ రష్యా ఉపగ్రహ రాజ్యంగా ఉనికిలో కొనసాగిన సంగతి బహిరంగ రహస్యమే.
పంచశీల ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ సరిహద్దు తగాదాల ఫలితంగా 1960ల నుండి రగిలిన పొరపొచ్చాలు తీవ్రమై యుద్ధం వరకూ దారితీసాయి. దానితో పంచశీల ఒప్పందం కాగితాల వరకే పరిమితమై చరిత్ర పొరల్లో కనుమరుగై పోయింది. మియాన్మార్ లో సైతం చైనా వ్యతిరేక అల్లర్లు చెలరేగడంతో చైనా-మియాన్మార్ (అప్పుడు బర్మా) సంబంధాలు కూడా బలహీనతకు గురయ్యాయి.
ఈ నేపధ్యంలో పంచశీల ఒప్పందానికి 60 యేళ్ళ పండుగ జరపాలని మూడు దేశాలు నిర్ణయించుకోవడం ఒకింత ఆశ్చర్యకర పరిణామం. మూడు దేశాలు తిరిగి సహకార సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఒక మార్గాన్ని వెతుక్కునే క్రమంలోనే దుమ్ము పట్టిన పంచశీల దస్త్రాన్ని దుమ్ము దులిపి బల్లపైకి తెస్తున్నారా అన్నది భవిష్యత్ పరిణామాలు మాత్రమే నిగ్గు తేల్చగలవు.
700 మందికి పైగా ఆహూతులు హాజరయిన ‘పంచశీల సభ’ బీజింగ్ లోని ప్రతిష్టాత్మకమైన ‘గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్’ లో జరగడం విశేషం. మియాన్మార్ అధ్యక్షుడు, మాజీ సైనిక నియంత అయిన ధీన్ సీన్, చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ లు ఈ సభకు హాజరు కాగా ఇండియా మాత్రం తమ ఉపాధ్యక్షుడు హమీద్ అన్సారీని మాత్రమే పంపడం వెనుక మర్మం ఏమిటో తెలియవలసి ఉంది. హమీద్ అన్సారీని రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించినప్పుడు ఆయనకు ‘అంత స్ధాయి లేదని’ బి.జె.పి అధినేత్రి, ప్రస్తుత విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ ఈసడించుకోవడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.
“ఒక దేశం శక్తివంతం కావడం మొదలు పెడితే అది అనివార్యంగా ఆధిపత్యాన్ని కోరుకుంటుందన్న అవగాహనను చైనా నమ్మడం లేదు. ఆధిపత్యం లేదా మిలట్రీ వాదం అన్నది చైనా జన్యువుల్లోనే లేదు. ఎటువంటి శషభిషలు లేకుండా చైనా నిశ్చయంగా శాంతియుత అభివృద్ధి పంధాను మాత్రమే అనుసరిస్తుంది. ఎందుకంటే అదే చైనాకూ, ఆసియాకు, ప్రపంచానికీ మంచిది కనుక” అని చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ వాకృచ్చారు.
“అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆధిపత్యం చెలాయించడం అన్నది మరో యుగానికి చెందినది. అలాంటి ప్రయత్నాలు విఫలం కాక తప్పవు. మిలట్రీ బలాన్ని ప్రదర్శించడం నైతిక పునాది రాహిత్యాన్ని, ఒక ఉదాత్త దర్శన లేమినీ మాత్రమే వెల్లడి చేస్తుంది తప్ప వాస్తవ శక్తిని కాదు. నైతిక ఔన్నత్యం, ఉన్నత లక్ష్యంలపై ఆధారపడితేనే భద్రత శక్తివంతంగానూ, శాశ్వతంగానూ ఉండగలదు” అని గ్జి జిన్ పింగ్ పంచశీల సభలో పేర్కొన్నారు.
గ్జి జిన్ పింగ్ మాటలు అమెరికా, ఐరోపాలను పరోక్షంగా దెప్పి పొడుస్తున్నాయన్నది స్పష్టమే. కానీ శక్తివంతం అయేందుకు ప్రయత్నించే దేశం అనివార్యంగా ఆధిపత్యాన్ని కోరుకుంటుదన్న వాస్తవం మరో యుగానికి చెందిందన్న ఆయన ఆదర్శం మాత్రం నడుస్తున్న యుగానికి చెందింది కాదని చెప్పక తప్పదు.
ఆధిపత్యం చెలాయించడం, చెలాయించకపోవడం అన్నవి ఒక దేశం యొక్క నైతిక ధృతి పైననో, ఆదర్శాల నిబద్ధతపైనలో ఆధారపడి ఉండేవి కావు. అది వాస్తవంగా భౌగోళిక రాజాకీయార్ధిక ఉనికికి సంబంధించిన సమస్య మాత్రమే. ఆర్ధిక ఎదుగుదల దానంతట అదే సంభవించే అమూర్త పరిణామం కాజాలదు. సమానంతరంగా రాజకీయ, మిలట్రీ దారుఢ్యాన్ని ప్రదర్శించకుండా ఆర్ధిక ప్రయోజనాలు వాటంతట అవే సిద్ధించవు.
ప్రత్యర్ధి శక్తులు అలుపెరగకుండా దురాక్రమణ పర్వాలలో మునిగి తేలుతున్నప్పుడు, నువ్వు ఆర్ధికంగా నిలబడాలంటే, అలాంటి పరిణామాలలో ఒక పక్కకు చేరక తప్పదు. లేకపోతే నీ ఉనికే ప్రశ్నార్ధకం అవుతుంది. నిర్దిష్ట మిలట్రీ-రాజకీయ పంధాను చేపట్టి నిలబడడామా లేక బలహీనపడి ఉనికిని కోల్పోవడమా… ఒక ఆర్ధిక శక్తికి అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలు ఈ రెండే. పైకి ఎన్ని చెప్పినా మిలట్రీ శక్తిని పెంచుకుంటూ పోతున్న చైనా చర్యలు సైతం ఈ వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తమ దేశాన్ని ఆధిపత్య శక్తులు దశాబ్దాల తరబడి వందల సార్లు బెదిరించి దోచుకున్నాయని గ్జి గుర్తు చేయడం కూడా అదే వాస్తవాన్ని చెబుతోంది.
సముద్ర సరిహద్దులను భద్రం చేసుకోక తప్పదని కూడా గ్జి జిన్ పింగ్ ఈ సందర్భంగా తమ ప్రజలకు ఉద్భోదించారు. తన ఉపన్యాసంలో చైనా అధ్యక్షుడి భారత ప్రధానిని పొగడడం మాత్రం మర్చిపోలేదు. భారత సాయుధ బలగాలను ఆర్ధిక శక్తిని బలీయం చేసుకోవడానికి నూతన ప్రధాని ప్రయత్నిస్తున్నారని, సదరు ప్రయత్నాలకు తమ సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆర్ధికంగా, సాయుధంగా శక్తివంతం అయితేనే విదేశీ సంబంధాలలో దీటుగా వ్యవహరించగలరని ఆయన గుర్తు చేశారు. పనిలో పనిగా రవీంద్ర నాధ్ టాగూర్ గుర్తు చేస్తూ యుద్ధం ద్వారా స్నేహాన్ని పొందలేవని ఉపదేశం కావించారు.
“ఇండియా, మియాన్మార్ మరియు ఇతర ఆసియా దేశాల ప్రజలు ప్రేమ, దయ, శాంతి లాంటి విలువలకు ప్రాధాన్యం ఇస్తారం”టూ ఆయన ఆసియా సెంటిమెంటును సైతం ప్రేరేపించారు. చైనాతో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి మోడి ప్రభుత్వం ఆసక్తిగా ఉందని హిందూత్వ అభిమానులు భావిస్తున్న నేపధ్యంలో వారి భావనల వాస్తవ ఆచరణ ఇంకా వ్యక్తం కావలసే ఉంది.
దయ్యాలు వేదాలు వల్లిస్తాయి. మనుషులు మాటలుప్రేరుస్తారు. ఇండియాకు తగిన ఆసియ స్నేహితుడు మంత్రాలు వల్లిస్తున్నాడు.