“బహుశా ఆయన యజమాని ఆలోచనలు వినబడతాయేమో…”
***
గత ఎన్.డి.ఏ ప్రభుత్వం హయాంలో యు.జి.సి స్వయం ప్రతిపత్తి తీవ్ర నియంత్రణకు లోనైంది. మరళీ మనోహర్ జోషి నేతృత్వంలోని మానవ వనరుల అభివృద్ధి శాఖ యు.జి.సితో పాటు ఎన్.సి.ఈ.ఆర్.టి పాఠ్య గ్రంధాలలోని పాఠ్యాంశాలను సైతం నిర్దేశించడం ద్వారా హిందూత్వ ఎజెండాను పచ్చిగా అమలు చేసేందుకు పూనుకుంది.
ఆ క్రమంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన భారతీయ చరిత్రకారులను వివిధ పదవుల నుండి తొలగించడమే కాకుండా చరిత్రగా పరిగణించలేని అంశాలు సైతం దారి చేసుకుని బృహత్ చరిత్రగా పాఠ్యాంశాలకు ఎక్కి భారత చరిత్ర ప్రయాణాన్ని వెక్కిరించినంత పని చేసింది.
ఢిల్లీ యూనివర్సిటీ ప్రవేశ పెట్టిన నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు విషయంలో యు.జి.సి వేస్తున్న అడుగులు మళ్ళీ పాత రోజులను గుర్తుకు తెస్తున్నట్లు కనిపిస్తోంది. నాలుగు సంవత్సరాల కోర్సును రద్దు చేయాల్సిందేనని ఢిల్లీ యూనివర్సిటీ ని యు.జి.సి ఆదేశించడంతో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయడం వరకూ వివాదం వీధికెక్కింది.
యు.జి.సి ఆదేశాలు తమ స్వయం ప్రతిపత్తిని హరించాయని రాజీనామా చేసిన వైస్ ఛాన్సలర్ ఆక్షేపించగా అసలు యు.జి.సి స్వయం ప్రతిపత్తే అనుమానంలో పడిపోయిందని ఈ కార్టూన్ సూచిస్తోంది. జరిగింది ఏమిటో రానున్న రోజుల్లో ఎలాగూ బైటపడక మానదు. ఆ లోపు ఏలినవారి ఉద్దేశ్యాలను ఎరిగి అప్రమత్తం కావలసిన బాధ్యత విద్యార్ధి లోకంపై మరింతగా పడినట్లేనని పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.
His Masters Voice (HMV) అన్నది గ్రామ్ ఫోన్ కంపెనీ. తమ అదృశ్య యజమాని యొక్క ఆలోచనలను వినేందుకు HMV గ్రామ్ ఫోన్ ను తమ పరిపాలనా బల్ల ముందు యు.జి.సి వారు నెలకొల్పుకున్నారని కార్టూనిస్టు వ్యంగ్యీకరించారు. యు.జి.సి స్వయం ప్రతిపత్తిని సదరు అదృశ్య యజమాని (కేంద్ర ప్రభుత్వం వెనుక ఉన్న హిందూత్వ శక్తులు) నియంత్రిస్తున్నాయని కార్టూనిస్టు పరోక్షంగా సూచిస్తున్నారు.
Reblogged this on ugiridharaprasad.
పింగ్‌బ్యాక్: యు.జి.సి స్వయం ప్రతిపత్తికి ఎవరు యజమాని? -కార్టూన్ | ugiridharaprasad