ప్రశ్న: వలసవాదం, సామ్రాజ్యవాదం ఒకటేనా?


Goldman Sachs

రాకేష్:

వలసవాదం, సామ్రాజ్యవాదం ఒకదానికొకటి పర్యాయపదాలా? వలసవాదం కంటే సామ్రాజ్యవాదం విశాలమైనది కావచ్చు, కానీ రెండింటి మధ్య నిర్దిష్ట తేడా ఏమిటి? వలసలు లేకుండా సామ్రాజ్యవాదం పని చేస్తుందా? పని చేస్తే ఉదాహరణలు ఏమిటి?

సమాధానం:

వలసవాదం, సామ్రాజ్యవాదం పర్యాయపదాలు కాదు. మీ ప్రశ్నలోనే ఉన్నట్లుగా సామ్రాజ్యవాదం విస్తృతమైన భావాన్ని, నిర్మాణాలను, వ్యవస్ధలను తెలియజేస్తుంది. వలసవాదం నిర్దిష్టమైన వ్యవస్ధాగత నిర్మాణం, పరిపాలనలను తెలియజేస్తుంది. వలసవాదం సామ్రాజ్యవాదంలో భాగంగా పరిగణించవచ్చు. కానీ సామ్రాజ్యవాదంలో ఉన్నదంతా వలసవాదంగా చెప్పలేము.

వలసవాదం అంటే ప్రత్యక్ష పాలన. ఒక దేశాన్ని మరొక దేశం ఆక్రమించుకుని వలసగా చేసుకుని దోపిడి చేయడం వలసవాదం. వలస పాలకులు ప్రత్యక్షంగా, భౌతికంగా వలసలను ఆక్రమించుకుని  పరిపాలిస్తే అది వలసవాదం. ఇండియాతో సహా అనేక ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు వివిధ యూరోపియన్ దేశాలకు వలసలుగా మారాయి. జాతీయోద్యమాల ద్వారా వలస దేశాల ప్రజలు పోరాటం చేసి వలస పాలనల నుండి విముక్తి సాధించడం తెలిసిన విషయమే.

ఇప్పుడు కూడా వలస పాలనలో కొన్ని దేశాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం అమెరికా ప్రత్యక్ష పాలనలో ఉంది. ఇరాక్ కూడా 2008 వరకూ అమెరికా ప్రత్యక్ష పాలనలో కొనసాగింది. అర్జెంటీనాకు చెందిన భూభాగం ఫాక్ లాండ్స్ ఇప్పటికీ బ్రిటన్ అధీనంలో ఉంది. ఫాక్ లాండ్స్ ను తమ సొంత భూభాగంగా వాదిస్తున్న బ్రిటన్, తన వలస మనస్తత్వాన్ని విడనాడి ఫాక్ లాండ్స్ ను అర్జెంటీనాకు అప్పగించాలని ఐరాస ఇటీవల గడ్డి పెట్టినా బ్రిటన్ తన వంకర వాదన మానలేదు. ప్యూర్టోరికో ద్వీపకల్పాన్ని అమెరికా తన భూభాగంగానే పరిగణిస్తుంది. అమెరికా పైకి ఎన్ని చెప్పినా ప్యూర్టోరికా అమెరికాకు వలస భూభాగం అనే చెప్పాల్సి ఉంటుంది.

సామ్రాజ్యవాదం అంటే ఆర్ధిక ఆధిపత్యమే లక్ష్యంగా సామ్రాజ్య విస్తరణ. ఆర్ధిక ఆధిపత్యం కలిగిన సామ్రాజ్యం అనివార్యంగా రాజకీయ ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది. పైకి చూడడానికి రాజకీయ స్వాతంత్ర్యం కలిగి ఉన్నట్లు కనిపించే అనేక దేశాలు వాస్తవంలో ఆర్ధిక, రాజకీయ పరాధీనతను కలిగి ఉంటాయి. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా లలోని అనేక దేశాలు ఇప్పటికీ వివిధ సామ్రాజ్యవాద దేశాల పెట్టణంలో ఉన్నాయి. అందులో ఇండియా కూడా ఒకటి.

వలస పాలనలో ఒకే దేశం మరొక దేశంపై ప్రత్యక్షంగా పెత్తనం చేయగలిగితే సామ్రాజ్యవాద యుగంలో ఏక కాలంలో అనేక ఆధిపత్య దేశాలు ఆ దేశంపై పెత్తనం చేసే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇలా వివిధ పెత్తందారీ దేశాల మధ్య బేరసారాలు ఆడగల శక్తి ఆధిపత్యంలో ఉన్న దేశాల పాలకులకి ఉంటుంది. ఇలా బేరసారాలు ఆడగల శక్తి పైకి ఆర్ధిక, రాజకీయ స్వతంత్రంగా కనిపిస్తుంది. అది వాస్తవంలో లొంగుబాటు మాత్రమే. బాహ్యపరిశీలనకు ఇది అంత తేలికగా అంతుబట్టదు. అందువలన లేని స్వతంత్రాన్ని ఉన్నట్లుగా మోసం చేయగల అవకాశం లోంగుబాటులో ఉన్న పాలకులకు ఉంటుంది.

ఈ విధంగా నామమాత్ర స్వతంత్రాన్ని అనుభవించే ఒక దేశం వివిధ సామ్రాజ్యవాద దేశాల ఆధిపత్యంలో ఉండడాన్ని అర్ధ వలసగా చెబుతాము. సామ్రాజ్యవాద శక్తులు తమ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టే ఉపరితల పెట్టుబడిదారీ సంబంధాలు ఆ దేశం పెట్టుబడిదారీ దేశంగా అభివృద్ధి చెందిన భ్రమలను కలుగజేస్తాయి. ఈ విధంగా బైటి నుండి పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసం ప్రవేశించే పెట్టుబడిదారీ సంబంధాలు ఒక దేశ వ్యవస్ధను ఫ్యూడల్ దశ నుండి పెట్టుబడిదారీ దశకు చేర్చగలవా అన్నది ప్రస్తుతం ఒక చర్చగా ఉంటోంది.

ఆధునిక పరిభాషలో సామ్రాజ్యవాదం అంటే ద్రవ్య పెట్టుబడిని ఎగుమతి చేయడం ద్వారా విదేశాలను సర్వ విధాలుగా తన అదుపులో పెట్టుకోవడం. ఆధునిక సామ్రాజ్యవాదాన్ని సమగ్రంగా పరిశీలించి లోకానికి తెలియజేసిన వ్యక్తి వ్లాదిమిర్ ఇల్యూనోవిచ్ లెనిన్. పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశే సామ్రాజ్యవాదం అని లెనిన్ సూత్రీకరించారు. ఆ సూత్రం ఇప్పటికీ వందకు రెండొందలు వంతులు వాస్తవం.

సామ్రాజ్యవాదంలో మరొక పార్శ్వం నయా వలస వాదం. పాత వలసవాదంలో ఆధిపత్య దేశం ప్రత్యక్ష పాలన ద్వారా దోపిడీ చేస్తే నయా వలస వాదంలో ద్రవ్య పెట్టుబడి ఎగుమతి ద్వారా పరోక్ష పాలన సాగిస్తుంది. ఒకే ఒక్క సామ్రాజ్యవాద దేశం ఒక పాలిత దేశాన్ని పరోక్ష ఆధిపత్యంలో ఉంచుకుంటే అది నయా వలస పాలన. ఒకటి కంటే ఎక్కువ సామ్రాజ్యవాద దేశాలు ఒక దేశాన్ని ఆధిపత్యంలో ఉంచుకుంటే అది అర్ధ వలస పాలన. ఒకే సామ్రాజ్యవాద దేశం ప్రత్యక్ష సైనిక ప్రమేయంతో ఒక దేశాన్ని ఆక్రమించి పాలిస్తుంటే అది అచ్చమైన వలస పాలన.

సామ్రాజ్యవాద యుగంలో ద్రవ్య పెట్టుబడి రారాజుగా వ్యవహరిస్తుంది. ద్రవ్య పెట్టుబడిని నిర్వహిస్తున్నది వాల్ స్ట్రీట్, ద సిటీ (లండన్) లలో కొలువు దీరిన బహుళజాతి బ్యాంకులే గనుక ప్రస్తుత ప్రపంచ చక్రవర్తులుగా సదరు బహుళజాతి బ్యాంకులనే పేర్కొనవచ్చు. ప్రస్తుత ప్రపంచంలోని సకల రుగ్మతలకు ఈ ద్రవ్య పెట్టుబడే కారణం. ఇది తన లాభాల కోసం ప్రజాస్వామ్య ప్రభుత్వాల్ని కూల్చుతుంది. నియంతృత్వాలను కాపాడుతుంది. లేని తగవులు సృష్టించి నిరంతర యుద్ధాలను రగుల్చుతుంది. దేశాల స్వాతంత్రాలను హారతి కర్పూరంలా హరించివేస్తుంది. తెగల మధ్య, జాతుల మధ్య, దేశాల మధ్య తగవులు పెట్టి యుద్ధాలు రగిల్చి లాభాలు పండించుకుంటుంది.

ద్రవ్య పెట్టుబడికి ఉచ్ఛం-నీచం, సిగ్గు-లజ్జ, నూనం-మానం, చీమూ-నెత్తురు లాంటి మానవ భావోద్వేగ విలువలేమీ ఉండవు. దానికి తన ఉనికి కొనసాగడమే పరమావధి. వర్తమాన యుగంలోని సమస్త రాజకీయ, ఆర్ధిక, సామాజిక సంక్షోభాలు దాని పుణ్యమే. తన లాభాల కోసం ఆధునిక నిర్మాణాలను కూల్చుతూ, తిరిగి నిర్మిస్తూ, మళ్ళీ మళ్ళీ కూల్చుతూ, మళ్ళీ మళ్ళీ నిర్మిస్తూ ఉండడం ద్రవ్య పెట్టుబడికి పెద్ద విషయం కాదు. ద్రవ్య పెట్టుబడి సాగించే దుర్మార్గాలను గమనిస్తే అసలు  మనిషే ద్రవ్య పెట్టుబడిని శాసిస్తున్నాడా లేకా ద్రవ్య పెట్టుబడి మనిషిని శాసిస్తోందా అన్న మహా అనుమానం కలుగుతుంది. ఎప్పటికీ పరిష్కారం దొరకని అనుమానంగా అది మన ముందు నిలబడి ఉంటుంది.

ఉదాహరణకి 9/11 (WTC) టెర్రరిస్టు దాడులు జరగడం వెనుక ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలు ఉన్నాయంటే నమ్మగలమా? ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా, సిరియా దురాక్రమణ యుద్ధాల వెనుక సామ్రాజ్యవాద ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలే పని చేస్తున్నాయంటే నమ్మగలమా? ఆఫ్రికాలో వివిధ జాతులు, తెగలు పరస్పరం వేల సంఖ్యలో కుత్తుకలు ఉత్తరించుకుని రక్త సముద్రాలను పారించిన ఘోరకలిలు ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాల సృష్టి అంటే నమ్మగలమా? ప్రస్తుతం ఇరాక్ లో షియా పాలకులపైన సున్నీ టెర్రరిస్టులు సాగిస్తున్న తిరుగుబాటుగా చెపుతున్న పరిణామాల వెనుక పశ్చిమ సామ్రాజ్యవాద పెట్టుబడి ప్రయోజనాలే పని చేస్తున్నాయంటే నమ్మగలమా? ఆంక్షల పేరుతో ఐరోపా, అమెరికాలు అమలు చేసిన వాణిజ్య ఆంక్షల వల్ల లక్షలాది ఇరాకీ, ఇరానియన్, సిరియన్, లెబనీస్, పాలస్టీనియన్ పసిపిల్లలు పాల డబ్బాలు కరువై చనిపోవడం వెనుక ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలే ఉన్నాయంటే ఆలకించగలమా?

ఇవన్నీ నమ్మలేము గానీ కఠిన వాస్తవాలు. మనిషి తాను సృష్టించిన వస్తువులను పరస్పరం మార్చుకోవడం కోసం సృష్టించిన డబ్బు, ‘ఇంతింతై వటుడింతింతై’ అన్నట్లుగా ద్రవ్య పెట్టుబడిగా మారి మానవ సమాజ నాగరికతా విలువలను, వ్యవస్ధలను శాసిస్తోంది. తప్పు ద్రవ్య పెట్టుబడిది కాదు. ఆ పెట్టుబడిపై కూర్చొని తన సహజ స్వభావాన్ని విస్మరించి వ్యవహరిస్తున్న మనిషిదే అంతిమ తప్పు. పెట్టుబడి సృష్టించిన వర్గ విభేదాలను మనిషి పరిష్కరించుకోవలసిన కర్తవ్యం ఇంకా మిగిలే ఉంది.

(ద్రవ్య పెట్టుబడి విశ్వరూపాన్ని నమూనా మాత్రంగా చూడాలంటే ‘ద ఇంటర్నేషనల్’ అనే హాలీవుడ్ సినిమా చూడొచ్చు.)

4 thoughts on “ప్రశ్న: వలసవాదం, సామ్రాజ్యవాదం ఒకటేనా?

 1. శేఖర్ గారు,వివరణాత్మకమైన మీ విశ్లేషణ చాలా బాగుంధి!సర్,నాకు కొన్ని సందేహాలు ఉన్నయి,వాటిని వివరిస్తారా?
  తప్పు ద్రవ్యపెట్టుబడిది కాదు,మనిషిదే అంతిమ తప్పు-అంటే మనిషి స్వార్ధం దీనికి ప్రధాన కారనం అని చెపుతున్నట్టే కదా!కాని,మీరు పాత టపాలో,ఈ స్వార్ధన్ని విమర్షిస్తూ,పెట్టుబడి విధానంలోనే,లోపాలు ఉన్నయని విష్లేషించారు!?
  కమ్యునిస్తు సమాజాలు మనిషితప్పులను ఎంత వరకు నియంత్రించగలవు?అప్పుడుమాంత్రం కొంతమంది తమ స్వార్ధంకోసం కమ్యునిజాన్ని తమ ప్రయోజనాల్కు వాడుకోరని గ్యరంతీ ఏమిటి?
  ఇప్పుడున్న పెట్టుబదిదారివిషానంలోనే మనిషి తనుచేసే తప్పులను సమర్ధవంతంగా నియంత్రించే వ్యవస్తలను ఏర్పరచుకుంటే ఈ వ్యవస్త వల్ల అత్యధికులు ప్రయోజనాలను పొందలేరా?
  సామ్రాజ్యదాదంవలన కలిగేనష్టాలను ఎన్నింటినో వివరించిన మీరు వాటి వలన కలిగిన ప్రయోజనాలను కోడా వివరిస్తే బాగున్ను,వీలైతే ఈ పని చేసిపెట్టగలరా?

 2. //తప్పు ద్రవ్యపెట్టుబడిది కాదు,మనిషిదే అంతిమ తప్పు-అంటే మనిషి స్వార్ధం దీనికి ప్రధాన కారనం అని చెపుతున్నట్టే కదా//
  అవును శేఖర్‌ గారి భావావేశంలో బయిటికి వచ్చిన మాట అయివుంటుంది. ద్రవ్య పెట్టుబడి దారి విధానం సృష్టించేదే మానవ స్వార్ధం. ధానికి మనిషి దాసుడు. ఈ దాస్య సృంఖలాలను తెంచుకోవాలంటే మళ్లీ ఆమనిషి నే పూనుకునేలా చేస్తుంది ద్రవ్య పెట్టుబడి దారి విధానం. దానికి అదేశత్రువవుతుంది.. ఆ శత్రు మూలాలు దానిలోనే ఇముడ్చుక పుట్టింది. వైరుధ్యాలు ఎక్కువై కొద్ది అది నశించి పోతుంది.

 3. ద్రవ్య పెట్టుబడికి ప్రాణం ఉండదు కదా, అదెలా శాసిస్తుంది అన్న ప్రశ్న వస్తుందని అలా రాశాను. స్వార్ధం వైపుకి ఆలోచన వెళ్లకూడదని వర్గ వైరుధ్యాలను పరిష్కరించుకోవలసిన కర్తవ్యం ఇంకా మిగిలే ఉందని కూడా చెప్పాను. స్వార్ధం అనేది మనిషిలో దానంతట అదే పుట్టే లక్షణం కాదు. భౌతిక, సామాజిక పరిస్ధితుల నుండి పుట్టే అనేకానేక భావాల్లో స్వార్ధం ఒకటి.

  మనిషిదే అంతిమ తప్పు అంటే దానర్ధం స్వార్ధం ఎలా అవుతుంది? మనిషి అంటే స్వార్ధం అని మాత్రమే కాదు కదా? సామాజిక పరిస్ధితుల నుండి మనిషికి వచ్చే అనేక లక్షణాల్లో స్వార్ధం ఒకటి మాత్రమే. స్వార్ధం అనేది ఉమ్మడి స్వార్ధంగా వ్యక్తీకృతమ్ కాగలిగితే అది అవసరమైన స్వార్ధమే. కానీ ఉమ్మడి స్వార్ధాలన్నీ అవసరమైనవి కాకపోవచ్చు. ఉదాహరణకి పెట్టుబడిదారుల ఉమ్మడి స్వార్ధం సమాజానికి చేటు తెస్తే, కార్మిక వర్గం ఉమ్మడి స్వార్ధం సమాజ పురోగమనానికి దారి తీస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s