‘ఓడలు బండ్లగును, బండ్లు ఓడలగును’ అని సామెత! బి.జె.పి జనరల్ సెక్రటరీ అమిత్ షా ఈ సామెతలో రెండో భాగాన్ని రుజువు చేసే క్రమంలో దూసుకుపోతూ ఉన్నారు. షోరాబుద్దీన్ షేక్, తులసీరాం ప్రజాపతి బూటకపు ఎన్ కౌంటర్ కేసుల్లో జైలు పాలై ఒక దశలో ‘ఇక పోలిటికల్ కెరీర్ ముగిసినట్లే’ అని పలువురు చేత భావించబడిన అమిత్ షా మరికొద్ది రోజుల్లో బి.జె.పి అధ్యక్ష పదవిని అధిష్టించనున్నట్లు వార్తలు వస్తున్నాయంటే… నేటి వ్యవస్ధ ఏ శక్తులను నెత్తిన పెట్టుకుని పూజిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.
ప్రధాని నరేంద్ర మోడికి కుడి భుజంగా అమిత్ షా సుప్రసిద్ధులు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆయన త్వరలోనే బి.జె.పి పార్టీకి జాతీయ అధ్యక్షుడు అవుతారు. ప్రస్తుత అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ కేంద్ర హోమ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున ఆయన స్ధానంలో మరో వ్యక్తిని అధ్యక్షునిగా ఆ పార్టీ ఎంచుకోవాల్సిఉంది. ఆయనకు ఉన్న ఒకే ఒక అడ్డంకి ప్రధాని మోడీ, ఆయనా ఒకే రాష్ట్రానికి చెందినవారు కావడం.
మోడి నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వంలో హోమ్ మంత్రిగా పని చేసిన అమిత్ షా మోడి అవలంబించిన సర్వ వ్యూహాలు, కార్యకలాపాల్లోనూ భాగస్వామి అని చెబుతారు. అసలు అమిత్ షా అనుసరించిన వ్యూహాలే మోడికి పెట్టని కోట అని చెప్పేవారూ ఉన్నారు. అలాంటి అవిభాజ్య భాగస్వామిని తమ పార్టీ అత్యున్నత పదవికి ప్రమోట్ చేయకుండా మోడి ఎలా ఉండగలరు?
ఒకటిన్నర సంవత్సరాల క్రితం అమిత్ షా ఎదుర్కొన్న పరిస్ధితులకూ నేటి పరిస్ధితులకు అసలు పొంతనే లేదు. సుప్రీం కోర్టు జోక్యంతో గుజరాత్ మారణకాండ కేసులు ఒక్కటొక్కటిగా తిరిగి ప్రాణం పోసుకుని దెయ్యాలై చుట్టుముడుతున్న పరిస్ధితుల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి భవితవ్యంపైన సైతం ఒకదశలో నిరాశాపూరిత మేఘాలు అలుముకున్నాయి. కానీ సుప్రీం కోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధిపతి ఆర్.కె.రాఘవన్ పుణ్యాన మోడి, అమిత్ షా ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు కాస్తా దూది పింజల్లా తేలిపోవడంతో ఒక్కో కట్టూ ఫటేల్మని తెగిపోవడం మొదలయింది.
ఏయే జాతీయ-అంతర్జాతీయ వ్యాపార శక్తుల వ్యూహాలు పన్నాయో, ఏయే రాజకీయ శత్రు-మిత్ర వైరుధ్యాలు తిరగబడి అస్త్ర-శస్త్ర సన్యాసాలకు తెగించాయో, ఏయే ఆర్ధిక బలాబలాల సమతూకపు ఆటల్లో ఎత్తులు పైయెత్తులు పోటీలు మాని విశ్రమించాయో… తెలియదు గాని అమిత్ షా బెయిలుపై విడుదల కావడం, మోడి ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించబడడం, ఢిల్లీ పీఠానికి దగ్గరి దారిగా భావించే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల రధసారధిగా అమిత్ షా అడుగు పెట్టడం జరిగిపోయాయి.
అమిత్ షా అలా ఉత్తర ప్రదేశ్ లో కాలు పెట్టారో లేదో ఆశ్చర్యకరంగా ఒక చిన్న ఆడపిల్ల వేధింపుల కేసు భారీ మతకల్లోలంగా రూపుదాల్చుకుని 2014 సాధారణ ఎన్నికల ముఖ చిత్రాన్ని శాసించేవైపుగా దర్జాగా నడిచిపోయింది. నలభై మందికి పైగా తెలలు తెగిపడిన ముజఫర్ నగర్ అల్లర్లు దశాబ్దాల నాటి జాట్, ముస్లిం ఓటు బ్యాంకు బంధాన్ని నిట్ట నిలువనా పాతరేసి అజిత్ సింగ్ పార్టీని ఇంటికి పంపగా బి.జె.పిని ఢిల్లీ మార్గంలో నిలబెట్టాయి. ముజఫర్ నగర్ అవమానానానికి ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని కోరిన అమిత్ షా ను ఒట్టి క్షమాపణతోనే ఎన్నికల కమిషన్ వదిలిపెట్టడం సాధారణ తర్కానికి అందని చాతుర్వ్యూహ ఫలితం కాదా!
మోడి-అమిత్ ద్వయం ఊర్ధ్వ ప్రయాణపు దారిలో దొర్లిపడుతున్న తలలను లెక్కించుకోవడం సందర్భోచితం కాగలదు. పద్మనాభ స్వామీ ఆలయం కేసులో సుప్రీం కోర్టుకు అమికస్ క్యూరీగా సహకరించిన ప్రఖ్యాత సుప్రీం కోర్టు లాయర్, మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యంను సుప్రీం జడ్జిగా నియమించాలని అత్యున్నత కొలీజియం చేసిన ప్రతిపాదనను మోడి ప్రభుత్వం మోకాలడ్డిన ఉదాహరణ నడుస్తున్న చరిత్రే.
తమ ఆదేశాలను లెక్క చేయరన్న భయంతోనే తన అభ్యర్దిత్వాన్ని మోడి ప్రభుత్వం తిరస్కరించిందని గోపాల్ సుబ్రమణ్యం విస్పష్టంగా చెప్పడాన్ని విస్మరించరాదు. కేంద్రం నిర్ణయాన్ని పక్కనబెట్టే హక్కూ, అధికారం కొలీజియంకు ఉన్నప్పటికీ గోపాల్ సుబ్రమణ్యం స్వయంగా తప్పుకోవడంతో సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వాల మధ్య తలెత్తనున్న ఘర్షణ తృటిలో తప్పిపోయింది గానీ లేనట్లయితే మరెన్ని విపరిణామాలు దేశం ముందు వరుసకట్టేవో మరి!
విచిత్రం ఏమిటంటే గోపాల్ సుబ్రమణియం తన ఉద్యోగ చరిత్రలో వ్యక్తం చేసిన హిందూత్వ విశ్వాసాలే ఆయనకు వ్యతిరేకంగా మోడి ప్రభుత్వం నిలబెట్టడం. కేరళలోని పద్మనాభ స్వామీ ఆలయం నుండి పెద్ద మొత్తంలో బంగారం దొంగచాటుగా తరలి వెళ్ళిపోయిన దారుణాన్ని తన 545 పేజీల నివేదికలో ఎండగట్టిన గోపాల్ సుబ్రమణియం, తన నివేదికకు కారణం తన ప్రతిభ కాదనీ ఏవో అదృశ్య దైవ శక్తులు తనను వెన్నంటి నడిపించి జరిగిన అక్రమాలను వెలికి లాగేలా చేశాయని చెప్పుకుని తరించారు.
ఈ అసందర్భ ప్రేలాపననే ఇంటలిజెన్స్ బ్యూరో గోపాల్ సుబ్రమణ్యంకు వ్యతిరేకంగా ఉదహరిస్తూ “ఆయన తన హేతుబద్ధ తర్కజ్ఞానంపై ఆధారపడడానికి బదులుగా తన వైదిక విశ్వాసాలపై ఆధారపడి నిర్ణయాలకు వస్తారని” చెబుతూ అభ్యంతరం చెప్పింది. హిందువుల మతపరమైన విశ్వాసమే పునాదిగా బాబ్రీ మసీదు-రామ జన్మభూమి ఉద్యమాన్ని నడిపిన శక్తులు తనకు నచ్చని వ్యక్తుల ఎదుగుదలను ఆటంకపరచడానికి అవే ఐహికేతర విశ్వాసాలను అభ్యంతరంగా చూపడం కంటే మించిన హిపోక్రసీ మరొకటి ఉండగలదా?
అంతేనా, ముంబైలో అమిత్ షా కు వ్యతిరేకంగా ఉన్న కేసులు విచారిస్తున్న సి.బి.ఐ జడ్జి ఒకరు (జె.డి.ఉత్పట్) ఉన్నపళంగా బదిలీ అయిపోయారు. అమిత్ షాను విచారణ నుండి తప్పించాలని పిటిషన్ వేసిన లాయర్ ను సదరు న్యాయమూర్తి తీవ్రంగా మందలించి వారం కూడా కాలేదు. ఈ బదిలీతోనే అమిత్ షాకు వ్యతిరేకంగా ఉన్న తులసీరాం ప్రజాపతి, షోరాబుద్దీన్ షేక్ బూటకపు ఎన్ కౌంటర్ల కేసులకు ఏ గతి పట్టనుందో అపుడే ఉప్పందుతోంది. 6 నెలల క్రితం బదిలీ కోరిన న్యాయమూర్తి కోరికను ఇప్పుడు నెరవేర్చడం ప్రభువులకు సానుకూలం అయ్యాక ఇక అది ఆగేది ఎంతసేపని?
బహుశా గుజరాత్ లో జైలు పక్షులుగా మారిన మాజీ పోలీసు ఉన్నతాధికారులు విడుదల కావడమే ఇక మిగిలిన పని కావచ్చు!
చాలా విలువైన విశ్లేషణ. తెర వెనక అసలు నిజాల్ని చాలా చక్కగా వివరించారు.
విశేఖర్ గారూ,
ఈ పరిణామాల్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీకేమనిపిస్తుంది? ‘సత్యమేవ జయతే ‘ అనేది ఒట్టి మాటేనా..? మంచి అంటే, పట్టుబడని చెడేనా? ధర్మం,న్యాయం, మానవత్వం,నీతి, నిజాయితీ లాంటివన్నీ చేతకాని అసమర్థులు చెప్పుకునే ఒట్టి మాటలేనా..?
Hi Reluctant Thinker,
అంత నిరాశావాదం అవసరం లేదు. ధర్మం, న్యాయం, మానవత్వం, నీతి, నిజాయితీ… ఇవన్నీ ఎల్లకాలం ఒకే రూపంలో ఉండేవి కావు. అవి ఆయా స్ధల, కాలాలకు బందీలు. సాపేక్షికాలు. ఈ విలువలు మానవ మనుగుడకు అతీతంగా పరిశీలించడం తరచూ జరిగే తప్పు. సామాజిక స్ధితి కదలికలు (డైనమిక్స్) ఏదో రూపంలో చురుకుగా తమపని తాము చేస్తూ ఉంటాయి. వాటిని చూడడమే మనం చేయవలసిన పని. చూడడమే కాకుండా పూనుకుని సహకరిస్తే సానుకూల మార్పు మరింత వేగవంతం అవుతుంది. ఇది సమర్ధత, అసమర్ధతల సమస్య కాదు. సంసిద్ధత, సందిగ్ధతల సమస్య మాత్రమే.