విదేశీ మందులోడికి మోడీ షాక్?!


Essential drugs

“నెత్తిన పేనుకు పెత్తనమిస్తే నెత్తి గొరుగురా ఒరే ఒరే” అని విదేశీ మందులోడు పాడుకుంటాడేమో ఇక! లేకపోతే నమ్మి, బ్రాండ్ ఇమేజి పెంచి, అధికారంలోకి రావడానికి సహకరిస్తే మరిన్ని మందులని ‘నియంత్రిత ధరల’ జాబితాలోకి మోడి ప్రభుత్వం తేవడాన్ని విదేశీ బహుళజాతి కంపెనీలు ఎలా అర్ధం చేసుకోగలవు?

భారత దేశంలో అమ్ముడయ్యే ఔషధాలలో మరిన్ని ‘ధరల నియంత్రిత జాబితా’ (price control) లోకి చేర్చాలని నరేంద్ర మోడి ప్రభుత్వం యోచిస్తోందని ప్రభుత్వ వర్గాలు కొన్ని పత్రికలకు ఉప్పందించాయి. సదరు ఉప్పు అందుకున్న వాటిలో రాయిటర్స్ పత్రిక కూడా ఒకటి. ఇలాంటి జాబితాలో చోటు చేసుకున్న ఔషధాల ధరలను కంపెనీలు తమ ఇష్టానుసారం పెంచుకోవడానికి వీలు ఉండదు. ప్రభుత్వం విధించే పరిమితి లోపలనే ధరలను నిర్ణయించాల్సి ఉంటుంది.

అత్యవసర ఔషధాల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక జాబితాను నిర్వహిస్తుంది. ఈ జాబితాలో ఇంకా ఏయే ఔషధాలను చేర్చవచ్చో నిర్ణయించడానికి మోడి ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించినప్పుడే విదేశీ ఔషధ కంపెనీల షేర్లు అమాంతం ఒక కుదుపుకు లోనయ్యాయి. ఈ కమిటీ ఈ రోజు (మంగళవారం, జూన్ 24) మొదటిసారి సమావేశం అయింది. సమావేశంలో నిర్ణయాలు ఏమిటో ఇంకా నిర్దిష్టంగా తెలియలేదు గానీ మరిన్ని మందులు అత్యవసర జాబితాలో చేర్చడానికి ఒక అభిప్రాయానికి వచ్చిన సంగతి వెల్లడి అయింది.

భారత దేశంలో ఆరోగ్యంగా బ్రతకడమే ఒక లగ్జరీ! 70 శాతం ప్రజలు రోజుకి 2 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో రోజులు వెళ్లమార్చే దేశంలో ఔషధాల ధరలు ఎంత తక్కువ ఉన్నా ఎక్కువే. లాభార్జన తప్ప మరో ధ్యేయమే లేని బహుళజాతి కంపెనీలు రాజ్యం ఏలే రోజుల్లో ఇక ఔషధాల ధరల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ఉపశమనం.

మరిన్ని మందుల్ని అత్యవసర జాబితాలో చేర్చడం అంటే విదేశీ బహుళజాతి కంపెనీలకు అరికాలి మంట నెత్తికి ఎక్కడం ఖాయం. 2012లో కాన్సర్ ఔషధం నెక్సావార్ తయారీకి భారతీయ కంపెనీ నాట్కో ఫార్మాకు కంపల్సరీ లైసెన్స్ ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం ఇప్పటికే బహుళజాతి కంపెనీలకు కోపం తెప్పించింది.

సదరు ఔషధంపైన బహుళజాతి కంపెనీ బేయర్ కు పేటెంట్ హక్కులు ఉన్నాయి. ఆ పేటెంట్ హక్కులను పక్కన బెడుతూ భారత ప్రభుత్వం జెనెరిక్ ఔషధం తయారీకి లైసెన్స్ ఇవ్వడం డబ్ల్యూ.టి.ఓ నిబంధనల ప్రకారమే జరిగినప్పటికీ కంపెనీలు గగ్గోలు పెట్టడం మానలేదు. డబ్ల్యూ.టి.ఓ నిబంధనల ప్రకారం లబ్ది పొందే హక్కు ఒక్క పశ్చిమ బహుళజాతి కంపెనీలకు మాత్రమే ఉండాలి. ఇండియా లాంటి వర్ధమాన దేశాలకు ఉండడానికి వీలు లేదు మరి!

నెక్సావార్ ఉదంతం దరిమిలా విదేశీ బహుళజాతి ఔషధ కంపెనీలన్నీ అప్రమత్తం అయ్యాయి. ఇలా అయితే భారత దేశంలో పెట్టుబడులు పెట్టడం వీలు కాదని బెదిరింపులు జారీ చేశాయి కూడాను. వ్యాపార కంపెనీలకు, మరీ ముఖ్యంగా విదేశీ బహుళజాతి కంపెనీలకు స్నేహపాత్రమైన ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న మోడి ప్రధాని అయిన తర్వాత కూడా ఔషధ రంగంలో పాత ప్రభుత్వ ధోరణే కొనసాగడం పట్ల కంపెనీలు నిరసన ప్రకటిస్తున్నాయి.

ఉదాహరణకి ఒక విదేశీ ఔషధ కంపెనీ అధికారి ఏమంటున్నాడంటే: “ఈ (ధరల నియంత్రణ) విషయంలో మరో కమిటీని ఏర్పాటు చేయడం చాలా ఆశ్చర్యకరం. కొత్త ప్రభుత్వం తనకు ఉందని చెప్పుకున్న ఫిలాసఫీకి ఇది పూర్తిగా విరుద్ధమైన సిద్ధాంతం (anti-thesis).” తమకు మేలు చేసే నిర్ణయాలు చేస్తారని నమ్ముకుంటే కొత్త ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం దారిలోనే వెళ్ళడం ఏమిటని ఈయనగారి వగపు.

గత సంవత్సరం యు.పి.ఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ముందు కేవలం 74 ఔషధాలు మాత్రమే అత్యవసర ఔషధాల జాబితాలో ఉండేవి. నూతన ఆర్ధిక విధానాలు దేశంలో ప్రవేశపెట్టక మునుపయితే అత్యవసర జాబితాలో లేని ఔషధాలను మాత్రమే లెక్కించగల సంఖ్యలో ఉండేవి. ఔషధ రంగాన్ని పరాయీకరిస్తూ ఉరుగ్వే రౌండ్ చర్చల నిర్ణయాలకు ఇండియా దాసోహం అన్న తర్వాత అత్యవసర ఔషధాలను లెక్క పెట్టుకోవలసిన పరిస్ధితి దాపురించింది.

అయితే 2012లో బేయర్-నెక్సావార్ కేసులో అప్పీలేట్ బోర్డు నిర్ణయం దరిమిలా మరిన్ని ఔషధాలను ప్రభుత్వం అత్యవసర జాబితాలోకి చేర్చింది. గత సంవత్సరమే ఈ సంఖ్యను 74 నుండి 348 కి యు.పి.ఏ ప్రభుత్వం చేర్చింది. ఇది దేశంలో అమ్ముడు అయ్యే ఔషధాలలో దాదాపు 30 శాతానికి సమానం అని ఒక అంచనా.

అత్యవసర ఔషధాల జాబితాను “అత్యవసర ఔషధాల జాతీయ జాబితా” (National List of Essential Medicines) అంటారు. ఈ జాబితాలోకి ఇంకా అనేక ఔషధాలను చేర్చవలసి ఉందని, అలా చేస్తేనే భారత దేశంలోని విస్తారమైన ప్రజలకు ఆరోగ్యం అందుబాటులోకి వస్తుందని ఆరోగ్య రంగంలోని ఎన్.జి.ఓ సంస్ధలు, కార్యకర్తలు ఎన్నాళ్లుగానో పోరు పెడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ ‘అత్యవసర ఔషధాలు’గా గుర్తించిన మందుల్లో అనేకం ఇంకా భారత దేశ జాబితాలో చోటు చేసుకోలేదు. ఉదాహరణకి అంటు వ్యాధుల నిరోధక ఔషధం అమికాసిన్, యాంటీబయాటిక్ ఔషధం సైక్లోసరీన్ లు WHO అత్యవసర ఔషధ జాబితాలో ఉన్నప్పటికీ అవి భారత దేశ అత్యవసర జాబితాలో లేవు.

బహుళజాతి కంపెనీలు మాత్రం ధరల నియంత్రణ వలన తమ లాభాలు తగ్గిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నాయి. ధరల నియంత్రిస్తే ఇక భారత దేశంలో పరిశోధనా రంగంలో పెట్టుబడులు పెట్టలేమని, వెనక్కి వెళ్లిపోవడమే తమకు ఉత్తమమైన పనిగా తోస్తోందని వివిధ సందర్భాల్లో హెచ్చరించాయి. కానీ వాస్తవం ఏమిటంటే బహుళజాతి ఔషధ కంపెనీలు ఏనాడూ ఇండియాలో పరిశోధన కోసం పెట్టుబడులు పెట్టిన ఉదాహరణలు లేవు.

తాము తయారు చేసిన ఔషధాలను పరీక్షించడం కోసం భారతీయులను గినియా పందుల లెక్కన ఉపయోగించిన ఉదాహరణలు మాత్రం కోకొల్లలు. అలాంటి కంపెనీలు చేసే బెదిరింపుల వల్ల ఇండియాకు కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు. ఉంటే గింటే లాభమే ఉంటుంది. విదేశీ కంపెనీల కబంధ హస్తాల నుండి భారతీయ ఔషధరంగం విముక్తి సాధించినట్లయితే ఆ మేరకు ఉత్పత్తి చేయడానికి భారతీయ కంపెనీలకు అవకాశం లభిస్తుంది. ధరలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే 15 బిలియన్ డాలర్ల భారతీయ ఔషధ మార్కెట్ ను విదేశీ బహుళజాతి కంపెనీలు అంత తేలికగా వదిలిపెట్టే అవకాశం లేనే లేదు. పేటెంట్ చేసిన ఔషధాల అమ్మకాలు పశ్చిమ దేశాల్లో బాగా పడిపోతున్నాయి. ఇండియాలో మెడికల్ టూరిజం దినదినాభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో పశ్చిమ దేశాల నుండి పెద్ద మొత్తంలో రోగులు ఇక్కడి చౌక చికిత్సలకోసం తరలి వస్తున్నారు. కాబట్టి భారతీయ ఔషధ రంగాన్ని విదేశీ కంపెనీలు వదులుకోజాలవు.

గత యు.పి.ఏ ప్రభుత్వం గానీ, ఇప్పటి మోడి ప్రభుత్వం గానీ భారతీయ ఔషధ కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఇక్కడి కంపెనీల ఆర్ధిక పలుకుబడే. మెరిసేదంతా బంగారం కానట్టే భారతీయ కంపెనీలుగా కనిపించేవన్నీ భారతీయ కంపెనీలు కాకపోవచ్చు కూడా. వాల్ స్ట్రీట్ కంపెనీల ద్రవ్య పెట్టుబడులు ప్రతి రంగంలోనూ బహిరంగంగానూ, అంతర్గతంగానూ చొచ్చుకు వస్తున్న నేపధ్యంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాల అసలు లబ్దిదారులు మళ్ళీ వాల్ స్ట్రీట్ ద్రవ్య పెట్టుబడే అయినా ఆశ్చర్యం లేదు.

3 thoughts on “విదేశీ మందులోడికి మోడీ షాక్?!

  1. పింగ్‌బ్యాక్: విదేశీ మందులోడికి మోడీ షాక్?! | ugiridharaprasad

  2. Now you should agree that Modi is doing good things here. Modi will kick everybody. Just see he will reduce the royalty amounts also which UPA allowed and caused 37billion $ loss to India.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s