భారత దేశం తమకు మిలట్రీ సహాయం చేయాలని ఆఫ్ఘనిస్తాన్ మరోసారి గట్టిగా కోరింది. పాకిస్ధాన్ ఏమన్నా అనుకుంటుందేమో అన్న శంకతో తమకు సాయం చేయకుండా వెనక్కి తగ్గడం భావ్యం కాదని, ఆఫ్ఘనిస్ధాన్ భద్రత సక్రమంగా ఉంటే అది భారత దేశానికి కూడా భద్రత అవుతుందని గుర్తించాలని ఇండియాలో ఆఫ్ఘన్ రాయబారి షాయిదా అబ్దాలి స్పష్టం చేశారు. ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్దాలి ఈ మేరకు ఆఫ్ఘన్ కోరికను పునరుద్ధరించారు.
గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఇదే కోరికను భారత్ ముందుంచాడు. ఆఫ్ఘనిస్ధాన్ కు అవసరమైన మిలట్రీ పరికరాలను, మందుగుండు సామగ్రిని ఇండియా సరఫరా చేయాలని కోరాడు. యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లు, ఇతర భూతల యుద్ధ వాహనాలు సరఫరా చేయాలని కోరాడు.
అయితే ఈ కోరికను భారత్ తిరస్కరించింది. ఆఫ్ఘనిస్ధాన్ కు ఆయుధాలు సరఫరా చేసినట్లయితే అది ఆఫ్ఘన్ లో జోక్యం చేసుకుంటున్నట్లుగా పాక్ భావిస్తుందని భారత పాలకుల అనుమానం. ఆఫ్ఘనిస్ధాన్, ఇండియాకు దగ్గర కాకుండా ఉండడం పాకిస్ధాన్ ప్రయోజనాలకు అనుకూలం అని పాక్ పాలకుల నిశ్చితాభిప్రాయం. కాబట్టి భారత్-ఆఫ్ఘన్ ల సంబంధాలను అనుమానంతో పరికించడం పాకిస్ధాన్ కు అనివార్యం.
ఆయుధాలను సరఫరా చేయనప్పటికీ ఇండియా ఇతర రంగాల్లో ఆఫ్ఘనిస్ధాన్ కు సాయం చేస్తోంది. సహాయం అంటే ధర్మానికి ఇచ్చేయ్యడం కాదు. నిర్దిష్ట మొత్తాన్ని సహాయంగా ప్రకటించి దానిని భారత కంపెనీల కాంట్రాక్టుల రూపంలో తిరిగి రాబట్టుకోవడం. ఈ కాంట్రాక్టుల కేటాయింపులలో ఆఫ్ఘన్ పాలకులకు తగిన మొత్తంలో కమిషన్ ముడుతుంది. వివిధ మౌలిక నిర్మాణాల రంగంలో ఇండియా ఇలాంటి సహాయాన్ని ఆఫ్ఘనిస్ధాన్ కు అందజేస్తోంది. ఆఫ్ఘన్ ను అమెరికా, నాటో రాజ్యాలు దురాక్రమించిన తర్వాత ఇండియా కంపెనీలకు ఈ విధంగా లబ్ది చేకూరింది. ఈ లబ్ది కోసమే అమెరికా ప్రకటించిన సో కాల్డ్ “ఉగ్రవాదంపై ప్రపంచ యుద్ధం”కు భారత పాలకులు మద్దతు ఇచ్చారు.
2014 చివరికి ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా తన సైనికులను ఉపసంహరించుకుంటోంది. ఇది పేరుకు మాత్రమే ఉపసంహరణ. మెజారిటీ సైన్యాలను ఉపసంహరించుకుని కనీస సంఖ్యలో కొనసాగిస్తుంది. కనీసం 10,000 మంది అమెరికా సైనికులను ఆఫ్ఘన్ లో ఉంచాలని అమెరికా భావిస్తోంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య భద్రతా ఒప్పందం జరగాల్సి ఉంది. ఒప్పందం ముసాయిదాను అమెరికా చాలాకాలం క్రితమే రూపొందించింది. సదరు ఒప్పందాన్ని ఆఫ్ఘన్ గిరిజన మహా పంచాయితీ లోయ జిర్గా ఆమోదించింది కూడా. అయితే దానిపైన సంతకం చేయకుండా హమీద్ కర్జాయ్ మొరాయిస్తున్నాడు. తగిన మొత్తంలో ఆర్ధిక సహాయం ప్రకటించకుండా సంతకం చేయబోనని ఆయన అమెరికాకు స్పష్టం చేస్తున్నాడు. గతంలో మాదిరిగా ఆర్ధిక వనరులు సమృద్ధిగా కొరవడిన అమెరికా అందుకు హామీ ఇవ్వలేకపోతోంది.
ఈ నేపధ్యంలో అమెరికా ఉపసంహరణ అనంతరం తాలిబాన్ తిరిగి ఆఫ్ఘనిస్ధాన్ ను స్వాధీనం చేసుకుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. తాలిబాన్ అధికారంలోకి రావడం అంటే మళ్ళీ ఆఫ్ఘనిస్ధాన్ లో పాక్ పాలకుల ప్రాబల్యం పెరగడం. పాక్ ప్రాబల్యం పెరగడంతో పాటు లష్కర్-ఏ-తాయిబా లాంటి ఉగ్రవాద గ్రూపులకు స్వేచ్ఛా విహరణ లభిస్తుంది. ఇది ఎలాగూ ఇండియాకు ఇష్టం లేదు. అలాగని పాక్ కి కోపం వచ్చే విధంగా పూర్తిస్ధాయి మిలట్రీ సహాయం అందిస్తే అసలు మొదలుకే మోసం రావచ్చని భారత పాలకుల అనుమానం. దానితో ఆర్ధిక ప్రాజెక్టుల వరకు సహకరిస్తూ మిలట్రీ సహాయానికి నిరాకరిస్తోంది.
పాకిస్ధాన్ కు సంబంధించిన అనుమానాలు ఎలా ఉన్నప్పటికీ చిన్నగా ఆయుధ సాయానికి కూడా ఇండియా గేట్లు తెరుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి ఆఫ్ఘనిస్ధాన్ జాతీయ సైన్యానికి చిన్న తరహా ఆయుధాలు సరఫరా చేయడానికి గత ఏప్రిల్ లో కేబినెట్ కమిటీ ఒకటి ఆమోదం తెలిపింది. అయితే ఈ ఆయుధాలు ఇండియా వద్ద ఉన్నవి కాదు. రష్యా నుండి సేకరించి వాటిని ఆఫ్ర్ఘనిస్ధాన్ కు తరలించాలని కేబినెట్ నిర్ణయించింది. తద్వారా అటు ఆఫ్ఘనిస్ధాన్ ను నిరుత్సాహపరచకుండా, ఇటు పాకిస్ధాన్ కు కోపం తెప్పించకుండా ఉండవచ్చని భారత పాలకుల అభిప్రాయం కావచ్చు.
భారత్ అనుమానాలు ఎలా ఉన్నప్పటికీ పాకిస్ధాన్ కారణంగా తమకు ఆయుధాలు సరఫరా చేయకపోవడాన్ని ఆఫ్ఘన్ పాలకులు ఆక్షేపిస్తున్నారు. మూడో దేశంపై ఆధారపడి తమతో సంబంధాలను నిర్వచించుకోవడం ఎంతవరకు సరైందని వారు ప్రశ్నిస్తున్నారు. ది హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్దాలి కూడా అదే ప్రశ్నించారు.
“ఇండియా నుండి ఆఫ్ఘనిస్ధాన్ మిలట్రీ సహాయం పొందడం వల్ల పాకిస్ధాన్ లాంటి మూడో దేశం అసంతృప్తిగా ఉండే పనైతే నాది ఒకే ఒక ప్రశ్న… ఆఫ్ఘనిస్ధాన్ సైన్యానికి కేవలం ఒకే ఒక దేశంతో యుద్ధం చేయమని ఆయుధ సాయం చేస్తున్నామా? ఈ ప్రాంతంలో ప్రతి దేశమూ శక్తివంతమైన పోలీసు, సైనిక వ్యవస్ధ కావాలని కోరుకుంటున్నపుడు కేవలం మాపైనే ఎందుకు వివక్ష? ఆఫ్ఘనిస్ధాన్ కు శక్తివంతమైన పోలీసు, సైనిక వ్యవస్ధలు అవసరం లేదా? ఆఫ్ఘనిస్ధాన్ కు ఏ విధమైన మద్దతును ఇండియా ఇచ్చినా అందులో ఎలాంటి తప్పూ లేదని నా అభిప్రాయం. ఇది ఇండియా పూనుకుని ఆఫ్ఘనిస్ధాన్ కు సహాయం చేయడం కాదు, ఆఫ్ఘనిస్ధాన్ దేశమే సాయం అడుగుతోందని గుర్తించాలి” అంటూ ఆఫ్ఘన్ రాయబారి షాయిదా అబ్దాలి యాష్టపోయారు.
మే నెలలో హెరాత్ రాష్ట్రంలోని భారత రాయబార కార్యాలయంపై ఉగ్రవాద దాడి జరిపింది లష్కర్-ఏ-తోయిబా (ఎల్.ఇ.టి) యే నని ఈ సందర్భంగా అబ్దాలి స్పష్టం చేయడం గమనార్హం. “ఎల్.ఇ.టి కేంద్ర స్ధానం ఎక్కడ ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎక్కడి నుండి పని చేస్తుందో మాకు బాగా తెలుసు. ఆ దాడులు ఎక్కడి నుండి వస్తుందో మల్లగుల్లాలు పడే బదులు వాటిని పధకం ప్రకారం ఎలా తిప్పి కొట్టాలో ఆలోచించాలి” అని అబ్దాలి తెలిపారు.