ప్రశ్న: ప్రతిపక్ష హోదా కోసం పాకులాట ఎందుకు?


parliament

నిఖిల్:

1. లోక్ సభలో అధికార ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏమిటి? ఆ హోదా కోసం కాంగ్రెస్ ఎందుకు పిచ్చిగా ప్రాకులాడుతోంది?

సమాధానం:

“లోక్ సభలో అధికార ప్రతిపక్ష హోదా” అంటే మీ ఉద్దేశ్యం “అధికారికంగా గుర్తించబడిన ప్రతిపక్ష హోదా” అయి ఉండాలి. బి.జె.పి పాలక పక్షం గనుక కాంగ్రెస్ ఎలాగూ ప్రతిపక్షమే. కానీ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఎందుకా పాకులాట అన్నది మీ అనుమానం.

లోక్ సభలో పాలక పక్షం తమ నాయకుడిని ఎన్నుకున్నట్లే ప్రతిపక్షం కూడా ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. పాలక పక్షం ఎన్నుకున్న నాయకుడిని ప్రధాన మంత్రి పదవికి అర్హునిగా రాష్ట్రపతి గుర్తించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతారు. ఆ విధంగా లోక్ సభలో మెజారిటీ నాయకుడు ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. పాలక పక్షం తీసుకునే చర్యలను ఒక కంట కనిపెడుతూ ప్రజలకు మేలు చేసే పాలన అందించేలా కాపలా కాసే పనిని ప్రతిపక్షానికి అప్పజెప్పారు. అయితే బహుళ రాజకీయ పార్టీల వ్యవస్ధలో ప్రతిపక్ష పార్టీగా కేవలం ఒకే ఒక పార్టీగా ఉండే అవకాశం ఉండదు లేదా తక్కువ. కాబట్టి వివిధ ప్రతిపక్ష పార్టీలలో ఒక పార్టీకి అధికారికంగా ప్రతిపక్ష హోదా కట్టబెట్టవలసి వస్తుంది.

ఇలా అధికారికంగా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కొన్ని నిబంధనలను చట్టంలో పొందు పరిచారు. ఆ చట్టం ప్రకారం అధికారికంగా ప్రతిపక్ష హోదా పొందాలంటే లోక్ సభలో కనీసం 10 శాతం సీట్లను ఒక పార్టీ గెలుచుకుని ఉండాలి. మన లోక్ సభ సీట్ల సంఖ్య 544. ఇందులో 10 శాతం అంటే 55 గా పరిగణిస్తున్నారు. కాబట్టి లోక్ సభలో అధికారిక ప్రతిపక్షం/ప్రధాన ప్రతిపక్షం హోదా పొందాలంటే కనీసం 55 సీట్లు గెలిచి ఉండాలి.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు మాత్రమే వచ్చాయి. అందువల్ల చట్టం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి అధికారిక ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు. ప్రతిపక్ష హోదా దక్కిన పార్టీకి లోక్ సభలో కొన్ని ప్రత్యేక హక్కులు వస్తాయి. ఆ హక్కుల కోసమే కాంగ్రెస్ పాకులాడడం.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడే మొత్తం ప్రతిపక్షానికి నాయకుడుగా వ్యవహరిస్తారు. అలాంటి ప్రతిపక్ష నాయకునికి కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. అలాగే వివిధ పదవుల నియామకాల్లో ప్రతిపక్ష నాయకుడిని పాలక పక్షం సంప్రదించాల్సి ఉంటుంది.

సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సి.వి.సి), సి.బి.ఐ, లోక్ పాల్ పదవుల నియామకంలో అధికారిక ప్రతిపక్ష నాయకుడిని ప్రభుత్వం తప్పనిసరిగా సంప్రదించాలి.

ప్రభుత్వం చేసే వివిధ ఖర్చులను ఆడిట్ చేసే అధికారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పి.ఏ.సి) కి ఉంటుంది. ఈ పి.ఏ.సి లో పాలక ప్రతిపక్షాల నేతలు, వారు నియమించిన సభ్యులు సభ్యత్వం (లోక్ సభ -15; రాజ్య సభ-7) కలిగి ఉంటారు. పి.ఏ.సి ఛైర్మన్ గా అధికార ప్రతిపక్షం సూచించిన సభ్యుడిని నియమించడం ఒక సంప్రదాయంగా ఉంటోంది.

అధికారిక ప్రతిపక్ష హోదా దక్కకపోతే ఈ అధికారాలన్నీ ఉండవు. పేరుకు మాత్రమే ప్రతిపక్షం గానీ చట్టబద్ధ హక్కులు ఏవీ సంక్రమించవు. అటువంటి ప్రతిపక్ష హోదా కావాలని ఎవరు మాత్రం ఆశిస్తారు?

పాలక పక్షం వైపు నుండి చూస్తే అధికారికంగా ప్రతిపక్షం లేకపోవడం వలన చాలా పనులు సులభంగా జరిగిపోతాయి. ప్రతిపక్ష సభ్యులకు అధికారికంగా బాధ్యత వహించాల్సిన బాధ తప్పిపోతుంది. చట్టబద్ధమైన జవాబుదారీతనం నుండి తప్పించుకోవచ్చు. తన ఇష్టానుసారం నియామకాలను చేసుకోవచ్చు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడి పదేళ్ళ పాటు లోకాయుక్త పదవిని ఖాళీగా ఉంచారు. అయినా తనను తాను అవినీతి వ్యతిరేకిగా మోడి చెప్పుకుంటారు. ప్రధాన మంత్రిగా కూడా లోక్ పాల్ పదవిని ఖాళీగా ఉంచగల సువర్ణావకాశం ఆయనకి దక్కింది.

చట్టబద్ధంగా పాటించవలసిన నియమాలను పక్కన పెడదాం. ఆదర్శవంతమైన పాలన అందించాలని ఒక పాలక పార్టీ భావిస్తే రాజ్యాంగం నిర్దేశించిన వివిధ ఆదర్శాలను, సూత్రాలను ఇతర అంశాలతో నిమిత్తం లేకుండా పాటించాలని భావిస్తుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి తగిన సీట్లు రాకపోయినా అధిక సీట్లు వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వవచ్చు. తద్వారా ప్రతిపక్షాన్ని విశ్వాసం లోకి తీసుకున్నామన్న పేరును పొందవచ్చు. తన పై తానే చెక్ పెట్టుకునేందుకు ఆదర్శవంతంగా కృషి చేయవచ్చు.

కానీ దేశంలో ఇలాంటి కనీస విలువలు నశించి చాలాకాలం అయింది. చిట్టచివరి శ్రామిక వర్గ పౌరుడి సంక్షేమం సైతం ప్రభుత్వాలు పట్టించుకోవాలన్న కనీస ప్రజాస్వామిక సూత్రం మాట అటుంచి, తమ దోపిడీ వర్గంలోనే భాగం అయిన ప్రతిపక్ష పార్టీలపైన కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడే విపరీత బుద్ధులు రాజ్యం ఏలుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో కనీస దోపిడీ నీతి/బూర్జువా నీతి కూడా అదృశ్యం అయిపోయింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s