మానవ సమాజానికి మొదటి సారి మచ్చికయిన పాపానికి కుక్కలు సైతం మనిషి చేసే అనేక పాపాల్లో భాగం పంచుకోవలసి వస్తోంది. వ్యాపారం పెంపుదల కోసం, ప్రత్యర్ధి వ్యాపారాన్ని కూల్చడం కోసం యుద్ధాలకు తెగబడడానికి మించిన పాపం ఏముంటుంది? అలాంటి మహా పాపంలో అమెరికా, ఐరోపా కుక్కలు భాగం పంచుకుంటూ తమకు తెలియకుండానే బహుశా నరక లోకానికి చేరుతున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ ను దురాక్రమించిన అమెరికా, నాటో బలగాలు తమతో పాటు సుశిక్షిత కుక్కలను తెచ్చుకుని అనేక కార్యకలాపాల్లో వాటిని వినియోగిస్తున్నారు. తాలిబాన్ తదితర మిలిటెంట్ సంస్ధలు ప్రయోగించే రోడ్డు పక్క బాంబుల వల్లనే అత్యధిక సంఖ్యలో అమెరికా, నాటో బలగాలు చనిపోయారు. అలాంటి రోడ్డు పక్క బాంబులను కనిపెట్టడానికి కుక్కలను విస్తృతంగా వినియోగించడంతో ఆఫ్ఘన్ యుద్ధంలో కుక్కలు సైతం పెద్ద సంఖ్యలో మరణించాయి.
బాంబులు కనిపెట్టడం, ప్రత్యర్ధి మాటు గాచి దాడి చేసే శిబిరాలను కనిపెట్టడం లాంటి యుద్ధ కార్యకలాపాలతో పాటు వివిధ శాంతి ప్రక్రియలకు కూడా అమెరికా, నాటోలు కుక్కలను వినియోగిస్తున్నాయి.
శాంతి అంటే నిజమైన శాంతి అని కాదు. అవి చేసే పని యొక్క స్వభావాన్ని బట్టి మాత్రమే శాంతి ప్రక్రియ అనడం. ఉదాహరణకి తప్పిపోయిన సైనికులని కనిపెట్టడం, సైనికులకు కావలసిన చిన్న చిన్న సేవలు చేయడం, యుద్ధంలో గాయపడిన సైనికులతో స్నేహం చేస్తూ వారికి స్వాంతన కలిగించడం మొదలైన పనులు చేయడానికి కూడా కుక్కలకు శిక్షణ ఇచ్చి వినియోగించుకుంటున్నారు.
ది అట్లాంటిక్ పత్రిక ప్రకారం ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో కుక్కలు ఈ కింది పనులు చేసి పెడుతున్నాయి.
-
పేలుడు పదార్ధాలను పసిగట్టడం
-
అక్రమ మాదక ద్రవ్యాలను కనిపెట్టడం
-
తప్పి పోయిన సైనికుల ఆచూకీ కనిపెట్టడం
-
శత్రు సైనికులను టార్గెట్ చేయడం
-
చికిత్స (ధెరపీ) కుక్కలుగా వ్యవహరించడం
-
సైనికులకు వివిధ సేవలు చేయడం
-
విశ్వాసపాత్రమైన స్నేహితులుగా వ్యవహరించడం
ఆఫ్ఘన్ యుద్ధంలో ఫ్రంట్ లైన్స్ లో పని చేయడం వలన సైనికులు ఎన్ని పరిణామాలను అనుభవిస్తున్నారో కుక్కలు కూడా అన్నీ పరిణామాలూ అనుభవిస్తున్నాయి. గాయపడడం దగ్గరి నుండి అవయవాలు కోల్పోవడం, ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతోంది.
యుద్ధంలో కుక్క గానీ, దాని నిర్వహకుడు గాని గాయపడి అంగవికలురుగా మారితే చికిత్స అనంతరం సదరు కుక్కని శాశ్వతంగా దాని నిర్వాహకుడికి అప్పజెప్పే నియమాన్ని అమెరికా పాటిస్తోంది. ఇదో రకం యుద్ధ న్యాయం కాబోలు!
ఈ ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక అందజేసింది.